Vijayakant
-
ఆ ఘనత విజయకాంత్‌దే: హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
నటుడు విశాల్ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం మార్క్ అంటోని. నటుడు ఎస్జే సూర్య ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఇందులో నటి రీతు వర్మ, అభినయ, తెలుగు నటుడు సునీల్, నిళల్గళ్ రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మినీ స్టూడియో పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. కాగా జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమాన్ని బుధవారం స్థానిక సైదాపేటలోని అన్నై వేళాంగణి కళాశాలలో నిర్వహించారు. ఇందులో నటుడు విశాల్, ఎస్ జే సూర్య, దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్, నిర్మాత వినోద్ కుమార్ తదితర చిత్ర వర్గాలు పాల్గొన్నారు. కాగా అన్నా వేళాంగణి కళాశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, అనేక మంది విద్యార్థులు ఈ వేడుకలు పాల్గొన్నారు. నటుడు విశాల్ అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అందించారు. ముందుగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణ భారత నటీనటుల సంఘానికి నటుడు విజయ్‌కాంత్ విశేష సేవలను అందించారన్నారు. అప్పుల్లో ఉన్న సంఘాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చింది ఆయనేని పేర్కొన్నారు. సంఘ నూతన భవన నిర్మాణానికి విజయ కాంతే కారణమని, మరో ఏడాదిలో నూతన భవనం పూర్తి అవుతుందని చెప్పారు. ఆ తర్వాత నూతన భవనంలో నటుడు విజయ కాంత్‌కు భారీ ఎత్తున అభినందన సభను నిర్వహించినట్లు తెలిపారు. ఇక మార్క్ అంటోని చిత్రం గురించి చెప్పాలంటే ఇది మంచి ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ ఓరియెంటెడ్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. దర్శకుడు అధిక రవిచంద్రన్ మాట్లాడుతూ ఇది రజనీకాంత్ నటించిన బాషా చిత్రం తరహాలో విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. -
పోటీకి దూరంగా విజయకాంత్.. బరిలో సతీమణి
సాక్షి, చెన్నై: డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ విరుదాచలం నుంచి పోటీ చేయనున్నారు. భర్త, పార్టీ అధినేత విజయకాంత్ ప్రప్రథమంగా గెలిచిన నియోజకవర్గం ఇదే కావడం గమనార్హం. ఈ సారి ఎన్నికల్లో విజయకాంత్ పోటీ చేయడం లేదు. అన్నాడీఎంకేతో జతకట్టేందుకు ప్రయత్నించి చివరకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో సర్దుకోవాల్సిన పరిస్థితి విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు ఎదురైన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో నీవే సీఎం అభ్యర్థి అంటూ, ప్రజాకూటమికి సారథ్యం వహించాలని అనేక పార్టీలు విజయకాంత్ చుట్టూ తిరిగాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారడంతో ఈ సారి పొత్తుకోసం డీఎండీకే కుస్తీలు పట్టక తప్పలేదు. ఎట్టకేలకు అమ్మముక ఇచ్చిన 60 సీట్లలో పోటీకి డీఎండీకే సిద్ధమైంది. 2006 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయకాంత్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అనారోగ్య సమస్యల దృష్ట్యా, ఆయన పోటీ చేయనప్పటికీ, చివరి క్షణంలో ప్రచారంలోకి రాబోతున్నారు. ఆయన తరఫున ప్రేమలత విజయకాంత్ ప్రప్రథమంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. 2005లో డీఎండీకే ఆవిర్భావంతో ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి విజయకాంత్ ఒక్కడే విరుదాచలం నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ప్రస్తుతం ఇదే విరుదాచలంను ప్రేమలత ఎంపిక చేసుకున్నారు. విరుదాచలం ప్రగతికి విజయకాంత్ గతంలో చేసిన సేవలు, అక్కడ ఆయనకు ఉన్న అభిమానాన్ని పరిగణించి ప్రేమలత ఓట్ల వేటకు సిద్ధమయ్యారు. ఈనెల 19న చివరి రోజు నామినేషన్ దాఖలుకు నిర్ణయించారు. మంగళవారం ప్రేమలత మాట్లాడుతూ విరుదాచలం నుంచి తాను పోటీ చేయనున్నానని, తమ కూటమి విజయకేతనం ఎగురవేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. విజయకాంత్ చివరి క్షణంలో ఎన్నికల ప్రచారంలోకి వస్తారని, ఆ వివరాలను మరి కొద్దిరోజుల్లో ప్రకటిస్తామన్నారు. చదవండి: సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు! -
విమర్శలా?
► అర్థం చేసుకోవాలి ► వైగో గారడీ ► ఇయక్కంలో చీలిక తథ్యమా ►వామపక్షాల ఐక్యతకు ► టి పాండియన్ పిలుపు సాక్షి, చెన్నై: మక్కల్ ఇయక్కంలో అంతర్గత సమరం రచ్చకెక్కుతోంది. ఆ ఇయక్కంకు కన్వీనర్‌గా ఉన్న వైగోకు వ్యతిరేకత ఏర్పడుతోంది. విజయకాంత్‌ను వైగో విమర్శిస్తే, వామపక్షాలు మద్దతుగా నిలవడం చర్చకు దారి తీశాయి. ఈ సమయంలో తానెప్పుడు విజయకాంత్‌ను విమర్శించానన్నట్టుగా వైగో పెదవి విప్పడం గమనించాల్సిందే.. ఎండీఎంకే నేత వైగో కన్వీనర్‌గా వీసీకీ, సీపీఎం, సీపీఐలతో మక్కల్ ఇయక్కంలో కొద్ది రోజులుగా సాగుతున్న వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా ఆ ఇయక్కంకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న వైగో తీరును పరోక్షంగా మిత్రులే విమర్శించే పనిలో పడ్డారు. వైగోకు కన్వీనర్ పదవి అవసరమా..? అని సీపీఎం సీనియర్ నేత రంగరాజన్ ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో వైగో నోరు జారడం చర్చకు దారి తీసింది. ఆ ప్రశ్నకు సమాధానానికి దాట వేత ధోరణి అన్నట్టుగా తన గురి డీఎండీకే అధినేత విజయకాంత్మీద మరల్చారు. ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేశామని వైగో చేసిన వ్యాఖ్యలకు విజయకాంత్ సతీమణి ప్రేమలత తీవ్రంగానే స్పందించడమే కాకుండా, ఎదురుదాడికి దిగారు. ఈ సమయంలో సీపీఎం, సీపీఐ నేతలు విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదన్నట్టు స్పందించడం చూస్తే, ఇయక్కంలో అంతర్గత సమరం తారా స్థాయికి చేరిందన్నది స్పష్టం అవుతోంది. వీసీకే నేత తిరుమావళవన్ పైపైకి ఇయక్కంలో అందరం కలిసే ఉన్నామని చెబుతున్నా, లోలోపల ఆయన కూడా మదన పడుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వైగో తీరుతో మున్ముందు మరింత ఇరకాటంలో పడడం కన్నా, ఇయక్కం అన్నది లేకుండా చేస్తే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నట్టు సమాచారం. ఇందుకు అద్దం పట్టే విధంగా సీపీఐ మాజీ రాష్ట్రకార్యదర్శి టి.పాండియన్ స్పందిస్తూ బలపడాలంటే, ముందుగా వామపక్షాలు ఏకమై, ముందుకు సాగాలని పిలుపునివ్వడం గమనించాల్సిన విషయం. అదే సమయంలో విజయకాంత్‌ను పరోక్షంగా ఆయన కూడా వెనకేసుకు రావడంతో వైగో మేల్కొన్నట్టున్నారు. తానెప్పుడు విజయకాంత్‌ను విమర్శించానని మాటల గారడి ప్రదర్శించడం గమనార్హం. కళింగపట్నంలో సోమవారం మీడియాతో మాట్లాడిన వైగో, ప్రేమలత తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నట్టుందని సూచించారు. తాను విజయకాంత్‌ను విమర్శించనేలేదని, రెండున్నర గంటల ఇంటర్వ్యూలను పూర్తిగా చూసి అర్థం చేసుకోవాలేగానీ, సహోదరి తప్పుగా భావించడం శోచనీయమని వ్యాఖ్యానించారు. -
తప్పు చేశాం!
► వైగో వ్యాఖ్య ► కెప్టెన్‌కు షాక్ సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా సంక్షేమ కూటమి పెద్ద తప్పు చేసిందని ఆ కూటమి కన్వీనర్, ఎండీఎంకే నేత వైగో విచారం వ్యక్తం చేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడమే ఆ తప్పు అని వ్యాఖ్యానించి కెప్టెన్‌కు పెద్ద షాకే ఇచ్చారు. తమిళనాట రాజకీయాలు భిన్నమే. కొన్ని పార్టీల నాయకులు అయితే, బద్ద శతృవుల వలే వ్యవహరిస్తుంటారు. రాజకీయ నాగరికత , స్నేహ పూర్వక పలకరింపులు ఇక్కడ అరుదే. ఎన్నికల సమయాల్లో భుజాలు భుజాలు రాసుకుంటారు. ఫలితాల్లో తేడా వస్తే మాత్రం కత్తులు దూసుకునే విధంగా మాటల తూటాల్ని పేల్చుతారు. ఆ కోవలో ఎండీఎంకే నేత వైగో ఎప్పుడూ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం గా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మెగా కూటమి ఏర్పాటులో సఫలీకృతులయ్యారు. సీపీఎం, సీపీఐ వంటి జా తీయ పార్టీలు, వీసీకే వంటి వెనుక బడిన సామాజిక వర్గం పార్టీతో పాటు, గత ప్రభుత్వంలో ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న డీఎండీకేను, కాంగ్రెస్‌ను చీల్చిన జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌ను ఒకే వేదిక మీదకు తెచ్చి తానే కన్వీనర్‌గా ముందుకు సాగారు. ఆ ఎన్నికల్లో తాము ఆరుగురం అంటూ ముందుకు సాగి, చివరకు ఫలితాలతో పాతాళంలోకి నెట్టబడారు. రాష్ట్ర చరిత్రలో ప్రపథమంగా సీపీఎం, సీపీఐ సభ్యులు అసెంబ్లీలో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధాన ప్రతి పక్షం అడ్రస్సు గల్లంతు కాగా, తమిళ మానిల కాంగ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ ఎన్నికల ప్రచారంలో ఇక, విజయకాంత్ సీఎం కూర్చీల్లో కూర్చునట్టే అని ధీమాతో ముందుకు సాగిన వైగో, తాజాగా, పేల్చిన మాటల తూటాలు డీఎండీకే అధినేతకు పెద్ద షాక్కే. తప్పు చేశాం: ఓ మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో ఎండీఎంకే నేత వైగో అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద తప్పే చేసినట్టు విచారం వ్యక్తం చేయడమే కాకుండా, డీఎండీకే అధినేత విజయకాంత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించడం గమనార్హం. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకేలతో ఆవిర్భవించిన ప్రజా సంక్షేమ కూటమిలో, ఎన్నికలయ్యే వరకు సీఎం అభ్యర్థి అన్న వ్యక్తికి చాన్సే లేదన్న నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. అయితే, ఆ నిర్ణయాన్ని విజయకాంత్ కోసం సడలించి పెద్ద తప్పు చేశామని విచారం వ్యక్తం చేశారు. విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం కూటమిలోని ఇతర పార్టీల మీద ప్రభావం పడ్డాయంటూ పరోక్షంగా సీపీఎం, సీపీఐల డిపాజిట్లు గల్లంతుపై వ్యాఖ్యానించారు. విజయకాంత్ అడిగిన సీట్లు ఇచ్చేందుకు డిమాండ్లను నెరవేర్చడానికి ఎన్నికల సమయంలో డీఎంకే సిద్ధమైందని పేర్కొన్నారు. అరుుతే, వాటిని పక్కన పెట్టి తన కూటమిలోకి రావడానికి విజయకాంత్ మొగ్గు చూపడం , అందుకు కృతజ్ఞతగా సీఎం అభ్యర్థిత్వానికి అప్పగించడం జరిగిందని వ్యాఖ్యానించారు. అయితే, ఆయన తమ కూటమిలోకి వచ్చినా, సీఎం అభ్యర్థిత్వం నిర్ణయాన్ని సడలించకుండా ఉండి ఉంటే బాగుండేదేమో అన్న భావన ప్రస్తుతం నెలకొని ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేశామని, అందుకు తగ్గ మూల్యం ఫలితాల రూపంలో చెల్లించుకున్నామని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓ విషయం చెబుతున్నానని, తాను అన్నాడీఎంకే పక్షపాతి కానే కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. 2011 ఎన్నికల్లో పోయెస్ గార్డెన్ మెట్లు తాను ఎక్కలేదని, పరిస్థితుల ప్రభావంతో ఆ ఎన్నికల్ని బహిష్కరించినట్టు పేర్కొన్నారు. పాదయాత్రలో ఉన్న సమయంలో సీఎం జయలలిత తనను మర్యాద పూర్వకంగా పలకరించారని, దాన్ని ఆధారంగా చేసుకుని తాను రాజకీయాలు సాగించి ఉండొవచ్చని, అరుుతే, మర్యాద వేరు, రాజకీయాలు వేరు అన్న విషయాన్ని తెలిసిన వాడిని కాబట్టే, డీఎంకే, అన్నాడీఎంకేలను తాను ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేయడం గమనార్హం. -
జోరందుకున్న ఎన్నికల ప్రచారం
ప్రచారంలో స్టార్ క్యాంపైనర్లు హొసూరు : తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు తమ ప్రచారం ముమ్మరం చేశారు. క్రిష్ణగిరి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ, క్రిష్ణగిరిలో స్టాలిన్, హొసూరులో డీఎండీకే నేత విజయ్‌కాంత్, డీఎండీకే మహిళా విభాగ రాష్ట్ర అక్ష్యక్షురాలు ప్రేమలత, డీఎంకే నేత, రాజ్యసభ సభ్యురాలు కణిమొళి హొసూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరఫున స్టార్ క్యాంపైనర్లుగా నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తళి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీపీఐ నాయకుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పీఎంకే పార్టీ తరఫున అన్బుమణి రామదాస్ ప్రచారం చేశారు. హొసూరులో : హొసూరు నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న బాలక్రిష్ణన్కు మద్దతుగా ప్రధానమంత్రి హొసూరులో ప్రచారం చేశారు. పీఎంకే తరఫున ఆ పార్టీ నేతలు డాక్టర్ రామదాస్, అన్బుమణిరామదాస్లు ప్రచారం చేశారు. డీఎంకే కూటమి కాంగ్రెస్ తరఫున కణిమోళి హొసూరులో ఎన్నికల ప్రచారం చేశారు. అన్నాడీఎంకే తరఫున సినీ స్టార్స్ వింద్య, ఆర్తి, గుండు కళ్యాణంలు ప్రచారం చేశారు. డీఎండీకే కూటమిలో డీఎంకే అభ్యర్థికి ప్రచారానికి కెప్టెన్ విజయ్‌కాంత్, ప్రేమలత ప్రచారం నిర్వహించారు. తళిలో : తళినియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి వై. ప్రకాష్‌కు మద్దతుగా కణిమొళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్నాడీఎంకే అభ్యర్థి నాగేష్కు మద్దతుగా క్రిష్ణగిరి ఎంపి కే. అశోక్‌కుమార్, సినీ నటులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీపీఐ అభ్యర్థికి మద్దతుగా ఆంధ్ర ప్రదేశ్ సీపీఐ నాయకుడు నారాయణ తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తళి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి అశోక్ బీజేపీ అభ్యర్థికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేపనహళ్లిలో వేపనహళ్లి నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థికి కణిమొళి, అన్నాడీఎంకే అభ్యర్థికి వింద్య, గుండు కల్యాణం ఎన్నికల ప్రచారం నిర్వహంచారు. డీఎండీకే అభ్యర్థికి విజయకాంత్, ప్రేమలతలు, పీఎంకే అభ్యర్థికి అన్బుమణి రామదాస్, రామదాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మీడియాపై విజయ్‌కాంత్ కస్సుబుస్సు
చెన్నై: సినీ నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్ మరోసారి మీడియా కస్సుబుస్సులాడారు. త్వరలో తమిళనాడులో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓ రెండు చానెళ్ల పోల్ సర్వే ఫలితాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సర్వేలన్నీ తప్పుల తడకని, వాటిని ప్రజలు నమ్మాల్సిన పనిలేదని చెప్పారు. ఒక సర్వే ఏఐఏడీఎంకే విజయం సాధిస్తుందని, మరో సర్వే డీఎంకే విజయం సాధిస్తుందని తెలిపిందని, ఆ రెండు చానెళ్లు కావాలని ఒక వ్యూహం ప్రకారమే అలా ప్రచారం చేస్తున్నాయి తప్ప ఆ ఫలితాలు సరైనవి కావని అన్నారు. తన పార్టీ ఒకప్పుడు డీఎంకే ఫౌండర్ సీఎన్ అన్నాదురై సాధించినంతటి గొప్ప విజయం సాధిస్తుందని చెప్పారు. -
అమ్మకు ఓటమి భయం
♦ కెప్టెన్ ఎద్దేవా ♦ ఆ ఇద్దరినీ నమ్మొద్దు ♦ ఓటర్లకు సూచన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఓటమి భయం పట్టుకున్నదని డీఎండీకే అధినేత, ప్రజాసంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి కెప్టెన్ ఎద్దేవా చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే మేనిఫెస్టోల్లోని వాగ్దానాలను నమ్మవద్దని సూచించారు. సాక్షి, చెన్నై: ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా విజయకాంత్ సుడిగాలి పర్యటన సాగిస్తూ వస్తున్నారు. అధికార పగ్గాలు లక్ష్యంగా సాగుతున్న తన పర్యటనలో డీఎంకే, అన్నాడీఎంకేలను గురి పెట్టి విజయకాంత్ తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. శనివారం విల్లుపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. ఓటర్లను ఆకర్షించేందుకు తన దైన శైలిలో దూసుకెళ్లారు. విల్లుపురంలో జరిగిన ప్రచార బహిరంగ సభలో విజయకాంత్ ప్రసంగిస్తూ, అమ్మకు ఓటమిభయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే ఆల్‌ఫ్రీ అన్నట్టుగా వాగ్దానాలు ఇచ్చేస్తున్నారని విమర్శించారు. ఆమె ఇచ్చిన వాగ్దానాల్లో ఉన్న ఆల్‌ఫ్రీ అన్నీ జనం చేతుల్లో ఉన్నవేనని వ్యాఖ్యానించారు. కొత్తగా ఆమె ఇచ్చేదేమిటంటూ మండి పడ్డారు. ఆమె వాగ్దానాల్ని నమ్మ వద్దు అని , ఈ సారి ఆమె గానీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు రెట్టింపు అవుతాయని, మద్యం దుకాణాలు మూడింతలు పెరుగుతాయని, బస్సు చార్జీలు నాలుగింతలు పెరుగుతాయని వివరించారు. ఓటమి భయం అమ్మలో పెరిగిందని, అందుకే ఉచితాల పేరిట మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమ్మ ఉప్పు, అమ్మ పప్పు, అమ్మ ...అమ్మ అని అంతా ఆమె భజనే చేస్తున్నారు గానీ, పురట్చి తలైవర్(విప్లవనాయకుడు) ఎంజీయార్ పేరును ఏ ఒక్క పథకానికి ఎందుకు పెట్టలేదో ప్రజలు నిలదీయాలని పిలుపు నిచ్చారు. ఎన్నికలప్పుడే ఆమెకు పురట్చి తలైవర్ ఎంజియార్ గుర్తుకు వస్తారని, అధికారంలోకి వస్తే, ఎంజీయార్‌ను పక్కన పడేసి, అంతా తానే అమ్మ భజన చేయడంటూ హెచ్చరించడం, మాట వినకుంటే, పదవుల్ని ఊడగొట్టడం ఆమెకు పరిపాటేనని ఎద్దేవా చేశారు. ఇక, ఆమెనే కాదు, డీఎంకేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మ వద్దని సూచించారు. ఆ ఇద్దరూ పెద్ద అవినీతి పరులేనని, అధికారం కోసం మాయాజాలం చేస్తారని, తదుపరి చుక్కలు చూపిస్తారన్న విషయాన్ని పరిగణించాలన్నారు. తాము ఆరుగురం రేయింబవళ్లు ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ముందుకు సాగుతున్నామని, ఈ ఆరుగురి బలం ఏమిటో ఈ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు తెలుస్తాయని హెచ్చరించారు. దయ చేసి ఆ రెండు పార్టీలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మ వద్దు అని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, ప్రతి ఇంటా వెలుగు నింపాలన్న ఒక్క తమ కూటమి ద్వారానే సాధ్యం అని, తమ అభ్యర్థులందరిని గెలిపించాలని విన్నవించారు. -
ఓటు... దీని రూటే వేరు గురూ...
తమిళనాడులో ప్రస్తుతం 700 ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతున్నాయి.ఎందుకో తెలుసా? ఓటర్లను ప్రలోభపెట్టేవారినీ అందుకై కానుకలు ఇచ్చేవాళ్లనీ పట్టుకోవడానికి! పాత ‘వేటగాడు’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ‘పుట్టింటోళ్లు తరిమేశారు’... పాటలో విలన్ సత్యనారాయణ ఒకే రంగు డ్రస్సు ఆ రంగులోనే ఉన్న బూట్లు తొడుక్కుని వస్తాడు. కాసేపటికి రౌడీ సిలోన్ మనోహర్ వచ్చి అతని టేబుల్ దగ్గరే కూచుంటాడు. పాట మంచి రసపట్టులో ఉండగా ఇద్దరూ కన్ను గీటుకుంటారు. మరు నిమిషంలో ఇతని షూస్ అతని వైపు అతని షూస్ ఇతని వైపు నెట్టుకుంటారు. అంటే ఆ షూ సోల్లో డైమండ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ స్మగ్లింగ్ జరుగుతోందన్న మాట. ప్రస్తుతం తమిళనాడులో ఓటర్లను లోబరుచుకోవడానికి ఇంతకు తక్కువ కాని కొత్త కొత్త రీతులను కనిపెట్టడానికీ కనిపెట్టి వాటిని అమలు పరచడానికి పార్టీలు, లీడర్లు, వారి లెవల్ 3, లెవల్ 4 లీడర్లు వెనుకాడటం లేదు. ఒక్క ఓటే... కాని వేయి లంచాలు. అఫీషియల్... ఒక అధికారి చెప్పినట్టుగా ఓటరును కరప్ట్ చేయడంలో దేశంలో తమిళనాడుకు మించిన రాష్ట్రం లేదు. అక్కడ ఓటరును రెండు విధాలుగా ఆకర్షిస్తారు. ఒకటి అధికారికంగా- అంటే ఎన్నికల మేనిఫెస్టో రూపంలో. రెండు అనధికారికంగా- అంటే డబ్బు దస్కం వగైరా వగైరా. 2006 ఎన్నికలలో డి.ఎం.కె అధినేత కరుణానిధి దీనిని మొదలెట్టారు. రెండు రూపాయలకు కిలోబియ్యం పథకాన్ని ప్రకటించారు. అది చూసి ఏ.ఐ.డి.ఎం.కె. పార్టీ అధినేత్రి జయలలిత ఏకంగా అర్హులకు పది కిలోల ఉచిత బియ్యం ప్రకటించింది. అది చూసి విజయకాంత్ పార్టీ పదిహేను కిలోల ఉచిత బియ్యాన్ని వాగ్దానాన్ని చేసింది. అయితే మొదట మొదలెట్టిన డి.ఎం.కె విజయాన్ని తన్నుకుపోయింది. 2011 ఎన్నికల నాటికి జయలలిత పుంజుకుని ఈ గిఫ్ట్ ప్యాక్ రేంజ్‌ను పెంచేసింది. కలర్ టి.వి, ఫ్రిజ్, సీలింగ్ ఫ్యాన్... వీటిని ఉచితంగా అర్హులకు ప్రకటించింది. పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పేద మహిళలకు నాలుగు గ్రాముల గోల్డు, పేదింటి పిల్ల పెళ్లికి 25,000 రూపాయల నగదు... ఇక ఆ లిస్టు కొనసాగింది. ప్రస్తుత ఎన్నికలలో ఈ ఊపును డి.ఎం.డి.కె అధినేత విజయకాంత్ కొనసాగిస్తున్నారు. ఆయన ఏకంగా తాను గనక అధికారంలోకి వస్తే పెట్రోలు 45 రూపాయలకి, డీజెల్ 35 రూపాయలకి అందిస్తానని అంటున్నాడు. రాష్ట్ర పరిధిలో ఉన్న పన్నులను ఎంత మినహాయించినా పెట్రోల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు లోబడిన పెట్రోల్ ధర 45 రూపాయలకు దిగదని పండితులు చెబుతున్నారు. అయినా విజయకాంత్ లెక్క చేయడం లేదు. మరొకటి... ప్రతి ఏటా కనీసం ఐదు వేల మంది రైతులను విదేశాలకు పంపి వ్యవసాయంలో మెలకువలు నేర్చుకుని వచ్చేలా చేస్తానని విజయకాంత్ అంటున్నాడు. పల్లెల్లోని ప్రతి కుటుంబం నెలసరి ఆదాయం 25,000 రూపాయలకు పెంచుతానని, అందుకు కావాలంటే ప్రతి ఇంటిలోని ఒకరికి క్లర్క్ ఉద్యోగం ఇస్తానని చెబుతున్నాడు. ఇక తమిళనాడుకు చెందిన టాప్ బ్రాండ్స్, వ్యాపార సంస్థల వాళ్లు ఏ రాష్ర్టంలో అయినా ఏ దేశంలో అయినా తమ వ్యాపారాలు చేసుకోవచ్చని, అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మాట మాత్రం చెప్పాల్సిన పని లేదని అంటున్నాడు. ఈ ఆకర్షణలు ఎవరిని అందలం ఎక్కిస్తాయో చూడాలి. అన్ అఫీషియల్‌గా... తమిళనాడులో ప్రస్తుతం 700 ఫ్లయింగ్ స్క్వాడ్స్ తిరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? ఓటర్లను ప్రలోభ పెట్టేవారినీ అందుకై కానుకలు ఇచ్చేవాళ్లనీ పట్టుకోవడానికి. ఇలా అక్రమంగా పంచడానికి తరలిస్తున్న డబ్బును ఇప్పటికే దాదాపు 25 కోట్లు అక్కడ అధికారులు పట్టుకున్నారు. అందుకోసం అత్యాధునిక జి.పి.ఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ద్వారా ఎక్కడినుంచి ఫిర్యాదుదారుని ఫోన్ వస్తుందో అక్కడికి చేరుకునేందుకు నెట్‌వర్క్‌నూ స్థాపించుకున్నారు. అంటే చెన్నై టి.నగర్ నుంచి ఒక వ్యక్తి ‘మా ఏరియాలో డబ్బు పంచుతున్నారు’ అని ఫోన్ చేయగానే మూడు నుంచి ముప్పై నిమిషాల్లో అక్కడకు స్క్వాడ్ చేరుకునేలాగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా సరే నాయకులు కొత్త కొత్త మార్గాలను కనిపెట్టడంలో ఐన్స్టీన్లను మించిపోతున్నారు. మొబైల్ రీచార్జ్‌లు.... ఓటర్లకు డబ్బు కావాలి- అని నాయకులు అనుకుంటారు. డబ్బు పంచితే పట్టుకుంటారు కనుక రూ.100, రూ.200, రూ.500కు మొబైల్ రీచార్జ్ చేయిస్తారు. అంటే పరోక్షంగా డబ్బు ఇస్తారు. కొన్ని చోట్ల చిల్లర దుకాణాల కూపన్లు ఇస్తున్నారు. ఆ కూపన్లు పట్టుకొని వెళ్లి ఎంపిక చేసిన షాపుల్లో ఆ కూపన్ మొత్తానికి సరిపడా సరుకు కొనుక్కోవచ్చు. కొన్నిచోట్ల పెట్రోల్ కూపన్లు కూడా చలామణి అవుతున్నాయి. గతంలో వంద నోటు, క్వార్టర్ బాటిల్ మద్యం ఓటరును ఆకర్షించడానికి సరిపోతుందని భావించేవారు. కాని ఇప్పుడు కానుకలు శృతి మించి గంజాయి, డ్రగ్స్ వరకూ వెళుతున్నాయి. పశ్చిమ బెంగాల్ డ్రగ్స్ విషయంలో మొదటి స్థానంలో ఉంటే కేరళ చివరిస్థానంలో ఉంది. ఈసారి ఓటర్ల కోసం సెల్ఫోన్లు, గ్యాస్ సిలిండర్లు, బియ్యం బస్తాలు, సిఎఫ్ఎల్ బల్బులు, వంట పాత్రలు... ఇంకా అనేకం తయారవుతున్నాయి. నిత్యం నిఘా ఉన్నప్పటికీ పాల ప్యాకెట్ల పంపిణీని, న్యూస్పేపర్ల పంపిణీని నాయకులు లక్ష్యం చేసుకునే అవకాశాలున్నాయి. అంటే నేరుగా డబ్బు పంచే వీలు లేకపోతే గనక తెల్లారేసరికి పాల ప్యాకెట్‌తో పాటు దానికి గుచ్చిన ఐదు వందల నోటు లేదంటే వెయ్యి నోటు కనిపించే అవకాశం ఉంది. లేదంటే ముంగిట్లో పడే న్యూస్పేపర్లో పాంప్లెట్‌కు బదులు కరెన్సీ కనిపించవచ్చు కూడా. అందుకే పోలీసులు ఇప్పటి నుంచి పేపర్, మిల్క్ బాయ్‌లను సమావేశ పరిచి ఇలాంటి పనులు చేయవద్దని సూచిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా... ఓటర్లను ప్రలోభపెట్టే ఏ పనినీ అంగీకరించని ఎలక్షన్ కమిషన్ తను కూడా ఓటర్లను ప్రలోభ పెడుతోందా? సరదాగా అయినా అవుననే చెప్పాలి. ఎందుకంటే ఓటు వేసేందుకు యువ ఓటర్లను ఆకర్షించడానికి ఎలక్షన్ కమిషన్ ‘సెల్ఫీల కాంపిటీషన్’ పెట్టింది. ఓటు వేసిన యువతీ లేదా యువకుడు తమ ఎలక్షన్ బూత్ కనిపించేలా సెల్ఫీ తీసుకుని జిల్లా పరిపాలనకు సంబంధించిన పేజీలో పోస్ట్ చేస్తే ఉత్తమ సెల్ఫీకి బహుమతి ఇస్తానని చెబుతోంది. అది ఒక ఆకర్షణ ఇది ఒక ఆకర్షణ... పవిత్ర భారతావనిలో ఓట్ల పండగ ఒక చిత్ర విచిత్రాల కార్ఖానా. -
ఆరోగ్యంగానే ఉన్నాను
పుకార్లు నమ్మొద్దు {పజా సంక్షేమ కూటమి విజయకాంత్ స్పష్టీకరణ చీలిక ఎవరి తరం కాదన్న ప్రేమలత వామపక్షాల వద్దకు వైగో, తిరుమా పరుగు ఒకే వేదిక మీదుగా అభ్యర్థుల జాబితా చెన్నై : ప్రజా సంక్షేమ కూటమికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలు, పుకార్లను నమ్మకండి అని తమ కేడర్‌కు ఆ కూటమి నేతలు సూచించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ డీఎండీకే అధినేత విజయకాంత్ స్పష్టం చేశారు. ఈ కూటమిని చీల్చడం ఎవరి తరం కాదని ప్రేమలత విజయకాంత్ వ్యాఖ్యానించారు. ఇక, కూటమి పేరు వ్యవహారంలో వామపక్షాల భిన్న స్వరంతో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమా పరుగులతో బుజ్జగింపులు సాగించి ఉన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా డీఎండీకే, ఎండీఎంకే, వీసీకే, వామపక్షాల నేతృత్వంలో ఏర్పాటైన కూటమిపై రోజుకో మలుపులతో చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కూటమి పేరు వ్యవహారంలో ఆదివారం వామపక్షాలు, ఎండీఎంకే, వీసీకేల మధ్య భిన్న స్వరాలు బయలు దేరాయి. అలాగే, డీఎండీకే అధినేత, సీఎం అభ్యర్థి విజయకాంత్ అనారోగ్యం పేరుతో సింగపూర్ పయన సమాచారం చర్చకు దారి తీశాయి. ఇక, మరెన్ని ట్విస్టులతో ఈ కూటమి పయనం సాగనుందో అన్న ప్రశ్న బయలు దేరింది. కెప్టెన్ టీం అన్న పేరుకు వ్యతిరేకంగా వామపక్షాల వ్యాఖ్యలతో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్ మేల్కొన్నట్టున్నారు. ఆగమేఘాలపై ఈ ఇద్దరు నేతలు సీపీఎం కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. సీపీఎం నేత జి రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్లను బుజ్జగించడంతో పాటుగా సీట్ల పందేరంలో సమయానుకూలంగా సర్దుకుందామన్న హామీని ఇచ్చి ఉన్నారు. దీంతో కూటమిపై వస్తున్న వదంతులు నమ్మ వద్దంటూ కేడర్‌కు నాయకులు సూచించే పనిలో పడ్డారు. ఇక, తమ కూటమిని చీల్చే యత్నం సాగుతున్నదని, ఇందుకు మీడియా కూడా వంత పాడుతున్నట్టుగా నాయకులు పల్లవిని అందుకోవడం గమనార్హం. ఇక, తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలను డీఎండీకే అధినేత విజయకాంత్ తీవ్రంగా ఖండించారు. విజయకాంత్ ఆరోగ్యంపై ఆయన సతీమణి ప్రేమలత చేసిన వ్యాఖ్యలతోనే సింగపూర్ పర్యటన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ విజయకాంత్ తరపున సోమవారం ప్రకటన వెలువడటం గమనార్హం. కూటమికి, తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలు, ప్రచారాలు, పుకార్లు ఏ ఒక్కటినీ నమ్మొద్దని అందులో కేడర్‌కు సూచించారు. ఏదేని విషయాలు ఉంటే, పార్టీ కార్యాలయం సమాచారాలు అందిస్తుందని, అంతే గానీ, మీడియాల్లో వచ్చే వార్తలు, కథనాలతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల ప్రచారంతో ప్రజల్లోకి వస్తానని విజయకాంత్ వివరించారు. అలాగే, ఏప్రిల్ పదో తేదిన కూటమిలోని పార్టీల అభ్యర్థులు ప్రకటన, పరిచయ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. ఇక, కూటమిని చీల్చేందుకు తీవ్ర కుట్రలు జరుగుతున్నాయని, ఇందుకు పలు మీడియాలు కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ప్రేమలత విజయకాంత్ తీవ్రంగా దుయ్యబట్టారు. మదురైలో జరిగిన ప్రచార కార్యాక్రమంలో అధికార మార్పు లక్ష్యంగా ప్రజా కూటమి ఆవిర్భవించిందని, దీనిని చీల్చేందుకు రకరకాల ప్రయత్నాలు, కుట్రలు జరుగుతూనే ఉన్నాయని మండి పడ్డారు. పండు తేనెలో పడిందని, ఇన్నాళ్లు అమ్మకు, అయ్యకు ఓటేయండంటూ నినాదాలు విన్పించాయని, ఇక ఆ రెండింటిని పక్కన పెట్టి అన్న(విజయకాంత్)కు ఓటేయండన్న నినాదాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలని పిలుపునిచ్చార -
సర్దుకుందాం
ఎండీఎంకే-40,వామపక్షాలు -35 వీసీకే -35 కెప్టెన్ రాకతో సెటైర్లు ప్రజా సంక్షేమ కూటమే: నల్లకన్ను ఇదేంటీ : సీపీఎం ఎమ్మెల్యే సాక్షి, చెన్నై : కెప్టెన్ రాకతో తమ బలం పెరిగినా, సీట్ల పందేరంలో మాత్రం సర్దుకోవాల్సిన పరిస్థితి ప్రజా కూటమి నేతలకు తప్పలేదు. ఎండీఎంకే 40, వామపక్షాలు 35, వీసీకే 35 సీట్లు చొప్పున పంచుకునే పనిలో పడ్డాయి. ఇక, ప్రజా కూటమిపై సెటైర్లు సంధించే వాళ్లు పెరగడంతో విమర్శల్ని తిప్పికొట్టేందుకు ఘాటుగా స్పందించే పనిలో వైకో, తిరుమా నిమగ్నమయ్యారు. ఇది కెప్టెన్ టీం కాదు, ప్రజా సంక్షేమ కూటమి అని సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను పెదవి విప్పడం గమనార్హం. ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో కలసి సాగుతున్న ప్రజా సంక్షేమ కూటమిలో బుధవారం ఆనందంకర క్షణాలు చోటు చేసుకున్నాయి. డీఎండీకే రాకతో తమ బలం పెరిగిందని జబ్బలు చరిచే పనిలో ఎండీఎంకే నేత వైకో, సీపీఎం నేత జి రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్ పడ్డారు. వచ్చి రాగానే 124 సీట్లను లాక్కుని , తమకు 110 సీట్లను విజయకాంత్ ఇవ్వడంతో వాటిని పంచుకోవడంలో సర్దుకోవాల్సిన పరిస్థితి మిగిలిన నేతలకు తప్పలేదు. కూటమిలో ఎలాంటి విబేధాలకు ఆస్కారం ఇవ్వని విధంగా సమష్టిగానే సర్దుకునే పనిలో పడ్డారు. ఆ మేరకు ఎండీఎంకే 40, వీసీకే 35, సీపీఎం, సీపీఐలు కలిసి 35 చోట్ల బరిలోకి దిగేందుకు నిర్ణయించి ఉన్నాయి. ఇక, వైకో, రామకృష్ణన్ ఎన్నికల బరిలో దిగేందుకు ఆస్కారం లేదని ఆ కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి. తిరుమావళవన్ మాత్రం పోటీకి నిర్ణయించగా, అధిష్టానం అనుమతి కోసం ముత్తరసన్ ఎదురు చూపుల్లో ఉన్నట్టు సమాచారం. ఇక, ఇతర పార్టీలు కూటమిలోకి వచ్చిన పక్షంలో సీట్లను విజయకాంత్ సర్దుబా టు చేసుకోవాల్సిందే అన్న నిర్ణయానికి మిగిలిన నేతలు వచ్చి ఉన్నారు. ఇంత వరకు నేతల మధ్య ఐక్యతతో పయనం సాగినా, అసలు సమస్య సిట్టింగ్ ఎమ్మెల్యేల రూపంలో వామపక్షాలకు ఎదురు అయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. సీపీఎంకు పది, సీపీఐకు తొమ్మిది మంది సిట్టింగ్ లు ఉండగా, ఒక్క సభ్యుడ కూడా లేని ఎండీఎంకే, వీసీకేలకు మాత్రం అన్ని స్థానాలు ఎందుకో అని పెదవి విప్పే వాళ్లు వామపక్షాలు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే తన ఫేస్ బుక్‌లో సీపీఎం సిట్టింగ్ ఎమ్మెల్యే బాల భారతి స్పందించి ఉండటం గమనించాల్సిన విషయం. అదే సమయంలో విజయకాంత్ రాకతో ఇది కెప్టెన్ టీం అని వైకో స్పందించడంతో, దానిని ఖండించే విధంగా సీపీఐ సీనియర్ నేత నల్లకన్ను స్పందించి ఉన్నారు. ఎంత మంది నాయకులు కూటమిలోకి వచ్చినా, పేరు మాత్రం ప్రజా సంక్షేమ కూటమి అన్న విషయాన్ని గు ర్తుంచుకోవాలని హితవు పలకడం ఆలోచించాల్సిందే. సెటైర్లు : విజయకాంత్ రాకతో మిత్ర పక్షాల్లో ప్రధానంగా సీపీఎం,సీపీఐలలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓ వైపు పెదవి విప్పుతుంటే, సీనియర్లు డొంక తిరుగుడు వ్యాఖ్యలకు సిద్ధం అవుతోంటే, సోషల్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాల్లో ఈ కూటమి మీద సెటైర్లు బయలు దేరి ఉన్నాయి. కొత్త రకం కార్టూన్లతో వ్యంగ్యంగా చిత్రీకరించి, కొత్త టాగ్ లైన్లతో విమర్శించే వాళ్లు పెరిగారు. ఇది ఓ వైపు సాగుతుంటే, మరో వైపు బిజేపీ నేతలు తీవ్రంగానే ప్రజా కూటమిని టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. ఆ పార్టీ జాతీయ నేత ఇలగణేషన్ తీవ్రంగా విరుచుకు పడుతూ, ప్రజా సంక్షేమ కూటమిలోకి విజయకాంత్ రాకతో అది, ప్రజా వ్యతిరేక కూటమిగా మారిందని ఎద్దేవా చేశారు. ఇలా సెటైర్లు, విమర్శలు, ఆరోపణలు బయలు దేరడంతో ఘాటుగానే సమాధానాలు ఇచ్చేందుకు వైకో, తిరుమా సిద్ధమయ్యారు. తమ కూటమిని చూసి ఓర్వ లేక, తమ బలం పెరగడంతో భయంతో విమర్శలు ఆరోపణలు సంధిస్తున్నారని మండి పడ్డారు. ప్రచారం: ఇప్పటికే ప్రజా కూటమి నేతలు ప్రచారంలో దూసుకెళుతుంటే, తన వంతుగా ప్రచార బాటకు విజయకాంత్ రెడీ అయ్యారు. కూటమి తరపున విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, బావ మరిది సుదీష్ వేర్వేరుగా రోడ్ షోకు సిద్ధం అవుతున్నారు. ఇందుకు తగ్గ పర్యటన మ్యాప్ రూపకల్పనలో డీఎండీకే వర్గాలు ఉరకలు తీస్తున్నాయి. అలాగే, వీరి ముగ్గురి కోసం ప్రత్యేక సౌకర్యాలు, వసతులతో మూడు ప్రచార వాహనాలు మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఇక, ఘాటుగా, తీవ్ర పదజాలలతో, తన భర్త ప్రసంగాల్ని తలదన్నే రీతిలో విజయకాంత్ సతీమణి ప్రేమలత ప్రసంగాలు సాగిస్తున్న విష యం తెలిసిందే. కొన్ని చోట్ల ఈ ప్రసం గాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ల సంఖ్య పెరగడంతో ఆమెకు భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమెకు ప్రత్యేక భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈసీకి డీఎం డీకే నేతలు వినతి పత్రం సమర్పించారు. -
సీఎం అభ్యర్థిగా విజయకాంత్
ప్రజా సంక్షేమ కూటమిలో డీఎండీకే చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎండీకే అధినేత విజయకాంత్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగ నున్నారు. ఎండీఎంకే అధినేత వైగో నేతృత్వంలో ఏర్పడిన ప్రజాసంక్షేమ కూటమి(పీడబ్ల్యుఎఫ్)తో పొత్తుపెట్టుకోవడం ద్వారా సీఎం అభ్యర్థిగా రంగంలో ఉండాలన్న కలను విజయకాంత్ నెరవేర్చుకున్నారు. పీడబ్ల్యుఎఫ్లో వైగో నేతృత్వం వహిస్తున్న ఎండీఎంకేతో పాటు, సీపీఐ, సీపీఎం, వీసీకేలు భాగస్వాములుగా ఉన్నాయి. బుధవారం డీఎండీకే కార్యాలయంలో విజయకాంత్, సుధీష్, ఎండీఎంకే అధినేత వైగో, వీసీకే అధ్యక్షుడు తిరుమావలవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ.రామకృష్ణన్ తుది విడత చర్చలు జరిపారు. దీంతో కొన్ని రోజులుగా తమిళనాడులో పార్టీల మధ్య పొత్తుల ఊహాగానాలకు బుధవారం తెరపడింది. ఆపై సీఎం అభ్యర్థిగా విజయకాంత్ పేరును అధికారికంగా ప్రకటించారు. అలాగే డీఎండీకేకు 124సీట్లు, వైగో బృందానికి 110 సీట్లు కేటాయించేలా ఒప్పందం కుదిరింది. కాగా, డీఎండీకేతో పొత్తు ఆశించిన బీజేపీ ఈ కూటమి ఏర్పాటును విమర్శించింది. -
రెండోస్సారి!
* పదేళ్లలో మరో ఒంటరిపోరు * డీఎండీకే నిర్ణయంపై అన్ని పార్టీల్లో విస్మయం * ప్రజాస్వామ్య కూటమిపై చర్చ చెన్నై, సాక్షి ప్రతినిధి : పార్టీ ఆవిర్భావంలో ఒకసారి ఒంటరిపోరుకు దిగిన డీఎండీకే సరిగ్గా పదేళ్ల తరువాత మరోసారి ఒంటరిగా ఎన్నికల సమరాన్ని ఎదుర్కోనుంది. తొలి సమరంలో కేవలం ఒక్కసీటు మాత్రమే దక్కగా రెండో సమరం ఫలితాలకు మరో నెలన్నర రోజులు ఆగాల్సి వచ్చింది. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలో డీఎంకే, అన్నాడీఎంకేల తరువాత తృతీయస్థానాన్ని దక్కించుకున్న డీఎండీకే సైతం కోలీవుడ్ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిందే. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, ప్రస్తుత అధ్యక్షుడు కరుణానిధి, అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్, ప్రస్తుతం పార్టీ అధినేత్రి జయలలిత సినిమారంగానికి చెందినవారని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆ రెండు పార్టీల అధినేతలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అదే వరుసలో తాను సైతం సీఎం కావాలని ఆశించిన విజయకాంత్ 2005లో రాజకీయాల్లోకి దిగారు. తమిళనాడులో ద్రవిడ పార్టీలకే ప్రజల్లో ఆదరణ ఉండటంతో విజయకాంత్ అధ్యక్షుడుగా దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం (డీఎండీకే) పేరుతో 2005లో పార్టీ ఆవిర్భవించింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2006లో అసెంబ్లీ ఎన్నికలు రాగా మొత్తం 234 స్థానాల్లో తమ అభ్యుర్థులను నిలబెట్టి ఒంటరిగా పోటీకి దిగారు. విరుదాచలం నియోజవర్గం నుంచి విజయకాంత్ పోటీచేశారు. అన్ని నియోజకవర్గాల్లో డీఎండీకే అభ్యర్థులు పరాజయం పాలుకాగా విజయకాంత్ ఒక్కరే గెలిచారు. అయితే అనేక నియోజకవర్గాల్లో గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించడం ద్వారా రాజకీయాల్లో కలకలం రేపారు. డీఎంకే, అన్నాడీఎంకే వంటి సీనియర్ పార్టీలను ఒంటికాలిపై ఢీకొని ఆ ఏడాది 8 శాతం ఓట్లను సాధించడం ఒక రికార్డుగా నిలిచింది. ఆ (2006) ఏడాది జరిగిన ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చినా పూర్తిస్థాయి మెజారిటీ లేకుండా పోయింది. అలాగే 2009 పార్లమెంటు ఎన్నికల్లో డీఎండీకే ఒంటరిగానే పోటీచేసి మొత్తం 39 స్థానాల్లోనూ ఓడిపోయింది. అయితే అన్ని నియోజకవర్గాల్లో కనీస ఓట్లను సాధించడం ద్వారా ఓటు బ్యాంకును చాటిచెప్పింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎం డీకే 41 స్థానాల్లో పోటీచే సి 29 స్థానాల్లో గెలుపొందింది. విజయకాంత్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ను దక్కించుకున్నారు. అన్నాడీఎంకేతో ఆయన చెలిమి ఎక్కవకాలం కొనసాగలేదు. ఈ పరిస్థితుల్లో 2006 తరువాత ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. పార్టీ ఆవిర్భావం తరువాత రెండుసార్లు ఒంటరిపోరుకు దిగినట్లయింది. సతీమణి సలహాతోనే ఒంటరిపోరు ఏదో ఒక బలమైన పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని విజయకాంత్ భావించగా, ఆయన సతీమణి ప్రేమలత మొత్తం వ్యూహాన్నే మార్చివేసినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని ఈ ఏడాది ఆ పార్టీకి బద్దశత్రువైన డీఎంకేతో జతకడితే ప్రజల్లోనూ, ఇతర పార్టీల్లోనూ చులకనై పోతామని ఆమె నూరిపోసినట్లు సమాచారం. ప్రేమలత మాటలను విశ్వసించిన విజయకాంత్ ‘పెళ్లాం చెబితే వినాలి’ అనే రీతిలో రాజకీయాలు నడిపిస్తున్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కేవలం విజయకాంత్ భార్యగాకాక చురుకైన నేతగా ప్రేమలత పేరొందడంతో ఆమె నిర్ణయాలకు విలువ పెరుగుతోంది. అందుకే గురువారం జరిగిన సభలో వ్యూహాత్మకంగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలపై ప్రేమలత దుమ్మెత్తిపోశారు. అయితే ఇన్నాళ్లు ఏదోఒక బలమైన పార్టీతో జతకట్టి కొన్ని సీట్లు దక్కించుకోగలమని నమ్మకంతో ఉన్న పార్టీనేతలు ఒంటరిపోరుతో నిరాశపడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు పార్టీ వైఖరి స్పష్టం కావడంతో శుక్రవారం అభ్యర్థుల ఎంపికను ప్రారంభించారు. ప్రజాసంక్షేమ కూటమి కెప్టెన్‌తో కలిసేనా రాష్ట్రంలో 8 నుంచి 10 శాతం మాత్రమే ఓటు బ్యాంకు కలిగి ఉన్న డీఎండీకే ఒంటరి పోరుకు దిగడం అన్ని పార్టీలను ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ తమ కూటమిలోకి వస్తాడనే చర్చలు మారిపోయి ప్రస్తుతం కెప్టెన్ ఒక కొత్తకూటమిని ఏర్పాటు చేసుకుంటాడనే ప్రచారం సాగుతోంది. ప్రజా సంక్షేమ కూటమి విజయకాంత్‌తో చేతులు కలిపి అతడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా సంక్షేమ కూటమిలోని ఎండీఎంకే, వీసీకే, వామపక్షాలతో డీఎండీకే కూడా చేరితే బలమైన కూటమిగా ఏర్పడగలదని ఆశిస్తున్నారు. తద్వారా కూటమి బలం 15 శాతం నుంచి 18 శాతానికి పెరుగుతుందని అంచనావేస్తున్నారు. ఓటుబ్యాం కు లెక్కలు చెప్పి ఎలాగైనా కెప్టెన్‌ను తమతో కలుపుకోవాలని ప్రజాస్వామ్య కూటమి తహతహలాడుతోంది. -
కెప్టెన్ మా వెంటే!
►మద్దతు ఇస్తాడన్న నమ్మకం ఉంది ► పెదవి విప్పిన కరుణ ► రెండు రోజుల్లో మేనిఫెస్టో ► కొళత్తూరు బరిలో మళ్లీ స్టాలిన్ ► ఇంటర్వ్యూకు హాజరు సాక్షి, చెన్నై : డీఎండీకే పొత్తు వ్యవహారాలపై వస్తున్న ఊహాజనిత కథనాలకు ముగింపు పలికే విధంగా డీఎంకే అధినేత కరుణానిధి స్పందించారు. కెప్టెన్ మా వెంటే అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్య, పండు పక్వానికి వచ్చింది...ఇక పాలల్లో పడాల్సిందే అని సామెతను వళ్లించి అటు కమలనాథులకు, ఇటు ప్రజా కూటమికి షాక్ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టోను సైతం ప్రకటించబోతున్నట్టు కరుణానిధి వెల్లడించారు. అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలతో డీఎంకే అధినేత కరుణానిధి ముందుకు సాగుతూ వస్తున్నారు. ఇప్పటికే ఆ కూటమిలోకి కాంగ్రెస్ చేరింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎప్పటి నుంచో డీఎంకేతో పయనం సాగిస్తూనే ఉంది. ఇక, పది శాతం మేరకు ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే అధినేత విజయకాంత్ తమ వెంట ఉంటే చాలు, అన్నాడీఎంకేను పతనం అంచుకు చేర్చినట్టే అన్న భావనలో డీఎంకే వర్గాలు పడ్డాయి. అయితే, విజయకాంత్ ఎక్కడా, ఎవరికీ చిక్కకుండా నాన్చుడు ధోరణితో ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో ఊహాజనిత కథనాలెన్నో పుట్టుకొచ్చాయి. బీజేపీ వైపు వెళుతున్నారంటూ కొన్ని మీడియాలు, ప్రజా కూటమి వైపు అంటూ మరికొన్ని మీడియాలు కోడై కూసినా, డీఎంకే అధినేత కరుణానిధి మాత్రం పొత్తు విషయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆశావహుల ఇంటర్వ్యూల మీదే తన దృష్టిని అంతా పెట్టారు. ఈ పర్వం సోమవారం పొద్దు పోయే వరకు సాగింది. 4,433 మందిని గత నెల 22వ తేదీ నుంచి కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఇంటర్వ్యూలు చేయడం విశేషం. ఇక, చివరగా కరుణానిధి ఇంటర్వ్యూకు స్టాలిన్ సైతం హాజరు కాక తప్పలేదు. కొళత్తూరు బరిలో మళ్లీ ఆయన నిలబడాలంటూ దరఖాస్తులు పెద్ద సంఖ్యలోనే వచ్చాయి. దీంతో ఆ స్థానం తనదేనని సీటును రిజర్వు చేసుకుంటూ ఇంటర్వ్యూకు దళపతి స్టాలిన్ సైతం హాజరు కాక తప్పలేదు. కరుణానిధి సంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సైతం ఇచ్చారు. ఈ దరఖాస్తుల పర్వం ముగియడంతో మంగళవారం మీడియా ముందుకు వచ్చిన కరుణానిధి ఊహాజనిత కథనాలకు ముగింపు పలికే విధంగా వ్యాఖ్యల్ని , సామెతల్ని సంధించారు. కెప్టెన్ మా వెంటే : అన్నా అరివాలయంలో పొత్తు వ్యవహారాలపై కరుణానిధి స్పందించారు. డి ఎంకే కూటమిలోకి డిఎండికే వస్తుందా..? అని ప్రశ్నించగా, పండు పక్వానికి వచ్చిందని, ఇక పాలల్లో పడాల్సిందేనని సామెతను వళ్లించారు. పొత్తు వ్యవహారాల్లో జాప్యం ఏమిటో..? అని ప్రశ్నించగా, జాప్యం ఏమీ లేదు, ఇతర వివరాలు చెప్పలేను అంటూ దాట వేశారు. విజయకాంత్ వస్తారన్న నమ్మకం ఉందా..? అని ప్రశ్నించగా, తప్పకుండా వస్తారని వ్యాఖ్యానించడం విశేషం. డీఎంకే మేనిఫెస్టో సిద్ధమా..? అని ప్రశ్నించగా, రెండు మూడు రోజుల్లో విడుదల చేయబోతున్నామన్నారు. ఇతర పార్టీల్ని కూటమిలోకి ఆహ్వానిస్తున్నారా..? అని ప్రశ్నించగా, ఇతరులెవ్వరినీ ఆహ్వానించ లేదు, ఆహ్వానించబోమని వ్యాఖ్యానించారు. ఇక, విజయకాంత్ తమ వెంటనే అన్నట్టుగా కరుణానిధి స్పందించడంతో కమలం వర్గాలు, ప్రజా కూటమి వర్గాలకు షాక్ తగిలినట్టు అయ్యాయి. ఇక, విజయకాంత్ చేజారినట్టేనా..అన్న భావనలో ఆ రెండు వర్గాలు పడ్డాయి. -
విజయకాంత్ మోసపోకూడదు: వైగో
టీనగర్: కరుణానిధి చేత విజయకాంత్ మోసపోకూడదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో హితవు పలికారు. ప్రజా కూటమి వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎగ్మూరులోగల ఎండిఎంకే కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఇందులో ప్రజాకూటమి సమన్వయకర్త వైగో, సీపీఎం కార్యదర్శి రామకృష్ణన్, సిపిఐ కార్యదర్శి ముత్తరసన్, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైగో విలేకరులతో మాట్లాడుతూ నేటి నుంచి ఈ వెబ్సైట్ ఇతర సామాజిక మాధ్యమాలలో తమ కూటమి విశేషాలు, ప్రకటనలు వంటివి పొందుపరుస్తామన్నారు. వీటి ద్వారా ప్రజలు తమతో నేరుగా సంప్రదించవచ్చన్నారు. రాష్ట్రంలో 65 శాతం ప్రజల మనోభావాలను ప్రతిఫలించే విధంగా మక్కల్ నలకూట్టని ( ప్రజాకూటమి) ఏర్పాటైందన్నారు. తమిళ మానిల కాంగ్రెస్‌ను తమ కూటమికి ఆహ్వానించామని, ఇంతవరకు వారు నిర్ణయం తీసుకోలేదన్నారు. డీఎండీకేను డీఎంకే కూటమికి ఆహ్వానించడం గురించి మంగళవారం కరుణానిధి మాట్లాడుతూ పండు పక్వానికి వచ్చిందని, ఏ సమయంలో పాలలో పడుతుందోనని వేచిచూస్తున్నట్లు తెలిపారన్నారు. ఈ పండు రాలి స్వచ్ఛమైన పాలలో పడితే బాగుంటుందని, అయితే డిఎంకే అవినీతి విషం కలిగిన పాలని, అందులో పడకూడదని అన్నారు. ఈ విషయంలో విజయకాంత్ మోసపోకూడదని హితవు పలికారు. -
కోర్టుకు రండి!
స్టాలిన్, కెప్టెన్, అన్భుమణి హాజరు కావాలి సెషన్స్ కోర్టు నోటీసులు చెన్నై: వరద రాజకీయం వ్యవహారంలో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే సీఎం అభ్యర్థి, ఎంపీ అన్భుమణి రాందాసులకు ఏర్పడింది. విచారణ నిమిత్తం కోర్టుకు రావాలంటూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రాజమాణిక్యం నోటీసులు జారీ చేశారు. డిసెంబర్లో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరుల్లో వరదలు సృష్టించిన విలయ తాండవం గురించి తెలిసిందే. వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆరోపణలు బయలు దేరాయి. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే సీఎం అభ్యర్థి అన్భుమణి రాందాసు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. వరద సాయంలో సర్కారు వైఫల్యం అంటూ తీవ్రంగా విరుచుకు పడుతూ స్పందించిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆధార రహిత ఆరోపణలు గుప్పించారంటూ స్టాలిన్ , అన్భుమణిలపై మంత్రి ఉదయకుమార్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. డీఎంకే అధినేత విజయకాంత్‌పై సీఎం జయలలిత తరఫున న్యాయవాదులు పరువు నష్టం దావాను సెషన్స్ కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ల విచారణ శుక్రవారం చెన్నై మొదటి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రాజమాణిక్యం ముందుకు వచ్చింది. పరువు నష్టం దావా పిటిషన్లను పరిశీలించిన న్యాయమూర్తి స్టాలిన్, విజయకాంత్, అన్భుమణి విచారణ నిమిత్తం నేరుగా కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. స్టాలిన్ ఏప్రిల్ 18న, విజయకాంత్ ఏప్రిల్ 25న, అన్భుమణి ఏప్రిల్ 29న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. అలాగే, వీరు గుప్పించిన ఆరోపణల్ని ప్రచురించిన కొన్ని తమిళ పత్రికలకు సైతం నోటీసులు జారీ చేశారు. ఆయా పత్రికల సంపాదకులు సైతం విచారణకు రావాలంటూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
అధికారంలోకి వస్తే పెట్రోల్ రూ.45 డీజిల్ రూ.35
లీటరు పెట్రోల్ రూ.45 డీజిల్ రూ.35 కలాం పేరుతో గ్రామాభివృద్ధి డీఎండీకే మేనిఫెస్టోలో కొత్త అంశాలు నేతృత్వానికి సన్నాహాలు సాక్షి, చెన్నై : తన చుట్టూ తిరుగుతున్న పార్టీల్ని, తన గొడుగు నీడన చేర్చుకునే రీతిలోడీఎండీకే అధినేత విజయకాంత్ వ్యూహ రచన చేశారు. తనతో కలసి వస్తే సరి, లేకుంటే ఒంటరికి సైతం సిద్ధం అన్న నిర్ణయానికి వచ్చి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. నేతృత్వం వహించేందుకు తాను సిద్ధం అని చాటే రీతిలో ఎన్నికల మేనిఫెస్టోలో కొంత భాగాన్ని డీఎండీకే ప్రకటించింది. ఇందులో ప్రజా సేవకుల పేరిట పథకాలను రచించడమే కాకుండా, లీటరు పెట్రోల్ రూ. 45, లీటరు డీజిల్ రూ.35కు విక్రయించడం జరుగుతుందని ప్రకటించడం గమనార్హం. డీఎండీకేను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రజా కూటమి, బీజేపీ, డీఎంకే కూటమిలు తీవ్రంగా కుస్తీలు పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, విజయకాంత్ ఎక్కడా చిక్కకుండా ఆచీతూచీ అడుగులు వేస్తూ వస్తున్నారు. మౌనంతో నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నారు. అయితే, విజయకాంత్ సతీమణి ప్రేమలత మాత్రం దూకుడుతో ముందుకు సాగుతున్నారు. డీఎంకేతో పొత్తు ప్రసక్తే లేదని చాటే విధంగా ఆమె వ్యాఖ్యలు సాగుతూ వస్తున్నాయి. దీంతో విజయకాంత్ తమతో అంటే తమతో చేతులు కలుపుతారన్న ఆశాభావంలో బీజేపీ, ప్రజా కూటములు మునిగి ఉన్నాయి. అయితే, ఒకరి గొడుగు నీడన తాను చేరడం కన్నా, తన గొడుగు నీడలోకి రండి అన్న ఆహ్వానాన్ని తన కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు పలికే వ్యూహ రచన చేసి ఉన్నారు. బీజేపీ కూటమిలోకి తాను చేరడం కన్నా, తన నీడలోకి రావడమే కాకుండా, కొన్ని ఆంక్షల్ని సైతం ఆ పార్టీకి విజయకాంత్ విధించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో మరో వ్యూహంతో ప్రజా కూటమిలోని పార్టీలతో పాటుగా తన మిత్రుడు జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌ను సైతం ఆహ్వానించడం, ఇతర సామాజిక వర్గాల పార్టీలతో మెగా కూటమికి అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా డీఎండీకే చేపట్టబోయే పథకాలను పరోక్షంగా ఎత్తిచూపే విధంగా మేనిఫెస్టోలోని కొంత భాగాన్ని విడుదల చేసి ఉండటం గమనార్హం. ఈ పథకాలన్నీ ఆకర్షణీయంగా రూపొందించి ఉండడంతో, మిగిలిన అంశాలు ఎలా ఉండబోతాయో అన్న ఎదురు చూపుల్లో పార్టీలు పడే విధంగా ఈ భాగాన్ని విడుదల చేసి ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ కసరత్తుల్లో ఉన్న విజయకాంత్, తాజాగా వేస్తున్న అడుగుల మీద సర్వత్రా దృష్టి పడి ఉన్నది. మేనిఫెస్టో : డీఎండీకే ఎన్నిల మేనిఫెస్టోలో కొంత భాగం విడుదల కావడంతో చర్చ బయలు దేరి ఉన్నది. ఇందులో రాష్ర్టంలోని 12620 గ్రామాల్లోని ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా భారత రత్న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రకటించి ఉన్నారు. అలాగే, ఇంటి వద్దకే రేషన్ వస్తువులు దరిచేర్చేందుకు ప్రత్యేక ప్రకటన చేశారు. నమ్మాళ్వార్ పేరిట వ్యవసాయ పథకం అమలు చేస్తామంటూ, ఈ పథకం మేరకు వ్యవసాయ సంబంధింత అన్ని రకాల విత్తనాలు, పరికరాలు, యూరియా తదితర వస్తువులు రాయితీతో ఇవ్వడం జరుగుతుందని వివరించారు. 65 ఏళ్లకు పై బడ్డ 30 లక్షల మంది అన్నదాతల్ని ఆదుకునే విధంగా నెలకు తలా రూ. 2500 పింఛన్ సదుపాయం కల్పిస్తామన్న హామీ ఇచ్చి ఉన్నారు. సిం గార వేలర్ పేరిట 65 ఏళ్లకు పైబడ్డ 10 లక్షల మంది జాలర్లకు తలా రూ. 2500 చొప్పున ఫించన్, కక్కన్ పేరిట 65 ఏళ్లు పైబడ్డ పది లక్షల మంది చేనేత కార్మికులకు తలా రూ. 2500 చొప్పున నెలకు పించన్ అందిస్తామని సూచించి ఉన్నారు. ప్రత్యేక ప్రతిభావంతుల కోసం ప్ర త్యేకంగా స్కూళ్లు, హిజ్రాల కోసం ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలు, కళాశాలలు ఏర్పాటు నినాదాల్ని పొందు పరిచి ఉన్నారు. ఇక, ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న చమురు ధరకు కల్లెం వేస్తూ మేనిఫెస్టోలో పొందు పరిచారు. అధికారంలోకి వస్తే లీటరు పెట్రోల్ రూ. 45కు, లీటరు డీజిల్ రూ. 35కు రాష్ట్రంలో విక్రయించడం జరుగుతుందంటూ పొందు పరిచి ఉండడం విశేషం. -
పొత్తుపై నోరువిప్పని విజయకాంత్
కెప్టెన్ కోసం త్యాగాలకు సిద్ధమన్న కాంగ్రెస్ పొత్తు విషయమై ఏ నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ పార్టీల చూపులన్నీ డీఎండీకే చుట్టూ పరిభ్రమిస్తుండగా ఆ పార్టీ అధినేత విజయకాంత్ మాత్రం నర్మగర్భంగానే వ్యవహరిస్తున్నారు. కాంచీపురంలో శనివారం నిర్వహించిన పార్టీ మహానాడులో అన్నాడీఎంకేపై విమర్శనాస్త్రాలతోనే తన ప్రసంగాన్ని ముగించి నిరాశపరిచారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రాంతీయ పార్టీల వరుసలో మూడో ప్రాధాన్యతను దక్కించుకున్న డీఎండీకే పొత్తు విషయమై ముసుగులో గుద్దులాటలా వ్యవహరిస్తోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో కమలనాథుల కూటమిలో చేరింది. అయితే తన పార్టీ అభ్యర్దుల ప్రచారంతో సరిపెట్టుకున్న విజయకాంత్ మిత్రపక్ష బీజేపీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడలేదు. పార్లమెంటు ఎన్నికల తరువాత బీజేపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరించిన విజయకాంత్ అసెంబ్లీ ఎన్నికల సమయానికి తాను పూర్తిగా దూరంగా జరిగారు. డీఎండీకేతో పొత్తుపెట్టుకోవాలని డీఎంకే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే పొత్తు ఖరారు చేసుకున్న కాంగ్రెస్‌కు విజయకాంత్‌ను చేరదీసే బాధ్యతను అప్పగించింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ సైతం డీఎండీకే గనుక తమ కూటమిలో కలిస్తే విజయకాంత్ పెట్టే అన్ని నిబంధనలకు ఓకే చెబుతామని ప్రకటించారు. అంతేకాదు, డీఎండీకే అభ్యర్థుల కోసం తమ సీట్లు తగ్గించుకునేందుకు సైతం సిద్దమని ఆఫర్ ఇచ్చారు. బీజేపీ సైతం డీఎండీకే నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. ప్రజాస్వామ్య కూటమి నేతలు వైగో, వామపక్షాలు విజయకాంత్‌ను ఆహ్వానిస్తూనే ఉన్నాయి. ఈ దశలో కాంచీపురంలో శనివారం పార్టీ మహానాడుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభ కావాల్సిన సభ 6.30 గంటలకు ప్రారంభమైంది. పార్టీ నేతలు యువజన విభాగం అధ్యక్షులు సుదేష్ తరువాత విజయకాంత్ సతీమణి ప్రేమలత ప్రసంగించారు. కింగ్ మేకర్ కాదు కింగ్‌ను చేయండి: ప్రేమలత రాబోయే ఎన్నికల్లో డీఎండీకే అధినేత విజయకాంత్‌ను కింగ్ చేస్తారా, కింగ్ మేకర్‌ను చేస్తారా, మీరు దేనిని కోరుకుంటున్నారని ప్రేమలతా విజయకాంత్ సభను ప్రశ్నించారు. అనేక సార్లు అదే ప్రశ్నను రెట్టించి చివరగా కింగ్ మేకర్ వద్దు కింగ్‌ను చేయాలని కోరారు. అభిమానులే నిర్ణయిస్తారు:విజయకాంత్ కాంచీపురం మహానాడులో పొత్తు విషయమై ప్రకటిస్తానని ప్రతి ఒక్కరూ ఆశించారని విజయకాంత్ అన్నారు. అయితే పొత్తుపెట్టుకుంటే తాను కింగ్‌ను అవుతానా లేక కింగ్ మేకర్‌ను అవుతానా అని కార్యకర్తలను ఆయన ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనను కింగ్‌ను చేయాలా లేక కింగ్ మేకర్‌ను చేయాలా అనేది కార్యకర్తలు, అభిమానులే త్వరలో నిర్ణయిస్తారని ఆయన పేర్కొంటూ ప్రసంగాన్ని ముగించారు. సమయం వచ్చినప్పుడు నిర్ణయం ప్రకటిస్తానన్నారు. -
కెప్టెన్ తేల్చేనా..!
♦ నేడు కార్యవర్గం భేటీ ♦ పెరంబలూరుకు నేతలు ♦ సచివాలయం సెట్ లో ఆంతర్యం సాక్షి, చెన్నై: పొత్తు విషయంలో తన నిర్ణయాన్ని డీఎండీకే అధినేత విజయకాంత్ తేల్చేనా!? అన్న ఎదురు చూపులు పెరిగాయి. పెరంబలూరు వేదికగా శనివారం డీఎండీకే సర్వ సభ్య సమావేశానికి సిద్ధమైంది. ఈ వేదిక ప్రవేశ మార్గంలో సెయింట్ జార్జ్ కోట(సచివాలయం)ను తలపించే రీతిలో సెట్ వేసి ఉండటంతో ఆంతర్యాన్ని తెలుసుకునే పనిలో పొత్తు కోసం ప్రయత్నించే పార్టీలు నిమగ్నయ్యాయి. పార్టీ ఆవిర్భావంతో తొలి ఎన్నికల్లో తానొక్కడినే అసెంబ్లీ మెట్లు ఎక్కినా, తన కంటూ ప్రత్యేక ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వస్తున్న నేత విజయకాంత్. తదుపరి ఎన్నికలతో ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. సీఎం కావాలని కలలు కంటూ వస్తున్న ఈ నేతకు రానున్న అసెంబ్లీ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ప్రస్తుతం రాజకీయం అంతా ఆయన చుట్టూ పరిభ్రమిస్తోంది. ఓ వైపు ప్రజా కూటమి, మరో వైపు బీజేపీ, మరొక వైపు డీఎంకే విజయకాంత్‌కు తలుపులు తెరిచాయి. తమతో పనిచేయాలని ఆయన్ను తమ వైపు ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి. అయితే, ఎప్పటిలాగే మౌనం వహిస్తున్న విజయకాంత్ మరికొన్ని గంటల్లో తన నిర్ణయాన్ని ప్రకటించి, పొత్తు విషయం తేలుస్తారా? గతంలో వలే మెలిక పెడతారా? అని పొత్తు కోసం ఆరాట పడుతున్న పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. పెరంబలూరు వేదికగా జరిగే పార్టీ సమావేశం మేరకు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఇది వరకే విజయకాంత్ స్పష్టం చేశారు. ఇప్పుడు పార్టీ కార్యకర్త, ద్వితీయ శ్రేణి నాయకులు, అగ్రనాయకులతో చర్చించి నిర్ణయాన్ని వెల్లడించేందుకు విజయకాంత్ సిద్ధమయ్యారు. ఏర్పాట్లు పూర్తి శనివారం పెరంబలూరులో రెండు వేల మంది వరకు ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారని అంచనా. మెజారిటీ శాతం మంది పార్టీ వర్గాలు డీఎంకేతో కలిసి నడుదామన్న సూచన ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రానున్న ఎన్నికల ద్వారా బలాన్ని మరింతగా పెంచుకోవాలంటే, డీఎంకేతో చెలిమి ద్వారానే సాధ్యమన్న నిర్ణయాన్ని ఇప్పటికే పలువురు డీఎండీకే వర్గాలు విజయకాంత్ దృష్టికి తీసుకెళ్లాయని సమాచారం. అయితే, సమావేశంలో డీఎంకేపై తనదైన శైలిలో తిట్ల పురాణం అందుకోకుండా విజయకాంత్ వ్యవహరించిన పక్షంలో ఆ పార్టీ కూటమి వైపుగా తలొగ్టినట్టే. విజయకాంత్ ధోరణిలో మార్పు లేని పక్షంలో ఆశల్ని డీఎంకే వదులుకోవాల్సిందే. ఇక, డీఎంకేతో పాటు ప్రజా కూటమి, బీజేపీలను సైతం గందరగోళ పరిస్థితిలోకి నెట్టే విధంగా తన వేదిక ప్రవేశ మార్గాన్ని విజయకాంత్ ఏర్పాటు చేయించడం గమనార్హం. ఎప్పుడూ ప్రజా సమూహం తన వెంట ఉన్నట్టుగా ఫ్లెక్సీలు, బ్యానర్లు వేయించుకునే విజయకాంత్ ఈసారి సెయింట్ జార్జ్ కోట (సచివాలయం) సెట్ వేసి ఉండటంపై ఆసక్తి రేపింది; చర్చకూ తావిచ్చింది! అలాగే ఓ వైపు తాను, మరో వైపు తన సతీమణి ప్రేమలత ఫొటో ఉండేలా చేయడం కూడా రాజకీయచర్చకు తెరలేపింది. డీఎంకే తన ఊహల్లో లేనిపక్షంలో బీజేపీ తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందా, ప్రజా కూటమి తన నేతృత్వానికి కట్టు బడుతుందా..? అన్న విషయాన్ని తేల్చుకునేందుకు ఈ సరికొత్త సెట్ అంటూ డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
విజయ్‌కాంత్‌పై తమిళనాట నిరసనల హోరు
-
పీఎం పదవైనా ఒకే !
అధికారం ఇచ్చినా సరే సరైన సమయంలో నిర్ణయం కూటమిపై విజయకాంత్ వ్యాఖ్య సాక్షి, చెన్నై : గవర్నర్, సీఎం, ఇంకా చెప్పాలంటే, పీఎం పదవికి తానే అభ్యర్థి అని ఎంపిక చేసినా అందుకు ఒకే. అయితే, కూటమి ఎవరితో అన్నది మాత్రం ఇప్పట్లో చెప్పనని డీఎండీకే అధినేత విజయకాంత్ స్పష్టం చేశారు. మూడు సమావేశాల అనంతరం సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ రాజకీయం సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. తమతో అంటే తమతో దోస్తీ కట్టాలంటూ ఓ వైపు బీజేపీ, మరో వైపు డీఎంకే, ఇంకో వైపు ప్రజా కూటమి ఆహ్వానాలు పలికాయి. ఇక, కాంగ్రెస్ కూడా తమతో కలసి రావాలన్న ఆహ్వానం ఇచ్చింది. ఇక, విజయకాంత్‌తో మంతనాల్లోనూ ఆయా పార్టీల వర్గాలు మునిగి ఉన్నారని చెప్పవచ్చు. అయితే, ఎవరికీ చిక్కకుండా విజయకాంత్ ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. అలాగే, పొత్తు విషయంగా మీడియా వద్ద నోరు జారకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ పొత్తుల ప్రయత్నాలు సాగుతున్న వేళ మీడియా ముందుకు విజయకాంత్ రాలేదని చెప్పవచ్చు. ఈ సమయంలో ఆదివారం ఆయన మీడియా ముందుకు వచ్చి ఏ పదవికి తనను ఎంపిక చేసినా సరే.. తాను మాత్రం ఒకే అంటూ తన దైన శైలిలో స్పందించడంతో పాటుగా, ఎవరితో పొత్తు అన్న విషయాన్ని మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నించినా గప్ చుప్ అంటూ ముందుకు సాగారు. పీఎం అభ్యర్థిత్వానికీ ఒకే : డీఎండీకే తరపున ఆదివారం నగరంలోని అడయార్, తండయార్ పేట, పోరూర్, మధ్యకైలాశ్లలో రక్త దాన, వైద్య శిబిరాలు జరిగాయి. మధ్యకైలాశ్లో శిబిరాన్ని ప్రారంభించినానంతరం మీడియాతో విజయకాంత్ మాట్లాడారు. తనను కూటమిలోకి రావాలని ఆహ్వానిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అయితే, పొత్తు ఎవరితో అన్నది మాత్రం ఇప్పట్లో తేల్చనని స్పష్టం చేశారు. ముందుగా పార్టీ కార్యవర్గ సమావేశం, తదుపరి సర్వసభ్య సమావేశం, చివరగా మహానాడులో కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం ఉంటుందని వివరించారు. పదే పదే గుచ్చిగుచ్చి ప్రశ్నలు సంధించినా, ఒక్కటే చెబుతున్నా, తన కార్యకర్తల్ని సంప్రదించకుండా నిర్ణయం మాత్రం తీసుకోనని స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థిగా ఎంపిక చేస్తే, అని ప్రశ్న సంధించగా, గవర్నర్, సీఎం, పీఎం పదవికి తనను అభ్యర్థిగా ఎంపిక చేసినా ఒకే, అయితే, పొత్తు విషయంలో మాత్రం నోరు జారబోనని వ్యాఖ్యానించారు. అధికారంలో వాటా ఇస్తే అని ప్రశ్నించగా, వాటా ఎందుకు, ఏకంగా అధికారం ఇచ్చినా తీసుకునేందుకు తాను రెడీ అని, అయితే, పొత్తు ఎవరితో అన్నది ఆ మూడు సమావేశాల అనంతరం చెబుతానని సమాధానం ఇచ్చారు. అంత వరకు వేచి ఉంటే, ఉండండి, లేదా ఏదో మీకు తోచించి రాసుకోండటంటూ మీడియాకు ఉచిత సలహా ఇచ్చారు. విమర్శతో చర్చ: జల్లికట్టు విషయంగా ప్రశ్నలు సంధించగా, డీఎంకే, బీజేపీల మీద పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం. పరోక్షంగా తాను ప్రజా కూటమికి విధేయుడిగా ఈ సమాధానం సాగడం విశేషం. కేబినెట్ మంత్రి జవదేకర్ అనుమతి ఇచ్చేస్తున్నారట.. సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ హామీ ఇచ్చారట. దీనికి కట్టుబడి ఆయన దీక్షకు వాయిదా వేశారంటా..! అని విమర్శలు గుప్పించారు. డీఎండీకే ఓటు బ్యాంక్ తగ్గిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, అలాంటప్పుడు తన చుట్టూ ఎందుకు ఇంత చర్చ అని ఓ ప్రశ్నకు సమాధానంగా స్పందించారు. అన్నాడీఎంకేకు సుమారు పార్లమెంట్, రాజ్యసభల్లో 49 లేదా 50 మంది వరకు సభ్యులు ఉండగా, వారి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒరిగింది శూన్యమేనని మండి పడ్డారు. అన్నాడీఎంకే వాళ్లను, ఓపీఎస్‌ను( ఆర్థిక మంత్రి)ని అడగాల్సిన ప్రశ్నల్ని తనను అడుగుతున్నారంటూ సహాయ చర్యల మీద స్పందిస్తూ తీవ్రంగా మండి పడ్డారు. ఇదే ప్రశ్నలు వాళ్లకు సంధించే ధైర్యం ఉందా అంటూ ఏకంగా ఓ మీడియా ప్రతినిధిని ఉద్దేశించి తన దైన శైలిలో స్పందించారు. పోరూర్‌లోని శిబిరంలో రక్తదానం చేసినానంతరం మీడియాతో మాట్లాడిన ప్రేమలత విజయకాంత్ ఇప్పటికే విజయకాంత్ చెప్పారుగా, అదే విధంగా సరైన సమయంలో మంచి నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానించారు. -
సీఎం పగ్గాలా...వాటానా..
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో మూడు కూటముల రాజకీయం ప్రస్తుతం డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ తిరుగుతున్నాయి. తమ వైపునకు అంటే, తమ వైపునకు రావాలంటూ డీఎంకే, ప్రజాకూటమి, బీజేపీలు బహిరంగంగానే పిలుపు నివ్వడంతో తమ అధినేత నిర్ణయం ఎటో...అన్న ఎదురు చూపుల్లో డీఎండీకే వర్గాలు పడ్డాయి. ఇక, రానున్న ఎన్నికలతో సీఎం పగ్గాలు చేపట్టే స్థాయికి తాను ఎదుగుతానా..? లేదా , అధికారాన్ని శాసించే స్థాయికి ఎదుగుతానా..? అన్న మల్లగుల్లాల్లో విజయకాంత్ ఉన్నట్టు సమాచారం. ‘ఒంటరి’నీ అంటూ రాజకీయాల్లోకి వచ్చిన విజయకాంత్ అదే బాటలో కొన్నేళ్లు పయనం సాగించారు. డీఎంకే పతనం లక్ష్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో దోస్తీ కట్టి తొలిసారిగా పొత్తుకు శ్రీకారం చుట్టారు. ఆ ఎన్నికల ద్వారా ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించిన విజయకాంత్ తన కంటూ కనీసంగా పది శాతం వరకు ఓటు బ్యాంక్‌ను దక్కించుకున్నారని చెప్పవచ్చు. లోక్‌సభ ఎన్నికల్ని ఎన్డీఏతో కలసి ఎదుర్కొని డిపాజిట్లు గల్లంతు చేసుకున్నా, తన ఓటు బ్యాంక్ మాత్రం పదిలంగానే ఉంచుకున్నారు. ఇప్పుడు అదే ఓటు బ్యాంక్ ఆయన చుట్టూ ప్రతి పక్షాల రాజకీయం సాగేలా చేసి ఉన్నాయి. బీజేపీ, ప్రజా కూటమి వర్గాలు ఇప్పటికే ఆయనతో మంతనాల్లో మునిగారు. తమతో అంటే తమతో కలిసి నడవాలని, అవసరం అయితే, నేతృత్వం పగ్గాలు లేదా, సీఎం అభ్యర్థితత్వం అప్పగించే విధంగా సంప్రదింపులు సాగి ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి సైతం విజయకాంత్‌కు స్వయంగా ఆహ్వానం పలకడం చర్చకు దారి తీసింది. విజయకాంత్ కరుణానిధి పిలుపుపై ఇంత వరకు స్పందించ లేదని చెప్పవచ్చు. రాష్ట్ర రాజకీయం తన చుట్టూ తిరుగుతుండటంతో ఆచీ తూచీ అడుగులు వేయడానికి కెప్టెన్ సిద్ధమయ్యారు. ఇందుకు తగ్గ ఉపదేశాలను పార్టీ వర్గాలకు ఇచ్చి ఉన్నారు. అదే సమయంలో, బీజేపీ లేదా ప్రజా కూటమితో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొన్న పక్షంలో సీఎం కావాలన్న తన ఆశ నెర వేరుతుందా..? అన్న అంశాన్ని పరిగణించి, అందుకు తగ్గ రహస్య సర్వేకు సిద్ధ పడ్డట్టు సమాచారం. ఇక,డీఎంకే విషయంలో ప్రస్తుతం తాను అనుసరిస్తున్న బాణిని ఇలాగే కొనసాగించేందుకు నిర్ణయించి ఉన్నారు. ఎన్నికల నాటి పరిస్థితుల మేరకు మనస్సు మార్చుకుని డీఎంకేతో అధికారంలో వాటాకు పట్టుబడితే ఎలా ఉంటుందో...? అన్న కోణంలోనూ ఈ కరుప్పు ఎంజీఆర్ ఆలోచనలో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎంకేకు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో వ్యవహరించి, ఇప్పుడు అదే పార్టీతో కలసి నడిచిన పక్షంలో ఎదురయ్యే నష్టాల్ని కూడా పరిగణలోకి తీసుకునే పనిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తల నిర్ణయం మేరకు తన తుది నిర్ణయం ప్రకటించే విధంగా పయనంలో ఉన్న విజయకాంత్, ప్రజా కూటమికి ఎలాంటి హామీ ఇవ్వన్నట్టుగా, బీజేపీతో స్నేహ పూర్వక పలకరింపు మాత్రమే సాగినట్టుగా డీఎండీకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. ఇక, తమ ‘కెప్టెన్’ సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ సారథిగా వ్యవహరించి కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. -
అసెంబ్లీకి కసరత్తు
సమీక్షల్లో మంత్రులు బిజీ 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం సమావేశం కోసం గవర్నర్‌కు విజయకాంత్ వినతి సాక్షి, చెన్నై : మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఆ సమయంలో సీఎంగా పన్నీరు సెల్వం ఉన్నారు. బడ్జెట్ దాఖలుతో సభను వాయిదా వేశారు. అయితే, శాఖల వారీగా నిధుల కేటాయింపులపై చర్చే జరగలేదు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్దోషిగా విడుదలయ్యారు. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వ వ్యవహారాలపై దృష్టి సారించే పనిలో జయలలిత నిమగ్నం అయ్యారు. ఆమె సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం అసెంబ్లీని సమావేశ పరచలేదు. అదే సమయంలో తాజాగా రాష్ట్రంలో ఓ వైపు టాస్మాక్ మద్యానికి వ్యతిరేకంగా నిరసనలు బయలుదేరి ఉండడం, ఎన్ఎల్సీ కార్మికులు సమ్మెబాట పట్టి ఉండడం, సమాచార కమిషనర్లు నియామకం వివాదానికి దారి తీసి ఉండడం తదితర పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి. ఈ సమయంలో అసెంబ్లీని తక్షణం సమావేశ పరచాలన్న డిమాండ్‌ను ప్రతి పక్షాలు తెర మీదకు తెచ్చాయి. బడ్జెట్ కేటాయింపులపై చర్చలు సాగని దృష్ట్యా, సభను సమావేశ పరిచి అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. సమీక్షల్లో మంత్రుల బిజీ: గత వారం మౌళి వాక్కం భవనం కుప్పకూలిన కేసు విచారణకు రాగా, అసెంబ్లీలో నివేదిక దాఖలు చేయడం జరుగుతుందని, ఈనెలలోనే అసెంబ్లీ సమావేశం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో శాఖల వారీగా మంత్రులు సమీక్ష సమావేశాల్లో బిజీ అయ్యారు. గత రెండు రోజులుగా మంత్రులు తమ తమ చాంబర్లలో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటి వరకు వెచ్చించిన నగదు, చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి పక్షాలు సంధించే ప్రశ్నల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో అసెంబ్లీని ఈనెల 21వ తేదీన సమావేశ పరిచే అవకాశం ఉందని సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. తదుపరి అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలోనన్నది నిర్ణయించి, బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓ వైపు అసెంబ్లీని సమావేశ పరిచే రీతిలో ప్రభుత్వం కసరత్తుల్లో మునిగి ఉంటే, మరోవైపు తక్షణం అసెంబ్లీని సమావేశ పరిచేందుకు తమరైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ప్రతి పక్ష నేత విజయకాంత్ విన్నవించి ఉన్నారు. గవర్నర్‌ను కలుసుకుని వినతి పత్రం సమర్పించి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించారు. 2 విక్రమ్, సూర్య, కార్తీలతో మల్టీస్టారర్ చిత్రం విక్రమ్, సూర్య, కార్తీ నటించే భారీ మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. ఇది ఒక హాలీవుడ్ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. వివరాల్లోకెళితే హాలీవుడ్లో వారియర్స్ పేరుతో తెరకెక్కి వసూళ్ల వర్షం కురిపించిన చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్లో పునర్నిర్మిస్తున్నారు. అక్షయకుమార్, సిద్ధార్ధ్ మల్హోత్రా, జాకీష్రాఫ్ ప్రదాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళంలో విక్రమ్, సూర్య, కార్తీలను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇక తెలుగులో ప్రభాస్,రామ్‌చరణ్, రాణాలను నటింప జేయడానికి చర్చలు సాగుతున్నట్లు సమాచారం.అత్యంత భారీ బడ్జెట్లో రూపిందనున్న ఈ చిత్రానికి శంకర్ లాంటి స్టార్ దర్శకుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది.ఇద్దరు సహోదరులు ఒక బాక్సింగ్ శిక్షకుడి ఇతివృత్తంతో రూపొందనున్న ఈ క్రేజీ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంచెం రోజులు ఆగాల్సిందే. -
ఏం చేద్దాం!
