రీ సర్వేకు ముందే రైతులకు సమాచారం
అధికారులకు కలెక్టర్ ఆదేశం
తగరపువలస: రీ సర్వే చేపట్టే గ్రామాల్లో రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, నిబంధనల మేరకు సంబంధిత నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. భీమిలి మండలం దాకమర్రిలో శుక్రవారం ఆయన పర్యటించారు. భూముల రీ సర్వే ప్రక్రియను అధికారులతో పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను గమనించారు. రైతులతో మాట్లాడి, రీ సర్వేపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భూముల పరిరక్షణ, సరిహద్దుల గుర్తింపు, దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చేపడుతున్న ఈ ప్రక్రియకు రైతులు సహకరించాలన్నారు. రైతులు దగ్గరుండి సర్వే చేయించుకోవాలని సూచించారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. అనంతరం దాకమర్రి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. రికార్డులను తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వస్తున్న వినతులు పరిశీలించారు. పంచాయతీలో పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట భీమిలి తహసీల్దార్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment