Tirupati District Latest News
-
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 59,784 మంది స్వామివారిని దర్శించుకోగా 20,740 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.61 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఎన్ఎస్యూ రిజిస్ట్రార్‌గా వెంకటనారాయణ తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా కడియం వెంకట నారాయణను నియమిస్తూ వీసీ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన డీఆర్డీఏ, సీఏబీఎన్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో డైరెక్టర్‌గా, అడ్మిన్ ఆఫీసర్‌గా పలు హోదాల్లో పనిచేశారు. ఈ సందర్భంగా ఆయనను వర్సిటీ వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి, మాజీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ రమశ్రీ,, అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. అనంతరం నూతన రిజిస్ట్రార్ మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. అరకొర వేట! వాకాడు: ఇటీవల వరుస తుపాన్లు, భారీ వర్షాల కారణంగా సముద్రంలో కొత్త నీరు, అలజడి ఏర్పడి వేట సక్రమంగా సాగడం లేదని సంప్రదాయ మత్స్యకారులు వాపోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం వాకాడు మండలం, కొండూరుపాళెం మత్స్యకారులు మాట్లాడుతూ ఒక్కో బోటులో ఒకరికి నలుగురు చొప్పున పొద్దు పొద్దస్తమానం సముద్రంలో గాలించినా పది, పదేహేను కిలోలకు మించి చేపలు దొరకడం లేదన్నారు. అదీ కూడా ఒకే రకం చేపలు దొరికితే అమ్ముకోవడానికి వీలుగా ఉంటుందన్నారు. అలా కాకుండా వివిధ రకాల చేపలు, పీతలు, రొయ్య లు, గుల్లలు, చెత్తా చెదారం దొరుకుతోందన్నారు. బోట్లకు డీజిల్ ఖర్చులు కూడా గిట్టుబాటు కావ డం లేదన్నారు. ఒడ్డున ఉన్న బోట్లు -
అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు
● శ్రీవారి పాదాలను తాకిన ఉషాకిరణాలు ● సప్త వాహనాలపై దర్శనమిచ్చిన మలయప్ప స్వామి ● భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ● రాత్రి వరకు తగ్గని రద్దీ అశేష భక్తజనం నడుమ చక్రస్నానంలో సేద తీరుతూ..తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య శ్రీమలయప్పస్వామి వారు సూర్యోదయం నుంచి రాత్రి వరకు సప్త వాహనాల్లో విహరించారు. ఉత్సవం నేపథ్యంలో ఉషోదయాన ప్రాతఃకాల ఆరాధన పూర్తికాగానే ఆలయం నుంచి వాహన మండపానికి శ్రీమలయప్పస్వామి వేంచేశారు. ఇక్కడ వజ్రకవచధా రి అలంకారభూషితులై సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ తిరువీధుల్లో వాయువ్య దిశకు చేరుకున్నారు. ఉదయం ఉదయభాను కిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. శ్రీవారి పాదాలపై ఉషాకిరణాలు ప్రసరించి సూర్య భగవానుడు అంజలి ఘటించారు. ఈ సమయంలో భక్తకోటి అఖండ గోవిందనామ కీర్తనలతో వేంకటాచలం ప్రతిధ్వనించింది. సూర్యప్రభ వాహనాన్ని వీడి చిన్నశేష వాహనాన్ని స్వామి అధిష్టించి చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అనంతరం గరుడ, హనుమంత వాహనాలపై ఊరేగి వాహన మండపానికి వేంచేశారు. మధ్యాహ్నం శ్రీమలయప్పస్వామి ఆలయానికి చేరుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వాహనసేవల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. వైభవంగా చక్రస్నానం శ్రీసుదర్శన చక్రతాళ్వారులు ఊరేగుతూ శ్రీవరాహస్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. సుదర్శన భగవానునికి శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర స్నా నం నిర్వహించారు. అనంతరం శ్రీవారు శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై ఊరేగారు. రాత్రి చంద్రోదయం సమయాన చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి ఒక్కరే ఊరేగి తిరిగి వాహన మండపానికి చేరుకున్నారు. స్వల్పంగా తోపులాటలు వాహనసేవ గంటల వ్యవధిలోపే ముగించాల్సి ఉండడంతో వేగం కారణంగా స్వల్పంగా తోపులాటలు చోటు చేసుకున్నాయి. అయితే వాహన సేవల ముందు భక్తుల పట్ల భద్రతా సిబ్బంది దురసుగా వ్యవహరిస్తూ తొసివేయడంపై కొందరు అసహనం వ్యక్తం చేశారు. భారీగా అధికారులు, బోర్డు సభ్యులు కుటుంబ సభ్యులు వాహనముందు చేరడంతో వారిని పక్కకు పంపడం భద్రతా సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. రాంభగీచావద్ద భక్తులను అనుమతించకపోవడంతో పోలీసులతో స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది.నిరంతరాయంగా అన్నప్రసాదాల వితరణ గ్యాలరీల్లోని భక్తులకు పాలు, మజ్జిగ, అన్నప్రసాదాలను టీటీడీ నిరంతరాయంగా అందించింది. మాతృశ్రీ తరిగొండ వెంబమాంబ అన్నప్రసాద సముదాయంతో పాటు తిరువీధుల్లోని గ్యాలరీల్లోని భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, కాఫీ, మజ్జిగ అందించారు. టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మణికంఠ, ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
బాలికోన్నత పాఠశాలకు హరిత అవార్డు
నారాయణవనం: స్థానిక బాలికోన్నత పాఠశాలకు ఈ ఏడాది హరిత పాఠశాలగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినట్లు హెచ్ఎం శశికళ తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ 2024–2025 విద్యాసంవత్సరానికి హరిత పాఠశాలగా జాతీయ స్థాయిలో ఎంపికై ందని తెలిపారు. ఇందులో వ్యర్థాల నిర్వహణ, ఇంకుడు గుంతలతో వర్షపు నీటి నిల్వ, వాడిన నీటిని మొక్కలకు పంపడం, విద్యుత్ ఆదా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. నేషనల్ గ్రీన్ కోర్, సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అవార్డ్‌ను సంస్థ డైరెక్టర్ జనరల్ సునీత నరేన్ చేతుల మీదుగా పాఠశాల తరఫున జీవశాస్త్ర ఉపాధ్యాయులు శ్యామలత అందుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు డీఈఓ కుమార్, డిప్యూటీ డీఈఓ ప్రభాకర్ రాజులు ఫోన్లో అభినందించినట్టు వెల్లడించారు. వామ్మో.. చిరుత! తిరుపతి సిటీ: ఎస్వీయూ కేంద్రీయ లైబ్రరీ వెనుక చిరుత కనిపించినట్టు విద్యార్థులు మంగళవారం సాయంత్రం అటవీశాఖ అధికారులకు, వర్సిటీ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి అధికారులు కేంద్రీయ గ్రంథాలయం వద్దకు చేరుకొని వాహనాలతోనే ఆ పొదల్లో పరిశీలించారు. చిరుత జాడ కనిపించ లేదు. అక్కడ గుమికూడిన విద్యార్థులను రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ఫారెస్ట్ అధికారి సౌజన్య కలిసి, చిరుత వ్యవహార శైలి, ఆహార సేకరణపై అవగాహన కల్పించారు. హాస్టల్‌కు వేళ్లే సమయంలో విద్యార్థులు గుంపులుగా వెళ్లాలని ఆదేశించారు. ఇప్పటికే వర్సిటీలో చిరుత కోసం ట్రాప్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు తెలి పారు. అయితే వాటి వద్దకు విద్యార్థులు వెళ్లడం వల్ల మనిషి పాదముద్రల వాసన గ్రహించి ఆ ట్రాప్ వద్దకు చిరుత రాదని తెలిపారు. డీన్ ఎన్సీ.రాయుడు, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పాకనాటి హరికృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐఐటీ సందర్శన
రేణిగుంట: భారత ఏకాత్మత యాత్రలో భాగంగా మంగళవారం ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల బృందం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీని సందర్శించింది. విభిన్న ప్రాంతాలలో వివిధ జాతులు అవలంభించే సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా 25మంది విద్యార్థులతో కూడిన బృందం ఐఐటీకి వచ్చింది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్.సత్యనారాయణ, ఐఐటీ కాంపిటెన్సీ డెవలప్మెంట్ అండ్ అవుట్చీర్ యాక్టివిటీస్ డీన్ ప్రొఫెసర్ అరుణ్ తంగిరాల వారిని ఆహ్వానించారు. జాతీయ సమగ్రత, సాంస్కృతిక సమ్మేళనాల ప్రాముఖ్యతను వివరించారు. ఐఐటీ క్యాంపస్‌లో ల్యాబ్‌లు, ఆధునిక భవనాలు, సాంకేతికత మేళవించిన సౌకర్యాలను చూసి విద్యార్థుల బృందం ముగ్ధులయ్యారు. రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు శ్రీకాళహస్తి: రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడిన ఘటన మంగళవారం తొట్టంబేడు మండలంలో చోటు చేసుకుంది. తిరుపతి ఆటోనగర్‌కు చెందిన మురళి, అతని భార్య శ్యామల, కుమార్తెలు హాసిని, హర్షిణి నెల్లూరు వెళ్లి తిరిగి బయలుదేరారు. తమిళనాడు రాష్ట్రం వేలూరుకు చెందిన ఓ వ్యాపారి కుటుంబంతో నెల్లూరుకు బయలుదేరాడు. మార్గం మధ్యలోని తొట్టంబేడు మండలం బసవయ్యపాళెం వద్ద ఈ రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కలబడినా..
వారం రోజులుగా ఆధ్యాత్మిక తిరుపతి నగరం అట్టుడికి పోయింది. తిరుపతి కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కాలకేయకూటమి చెలరేగిపోయింది. 48 మంది కార్పొరేటర్ల బలం కలిగిన వైఎస్సార్సీపీ వ్రేణులపై దాడికి తెగబడింది. వారి ఆస్తులను ధ్వంసం చేస్తూ అరాచకం సృష్టించింది. కుటుంబ సభ్యులను బెదిరిస్తూ భయాందోళనకు గురిచేసింది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అధికారులను అడ్డం పెట్టుకుని మరీ చిత్ర హింసలకు శ్రీకారం చుట్టింది. సోమవారం ఓటేయడానికి వచ్చిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై గూండాగిరి ప్రదర్శించింది. నలుగురు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి కలకలం సృష్టించింది. ఆపై మంగళవారం ఓటింగ్‌లో పాల్గొన్న ఆ కార్పొరేటర్లు కన్నీళ్లు పెట్టుకోవడం వారి అరాచకాలకు నిదర్శనంగా నిలిచింది. మహిళా మేయర్, కార్పొరేటర్ల వీరోచిత పోరాటం రాష్ట్ర ప్రజానీకానికి ఆదర్శంగా నిలిచింది. ఆదరిస్తూ..అండగా నిలుస్తూ! వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి కార్పొరేటర్లకు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలబడడాన్ని పలువురు ప్రసంసిస్తున్నారు. వారం రోజుల పాటు వారిని సురక్షితంగా తన నివాసానికి తీసుకొచ్చా రు. ఆపై వారి కుటుంబాలకు అండగా నిలిచారు. దాడులు, ప్రతి దాడులను ఎప్పటికప్పుడు ప్రతిఘటించారు. అదేవిధంగా మేయర్ డాక్టర్ శిరీష మహిళే అయినా.. గూండాలు ఎదురొచ్చి దాడులు చేస్తున్నా అధైర్యపడలేదు. మహిళా కార్పొరేటర్లకు ధైర్యం చెబుతూ వీరోచితంగా పోరాడారు. మరో కార్పొరేటర్ ఆరణి సంధ్య మహిళా కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ కూటమి నేతల బెదిరింపు కాల్స్‌ను తిప్పికొట్టారు. ఇలా ప్రతి మహిళా కార్పొరేటర్ తమదైన శైలిలో పోరాడి అభినందనలు అందుకున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి డెప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కాలకేయ కూటమికి ఎదురొడ్డి పోరాడారు. నగరంలో వారం రోజులుగా కూటమి గూండాల అలజడులు.. అల్లర్లతో భయానక వాతావరణాన్ని సృష్టించారు. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసినా.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు అదరలేదు.. బెదరలేదు. తాము ప్రయాణిస్తున్న వాహనాన్ని సుమారు 500 మంది గూండాలు అడ్డుకుని రాడ్లు, రాళ్లతో దాడులకు తెగబడుతున్నా చింతించలేదు. ముఖ్యంగా మహిళా కార్పొరేటర్లు ఎదిరించి వీరోచిత మహిళలనిపించుకున్నారు. పోలీసులు, రెవెన్యూ, కార్పొరేషన్, కిరాయి రౌడీలందరినీ ఉపయోగించినా కుట్రలు పారలేదు. కూటమి అరాచకాలకు ఆ కన్నీళ్లే సాక్ష్యం తిరుపతి డెప్యూటీ మేయర్ ఎన్నికలు ముగిశాక కిడ్పాప్‌నకు గురైన వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు, ఎమ్మెల్సీ తిరిగి భూమన కరుణాకరరెడ్డి నివాసానికి విచ్చేశారు. జరిగిన తీరును వివరించారు. తమపై భౌతిక దాడులు చేస్తూ, ఆస్తులు విధ్వంసానికి పాల్పడిన నరకం చూపించారని అనీష్‌రాయల్ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. అనీష్ ఆవేదనను అర్థం చేసుకున్న భూమన కన్నీరు పెట్టుకోవడం చూసి కార్పొరేటర్లంతా భావోద్వేగానికి లోనయ్యారు. భవిష్యత్‌లో అంతా కలసికట్టుగా పనిచేయడానికి వేదికగా మారిందని వైఎస్సార్సీపీ శ్రేణులు అభిప్రాయపడ్డారు. కళ్లెదుటే అరాచకం సృష్టిస్తున్నా అదరలేదు, బెదరలేదు వీర సైనికులనిపించుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కూటమి గూండాలను ఎదిరించిన మహిళా కార్పొరేటర్లు దొడ్డిదారిలో డెప్యూటీని లాక్కున్నా నైతిక విజయం వైఎస్సార్సీపీదే వారం రోజులపాటు కూటమి గూండాలు వెంటాడినా చివరకు ఓటేశారు! నైతిక విజయం వైఎస్సార్సీపీదే కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. తిరుపతి డెప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా దిగజారుడు రాజకీయాలకు ఒడిగట్టారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కొందరిని అధికారబలంతో బెదిరించి, భయపెట్టి ప్రలోభాలకు గురిచేశారు. దొడ్డిదారిలో డెప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. కానీ నైతిక విజయం మాత్రం వైఎస్సార్‌సీపీదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలమనుకోవద్దు! తిరుపతి నగర మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో నైతిక విజయం వైఎస్సార్సీపీదే. టీడీపీకి చెందిన ఒకే ఒక కార్పొరేటర్‌తో డెప్యూటీ మేయర్ స్థానాన్ని ఎలా దక్కించుకోగలుగుతారు..? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికార బలం, దాడులు, ఆస్తుల ధ్వంసం, అక్రమ కేసులు, కిడ్నాప్లతో లోబరుచుకున్నారు. టీడీపీ గెలుపు చూసి తాము బలంతో గెలిచాం అనుకుంటున్నారు. ప్రజాకోర్టులో కూటమి ప్రభుత్వం ఓడిపోయింది. – డాక్టర్ ఎం.గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
మోసకారి చంద్రబాబు
– డీసీసీబీ మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి పెళ్లకూరు: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ యువగళం పాదయాత్ర నుంచి 2024 ఎన్నికల ప్రచారంలో అనేక వాగ్ధానాలు చేసి అధికారంలోకి రాగానే మాట మార్చిన ‘ద గ్రేట్ మోసకారి చంద్రబాబు’ అని డీసీసీబీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఘాటుగా విమర్శించారు. మంగళవారం చిల్లకూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పలు ప్రశ్నలు సంధించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షలు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ప్రతి నెలా రూ.3 వేలు ఎక్కడని నిలదీశారు. 2025 జనవరి 1న విడుదల చేస్తామన్న జాబ్ క్యాలెండర్, వలంటీర్లను కొనసాగిస్తూ రూ.10 వేలు పారితోషకం ఇస్తామని చెప్పిన మాట ఎక్కడన్నారు. అధికారంలోకి రాగానే లక్షలాది కంపెనీలు తీసుకొచ్చి సృష్టిస్తామన్న సంపద ఎక్కడ?, బడికి వెళ్లే ఒక్కో బిడ్డకు రూ.15 వేలు ఇస్తామన్న తల్లికి వందనం ఎక్కడ?, రైతుకు రూ.20 వేలు ఇస్తామన్న పెట్టుబడి ఎక్కడ?, ఇంట్లో 19 నుండి 59 ఏళ్లు ఉన్న మహిళలకు ఒక్కరుంటే రూ.1,500, ఇద్దరుంటే రూ.3 వేలు, ముగ్గురుంటే రూ.4,500 అని చెప్పిన మాట ఎక్కడ?, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, పొదుపు మహిళలకు ఇస్తామన్న రూ.18 వేలు ఎక్కడని నిలదీశారు. కూటమి పాలనలో ఆ పార్టీ శ్రేణులంతా ఇసుక దోపిడీ, గ్రావెల్ మాఫియా, బెల్టు షాపులతో అక్రమ ధనార్జన కోసమే నిరంతరం శ్రమిస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పే సమయం త్వరలో వస్తుందన్నారు. -
సంకల్ప్ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అర్బన్: కేంద్ర ప్రభుత్వం సంకల్ప్ పథకం ద్వారా రెండు నెలలుపాటు శిక్షణ ఇచ్చి.. తర్వాత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి శ్రీకారం చుట్టిందని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ తిరుపతిలో శిక్షణ కోసం నాలుగు సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. 8 తర్వాత మార్చి 31 వరకు శిక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. శిక్షణ అనంతరం కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ జారీచేస్తారని వివరించారు. అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించన్నట్టు వెల్లడించారు. తిరుపతిలో నాల్గుచోట్ల శిక్షణ ● జన శిక్షణ్ సంస్థాన్ వారి నేతృత్వంలో తిరుపతిలోని రాస్ బిల్డింగ్‌లో అసిస్టెంట్ డ్రెస్ మేకర్, అసిస్టెంట్ టైకె ్సల్స్ ప్రింటర్, అసిస్టెంట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, బ్యూటీ కేర్ అసిస్టెంట్, అసిస్టెంట్ జ్యూట్ కేర్ క్రాప్ట్ ప్రొడక్ట్ మేకర్ శిక్షణ ఇవ్వనున్నారు. కనీసం రాయడం, చదవడం పరిజ్ఞానం ఉండాలి. 18–45 ఏళ్ల వారు అర్హులు. అదనపు సమాచారం కోసం 9440275311, 9848209212, 8897309621 నంబర్లలో సంప్రదించవచ్చు. ● ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ అఫ్ ఉమెన్(మహిళా ప్రాంగణం) తిరుచానూరులో శిక్షణ. అసిస్టెంట్ బ్యూటీ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్పై శిక్షణ ఇవ్వనున్నారు. కనీసపం పదో తరగతి, 18–45 ఏళ్లు వారు అర్హులు. అదనపు సమాచారం కోసం 9160932881, 8333921349లో సంప్రదించవచ్చు. ● ఎస్వీయు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో, డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్ అనే శంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఏదైనా డిగ్రీ, 18–45 ఏళ్ల వారు అర్హులు. అదనపు సమాచారం కోసం 9666798537, 9110762515 నంబర్లలో సంప్రదించాలి. ● నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారు తిరుపతిలోని అలిపిరి రోడ్డు ఎస్వీ మెడికల్ కళాశాల వద్ద శిక్షణ ఇవ్వనున్నారు. అసిస్టెంట్ ఎలక్ట్రిషన్ అనే అంశంపై శిక్షణ అందిస్తారు. కనీసం పదో తరగతి చదివి ఉండాలి. 18–45 ఏళ్ల లోపు వారు అర్హులు. అదనపు సమాచారం కోసం 9701440274, 9703437472 నంబర్లలో సంప్రదించవచ్చు. -
క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించాలి
తిరుపతి తుడా: క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే ప్రాణ హాని వుండదని స్విమ్స్ డైరెక్టర్, వీసీ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని స్విమ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. స్విమ్స్ క్యాన్సర్ బ్లాక్ నిర్మాణంలో ఉందని, అందులో 5 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. స్విమ్స్‌లో బోన్ మ్యారో సేవలు కూడా త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు. క్యాన్సర్ గుర్తించడానికి పింక్ బస్ ద్వారా అన్ని పరీక్షలు చేస్తున్నట్టు తెలియజేశారు. డీన్ అల్లాడి మోహన్, అంకాలజీ వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. రుయాలో... రుయా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కమ్యూనీటీ పారామెడికోస్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియషన్ ఆధ్వర్యంలో మంగళవారం క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీరోడ్డు నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకుడు పి.నవీన్‌కుమార్‌రెడ్డి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
వరి ధాన్యం కొనుగోలుకు శ్రీకారం
తిరుపతి అర్బన్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సివిల్ సప్లయ్ అధికారులు మొదలుపెట్టారు. రెండు రోజులుగా జిల్లాలోని ఆరు మండలాల్లో కొనుగోలు చేస్తున్నారు. వారం క్రితం సాక్షి దినపత్రికలో ‘ఇదేం మెలిక’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం జిల్లాలోని వరదయ్యపాళెం, బీఎన్ కండ్రగ, పిచ్చాటూరు, నాగలాపురం, డీవీ సత్రం, సూళ్లూరుపేట మండలాల్లో ఒక్కో మండలంలో రెండు నుంచి నాలుగు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సాధారణ రకం (75 కేజీలు) రూ.1,725, గ్రేడ్ –ఏ రకం (75 కేజీలు) రూ.1,740 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ రూల్స్ తప్పనిసరి ● చెడిపోయినా, మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యపు గింజలు 4 శాతం మించి ఉండరాదు ● వ్యర్థ పదార్థాలు, మట్టి, రాళ్లు, ఒక శాతానికి మించి ఉండరాదు ● చెత్త, తాలు(జల్లు) ఒక శాతం మించి ఉండరాదు ● రంగు మారిన ధాన్యం ఐదు శాతానికి మించ ఉండరాదు ● పరిపక్వం లేని, ముడుచుకుపోయిన, వంకర తిరిగిన ధాన్యం మూడు శాతం మించరాదు ● కేళీలు ఆరు శాతం మించి ఉంటే కొనుగోలు చేయరు ● తేమ 17 శాతం మించి ఉండరాదు -
చేపాచేపా ఎప్పుడొస్తావ్?
– చెరువుల్లో చేప పిల్లలు వదలడానికి వాయిదాలు తిరుపతి అర్బన్: జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలను వదలడానికి మత్స్యశాఖ అధికారులు వాయిదాలపై వాయిదాలు వేస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అంటూ నాలుగు నెలలుగా కాలయాపన చేస్తున్నారు. సాధారణంగా గడిచిన పదేళ్లుగా బాపట్ల ప్రాంతం నుంచి చేప పిల్లలను సెప్టెంబర్‌లో తెచ్చుకుని రెండు నెలల పాటు జాలర్ల సమక్షంలో పెంచడం.. తర్వాత చెరువుల్లోకి నీళ్లు వచ్చి అనంతరం నవంబర్, డిసెంబర్లో వదిలిపెట్టేవారు. ఆ తర్వాత మూడు నెలల్లోనే (90 రోజులు) చెరువుల్లో చేప పిల్లలు పెద్దవై.. కేజీకి పైగా తూకం వచ్చేవి. వీటిని విక్రయించడం ద్వారా ఆదాయం వచ్చేది. అయితే కూటమి ప్రభుత్వం చేప పిల్లలను తెప్పించడం మానేశారు. జాలర్ల సమక్షంలో పెంచే కార్యక్రమానికి స్వస్తి పలికారు. జనవరి మొదటి వారంలో చెరువుల్లో చేప పిల్లలను వదలనున్నట్లు మొదట ప్రకటించారు. తర్వాత జనవరి చివరి వారం, అనంతరం ఫిబ్రవరి 1 నుంచి అంటూ ప్రచారం చేశారు. తాజాగా మరో మూడు రోజుల్లో ప్రారంభిస్తామని చెబుతున్నారు. చేప పిల్లలు వదిలిపెట్టిన తర్వాత మూడు నెలలు ఉంటేనే కేజీకి పైగా తూకం వస్తాయి. అయితే మార్చి 31కి జిల్లాలోని 90 చెరువుల్లో నీళ్లు ఉండవు. ఇప్పటికిప్పుడు వదిలిపెట్టినా 50 రోజులు మాత్రమే గడువు ఉంటుంది. కనీసం అర కేజీ అయినా తూకం వస్తాయని అంతా భావిస్తున్నారు. అయినా వదిలిపెట్టకుండా వాయిదాలు వేయడంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.మూడు రోజుల్లో వదులుతాం మరో మూడు రోజుల్లో చేప పిల్లలను చెరువుల్లో వదులుతాం. ముందుగా మత్స్యకారుల సొసైటీలున్న చెరువుల్లో, ఆ తర్వాత చెరువుల్లో నీటి శాతాన్ని బట్టి చేప పిల్లలు వదులుతాం. – నాగరాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి -
తుమ్మలగుంటలో వైభవంగా రథసప్తమి వేడుకలు
తిరుపతి రూరల్ : తుమ్మలగుంటలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరుపతి నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామి వారిని దర్శించి పునీతులయ్యారు. మంగళవారం ఉదయం స్వామి వారు సూర్యప్రభ వాహనంపై గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తికి ప్రత్యేక అలంకరణ, దైనందిన పూజాధికాలు నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలు, కర్పూర హారతుల నడుమ స్వామి వారి వాహన సేవలు కన్నుల పండువుగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు వాహన సేవల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సప్త వాహనాలపై కల్యాణ వెంకన్న విహారం ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై స్వామి వారు భక్తులను కటాక్షించారు. ఆ తర్వాత చిన్న శేష వాహనం, గరుడ, హనుమంత వాహనాలపై విహరించారు. అనంతరం ఆలయ పుష్కరణిలో వైఖానస ఆగమోక్తంగా చక్రతాళ్వార్‌కు తిరుమంజనం నిర్వహించి చక్రస్నానం ఆచరించారు. సాయంత్రం 5 గంటల నుంచి స్వామి వారు కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి పర్వదినాన సూర్యప్రభ వాహన సేవ తరువాత జరిగిన పుష్కరణిలో సాగిన చక్రస్నానానికి భక్తులు కిక్కిరిసిపోయారు. సప్త వాహనాలపై కల్యాణ వెంకన్న విహారం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు -
ఎల్ఎల్ఎం పరీక్షా ఫలితాల విడుదల
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన ఎల్ఎల్ఎం రెండవ సెమిస్టర్ ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎం.దామ్లానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని కోరారు. నేడు ప్రాక్టికల్స్ పరీక్ష నిర్వహణపై సమీక్ష తిరుపతి ఎడ్యుకేషన్: ఈ నెల 10నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ జనరల్ ప్రాక్టికల్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్ఐఓ) జీవీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణపై బుధవారం ఉదయం 10గంటలకు తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్య కళాశాలల్లో పనిచేస్తున్న సైన్స్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ) లెక్చరర్లు తప్పనిసరిగా ఈ సమీక్షకు హాజరవ్వాలని ఆర్ఐఓ కోరారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చంద్రగిరి: రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని శ్రీనివాసమంగాపురం సమీపంలోని రైల్వే గేటు వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గుర్రంకొండ మండలం అరిగివారిపల్లికి చెందిన రవి కుమార్ యాదవ్(55) శనివారం రాత్రి తిరుపతి నుంచి వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శరీరంపై నుంచి రైలు వెళ్లడంతో మృతదేహం ఛిద్రమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం రైల్వే అధికారులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్వర్టును ఢీకొన్న బొలెరో కల్వర్టును బొలెరో ఢీకొనడంతో డ్రైవరు గాయాలపాలయ్యాడు. ఈ ఘటన మంగళవారం పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై అగరాల సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. చిత్తూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ బాలాజీకి తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు బస్సులు ఢీ
– 15 మందికి గాయాలు చిల్లకూరు: యాత్రలకు వెళ్లి తిరిగి సొంత ఊరికి వెళుతున్న ఓ ప్రైవేటు బస్సును వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు తెలంగాణా రాష్ట్రంలోని జనగాం ప్రాంతానికి చెందిన 50 మంది పుణ్య క్షేత్రాలకు 15 రోజులు క్రితం వెళ్లారు. తిరిగి వెళ్తున్న క్రమంలో చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా సమీపంలోకి వచ్చింది. అదే సమయంలో నెల్లూరు –2 డిపోకు చెందిన బస్సు తిరుపతి నుంచి నెల్లూరుకు వస్తూ ముందున్న యాత్రికుల ట్రావెల్ బస్సును వెనక నుంచి ఢీ కొంది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్తోపాటుగా రెండు బస్సుల్లో ఉన్న 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనాలు, స్వర్ణ టోల్ ప్లాజా అంబులెన్స్‌లలో క్షత గాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో జనగాం ప్రాంతానికి చెందిన శివకుమార్, వీరాస్వామి, యాకయ్య, కలమ్మలతోపాటుగా మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే ఆర్టీసీ బస్సులో తిరుపతి నుంచి నెల్లూరుకు ప్రయాణిస్తున్న డ్రైవర్ ఆనంద్, చిత్తూరుకు చెందిన హేమంత్‌కుమార్, పీలేరు ప్రాంతం చెరువు కింద పల్లికి చెందిన జయరామయ్య, శ్రీకాళహస్తికి చెందిన పద్మమ్మ, నెల్లూరుకు చెందిన షకీలాకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారి వద్ద నుంచి వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు. -
ఎరచ్రందనం అక్రమ రవాణాకు ఏడాది జైలు
తిరుపతి లీగల్ : ఎరచ్రందనం దుంగలను అక్రమ రవాణా చేసిన కేసులో డక్కిలి మండలం, వెల్లికల్లుకు చెందిన ఆటో డ్రైవర్ ఎం.గురునాథంకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ జూనియర్ జడ్జి ఎస్.శ్రీకాంత్ మంగళవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం.. 2012 సెప్టెంబర్ 25వ తేదీ వెంకటగిరి ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది బాలయ్యపల్లి మండలం, అక్కంపేట– కయురు చెరువు అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా నిందితుడు గురునాథం తన వాహనంలో 373 కిలోల 18 ఎరచ్రందనం దుంగలను తరలిస్తూ ఫారెస్ట్ సిబ్బందికి పట్టుబడ్డాడు. వెంకటగిరి రేంజ్, బాలయ్యపల్లి సెక్షన్ ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ శిరీష వాదించారు. -
సిరుల తల్లికి.. శిరసాభివందనం
● రథసప్తమి వేళ.. సప్త వాహనాలపై పద్మావతి అమ్మవారి దర్శనం తిరుపతి రూరల్ : సిరుతల్లి శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఒకేరోజు ఏడు వాహనాలపై అమ్మవారు దర్శనం ఇవ్వడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలను తలపించాయి. ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమైన వాహన సేవలు మధ్యాహ్నం 2 గంటల వరకు నిరాటంకంగా సాగాయి. హంస, అశ్వ, గరుడ, చిన్న శేష వాహనాలపై అమ్మవారు విహరించారు. సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ, గజ వాహన సేవలు అత్యంత వైభవంగా సాగాయి. పోటెత్తిన భక్తజనం సిరుల తల్లికి శిరసాభి వందనం అన్నట్లుగా భక్తులు అమ్మవారి వాహనసేవల్లో పాల్గొని గోవిందా.. గోవిందా.. అంటూ ప్రార్థిస్తూ ప్రణమిళ్లారు. ఒక్క రోజు బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి పర్వదినాన అమ్మవారు సప్త వాహనాలపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు రథసప్తమి పర్వదినాన కళాకారులు ప్రదర్శించిన దేవతా మూర్తుల కళా రూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు కళాకారులు చేసిన నృత్యాలు, కోలాటాలు, చెక్క భజనలు అలరించాయి. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు అమ్మవారి వాహనసేవల్లో తరించారు. -
10న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
తిరుపతి అర్బన్: నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఈ నెల 10న చేపట్టనున్నట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఆ మేరకు సోమవారం కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్‌తోపాటు వైద్యాధికారులతో కలసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించి, ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రతి ఏటా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈ నెల 17న మాప్–ఆఫ్ డే నిర్వహణ ఉంటుందన్నారు. 1–19 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు అల్బెండోజోల్ 400 ఎంజీ ట్యాబ్లెట్లు అందిస్తారని చెప్పారు. డీఎంహెచ్ఓ బాలకృష్ణనాయక్, డాక్టర్లు హరిత, పద్మావతి, అబిజ్ఞ, గుణశేఖర్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
తిరుపతి అర్బన్: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్ ఉంటాయని.. ఆ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయన సోమవారం ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనరల్ విద్యార్థులు 24,927 మందికి 124 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 2,355 మంది కోసం 23 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. విద్యార్థులు 20 నిమిషాలకు ముందే సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థుల కోసం బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని, సెంటర్లలో తప్పకుండా సీసీ కెమెరాలు ఉండాలని డీఆర్వో నరసింహులు, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి ప్రభాకర్‌రెడ్డి, డీఈఓ కేవీఎన్ కుమార్‌ను ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ రఘుపతి, రాజశేఖర్‌రెడ్డి, గోపాలరెడ్డి, రవి, విద్యుత్ శాఖ ఈఈ వాసవీలత, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
సరస్వతీ నమస్తుభ్యం!
