భూ కుంభకోణ నివేదికను బయటపెట్టండి
● బురదజల్లడం కాదు.. ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. ● గ్రూప్–2 అభ్యర్థులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ● కూటమి ప్రభుత్వం తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీపై స్పష్టతే లేదు ● మీడియాతో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భూ కుంభకోణాలకు సంబంధించి జరిపిన విచారణ నివేదికను బహిర్గతం చేయాలని ఏపీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఊరికే బురదజల్లడం కాదు.. ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. ఇదే వేదికపై నుంచి అనేక సార్లు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు. ఈ ప్రభుత్వానికి నచ్చినట్లే 2004 లేదా 2014 ఏ సంవత్సరం నుంచి అయినా విచారణ జరిపిన నివేదికను బయటపెట్టాలన్నారు. శుక్రవారం లాసన్స్‌బేకాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. గుంటూరు మిర్చి యార్డ్‌లో గిట్టుబాటు ధర లేక, దళారీ విధానంతో ఇబ్బందుల పడుతున్న రైతులను పరామర్శించడానికి మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెళితే చట్ట వ్యతిరేక కార్యక్రమంటూ కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్ జగన్‌కు రక్షణ కల్పించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండగానే చంద్రబాబు విజయవాడలో మ్యూజికల్ నైట్‌లో పాల్గొన్నారని, కోడ్ ఉన్నప్పుడే యూనివర్సిటీలకు వీసీ నియామకాలు చేపట్టారని గుర్తు చేశారు. ఢిల్లీలో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లిన చంద్రబాబు, మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో మాట్లాడేందుకు వెళ్లినట్లు అబద్దాలు చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి లేరన్న విషయం ముందుగానే తెలియదా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయం, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని.. చంద్రబాబు ఎప్పుడూ వ్యవసాయం, రైతుల గురించి ఆలోచించిన దాఖలాల్లేవన్నారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమా..?
గ్రూప్–2 మెయిన్స్ రోస్టర్ పాయింట్ సమస్యలపై ఉన్న అభ్యంతరాలను సహేతుకంగా పరిష్కరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన డీఎస్సీ పరిస్థితే వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే.. కూటమి పార్టీలు ఇచ్చిన హామీల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమవుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment