భార్య, కుమారుడిని చంపి తానూ ఆత్మహత్య
బేగంబజార్ తోపుఖానాలో దారుణం
మృతులు ముగ్గురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు..
గన్‌పౌడ్రీ: ఇల్లాలిపై అనుమానంతో ఉన్మాదిగా మారాడు ఓ భర్త. కట్టుకున్న భార్యను, కన్న కొడుకును చంపేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన బేగంబజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎండీ సిరాజ్ (38), ఏలియా (35) దంపతులు. వీరికి నాలుగు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఆజాన్, హైజాన్ ఉన్నారు. ఈ కుటుంబం కొన్నేళ్ల క్రితం ఉపాధిని వెతుక్కుంటూ నగరానికి వలస వచి్చంది. బేగంబజార్‌లోని తోపుఖాన్‌పేటలో అద్దె ఇంటిలో ఉంటోంది. సిరాజ్ సమీపంలోని ఓ గాజుల దుకాణంలో పని చేస్తున్నాడు. అతడు తన భార్య ప్రవర్తనపై కొన్నాళ్లుగా అనుమానం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి దంపతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవ శుక్రవారం తెల్లవారుజాము సుమారు 4 గంటల దాకా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే కోపోద్రిక్తుడైన సిరాజ్ ఇంట్లోని కత్తితో భార్య ఏలియా గొంతు కోసి చంపేశాడు. అనంతరం చిన్న కుమారుడు హైజాన్ (3) గొంతు నులిమి హత్య చేశాడు. తమ్ముడిని తండ్రి చంపుతున్న దృశ్యాన్ని చూసిన పెద్ద కుమారుడు ఆజాన్ ప్రాణ భయంతో అరుస్తూ బయటకు పారిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి ఇంటి లోపలికి వెళ్లి చూడగా సిరాజ్ అప్పటికే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే వారు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. బేగంబజార్ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మృతుడి బంధువులకు సమాచారం అందించారు. తన భార్య ఏలియా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో సిరాజ్ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రతి రెండేళ్లకోసారి వీరు స్వగ్రామానికి వెళ్లి వస్తుంటారని, ఇటీవలే అక్కడికి వెళ్లి వచి్చనట్లు చెప్పారు. ఘటనా స్థలంలో సిరాజ్ రాసిన సూసైడ్ నోట్ లభించిందని, మృతదేహాలను ఉత్తరప్రదేశ్‌లోని తమ గ్రామానికి తరలించాలని సిరాజ్ అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment