హర్షిత (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: పుట్టిన రోజే ఓ విద్యార్థిని మృత్యు ఒడికి చేరుకుంది... ఏమైందో ఏమో కానీ జన్మదినం రోజే బలవన్మరణం పొంది కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. అప్పటి వరకు తోటి విద్యార్థినులతో ఆనందంగా గడిపిన ఆ యువతి పుట్టిన రోజే తిరిగిరాని లోకాలకు వెళ్లటం అందరినీ కలిచివేసింది. సీఏ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
ఎస్సై నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి చామపాడు గ్రామానికి చెందిన కేసాని కిరణ్‌కుమార్ బాలాజీనగర్‌లో నివాసముంటూ ఓ ప్లాస్టిక్ కంపెనీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు హర్షిత (20) అలియాస్ హనీ. ఆన్‌లైన్‌లో సీఏ, బీకాం చదువుతోంది. సాయికిరణ్ బంధువులు చనిపోవటంతో సాయికిరణ్, భార్య నర్మదాలు బుధవారం సాయంత్రం నెల్లూరుకు వెళ్లారు. తిరిగి శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు.
గడియ కొట్టడంతో ఎంతకీ తలుపు తీయకపోవటంతో అనుమానం వచ్చి ఇంటి యజమాని మూర్తి సహాయంతో గడియ పగలగొట్టి బెడ్‌రూంలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే చున్నీ కట్ చేసి కూతురుని కిందకు దించాడు. తనకు ఒక్కగానొక్క కూతురు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించటంతో ఆ తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు. అంతకు ముందు రోజు గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో తండ్రికి ఫోన్ చేసి వస్తున్నారా? అని అడిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి సినిమా చూడడానికి కూడా వెళ్లినట్లు తలిదండ్రులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు తెలుసుకొని క్లూస్ టీమ్ ఆధారంగా వివరాలు సేకరించారు. తన కూతురు చదువులో ఒత్తిడికి లోనయ్యేదని.. ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తండ్రి సాయికిరణ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment