రూ.3 కోట్లకు ముంచేశారు
టూ టౌన్ ఎస్‌ఐగా అవతారమెత్తిన సస్పెండైన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్
రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసం
ఒక్కొక్కరి నుంచి రూ.12 నుంచి రూ.15 లక్షల వసూలు
ముగ్గుర్ని పెళ్లాడిన ఘనుడు
ఆమెకూ పోలీస్ డ్రెస్ వేసి యువతకు వల
డమ్మీ పిస్టల్‌తో బెదిరించి పరారైన నిందితులు
మిస్సింగ్ కేసు దర్యాప్తులో అసలు వ్యవహారం బట్టబయలు.?
పోలీసుల అదుపులో రమేష్, ప్రవీణ
విశాఖ సిటీ: ఒక మిస్సింగ్ కేసు.. పెద్ద మిస్టరీని బట్టబయలు చేసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను రూ.3 కోట్లకు ముంచేసిన ఘరానా నకిలీ పోలీసు వ్యవహారమిది. ఎస్‌ఐగా అవతారమెత్తి.. తన చేతిలో మోసపోయిన యువతినే బుట్టలో వేసుకొని.. ఆమెతో కలిసి అనేక మందిని దోచుకున్న సస్పెన్షన్‌కు గురైన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ హనుమంతు రమేష్ (47) వ్యవహారం ఇపుడు నగరంలో సంచలనం రేకెత్తిస్తోంది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.12 నుంచి రూ.15 లక్షలు వసూలు చేసిన దగ్గర నుంచి.. నకిలీ రైల్వే వెబ్‌సైట్ తయారీ.. హాల్ టికెట్ల జారీ.. విజయవాడలో ఒక హోటల్‌లో ఉత్తుత్తి ప్రవేశ పరీక్ష నిర్వహణ.. హైదరాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో ఇంటర్వ్యూల పేరుతో హడావుడి.. నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ.. ఇలా అనేక మంది నిరుద్యోగులను నిలువు దోపిడీ చేసిన ఆ రహస్య దంపతుల తెలివితేటలకు పోలీసులు సైతం విస్తుపోయారు. వివరాల్లోకి వెళితే..
విధుల్లో నిర్లక్ష్యంతో సస్పెన్షన్
శ్రీకాకుళం జిల్లా మొళియాపుట్టు ప్రాంతానికి చెందిన హనుమంతు రమేష్ వీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. 2022 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్‌కు బదిలీ అయినప్పటికీ అతడు విధుల్లో చేరలేదు. దీంతో దీర్ఘకాలం సెలవు తీసుకోవడంతో సీఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం రమేష్ పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో అడవివరం ప్రాంతంలో ఆర్‌ఆర్ టవర్స్‌లో నివాసముంటున్నాడు.
ఎస్‌ఐగా అవతారమెత్తి..
సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా సస్పెన్షన్‌కు గురైన రమేష్ విశాఖ టూటౌన్ ఎస్‌ఐగా అవతారమెత్తాడు. తన నివాస ప్రాంతంలోనే కాకుండా పెందుర్తిలో కొన్ని సామాజిక వర్గాల పెద్దలను పరిచయం చేసుకున్నాడు. రైల్వే శాఖలో కొంత మంది ఉన్నతాధికారులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని అందరికీ చెప్పుకొచ్చాడు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో అనేక మంది నిరుద్యోగులు రమేష్ మాటలు విశ్వసించి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు సమర్పించుకున్నారు.
యువతులకు వల..
రమేష్ యువతులకు వల వేయడంలో సిద్ధహస్తుడు. ముందు ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె అక్కపై కన్నేసి ఆమెను కూడా పెళ్లాడాడు. ఆ ఇద్దరితోనే ఆగిపోలేదు. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని విశాలాక్షినగర్ ప్రాంతానికి చెందిన ప్రవీణ అనే యువతి నుంచి కూడా రమేష్ రూ.15 లక్షల వరకు డబ్బు తీసుకొని మోసం చేశాడు. ఉద్యోగం రాకపోయే సరికి ప్రవీణ తండ్రి రమేష్‌ను గట్టిగా నిలదీశాడు. దీంతో అతడు తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేశాడు. అయితే ప్రవీణను మాత్రం సింహాచలంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. రమేష్‌తో కలిసి ప్రవీణ కూడా పోలీస్ అని చెప్పుకుంటూ నిరుద్యోగులకు వల వేసింది.
డమ్మీ పిస్టల్‌తో బెదిరించి
రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో అభ్యర్థులు రమేష్‌ను నిలదీయడం ప్రారంభించారు. ఒకసారి అత డి ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగారు. తమకు డబ్బులు ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించా రు. దీంతో రమేష్ తన వద్ద ఉన్న డమ్మీ మెటల్ పిస్టల్‌ను చూపించి వారిని బెదిరించాడు. అనంతరం విశాఖ నుంచి ప్రవీణతో కలిసి పరారయ్యాడు.
మిస్సింగ్ ఫిర్యాదుతో వెలుగులోకి?
తన భర్త కనిపించడం లేదని రమేష్ భార్య ఈ ఏడాది జనవరి 24వ తేదీన పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ దర్యాప్తులో అనేక విస్తుపోయే వాస్తవాలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. వారికి అందిన సమాచారం ప్రకారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రమేష్, ప్రవీణలపై నెల రోజుల పాటు నిఘా పెట్టారు. సాంకేతికత సహాయంతో వారు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో కొంత మంది బాధితులు పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదులు ఆధారంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు హైదరాబాద్‌కు వెవెళ్లి రమేష్, ప్రవీణలను అదుపులోకి తీసుకున్నారు.
రహస్యంగా విచారణ..
నిరుద్యోగులను నిలువునా ముంచిన ఇద్దరినీ పోలీస్ ఉన్నతాధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉండడంతో వివరాలు వెల్లడించడం లేదు. అయితే ఇప్పటికే కీలకమైన ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. త్వరలోనే వీరిని అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నాయి.
నకిలీ వెబ్‌సైట్.. ఉత్తుత్తి పరీక్ష
నిరుద్యోగులను నుంచి రూ.కోట్లు కాజేసేందుకు రమేష్, ప్రవీణ అడుగడుగునా మోసాలకు తెరతీశారు. అభ్యర్థులను నమ్మించేందుకు వీరు ఏకంగా నకిలీ రైల్వే వెబ్‌సైట్‌ను రూపొందించారు. దాని ద్వారా అభ్యర్థులకు మెయిల్స్ ద్వారా ఉద్యోగ సమాచారాన్ని పంపించే వారు. నకిలీ హాల్ టికెట్లు జారీ చేశారు. విజయవాడలో ఒక హోటల్‌లో ఉత్తుత్తి పరీక్ష సైతం నిర్వహించారు. అంతటితో ఆగకుండా కొద్ది రోజులకు ఇంటర్వ్యూ ఉందని హైదరాబాద్‌లో డీఆర్‌ఎం కార్యాలయానికి రావాలని మెసేజ్‌లు పంపించారు. అభ్యర్థులు అక్కడికి వెళ్లగా రమేష్ వారిని రిసీవ్ చేసుకున్నాడు.
ఉన్నతాధికారులతో మాట్లాడి వస్తానని చెప్పి కొంత సేపు కార్యాలయంలో తిరిగి వచ్చాడు. ప్రస్తుతం అధికారులు బిజీగా ఉన్నారని మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పి అభ్యర్థులను అక్కడి నుంచి పంపించేశాడు. వీరికి ఉద్యోగాలు వచ్చేశాయని నకిలీ నియామక పత్రాలు చూపిస్తూ మరికొంత మంది నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment