సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్ని కలో బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా సీపీఐ, సీపీఎం పార్టీలు ముందుకు సాగనున్నాయి. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించాలని నిర్ణయించాయి. ఇప్పటికే వేర్వేరుగా పార్టీ కార్యకర్తలతో స్థానికంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే గతంలో అనేకసార్లు సీపీఐ అభ్యర్థులు మునుగోడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ ఆ పార్టీకి క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. సీపీఎం కూడా కొంతమేరకు ఓటు బ్యాంకు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థిని పోటీకి దింపే విషయం కూడా సీపీఐ సమాలోచనలు చేస్తోంది. పోటీ చేస్తే గెలవగలమా? ఒకవేళ గెలవ లేని పరిస్థితి ఉంటే ఓట్ల చీలిక వల్ల బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా? అనే కోణంలో మల్లగుల్లాలు పడుతోంది. పార్టీ క్యాడర్‌తో జరుగుతున్న సమావేశాల్లో మాత్రం చాలామంది పోటీ చేయాలనే సూచిస్తున్నట్లు తెలిసింది.
అయితే గతంలో అనేకసార్లు గెలిచినా అది పొత్తుల వల్లే సాధ్యమైందని, పూర్తిగా సొంత బలమే కారణం కాదని సీపీఐ నాయకులు కొందరు చెబుతున్నారు. అంతేకాదు నియోజకవర్గ పునర్విభజన వల్ల గతంలో ఉన్న ఓటు బ్యాంకు కొంత మేరకు తగ్గింది. ఈ పరిస్థితుల్లో పోటీ చేయడం వల్ల పరోక్షంగా బీజేపీకి లాభం కలిగే అవకాశం ఉంటుందని, అదే ఖాయమైతే బరిలో ఉండకూడదని సీపీఐ భావిస్తున్నట్టు తెలిసింది. అన్ని కోణాల్లో విశ్లేషించుకున్న తర్వాతే ముందుకు సాగాలనే ఆలోచనలో ఉంది. ఒకవేళ సీపీఐ తన అభ్యర్థిని బరిలోకి దింపితే మద్దతు ఇచ్చేందుకు సీపీఎం సిద్ధంగా ఉంది. రెండు పార్టీలు ఈ నెల 15 తర్వాత సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోనున్నాయి. (క్లిక్: మునుగోడులో పెరిగిపోతున్న పొలిటికల్ హీట్)
టీఆర్‌ఎస్‌కా? కాంగ్రెస్‌కా?
సీపీఐ పోటీ చేయని పక్షంలో బీజేపీకి అడ్డుకట్ట వేసే పార్టీకి మద్దతు ఇవ్వాలని వామపక్షాలు భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీని ఓడించగలిగేది టీఆర్‌ఎస్సా? కాంగ్రెస్సా? అన్నది ఇప్పుడు కీలకమని సీపీఐ, సీపీఎం నేతలంటున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలసలు ఉంటాయా? అలా వెళ్లడం వల్ల కాంగ్రెస్ బలహీన పడుతుందా? లేక కాంగ్రెస్ తన బలాన్ని చాటుకుంటుందా? టీఆర్‌ఎస్ పరిస్థితి ఏమిటి? ఈ రెండు పార్టీల్లో ఎన్నికల నాటికి బీజేపీని ఓడించే సత్తా ఎవరికి ఉంటుందన్న దానిపై ఆధారపడి మద్దతు విషయంలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ కీలక నేత ఒకరు చెప్పారు. (క్లిక్: మంచి బట్టలు తొడిగినా ఓర్వలేడు!.. ఆయనకు టికెట్ ఇస్తే..)
Comments
Please login to add a commentAdd a comment