మనస్తాపంతో గృహిణి అత్మహత్య
జీడిమెట్ల: డబ్బులు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడం , ఈ విషయమై ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్ల టీఎస్‌ఎస్‌ఐసీ కాలనీలో నివాసం ఉంటున్న చందు భార్య లావణ్య(35) స్థానికంగా టైలరింగ్ షాప్ నిర్వహిస్తోంది.
కొద్ది నెలల క్రితం ఆమెకు శివరాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. లావణ్యతో స్నేహంగా ఉండే శివరాం తన వ్యాపార నిమిత్తం రూ.5లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమె తన నగలు తాకట్టు పెట్టి రూ.5 లక్షలు ఇచ్చింది. నెలలు గడుస్తున్నా శివరాం డబ్బులు చెల్లించకపోవడంతో ఆమె ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో చందు శుక్రవారం శివరాంను ఇంటికి పిలిచి డబ్బుల విషయమై నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
దీంతో లావణ్య శివరాంకు ఫోన్‌చేసి నువ్వు డబ్బులు ఇవ్వనందునే తమ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని నీ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన శివరాం, చందు ఇంటికి వెళ్లి చూడగా లావణ్య చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఇద్దరూ కలిసి ఆమెను కిందికి దింపి సమీపంలోని అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment