అల్లిపురం: మహిళల అక్రమ రవాణా, ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, ముగ్గురు బాధిత మహిళలను కాపాడారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు. పలువురు ఆకర్షణీయంగా వెబ్‌సైట్‌లను డిజైన్ చేసి.. పలు వెబ్‌సైట్ల నుంచి మహిళల వివరాలు, కాంటాక్ట్ నంబర్లు సేకరిస్తారు. వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి నగరంలోని లాడ్జీలు, హోటళ్లలో ఉంచుతారు. ఏజెంట్ల నుంచి వచ్చిన సమాచారంతో కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకుని మహిళలు ఉన్న చోటికి వారిని పంపిస్తారు.
ఇలా గుట్టుగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ విధంగానే వెబ్ డిజైనర్ రావాడ కామరాజు అలియాస్ దీపక్ www.findbestclass.com ను రూపొందించాడు. వ్యభిచారం కోసం మహిళలను రవాణా చేసే లోకాన్‌టో వెబ్‌సైట్ నుంచి ఏజెంట్ల పేర్లు, ఫోన్ నంబర్లను భద్రపరచుకుని.. వాటిని తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు. వెబ్‌సైట్‌ను సంప్రదించిన కస్టమర్లకు ఏజెంట్ల వివరాలు, మహిళల ఫొటోలు పంపిస్తున్నాడు. తద్వారా కస్టమర్లకు, ఏజెంట్లకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఇందుకోసం డబ్బులు తీసుకుని.. ఏజెంట్లతోపాటు బాధితులకు కమిషన్ అందిస్తున్నాడు. కాగా.. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసుల సహకారంతో దర్యాప్తు ప్రారంభించారు. లాసన్స్‌బే కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న రావాడ కామరాజు, బాడి రాము, మాటూరి రమేష్, మంగేష్ రమేష్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు.
రావాడ కామరాజు తాను మహిళల అక్రమ రవాణా కోసం ఉపయోగించే 34 మంది ఏజెంట్ల పేర్లను వెల్లడించాడు. భూపేష్‌నగర్‌లోని లాడ్జీలో ఉంచిన ముగ్గురు బాధిత మహిళల వివరాలతో పాటు ఒక మహిళా ఏజెంట్, మగ ఏజెంట్ పేర్లను తెలియజేశాడు. అతను ఇచ్చిన సమాచారంతో బాధిత మహిళలను విడిపించి.. ఇద్దరు ఏజెంట్లు సూర్యవంశీ, అలీష సుభద్రలను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
మహిళలను మభ్యపెట్టి వ్యభిచారం నిర్వహించడం, మహిళల అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని సీపీ హెచ్చరించారు. ప్రజలు వెబ్‌సైట్‌లు, ఇతర మాధ్యమాల ద్వారా మహిళలతో అక్రమ వ్యాపారం చేసినా, నిర్వహించినా చట్టప్రకారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామన్నారు. హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సీపీ బాగ్చి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment