జనంలోకి కెప్టెన్
Published Sun, Aug 25 2013 5:37 AM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM
సాక్షి, చెన్నై:తన జన్మదినాన్ని పేదరిక నిర్మూలన దినోత్సవంగా విజయకాంత్ జరుపుకుంటున్నారు. ఆయన ఆదివారం 61వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పేదలకు శనివారం సాయం అందించారు. కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వంద మంది వికలాంగులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లు పంపిణీ చేశారు. ఎంజీఆర్ బదిర పాఠశాలకు రూ.50 వేలు అం దజేశారు. అనంతరం కెప్టెన్ మీడియూతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. రాష్ట్రం లో ప్రజా సమస్యల్ని పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు.
ప్రధాన ప్రతిపక్ష నేతగా తానేదైనా సమస్యను తెరపైకి తెస్తే దానిగురించి పట్టించుకోకుండా కేసుల మోత మోగిస్తున్నారని విమర్శించారు. సమస్యల్ని, లోపాల్ని ఎత్తి చూపించే అధికారం ప్రతిపక్షానికి ఉందని స్పష్టం చేశారు. అయితే ఇక్కడ గళాన్నే నొక్కేస్తున్నారని విమర్శించారు. యూపీఏ సర్కారు తీరు ప్రజల్ని కష్టాలపాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వంతో ఢీ: రాష్ట్రంలోని ప్రజల సమస్యల్ని అధ్యయనం చేసి ప్రభుత్వాన్ని ఢీకొట్టనున్నట్లు విజయకాంత్ ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలోనూ తాను పర్యటిస్తానన్నారు. ప్రజలు తెలిపే సమస్యల ఆధారంగా సమరభేరి మోగించనున్నట్లు వెల్లడించారు.
దివంగత నేతలు అన్నా, ఎంజీఆర్ పేర్లతో ప్రజల్ని మోసం చేయడం వేదన కలిగిస్తోందన్నారు. వారి పేర్లను వాడుకుంటూ పంబం గడుపుకుంటున్న కొన్ని పార్టీలకు చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. డీఎండీకే ఆధ్వర్యంలో భారీ మహానాడుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా కార్యకర్తల అభీష్టం తెలుసుకోనున్నట్లు చెప్పారు. వారి కోరిక, నిర్ణయం మేరకు లోక్‌సభ ఎన్నికల్ని తాను ఎదుర్కొంటానన్నారు. తనలాగే అందరు నేతలూ పుట్టినరోజు వేడుకలను పేదలకు ఉపయోగపడే రీతిలో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎండీకే ప్రిసీడియం ైచె ర్మన్ బన్రూటి రామచంద్రన్, యువజన నేత సుదీష్, విజయకాంత్ సతీమణి ప్రేమలత, పార్టీ కోశాధికారి ఇళంగోవన్, ఎమ్మెల్యేలు పార్థసారథి, చంద్రకుమార్, నల్లతంబి, శేఖర్, వెంకటేషన్, అనగై మురుగేషన్, శివకులందు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement