
2020లో ఖైరతాబాద్ వైశ్య భవన్‌లో దుర్ఘటన
న్యాయవాదిని కలవడానికి వచ్చి బలవన్మరణం
అప్పట్లో ఘటనాస్థలి నుంచి సూసైడ్ నోట్ స్వా«దీనం
సాక్షి, హైదరాబాద్ : ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమృత తండ్రి మారుతిరావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. 2020 మార్చి 7న ఖైరతాబాద్‌లో ఉన్న వైశ్య భవన్‌లో బస చేసిన ఆయన మరుసటి రోజు విగతజీవిగా కనిపించారు. న్యాయవాదిని కలవడానికి వచ్చి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అప్పట్లో మారుతిరావు బస చేసిన గది నుంచి పోలీసులు సూసైడ్ నోట్ సైతం స్వా«దీనం చేసుకున్నారు. మారుతిరావు తన వాహనంలో డ్రైవర్ బెల్లంకొండ రాజేష్ తో కలిసి నగరానికి వచ్చారు. 2020 మార్చి 7 సాయంత్రం 6:40 గంటలకు ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో ఉన్న ఆర్య వైశ్య భవన్ రూమ్ నెం.306లో బస చేశారు. న్యాయవాది వస్తారంటూ డ్రైవర్‌తో చెప్పిన మారుతిరావు అతడిని కారులోనే ఉండమన్నారు.
ఆ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో బయటకు వచ్చిన మారుతిరావు డ్రైవర్‌ను పిలిచి ఎదురుగా ఉన్న మిర్చీ బండీ నుంచి గారెలు, కారులో కొన్ని కాగితాలు తెప్పించుకున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో తన గదిలో ఏసీని బాగు చేయించుకున్న మారుతిరావు.. లోపల నుంచి తలుపులు వేసుకుని పడుకున్నారు. మరుసటి రోజు (2020 మార్చి 8) ఉదయం మిర్యాలగూడలో ఉన్న ఆయన భార్య గిరిజ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో డ్రైవర్ రాజేష్‌కు ఫోన్ చేయగా..అతడు పైకి వెళ్లి ప్రయత్నించిన అతడు చివరకు వైశ్య భవన్ నిర్వాహకుల ద్వారా సైఫాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు గదిలోకి ప్రవేశించగా...మంచంపై విగతజీవిగా పడి ఉన్న మారుతిరావు కనిపించారు. ఆ గదిలో ఓ సూసైడ్‌నోట్ పోలీసులకు లభించింది. అందులో ‘గిరిజా క్షమించు...అమ్మా అమృత అమ్మ దగ్గరకు రా అమ్మా’ అని మాత్రమే ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అప్ప ట్లో వైశ్య భవన్ వద్దకు వచ్చిన మారుతిరావు సోదరుడు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ... వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయా లని, ఊహా కల్పనతో వార్తలు రాయవద్దని దురుసుగా మాట్లాడారు. తాజాగా ప్రణయ్ కేసులో శ్రవణ్‌కు జీవితఖైదు పడటం గమనార్హం.