నలభై ఏళ్ల కళావైభవం.. కూచిపూడి కళాక్షేత్రం
కళాభారతిలో ఘనంగా వార్షికోత్సవం
మద్దిలపాలెం: ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల సీనియర్ నాట్య కళాకారులు వారి నాట్య విన్యాసాలతో కళా ప్రియుల హృదయాలను సమ్మోహనపరిచారు. కూచిపూడి కళాక్షేత్రం 40వ వార్షికోత్సవం శుక్రవారం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర కల్చరల్ కమిషన్ చైర్‌పర్సన్ తేజస్విని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీనియర్, జూనియర్ కళాకారులు వారి నాట్య సోయ గాలతో అందరి హృదయాలను రంజింపచేశారు. ఈ సందర్భంగా నటరాజ్ మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకుడు బత్తిన విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ పద్మభూషణ్ డాక్టర్ వెంకటేశ్వర సత్యం 40 ఏళ్ల కిందట విశాఖలో స్థాపించిన కూచిపూడి కళాక్షేత్రం ఎందరో కళాకారులను తయారు చేసిందన్నారు. కళాక్షేత్రంలో 1985 నుంచి 2025 వరకు నేర్చుకున్న పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు కలిపి 100 మంది నృత్య ప్రదర్శనలు ఇవ్వడం అద్భుతమైన ఘట్టమన్నారు. కళాక్షేత్ర గురువు హరి రామమూర్తి దర్శకత్వంలో తారకాసుర సంహారం అను నృత్య రూప కం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ శ్యాం ప్రసాద్, కళాభారతి అధ్యక్షుడు ఎంఎస్‌ఎన్ రాజు, లెండి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ మధుసూదన రావు, కూచిపూడి కళాక్షేత్ర అధ్యక్షుడు డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ మిత్ర, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ శ్రీనివాస్, శైలజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment