తిరుపతి పద్మావతి నగర్‌లో విషాదం
వదిన, అన్న కూతుళ్లను చంపి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
తిరుపతి క్రైం: తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని అన్న భార్య, ఇద్దరు కుమార్తెలను హత్యచేసి.. తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బుధవారం రాత్రి తిరుపతి పద్మావతినగర్‌లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరుకు చెందిన గుడిమెట్ల తిరిపిదాస్ రెండేళ్ల క్రితం కుటుంబంతో వచ్చి తిరుపతి పద్మావతి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ ఉద్యోగి అయిన దాస్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు. దాస్ సోదరుడు గుడిమెట్ల మోహన్ (36) చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అతడికి 2019లో అన్నావదినలు వివాహం జరిపించారు. వివాదాల నేపథ్యంలో 2021లో భర్త మోహన్‌ను వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.
ఆ తరువాత తమ్ముడి భార్య, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడిన దాస్ ఇద్దరూ కాపురం చేసుకునేలా ఒప్పించాడు. ఆ సమయంలో తనకు ఇష్టంలేని పెళ్లి చేశావంటూ దాస్‌పై తమ్ముడు మోహన్ దాడి చేశాడు. కొంతకాలం అనంతరం మోహన్ అతడి భార్య మధ్య గొడవలు ప్రారంభం కావటంతో మోహన్ భార్య తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. చెన్నైలో ఉద్యోగం చేసుకుంటున్న మోహన్ తరచూ తిరుపతిలోని అన్న వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. రెండు రోజుల క్రితం తిరుపతి వచి్చన మోహన్ బుధవారం సాయంత్రం అన్న కుమార్తెలను స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంటివద్ద విడిచిపెట్టి బజార్‌కు వెళ్లాడు.
అన్న ఇంట్లో లేని సమయంలో తిరిగి వచ్చిన మోహన్ కత్తితో వదిన, అన్న కుమార్తెల గొంతుకోశాడు. ఆ తరువాత తాను గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాస్ ఇంటికి చేరుకోగా.. తలుపులు లోపలికి గడియపెట్టి ఉండడంతో అనుమానం వచ్చి వెనుక డోర్ తెరుచుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. అప్పటికే భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి.
తమ్ముడు గదిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ రవిమనోహరాచారి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తన తమ్ముడు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు తనపై కక్ష పెంచుకున్నాడని దాస్ చెప్పాడు. భార్యాభర్త విడిపోవడంతో ఇద్దర్నీ కలిపేందుకు ప్రయత్నించానని తెలిపాడు. తనపై కోపం పెంచుకుని చివరకు ఇలా చేశాడని వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment