ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుల దుర్మరణం
మృతులిద్దరూ మేనమామ, మేనల్లుడు
ఉక్కునగరం: పెళ్లయిన నెల రోజులకే ఒక యువకుడికి నిండు నూరేళ్లు నిండి పోయాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన ఘటన.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. మృతులిద్దరూ మేనమామ, మేనల్లుడు కావడం గమనార్హం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ దరి ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన డబ్బీరు పవన్‌కుమార్(31) పరవాడ ఫార్మాసిటీలో పనిచేస్తూ కూర్మన్నపాలెం దరి శాతావాహన నగర్‌లో నివాసముంటున్నాడు. అతని మేనల్లుడు కొండవలస రూపేష్‌కుమార్(21) హైదరాబాద్‌లో సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
బుధవారం రాత్రి 7.50 గంటల సమయంలో ఇద్దరూ కలిసి బైక్‌పై స్టీల్‌ప్లాంట్ ప్రధాన మార్గంలో కణితి జంక్షన్ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో కూర్మన్నపాలెం నుంచి కణితి జంక్షన్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు బైక్‌ను సుమారు 30 మీటర్లు ఈడ్చుకుపోయింది. ఇద్దరిపై ఆర్టీసీ బస్సు టైర్లు ఎక్కడంతో.. వీరు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పవన్ కుమార్ బంధువులు అక్కడకు చేరుకుని రోదించిన తీరు అందరినీ కలచివేసింది. పవన్‌కుమార్‌కు గత నెల 26న వివాహమైంది.
మరికొన్ని రోజుల్లో భార్యను తీసుకువచ్చేందుకు చూస్తున్న ఈ సమయంలో ఇలా జరిగిందంటూ అతని అక్క కన్నీటి పర్యంతమైంది. రూపేష్‌కుమార్ ఇక్కడకు ఎందుకు వచ్చాడో తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న స్టీల్‌ప్లాంట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సు డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు లొంగిపోయాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం వారి మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment