స్వతంత్ర భారతావనికి జరిగిన తొలి ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన ఎంపీతోనే కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలన్న నిర్ణయం జరిగింది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు కూడా దక్కని ఆ ఖ్యాతి కమ్యూనిస్టులకు దక్కింది. 1952 మార్చిలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టుల అభ్యర్థి రావినారాయణ రెడ్డి, నెహ్రూకన్నా అత్యధిక మెజారిటీలో విజయం సాధించారు. రావి నారాయణ రెడ్డికి ఆ ఎన్నికల్లో 3,09,162 ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ కమ్ జౌన్‌పూర్ (పశ్చిమ) ద్విసభ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జవహర్‌లాల్ నెహ్రూకు మాత్రం 2,33,571 ఓట్లు పడ్డాయి. దీంతో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అరుదైన అవకాశం కమ్యూనిస్టులకు దక్కినట్లయ్యింది. ఇపుడు ఈ చరిత్రనంతా నెమరు వేయడం ఎందుకంటే.. కమ్యూనిస్టుల ప్రాభవం ఏ విధంగా ఉండేదో గుర్తు చేసుకోవడం కోసం.. ఇప్పటి వారి పరిస్థితిపై ఓ అంచనాకు రావడం కోసం. ఉనికి కోసం వారు పడుతున్న ఆరాటాల గురించి చర్చించుకోవడం కోసం.
తెలంగాణ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ బీఆర్ఎస్ నిరాదరణకు గురై, కాంగ్రెస్ కు స్నేహ హస్తం చాచినా ఆ పార్టీ పట్టించుకోక పోవడంతో ఇపుడు ఎలాంటి ఎన్నికల పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాల్సి వచ్చింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా అసెంబ్లీ సీట్లను గెలుచుకునే స్థితి నుంచి కమ్యూనిస్టులు ఎపుడో కిందకు జారిపోయారు.
కమ్యూనిస్టులది ఘనమైన చరిత్రే
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు అంటే 1983 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వైరి వర్గాలు కాంగ్రెస్, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలే. కమ్యూనిస్టులు సీపీఐ, సీపీఎంలుగా విడివడ్డాక క్రమేణా కాంగ్రెస్ ను ధీటుగా ఎదుక్కోవడంలో ఉభయ కమ్యూనిస్టులు విఫలమవుతూ వచ్చారు. ఈ తరుణంలోనే ఎన్టీ రామారావు నాయకత్వంలో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీకి దగ్గరై, పోత్తులు పెట్టుకోవడం మొదలు పెట్టారు. నాటి ఆర్ధిక మంత్రి నాదేండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు, తెలుగుదేశంలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ ను తిరిగి సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో వామపక్షాలది తీసివేయలేని పాత్ర. వాస్తవానికి 1983లో ఎన్టీఆర్ ప్రభంజనలో సైతం వామపక్షాలు తమ ఉనికిని చాటాయి. ఆ ఎన్నికల్లో సీపీఐ 4 నియోజకవర్గాల్లో, సీపీఎం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. అంటే అప్పటికి ఆ పార్టీలకు ఉన్న శక్తిని తక్కువగా అంచనా వేయలేం. కానీ, తర్వాత వరసగా జరిగిన 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీతో జతకట్టి బరిలోకి దిగాయి. ఇక్కడి వరకు సవ్యంగా సాగిన టీడీపీ, లెఫ్ట్ పార్టీల స్నేహం ( ఒక విధంగా ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఉన్నన్ని రోజులు..) ఆతర్వాత బ్రేక్ అయ్యింది.
చంద్రబాబు అవకాశవాదంతో టీడీపీకి దూరమైన వామపక్షాలు
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిన 1999 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీంతో చంద్రబాబు అవకాశవాదానికి షాకైన వామపక్షాలు, టీడీపీకి దూరమయ్యాయి. ఆ ఎన్నికల్లో సీపీఎం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించగా, సీపీఐకి ఒక్క చోటా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జరిగిన పొత్తులో లాభపడిన సీపీఐ 6, సీపీ ఎం 9 నియోజకవర్గాల్లో విజయం దక్కించుకున్నాయి. కాంగ్రెస్‌తో వచ్చిన పొరపొచ్చాల వల్ల 2009 ఎన్నికల్లో మహాకూటమి లో భాగంగా టీడీపీ, బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్ఎస్) తో ఎన్నికలు వెళ్లాయి. అప్పుడు కూడా సీపీఐ 4 చోట్ల , సీపీఐఎం ఒక చోట గెలిచాయి. గడిచిన నాలుగు దశాబ్ధాల కాలంలో అంటే 1983 నుంచి ఇప్పటి దాకా ఏదో ఒక పార్టీ అండలేకుండా అసెంబ్లీ సీట్లను గెలుచుకోలేని స్థితికి వామపక్షాలు చేరుకున్నాయి. చివకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణలో సీపీఐ(ఎం) వైఎస్‌ఆర్‌సీపీతో పొత్తు పెట్టకుని ఒక చోట, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సీపీఐ ఒక చోట గెలిచాయి. 2018 ఎన్నికలు తెలంగాణలో ఆ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా చేశాయి.
మునుగోడు ఉప ఎన్నికతో.. బీఆర్ఎస్ తో దోస్తీ
2023 ఎన్నికల్లో మొదట బీఆర్ఎస్ తో కలిసి వెళతాయని భావించినా, అది బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికలు వేదికగా ఆ నియోజకవర్గంలో బీజేపీని ఎదుర్కునే శక్తి బీఆర్ఎస్ కే ఉందని పేర్కొంటూ ఆ పార్టీతో జతకట్టాయి. ఆ ఎన్నికల్లో వామపక్షాల మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచిందని అంతా భావించినా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం వామపక్షాలను కరివేపాకులా తీసి పక్కన పడేశారు. 2023 ఎన్నికల అభ్యర్థుల ప్రకటన సమయంలో తమ మిత్రపక్షాలుగా భావిస్తున్న వామపక్షాలతో మాటమాత్రంగా కూడా చర్చలేవి జరపకుండా ఏక కాలంలో 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో సీపీఎం, సీపీఐ పోటీ చేయాలని భావించిన స్థానాలు కూడా ఉండడం విశేషం. దీంతో బీఆర్ఎస్, వామపక్షాల మధ్య చెడిందని, పొత్తు లేనట్టేనన్న అర్థమై పోయింది.
జాతీయ రాజకీయాల్లో భాగంగా ‘ ఇండియా ’ కూటమిలో కాంగ్రెస్ తో వామపక్షాలు కలిసి నడుస్తున్నాయి. దీంతో తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని భావించినా.. ఆ పార్టీల మధ్య ఇంకా పొత్తు పొడవలేదు. దాదాపు తెలంగాణలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉండక పోవచ్చని, ఒంటరిగానే వామపక్షాలు పోటీ చేయనున్నాయని తెలుస్తోంది. దీంతో వామపక్ష పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకు ఎవరి జయాపజయాల్లో కీలకం కానుందన్న సమీకరణలు మొదలయ్యాయి. వామపక్షాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నాయి..? చివకు కనీసం ఉభయ కమ్యూనిస్టుల పార్టీల మధ్యనైనా సరైన అవాగాహన కుదురుతుందా అన్న ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి ఉంది.
:::మిత్రా. ఎన్
Comments
Please login to add a commentAdd a comment