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేకు బీజేపీ దగ్గర కావడంతో తదుపరి తమ కార్యచరణ మీద డీఎండీకే అధినేత విజయకాంత్ దృష్టి కేంద్రీకరించారు. పొత్తుల కసరత్తుల్లో భాగంగా ఆదివారం పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి పార్టీ వర్గాలతో సమాలోచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పయనించిన డీఎండీకే నేత విజయకాంత్‌కు అదృష్టం కలసి వచ్చి ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించిన విషయం తెలిసిందే. తదుపరి పరిణామాలతో ఆ పార్టీతో పెంచుకున్న వైర్యం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వైపుగా అడుగులు వేయించింది. ఆ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతుతో భంగ పడ్డ విజయకాంత్ బీజేపీకి విధేయుడిగానే ఉంటూ వచ్చారని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ కూటమిలో లేనన్నట్టుగా వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, బీజేపీ కూటమికి సీఎం అభ్యర్థిగా తానే ఉంటానన్న భావనలో ఉంటూ వచ్చిన విజయకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన ఆలోచనలో పడేసింది. అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఇంటికి నరేంద్ర మోదీ వెళ్లడం విజయకాంత్‌కు పెద్ద షాక్కే. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య పొత్తు ఖరారైనట్టుగా సంకేతాలు రావడంతో తదుపరి తన కార్యచరణ మీద దృష్టి పెట్టే పనిలో విజయకాంత్ పడ్డారు. ఇందుకోసం అత్యవసరంగా ఆదివారం పార్టీ కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చారు. సమాలోచన : కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో ఉదయం పది గంటల కు విజయకాంత్ నేతృత్వంలో సమావేశం ఆరంభం అయింది. ఇందులో బీ జేపీతో ఇక కలిసి పనిచేయడం కష్టమేన న్న విషయాన్ని గ్రహించి ,ప్రత్యామ్నా య పొత్తుల అన్వేషణపై పార్టీ వర్గాల అభిప్రాయాల్ని విజయకాంత్ సేకరించి నట్టు సమాచారం. ప్రధానంగా ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకేలతో కలసి తన నేతృత్వంలో కూటమిని ఏర్పాటు చేయడం లేదా, డీఎంకే కూటమిలోకి వెళ్లడమా..? అన్న అంశంపై చర్చ సాగి నట్టు తెలిసింది. మెజారిటీ శాతం మం ది గతంలో వలే దూకుడు నిర్ణయాలు వ ద్దు అని, ఆలోచించి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళదామంటూ విజయకాంత్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ సమావేశంలో ముందుగా భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మౌనం పాటించారు. తీర్మానాలు : ఈ సమావేశంలో పొత్తుల కసరత్తు చర్చకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినా, చివరకు కొన్ని తీర్మానాలు చేసి మీడియాకు ప్రకటించారు. అలాగే, త మ అధినేత విజయకాంత్ బర్త్‌డే వేడుక లు నెల రోజుల పాటుగా సాగనున్న నేపథ్యంలో ప్రజా హిత కార్యక్రమాలకు సిద్ధం అయ్యారు. ఇక, మద్యం ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నిర్ణయిం చారు. ఆగస్టు 15లోపు రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధంపై తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మానవ హారంలో పాల్గొన్న తమ పార్టీ వర్గాలపై పోలీసుల లాఠీ చార్జ్‌ను తీవ్రంగా ఖం డించారు. నాగపట్నం, తంజావూరు, తిరువారూర్‌లో మిథైన్ తవ్వకాలకు శాశ్వత నిషేధం విధించాలని, గ్రానైట్, రాళ్ల క్వారీలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే, భారత రత్న అబ్దుల్ కలాం అంత్యక్రియలకు సీఎం జయలలిత గైర్హాజరుపై తీవ్రంగా మండి పడుతూ ప్రత్యేక తీర్మానం చేశారు. -
మెట్రోలో నేతలు
డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్ వేర్వేరుగా మెట్రో రైలులో బుధవారం పయనించారు. ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ రైలు సేవల్ని తిరువొత్తియూరు, తిరువేర్కాడు వరకు విస్తరించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు డీఎంకే తీసుకొచ్చిందన్న ఒకే కారణంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపారంటూ సీఎం జయలలిత తీరుపై విజయకాంత్ మండిపడ్డారు. సాక్షి, చెన్నై:నగరంలో మెట్రో రైలు సేవలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కోయంబేడు - ఆలందూరు మధ్య పరుగులు తీస్తున్న మెట్రో రైలులో పయనించేందుకు నగర వాసులు ఎగబడుతున్నారు. రైలు చార్జీ ఎక్కువగా ఉన్నప్పటికీ, తొలి అనుభూతిని ఆశ్వాదించే రీతిలో మెట్రో పయనానికి పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్ వేర్వేరుగా మెట్రో రైలు ఎక్కారు. ప్రయాణికులతో ముచ్చటిస్తూ తమ పయనం సాగించారు. స్టాలిన్ పయనం : సరిగ్గా 9.30 గంటలకు కోయంబేడులోని రైల్వే స్టేషన్‌కు డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ చేరుకున్నారు. ఆయన రాకతో ఆ పరిసరాల్లోని డీఎంకే వర్గాలు తరలివచ్చి ఆహ్వానం పలికాయి. స్టాలిన్‌తో కలిసి నేతలు ఎం సుబ్రమణియన్,రాజేంద్రన్, ధన శేఖరన్ మెట్ల మార్గం గుండా వెళ్లి 9.45 గంటలకు మెట్రో రైలు ఎక్కారు. తమ బోగీలోకి స్టాలిన్ రావడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఆయనతో కరచాలనంకు ఎగబడ్డారు. కాసేపు నిలబడి పయనించిన స్టాలిన్, మరికాసేపు సీట్లో కూర్చున్నారు. ప్రయాణికులతో ముచ్చటిస్తూ, రైలు సేవలు, అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. సరిగ్గా పది నిమిషాల్లో 9.55కు రైలు ఆలందూరు స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ డీఎంకే వర్గాలు స్టాలిన్‌కు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, ఈ మెట్రో రైలు ప్రాజెక్టు తమ ఘనతేనని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ ఇతర పథకాల వలే ఈ ప్రాజెక్టును తుంగలో తొక్కేస్తారోనని భావించామని, అయితే, తాము ముందుగా తీసుకున్న చర్యలు, నిధుల కేటాయింపులతో ప్రాజెక్టును అడ్డుకోలేని పరిస్థితి ఈ పాలకులకు ఏర్పడిందని మండి పడ్డారు. అయితే, చార్జీ అధికంగా ఉందని, దీనిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టును తిరువొత్తియూరు, తిరువేర్కాడు వరకు పొడిగించాలని, రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ మెట్రో సేవలు దరి చేర్చాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో నిర్లవణీకరణ, మెట్రో ప్రాజెక్టు, రహదారులు, భారీ వంతెనలు తదితర అనేకానేక పథకాలు తీసుకొచ్చి దిగ్విజయవంతంగా అమలు చేశామని, అయితే, నాలుగున్నరేళ్ల అన్నాడీఎంకే హయాంలో ఇంత వరకు కొత్తగా ఏ ఒక్క పథకం పూర్తికాక పోవడం శోచనీయమని విమర్శించారు. ఇక, ఫేస్‌బుక్‌లతో తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని , దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈసందర్భంగా హెచ్చరించారు. డీఎంకే పథకం కాబట్టే : మెట్రో రైలు ప్రాజెక్టు డీఎంకే తీసుకొచ్చింది కాబట్టే సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపేశారంటూ సీఎం జయలలిత తీరుపై డీడీకే అధినేత విజయకాంత్ మండి పడ్డారు. స్టాలిన్ పయనం ముగియగానే, సరిగ్గా 11 గంటలకు తన పార్టీ యువజన నేత సుదీష్, ఎమ్మెల్యేలు చంద్రకుమార్, పార్థసారథి, కామరాజ్‌లతో కలసి ఆలందూరు స్టేషన్‌కు విజయకాంత్ చేరుకున్నారు. ఎస్కలే టర్ ద్వారా పై అంతస్తుకు చేరుకున్న విజయకాంత్ రైలు కోసం పది నిమిషాలు వేచి ఉండాల్సి వచ్చింది. విజయకాంత్ రాకతో ఆయన్ను చూడటానికి ప్రయాణీకులు ఎగబడ్డారు. అక్కడి సీట్లలో ప్రయాణికులతో కలసి కూర్చున్న విజయకాంత్ వారితో ముచ్చటిస్తూ, స్టేషన్లలోని ఏర్పాట్లు, పయన సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రైలు రాగా, ఓ వృద్ధురాలితో కలసి లోనికి వెళ్లిన విజయకాంత్ అక్కడ కూర్చుని ప్రయాణికులతో ముచ్చటిస్తూ, ఫోన్లో మాట్లాడుతూ ముందుకు సాగారు. కోయంబేడుకు చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు జెండా ఊపి ఉంటే బాగుండేదన్నారు. ఆయన వస్తే, ఎక్కడ తమ ఘనత చెప్పుకోలేని పరిస్థితి వస్తుందోనని భావించే సచివాలయం నుంచి అత్యవసరంగా జెండా ఊపేశారని విమర్శించారు. డిఎంకే ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి పథకం ఇది అని, ఈ ఘనత వారిదేనంటూ, మంచి చేశారు కాబట్టే అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్లో మధ్యాహ్నం వరకు యాభై శాతం ఓట్లే పోలైందని, ఆతర్వాత పోలైన ఓట్లన్నీ దొంగ ఓట్లేనని, దొంగ ఓట్లు, ఎన్నికల యంత్రాంగం సహాకారంతో మెజారిటీ తెచ్చుకున్నారంటూ ఆరోపించారు. -
ఆ పార్టీలే లక్ష్యం
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు మూడు పార్టీలను తన వైపునకు తిప్పుకోవాలన్న లక్ష్యం తో డీఎంకే అధినేత ఎం కరుణానిధి వ్యూహరచనల్లో పడ్డారు. వారికి గాలం వేయడం కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, డీఎండీకే నేత విజయకాంత్ మెట్టు దిగేనా..? అన్న ప్రశ్నను డీఎంకే వర్గాలే లేవదీస్తుండడం గమనార్హం. సాక్షి, చెన్నై : వరుస పరాజయాలతో ఢీలా పడ్డ డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఎట్టకేలకు బలోపేతం లక్ష్యంగా పార్టీని జిల్లాల వారిగా పునర్విభజించక తప్పలేదు. జిల్లాల వారిగా పదవుల్లో కొత్త వాళ్లకు చోటు కల్పించారు. రానున్న ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ఉన్న కరుణానిధికి, తాజా పరిణామాలు పెద్ద షాకే అని చెప్పవచ్చు. నిర్దోషిగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత బయట పడడం, సీఎంగా పగ్గాలు చేపట్టడంతో తదుపరి కార్యచరణ మీద కరుణానిధి దృష్టి పెట్టి ఉన్నారు. జయలలిత హవాకు కల్లెం వేయడం లక్ష్యంగా ప్రతి పక్షాల్ని ఏకం చేసిన మెగా కూటమికి వ్యూహ రచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో తాజాగా తమ కుటుంబ వేడుకకు అన్ని పార్టీలను ఆహ్వానించే పనిలో పడ్డారు. అయితే, వీరిలో అందరూ కలసి వచ్చే అవకాశాలు లేని దృష్ట్యా, ప్రధానంగా మూడు పార్టీల మీద కన్నేసి ఉన్నారు. ఆ మూడు పార్టీలే కీలకం రాష్ట్రంలో ప్రధాన ప్రతి పక్షంగా ఉన్న డీఎండీకేకు వ్యక్తిగత ఓటు బ్యాంక్ బాగానే ఉన్నది. ఇక, కాంగ్రెస్‌కు కాస్తో కూస్తో ఓటు బ్యాంక్ ఉంది. అలాగే, వైగో నేతృత్వంలోని ఎండీఎంకేకు దక్షిణ తమిళనాడులో కొంత మేరకు బలం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే తమ వెంట పుదియ తమిళగం, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్‌లు ఉండడంతో, మిగిలిన ఆ మూడు పార్టీలను తమ వైపునకు తిప్పుకోవాలన్న లక్ష్యంతో వ్యూహ రచనల్లో నిమగ్నం అయ్యారు. తమ కుటుంబ వేడుకకు హాజరయ్యే ఆ మూడు పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలిగేందుకు సిద్ధం అవుతున్నారు. ఇందుకు తగ్గ కార్యచరణ సిద్ధం చేసి ఉన్నట్టుగా డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. వాసన్ నేతృత్వంలోని టీఎంసీ తమతో చేతులు కలిపే అవకాశాలు లేని దృష్ట్యా, రాందాసు నేతృత్వంలోని పీఎంకేను నమ్మలేని పరిస్థితి ఉన్నందున,ఆ ఇద్దర్ని పక్కన పెట్టేందుకు డీఎంకే సిద్ధం అయినట్టు సంకేతాలు ఉన్నాయి. ఇక, వామపక్షాల దారి ఎటో అన్నట్టుగా ఉండడంతో, కలిసి వస్తే వారిని అక్కున చేర్చుకునేందుకు సైతం వ్యూహ రచన చేసి ఉండడం గమనించాల్సిన విషయం. డీఎంకేతో కలిసి నడిచేందుకు ఎండిఎంకే సిద్ధంగానే ఉన్నట్టుగా ప్రచారం సాగుతున్నది. ఆ పార్టీ నుంచి డిఎంకే గూటికి చేరి అధికార ప్రతినిధిగా చెలామణిలో ఉన్న కేఎస్ రాధాకృష్ణన్ అందుకు తగ్గ ప్రయత్నాల్లో నిమగ్నమైనట్టు సమాచారం. కేఎస్ రాధాకృష్ణన్ ద్వారా డీఎంకే అధిష్టానం నుంచి కొన్ని హామీలను తీసుకున్న తర్వాతే వైగో తన స్పష్టతను వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, డీఎంకేతో కలసి నడిచేందుకు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సిద్ధంగా ఉన్నా, తమ అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూడక తప్పలేదు. ఇక, చిక్కంతా డీఎంకే అధినేత విజయకాంత్ రూపంలో డీఎంకేకు ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే సమయంలో ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పార్టీలకు వల వేయడం లక్ష్యంగా, ఆయా పార్టీ వర్గాలతో వ్యవహరించాల్సిన తీరు, తదితర అంశాలతో పాటుగా ప్రజల్లోకి వెళ్లడం కోసం అస్త్రాలు సిద్ధం చేయడానికి సోమవారం జిల్లాల కార్యదర్శుల సమావేశానికి సైతం కరుణానిధి పిలుపు నిచ్చినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయకాంత్ తగ్గేనా విజయకాంత్‌కు రాష్ట్రంలో బలం ఉన్నా, తన నోటి దురుసు తనం, దూకుడుతో కమెడియన్‌గా మారుతున్నారు. ప్రస్తుతానికి బీజేపీ జపం చేస్తున్న విజయకాంత్‌కు ఎన్నికల సమయంలో షాక్‌లు తగిలే అవకాశాలు ఎక్కవే. అన్నాడీఎంకేతో బీజేపీ దోస్తి కట్టిన పక్షంలో ప్రత్యామ్నాయం మీద ఆయన దృష్టి పెట్టక తప్పదు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యేందుకు వెనుకాడని విజయకాంత్, డీఎంకేతో దోస్తి విషయంగా ఏ మేరకు మెట్టు దిగుతారోనన్నది వేచి చూడాల్సి ఉంది. ఆహ్వాన పత్రికను ఇవ్వడానికి విరుగ్గం బాక్కంలోని విజయకాంత్ ఇంటికి వెళ్లేందుకు తొలుత డీఎంకే కోశాధికారి స్టాలిన్ నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఇంటికి రావొద్దని, పార్టీ కార్యాలయానికి రావాలని ఆయన సూచించి ఉన్నారు. స్టాలిన్ వచ్చి వెళ్లగానే, తన కార్యాలయాన్ని కూల్చి వేసిన వాళ్లను, అదే చోట మెట్లు ఎక్కేలా చేశానంటూ తన వాళ్లతో విజయకాంత్ వ్యంగ్యంగా మాట్లాడినట్టు సంకేతాలు వెలువడడం గమనార్హం.