సర్దుకుందాం
Published Fri, Mar 25 2016 2:57 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
ఎండీఎంకే-40,వామపక్షాలు -35
వీసీకే -35
కెప్టెన్ రాకతో సెటైర్లు
ప్రజా సంక్షేమ కూటమే: నల్లకన్ను
ఇదేంటీ : సీపీఎం ఎమ్మెల్యే
సాక్షి, చెన్నై : కెప్టెన్ రాకతో తమ బలం పెరిగినా, సీట్ల పందేరంలో మాత్రం సర్దుకోవాల్సిన పరిస్థితి ప్రజా కూటమి నేతలకు తప్పలేదు. ఎండీఎంకే 40, వామపక్షాలు 35, వీసీకే 35 సీట్లు చొప్పున పంచుకునే పనిలో పడ్డాయి. ఇక, ప్రజా కూటమిపై సెటైర్లు సంధించే వాళ్లు పెరగడంతో విమర్శల్ని తిప్పికొట్టేందుకు ఘాటుగా స్పందించే పనిలో వైకో, తిరుమా నిమగ్నమయ్యారు. ఇది కెప్టెన్ టీం కాదు, ప్రజా సంక్షేమ కూటమి అని సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను పెదవి విప్పడం గమనార్హం.
ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో కలసి సాగుతున్న ప్రజా సంక్షేమ కూటమిలో బుధవారం ఆనందంకర క్షణాలు చోటు చేసుకున్నాయి. డీఎండీకే రాకతో తమ బలం పెరిగిందని జబ్బలు చరిచే పనిలో ఎండీఎంకే నేత వైకో, సీపీఎం నేత జి రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్ పడ్డారు. వచ్చి రాగానే 124 సీట్లను లాక్కుని , తమకు 110 సీట్లను విజయకాంత్ ఇవ్వడంతో వాటిని పంచుకోవడంలో సర్దుకోవాల్సిన పరిస్థితి మిగిలిన నేతలకు తప్పలేదు. కూటమిలో ఎలాంటి విబేధాలకు ఆస్కారం ఇవ్వని విధంగా సమష్టిగానే సర్దుకునే పనిలో పడ్డారు.
ఆ మేరకు ఎండీఎంకే 40, వీసీకే 35, సీపీఎం, సీపీఐలు కలిసి 35 చోట్ల బరిలోకి దిగేందుకు నిర్ణయించి ఉన్నాయి. ఇక, వైకో, రామకృష్ణన్ ఎన్నికల బరిలో దిగేందుకు ఆస్కారం లేదని ఆ కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి. తిరుమావళవన్ మాత్రం పోటీకి నిర్ణయించగా, అధిష్టానం అనుమతి కోసం ముత్తరసన్ ఎదురు చూపుల్లో ఉన్నట్టు సమాచారం. ఇక, ఇతర పార్టీలు కూటమిలోకి వచ్చిన పక్షంలో సీట్లను విజయకాంత్ సర్దుబా టు చేసుకోవాల్సిందే అన్న నిర్ణయానికి మిగిలిన నేతలు వచ్చి ఉన్నారు.
ఇంత వరకు నేతల మధ్య ఐక్యతతో పయనం సాగినా, అసలు సమస్య సిట్టింగ్ ఎమ్మెల్యేల రూపంలో వామపక్షాలకు ఎదురు అయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. సీపీఎంకు పది, సీపీఐకు తొమ్మిది మంది సిట్టింగ్ లు ఉండగా, ఒక్క సభ్యుడ కూడా లేని ఎండీఎంకే, వీసీకేలకు మాత్రం అన్ని స్థానాలు ఎందుకో అని పెదవి విప్పే వాళ్లు వామపక్షాలు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే తన ఫేస్ బుక్‌లో సీపీఎం సిట్టింగ్ ఎమ్మెల్యే బాల భారతి స్పందించి ఉండటం గమనించాల్సిన విషయం. అదే సమయంలో విజయకాంత్ రాకతో ఇది కెప్టెన్ టీం అని వైకో స్పందించడంతో, దానిని ఖండించే విధంగా సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను స్పందించి ఉన్నారు. ఎంత మంది నాయకులు కూటమిలోకి వచ్చినా, పేరు మాత్రం ప్రజా సంక్షేమ కూటమి అన్న విషయాన్ని గు ర్తుంచుకోవాలని హితవు పలకడం ఆలోచించాల్సిందే.
సెటైర్లు : విజయకాంత్ రాకతో మిత్ర పక్షాల్లో ప్రధానంగా సీపీఎం,సీపీఐలలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓ వైపు పెదవి విప్పుతుంటే, సీనియర్లు డొంక తిరుగుడు వ్యాఖ్యలకు సిద్ధం అవుతోంటే, సోషల్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాల్లో ఈ కూటమి మీద సెటైర్లు బయలు దేరి ఉన్నాయి. కొత్త రకం కార్టూన్లతో వ్యంగ్యంగా చిత్రీకరించి, కొత్త టాగ్ లైన్లతో విమర్శించే వాళ్లు పెరిగారు.
ఇది ఓ వైపు సాగుతుంటే, మరో వైపు బిజేపీ నేతలు తీవ్రంగానే ప్రజా కూటమిని టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. ఆ పార్టీ జాతీయ నేత ఇలగణేషన్ తీవ్రంగా విరుచుకు పడుతూ, ప్రజా సంక్షేమ కూటమిలోకి విజయకాంత్ రాకతో అది, ప్రజా వ్యతిరేక కూటమిగా మారిందని ఎద్దేవా చేశారు. ఇలా సెటైర్లు, విమర్శలు, ఆరోపణలు బయలు దేరడంతో ఘాటుగానే సమాధానాలు ఇచ్చేందుకు వైకో, తిరుమా సిద్ధమయ్యారు. తమ కూటమిని చూసి ఓర్వ లేక, తమ బలం పెరగడంతో భయంతో విమర్శలు ఆరోపణలు సంధిస్తున్నారని మండి పడ్డారు.
ప్రచారం: ఇప్పటికే ప్రజా కూటమి నేతలు ప్రచారంలో దూసుకెళుతుంటే, తన వంతుగా ప్రచార బాటకు విజయకాంత్ రెడీ అయ్యారు. కూటమి తరపున విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, బావ మరిది సుదీష్ వేర్వేరుగా రోడ్ షోకు సిద్ధం అవుతున్నారు. ఇందుకు తగ్గ పర్యటన మ్యాప్ రూపకల్పనలో డీఎండీకే వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. అలాగే, వీరి ముగ్గురి కోసం ప్రత్యేక సౌకర్యాలు, వసతులతో మూడు ప్రచార వాహనాలు మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇక, ఘాటుగా, తీవ్ర పదజాలలతో, తన భర్త ప్రసంగాల్ని తలదన్నే రీతిలో విజయకాంత్ సతీమణి ప్రేమలత ప్రసంగాలు సాగిస్తున్న విష యం తెలిసిందే. కొన్ని చోట్ల ఈ ప్రసం గాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ల సంఖ్య పెరగడంతో ఆమెకు భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమెకు ప్రత్యేక భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈసీకి డీఎం డీకే నేతలు వినతి పత్రం సమర్పించారు.
Advertisement