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో వసంతి పంచమిని పురస్కరించుకుని సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద భక్తులు తమ చిన్నారులతో పాల్గొని వేదపండితులు ఆశీర్వచనాల నడుమ అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మాట్లాడుతూ వసంత పంచమి రోజున చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయిచడం ఎంతో శుభకరమన్నారు. ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్, శ్రీచైనత్య, ఎంజీఎం తదితర పాఠశాలల్లో కూడా నర్సరీ విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు -
● రణరంగంగా తిరుపతి నగర డెప్యూటీ మేయర్ ఉప ఎన్నిక ● విధ్వంసం సృష్టించిన కూటమి నేతలు ● డెప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నేటికి వాయిదా ● దాడులకు తలొగ్గని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ● ఎస్వీయూలో కూటమి రౌడీల హల్చల్ ● అధికార పార్టీకి సహకరించిన పోలీసులు, అధికారులు
వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల బస్సును చుట్టుముట్టిన కూటమి గూండాలు తిరుపతి డెప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి గూండాలు రెచ్చిపోయారు. బలం లేని చోట బలగాన్ని వెంటబెట్టుకుని అరాచకానికి ఒడిగట్టారు. ఓటేయడానికి బస్సులో వచ్చిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. మహిళా కార్పొరేటర్లపై అమానవీయంగా వ్యవహరించారు. కొందరు కార్పొరేటర్లను బలవంతంగా లాక్కొచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. జర్నలిస్ట్‌లపైనా దాడికి తెగబడ్డారు. పోలీసులు, అధికారుల సమక్షంలోనే ఎస్వీయూ ప్రాంగణంలో రణరంగం సృష్టించారు. తిరుపతి డెప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడేలా చేశారు. తిరుపతి తుడా, తిరుపతి సిటీ: తిరుపతి నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ ఉప ఎన్నిక రణరంగంగా మారింది. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌ల మధ్య కోరం లేక మంగళవారానికి వాయిదా పడింది. ఎస్వీ యూనివర్సిటీ వేదికగా సోమవారం నగర డెప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఎస్వీయూ ప్రాంగణంలో కూటమి నేతల అరాచకాలతో హైడ్రామా నడిచింది. ఎన్నికల అధికారులు విధించిన నిబంధనలు కూటమి నేతలకు వర్తించలేదు. వర్సిటీ ప్రాంగణం టీడీపీ, జనసేన నేతలతో నిండిపోయింది. వైఎస్సార్సీపీ నేతలకు అడుగడుగునా తనిఖీలు తప్పలేదు. ఉదయం 6 గంటల నుంచే యూనివర్సిటీ పోలీసుల చక్రబంధంలోకి వెళ్లింది. దాడులకు తలొగ్గని కార్పొరేటర్లు డెప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు ఏకంగా జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ రంగంలోకి దిగారు. గడిచిన ఐదు రోజులుగా తిరుపతిలో తిష్టవేసి రాజకీయాలు నడిపించారు. వైఎస్సార్సీపీకి చెందిన కార్పొరేటర్లను లొంగదీసుకునేందుకు బెదిరింపులకు దిగారు. లొంగకపోవడంతో ఆస్తుల ధ్వంసానికి తెగబడ్డారు. ఈ క్రమంలో ముగ్గురు కార్పొరేటర్లు కూటమి పంచన చేరాల్సి వచ్చింది. అయితే మిగిలిన కార్పొరేటర్లు టీడీపీ, జనసేన నేతల ఒత్తిళ్లు, దాడులకు తలవంచ లేదు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ బలాన్ని తగ్గించేందుకు కిడ్నాప్‌లకు తెరలేపారు. ఉదయం 8 నుంచి 21వ డివిజన్ కార్పొరేటర్ రాజమ్మ ఇంటివద్ద టీడీపీ నాయకులు దిష్ట వేశారు. అన్నా రామచంద్రయ్య, కార్పొరేటర్ అనిత, టీడీపీ నేతలు కోడారు బాల సుబ్రమణ్యం, బుల్లెట్ రమణ ఆమెను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని వెళ్లిపోయా రు. ఆపై ఆమె తిరిగి వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచారు. అలాగే మరింత మంది కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి దౌర్జాన్యాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో మెజారిటీ కార్పొరేటర్లు కౌన్సిల్లోకి వెళ్లేందుకు నిరాకరించి నిరసనకు దిగారు. అంతా పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వస్తున్న వాహనంపై విధ్వంసం, దాడులు, కిడ్నాప్‌లు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. టీడీపీ, జనసేన నేతలు గుమిగూడి, నానా హంగామా చేస్తున్నా పట్టించుకోలేదు. పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్ల కిడ్నాప్‌లు చేసినా చూసీచూనట్టు వదిలేశారు.వర్సిటీలో రౌడీల హల్చల్పోలీసులు ఎస్వీయూ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 144 సెక్షన్ విధించారు. పాస్‌లు పేరుతో హడావుడి సృష్టించారు. అయితే ఇవన్నీ ప్రతిపక్ష పార్టీకి మాత్రమే పోలీసులు వర్తింపజేశారు. టీడీపీ, జనసేన నాయకులు వందలాది మంది ఎన్నిక జరిగే భవనం ముందు తిష్టవేశారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు ఆరణి మధన్ తన అనుచరులతో వర్సిటీ ప్రాంగణంలో హల్చల్ చేశారు. టీడీపీ, జనసేన నేతలకు ఎన్నికల అధికారులు విచ్చల విడిగా పాస్‌లు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నాయకుడు నరసింహయాదవ్ పోలీసులను బెదిరిస్తూ కౌన్సిల్ హాల్లోకి వెళ్లడం గమనార్హం. బలవంతంగా వీడియోలు ఎన్నిక నిర్వహణలో విఫలం కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకే ఒక్క డివిజన్‌ను టీడీపీ గెలుచుకుంది. 48 స్థానాలను వైఎస్సార్సీపీ కై వశం చేసుకుంది. ఒక్క కార్పొరేటర్‌తో కూటమి ప్రభుత్వం డెప్యూటీ మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని చేస్తున్న కుయుక్తుల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డెప్యూటీ మేయర్ ఎన్నికను సకాలంలో నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కూటమి దౌర్జన్య కాండ డెప్యూటీ మేయర్ ఎన్నికలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఇంటి నుంచి ఉదయం 9.55 గంటలకు బయలు దేరారు. ప్రత్యేక వాహనంలో వస్తున్న కార్పొరేటర్లు ఎస్వీయూ రెండో గేటు వద్దకు చేరుకోగానే కూటమి నేతలు అడ్డుకున్నారు. అక్కడే ముందగా తిష్టవేసిన 300పైగా రౌడీమూకలు ఒక్కసారిగా చుట్టుముట్టారు. బస్సు చక్రాలకు గాలితీశారు. వాహన అద్దాలను ధ్వంసం చేశారు. దాడులతో ఉలిక్కిపడ్డ మహిళా కార్పొరేటర్లు భయాందోళనకు గురయ్యారు. రౌడీ మూకల అరుపులు, కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వాహనంలోకి చొరబడి కార్పొరేటర్లపై పిడిగుద్దులు గుద్దుతూ తిట్లదండకం అందుకున్నారు. కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, పుల్లూరు అమరనాథ్‌రెడ్డి, బోకం అనిల్, అనీష్‌రాయల్, మోహన్ క్రిష్ణయాదవ్పై దాడులకు దిగారు. ఆపై సిద్ధంగా ఉన్న కూటమి నేతల వాహనాల్లో వారిని ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. మిగిలిన కార్పొరేటర్లలో ఐదుగురిని కొట్టుకుంటూ వాహనాల్లో ఎక్కించారు. మహిళా కార్పొరేటర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. కిడ్నాప్‌కు గురైన కార్పొరేటర్లపై దౌర్జన్యం చేసి వారి నుంచి బలవంతంగా వీడియోలను చేయించి విడుదల చేయించారు. 21వ డివిజన్ కార్పొరేటర్ రాజమ్మను స్పష్టంగా కిడ్నాప్ చేసిన దృశ్యాలు ఉన్నాయి. కానీ అన్నా అనిత కిడ్నాప్ కాలేదని వీడియో చేసి మీడియాకు విడుదల చేశారు. అలానే యూనివర్సిటీ వద్ద ఐదుగురు కార్పొరేటర్లను కిడ్నాప్‌చేసి ఒకరిని విడుదల చేశారు. నలుగురు కార్పొరేటర్లను ఫామ్ హౌజ్‌లో పెట్టి తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇళ్లవద్దే ఉన్నామని వీడియోలు చేయించి విడుదల చేశారు. ఈ వీడియోలు బలవంతంగా చేశారనే విషయం తేటతెల్లమవుతోంది. ఈ కుట్ర వెనుక అన్నా రామచంద్రయ్య హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. -
రథసప్తమికి పెంచలకోన సిద్ధం
రాపూరు: మండలంలోని పెంచలకోనలో మంగళవారం జరగనున్న రథసప్తమి వేడుకులకు సర్వం సిద్ధం చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. రథసప్తమి నాడు సప్త వాహనాల్లో శ్రీపెనుశిల లక్ష్మీనసింహుడు క్షేత్రంలోని మాడ వీధుల్లో ఊరేగనున్నారు. రథసప్తమి పర్వదినాన్ని మినీ బ్రహ్మోత్సవంలా భవిస్తారని అధికారులు వెల్లడించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టినట్టు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు సూర్యప్రభ వాహనంపై, 8కి శేష వాహనం, 10కి సింహ వాహనం, 12కు బంగారు హనుమంత వాహనం, 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు హనుమంత వాహనం, 6కు అశ్వ వాహనం, 8 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నట్టు తెలిపారు. -
అర్జీలకు పరిష్కారం చూపండి
తిరుపతి అర్బన్: అర్జీలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు కలెక్టర్‌తోపాటు జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 220 అర్జీలు వచ్చాయి. అందులో 116 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం నుంచి మండల కార్యాలయాలు, డివిజన్ కార్యాలయాల పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను అక్కడే పరిష్కరించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
పొంచి ఉన్న నీటి గండం!
● స్వర్ణముఖి నదిలో ఇసుక రీచ్ ● ఎడారిగా మారనున్న వేల ఎకరాల పంట భూములు ● సాగునీటి పథకాలకూ ఇబ్బందే ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● లబోదిబో మంటున్న అన్నదాతలు ● వైఎస్సార్సీపీ పాలనలో ఇసుక రీచ్‌లు రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు పెళ్లకూరు: చుట్టూ పచ్చని పంట పొలాలు. పోరు గాలికి ఆటూ ఇటూ తలూపుతూ రైతును ఉల్లాస పరిచే వరి పైర్లు. నోరూరించే కూరగాయల తోటలు. సాగుకు అనుకూలంగా వేలాది ఎకరాలు.. కానీ ఇవేవీ కూటమి ప్రభుత్వానికి కనిపించడంలేదు. స్వర్ణముఖి నదిలో ఇసుక రీచ్ ఏర్పాటుకు అనుమతిలిస్తూ ఆదేశాలివ్వడం విమర్శలకు తావిస్తోంది. నదీ పరివాహక భూములన్నీ ఎడారిని తలపిస్తాయని రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. నాటి నుంచీ! 1987లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు తెలుగుగంగా కాలువ ఏర్పాటు చేసి స్వర్ణముఖి నదికి గంగ జలాలను విడుదల చేయించారు. దాంతో మండలంలోని ముమ్మారెడ్డిగుంట, పుల్లూరు, కలవకూరు, చింతపూడి, అనకవోలు, పెరుమాళ్లపల్లి, యాలకారికండ్రిగ, గంగరాజుకండ్రిగ, భీమవరం, రావులపాడు, కొత్తూరు, పెళ్లకూరు, కప్పగుంటకండ్రిగ, చిల్లకూరు, జీలపాటూరు, చావలి, చెంబడిపాళెం, పాలచ్చూరు, తాళ్వాయిపాడు గ్రామాల్లోని సుమారు 1,150 మందికి పైగా రైతులు 6,352 ఎకరాల్లో వరి, వేరుశనగ, పలు రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. అలాగే స్వర్ణముఖినది నుంచి చెంబడిపాళెం గ్రామం వద్ద రాజీవ్ టెక్నాలజీ మంచినీటి పథకం ద్వారా దిగువచావలి, చెంబడిపాళె, బంగారంపేట, ఊడిపూడి, మోదుగులపాళెం, రోసనూరు, రాజుపాళెం, సిద్దాపురం వేణుంబాక గ్రామాలకు తాగునీరు సరపరా అవుతోంది. అలాగే తాళ్వాయిపాడు, ఎగువచావలి, శిరసనంబేడు, చిల్లకూరు, జీలపాటూరు, పెళ్లకూరు, కొత్తూరు, రావులపాడు, నెలబల్లి, చింతపూడి, పుల్లూరు, ముమ్మారెడ్డిగుంట, కలవకూరు, అనకవోలు గ్రామాల్లోని ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌లకు స్వర్ణముఖినది నుంచి తాగునీరు అందుతోంది. పొంచి ఉన్న ముప్పు స్వర్ణముఖినదిలో ఇసుక రీచ్ మంజూరు చేయడం వల్ల పచ్చని పంట పొలాలకు ముప్పు పొంచి ఉంది. ఇసుక తోడేస్తే ఈ ప్రాంతమంతా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. నదికిరువైపులా సారవంతమైన భూములు ఉండడంతో 1967లో అప్పటి పాలకులు కలవకూరు వద్ద స్వర్ణముఖినదిపై చెక్‌డ్యామ్ నిర్మించారు. పాలచ్చూరు సప్లయ్ చానల్‌కు సాగునీరు సరపరా చేస్తున్నారు. తద్వారా పెళ్లకూరు, నాయుడుపేట, ఓజిలి మండలాల్లోని సుమారు 37 చెరువులకు సాగునీరు అందుతోంది. ఈ క్రమంలో ఈ ప్రాంత రైతులు వంగ, బెండ, కాకర, చిక్కుడు, బీర తదితర కూరగాయలతో పాటు అనేక రకాల ఆకు కూరలు సాగుచేస్తున్నారు. వరి పైర్లు ధ్వంసం కలవకూరు వద్ద ఇసుక రీచ్ కోసం ఇటీవల సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి స్వర్ణముఖి నదిని పరిశీలించారు. ఆమె ఆదేశాల మేరకు నదీ తీరంలోని ప్రభుత్వ భూముల్లో పేదలు సాగు చేసుకుంటున్న వరి పైర్లను యంత్రాలతో ధ్వంసం చేసి ఇసుక రీచ్‌కు రహదారి ఏర్పాటు చేశారు. ఇసుకరీచ్ రద్దు చేయాలి స్వర్ణముఖినదిలో మంజూరు చేసిన ఇసుక రీచ్‌ను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కూటమి నేతలు ట్రాక్టర్లతో ఇసుక తోడేయడం వల్ల వ్యవసాయ బోర్ల వద్ద భారీ గోతులు ఏర్పడ్డాయి. భూగర్భ జలాలు అందడం లేదు. చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి, పుల్లూరు కలెక్టర చర్యలు తీసుకోవాలి వేల ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీటికి కేంద్ర బిందువుగా ఉన్న స్వర్ణముఖి నదిలో ఇసురీచ్ విషయమై కలెక్టర్ పూర్తి స్థాయిలో పరిశీలించి రద్దు చేయాలి. గత ప్రభుత్వంలో విడుదలైన కోర్టు ఉత్తర్వులను కొనసాగించేలా చర్యలు చేపట్టాలి. – వెంకటేశ్వర్లు, చెంబేడు నీటి గండం తప్పదు స్వర్ణముఖినదిలో ఇసుక రీచ్ మంజూరు చేయడం వల్ల సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయి. దశాబ్దాలుగా వ్యవసాయాన్ని నమ్ముకొని బతికే రైతులకు సాగురు ప్రశ్నార్థకమవుతుంది. – కుమారస్వామి, పునబాక ●గత ప్రభుత్వంలో ఇసుకరీచ్‌లు రద్దు 2019–24లో జగన్ ప్రభుత్వం కలవకూరు, కప్పగుంటకండ్రిగ, తాళ్వాయిపాడు గ్రామాల్లో మంజూరు చేసిన ఇసుక రీచ్‌లను అప్పటి అధికార పార్టీ నేతలే ఇక్కడి పరిస్థితులను హైకోర్టుకు విన్నవించారు. దాంతో రైతులు, ప్రజల సౌకర్యార్థం కోసం ఆ ఇసుక రీచ్‌లను అప్పటి జగన్ ప్రభుత్వం రద్దు చేశారు. కానీ ప్రస్తుత కూటమి నేతలు పోలీసుల కనుసన్నల్లో ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. రైతులు, ప్రజల సంక్షేమం పట్టని నేతల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తిరుమలలో రథసప్తమి ఏర్పాట్ల పరిశీలన
తిరుమల: తిరుమలలో మంగళవారం రథసప్తమి నిర్వహించనున్న సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తిరుమలలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. ఆలయ నాలుగు మాడ వీధులు, గ్యాలరీలు పార్కింగ్ ప్రదేశాలను ఆయన స్వయంగా పరిశీలించారు. భద్రతాపరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తిరుమలలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. భక్తులు ఎక్కువగా ఏ సమయంలో వస్తారో... గుర్తించి ఆ సమయంలో ప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, రామకృష్ణ, పలువురు డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పోలీస్ అదనపు బలగాల ఏర్పాటు
తిరుపతి అర్బన్: తిరుపతి నగరపాలక డెప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో మంగళవారం అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా మెజిస్ట్రేట్, కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా వేశామని వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణ నేపథ్యంలో 250 మంది అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా చట్టరీత్యా చర్యలుంటాయని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. డెప్యూటీ మేయర్ ఎన్నిక నేడు తిరుపతి నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ ఎన్నిక సోమవారం నిర్వహించడానికి కోరం లేకపోవడంతోనే మంగళవారానికి వాయిదా వేశామని జేసీ, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ తెలిపారు. ప్రస్తుతం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 47 మంది కార్పొరేటర్లు ఉన్నారని, అంతేకాకుండా ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారని చెప్పారు. మొత్తం 50 మందిలో కోరం ప్రకారం 25 మంది హాజరుకావాల్సి ఉందని వెల్లడించారు. అయితే సోమవారం 22 మంది హాజరుకావడంతో మంగళవారానికి వాయిదా వేసినట్లు స్పష్టం చేశారు. ఎస్వీయూ అష్ట దిగ్బంధం తిరుపతి సిటీ: ఎస్వీయూను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో వేల సంఖ్యలో పోలీసులు వర్సిటీలో ఉదయం 6 నుంచే హల్చల్ చేశారు. వర్సిటీ పరిపాలనా భవనానికి వెళ్లే అన్ని దారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వర్సిటీకీ అధికారులు సోమవారం సెలవు ప్రకటించారు. వర్సిటీ ఆవరణలోని మెన్, ఉమెన్ హాస్టల్స్‌లో ఉన్న విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. కనీసం మెస్‌లకు వెళ్లేందుకు, వర్సిటీ నుంచి నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా అడ్డుకున్నారు. బయటకు వెళ్లిన విద్యార్థులను వర్సిటీలోనికి అనుమతించకపోవడంతో విద్యార్థులు రోడ్లపైనే పడిగాపులు కాశారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చంద్రగిరి: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి తొండవాడ సమీపంలోని హ్యాపీ దాబా వద్ద సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. సుమారు 45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు దాటుతున్న సమయంలో చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తి తలపై వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ మేరకు మృతదేహానికి పంచనామా పూర్తి చేసి, పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించినట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు చంద్రగిరి పోలీసులను సంప్రదించాలని కోరారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్ పాకాల: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసినట్టు సీఐ సుందర్శన్ప్రసాద్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆవివరాలను విలేకరులకు వివరించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు వచ్చిన సమాచారం మేరకు నెల్లూరు రూరల్ మండలం, మేకలవారితోటకు చెందిన సాన విష్ణుమోహన్‌రెడ్డి(24), తమిళనాడు రాష్ట్రం, తేనె జిల్లా, ఉత్తమపాళెం తాలూకా, కంభం గ్రమానికి చెందిన పాండియన్(31)ని పాకాల రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి 13 కిలోల గంజాయిని, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ముద్దాయిలు ఇద్దరూ విజయవాడ నుంచి మదురైకి గంజాయిని తరలించడానికి పాకాల రైల్వే స్టేషన్‌కి చేరుకున్నట్టు వెల్లడించారు. అదే రోజు మదురైకి రైలు లేకపోవడంతో కాట్పాడికి వెళ్లి అక్కడి నుంచి మదురైకి వెళ్లడానికి నిశ్చయించుకున్నారని తెలిపారు. పక్కా సమాచారంతో సీఐ, ఎస్ఐ సంజీవరాయుడు, తహసీల్దార్ సంతోష్సాయిలు రెల్వే స్టేషన్‌కి చేరుకుని ముద్దాయిలను అరెస్టు చేసినట్టు చెప్పారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 6 కంపార్ట్మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 75,706 మంది స్వామివారిని దర్శించుకోగా 23,340 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.34 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.