విశాఖపట్నం: జీవీఎంసీ భీమిలి జోన్ ఒకటో వార్డు చిట్టివలస రెడ్డి వీధికి చెందిన ఆర్మీ ఉద్యోగి కొల్లి పూర్ణ రామచంద్రారెడ్డి(33) జమ్ములో శుక్రవారం ఉదయం విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. జమ్ములోని సిగ్నల్ విభాగంలో విధులు నిర్వర్తిస్తుండగా ఉదయం 10.30 సమయంలో తెగిపడిన విద్యుత్ వైర్లను గుర్తించకపోవడంతో అవి తగిలి మృత్యువాత పడినట్టు అతని బంధువులు తెలిపారు.
ఆ సమయంలో విపరీతమైన మంచు కురుస్తుందని వివరించారు. రామచంద్రారెడ్డికి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పాత చెరకుపల్లికి చెందిన భవానీలక్ష్మితో 2020 ఫిబ్రవరిలో వివాహమైంది. వీరికి రేష్మ అనే 11 నెలల కుమార్తె ఉంది. కుమార్తె మొదటి పుట్టినరోజు ఘనంగా నిర్వహించేందుకు ఈ నెల 28న వస్తున్నట్టు ఇటీవల కుటుంబ సభ్యులకు సమాచారం కూడా అందించాడు.
మృతుని తల్లిదండ్రులు వెంకటరమణ, మంగమ్మలకు ఇద్దరు సంతానంలో పూర్ణ రామచంద్రారెడ్డితో పాటు వివాహమైన మరో కుమార్తె ఉంది. ఈ నెల 19న మృతుని పుట్టినరోజు. కాగా పూర్ణ భౌతిక కాయం శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో జమ్ము నుంచి విశాఖ రానుంది. ఆదివారం చిట్టివలస గోస్తనీనది తీరంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment