విశాఖపట్నం: ఎండాడలో సగం కాలిన ఓ క్యాబ్ డ్రైవర్ మృతదేహం కలకలం రేపింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఎండాడలోని సెయింట్ లుక్స్ కళాశాలకు సమీపంలో సగం కాలిన మృతదేహాన్ని ఆదివారం వాకర్లు గుర్తించి.. ఆరిలోవ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఆ మృతదేహం ఎంవీపీకాలనీలో నివాసం ఉంటున్న మోసగంటి సుబ్రహ్మణ్యం(42)దిగా గుర్తించారు. ఆయన క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు.
సుబ్రహ్మణ్యంకు 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరి సొంతూరు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం జగ్గన్నపేట. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగాదాల కారణంగా మూడేళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యం ఒంటరిగానే ఎంవీపీలో నివాసం ఉంటూ.. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా.. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జీవితంపై విరక్తి చెందుతున్నట్లు, బాధతో కొన్ని కొటేషన్లను తన వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకున్నాడు. తెల్లవారేసరికి విగతజీవిగా మారాడని అతని సోదరుడు ప్రకాష్ విలపించారు.
అనుమానాలెన్నో..
గతంలో సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో చేతులు కోసుకున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఒంటరిగా బతకలేక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేసి కాల్చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం చనిపోయిన స్థలంలో రెండు మద్యం బాటిల్స్, అతని కాలిపై గాయాలున్నాయి. సంఘటన స్థలంలోనే కారు ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ రాంబాబు, ఆరిలోవ సీఐ గోవిందరావు సుబ్రహ్మణ్యం మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని.. ఇప్పటికే క్లూస్ టీమ్ వివరాలు సేకరించిందన్నారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment