women died
-
బెంగళూరులో విషాదం.. మహిళ ప్రాణాలు తీసిన నటుడు!
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. కన్నడ నటుడు నాగభూషణ కారు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందారు. ఫుట్‌పాత్‌పై నడుస్తున్న జంటపైకి నాగభూషణ నడుపుతున్న కారు దూసుకెళ్లింది. శనివారం వసంతనగర్ ప్రధాన రహదారి సమీపంలో ఈ సంఘటన జరిగింది. నటుడి కారు మొదట విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి.. ఆ తర్వాత దంపతులపై దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల కౌసల్య సుప్రజా రామ చిత్రంలో కనిపించిన కన్నడ నటుడు నాగభూషణ కర్ణాటకలోని బెంగళూరులో ఫుట్‌పాత్‌పై నడుస్తున్న జంటపైకి తన కారును ఢీకొట్టాడు. ఈ సంఘటన శనివారం రాత్రి 9:45 గంటలకు వసంతనగర్ ప్రధాన రహదారి సమీపంలో నటుడి కారు మొదట విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, ఆపై నడుచుకుంటూ వెళ్తున్న జంటను ఢీకొట్టింది. నటుడు ఉత్తరాహాల్ నుండి కోననకుంటె వైపు వెళ్తున్నట్లు ఇండియా టీవీ రిపోర్టర్ ధృవీకరించారు. అయితే నాగభూషణం స్వయంగా తానే గాయపడిన దంపతులను ఆస్పత్రికి తరలించాడు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ 48 ఏళ్ల మహిళ మృతి చెందగా.. ఆమె భర్త ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. కాగా..ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు నటుడిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. నాగభూషణం కౌసల్య సుప్రజా రామ చిత్రంలో చివరిసారిగా కనిపించాడు. ఇక్కత్ అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఆయన.. ఈ చిత్రంలో నటనకు ఉత్తమ డెబ్యూ నటుడిగా అవార్డు లభించింది. బడవ రాస్కెల్ అనే మూవీకి ఉత్తమ సహాయ నటుడిగా కూడా ఎంపికయ్యాడు. తెలుగు, తమిళంలో సమంత, ఆది పినిశెట్టి నటించిన యూ టర్న్ చిత్రంలో ఆటో డ్రైవర్‌గా నటించారు. -
ఏమైందో ఏమో..! పుట్టిన రోజే యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: పుట్టిన రోజే ఓ విద్యార్థిని మృత్యు ఒడికి చేరుకుంది... ఏమైందో ఏమో కానీ జన్మదినం రోజే బలవన్మరణం పొంది కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. అప్పటి వరకు తోటి విద్యార్థినులతో ఆనందంగా గడిపిన ఆ యువతి పుట్టిన రోజే తిరిగిరాని లోకాలకు వెళ్లటం అందరినీ కలిచివేసింది. సీఏ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి చామపాడు గ్రామానికి చెందిన కేసాని కిరణ్‌కుమార్ బాలాజీనగర్‌లో నివాసముంటూ ఓ ప్లాస్టిక్ కంపెనీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు హర్షిత (20) అలియాస్ హనీ. ఆన్లైన్లో సీఏ, బీకాం చదువుతోంది. సాయికిరణ్ బంధువులు చనిపోవటంతో సాయికిరణ్, భార్య నర్మదాలు బుధవారం సాయంత్రం నెల్లూరుకు వెళ్లారు. తిరిగి శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. గడియ కొట్టడంతో ఎంతకీ తలుపు తీయకపోవటంతో అనుమానం వచ్చి ఇంటి యజమాని మూర్తి సహాయంతో గడియ పగలగొట్టి బెడ్రూంలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే చున్నీ కట్ చేసి కూతురుని కిందకు దించాడు. తనకు ఒక్కగానొక్క కూతురు ఉరివేసుకొని విగతజీవిగా కనిపించటంతో ఆ తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు. అంతకు ముందు రోజు గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో తండ్రికి ఫోన్ చేసి వస్తున్నారా? అని అడిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి సినిమా చూడడానికి కూడా వెళ్లినట్లు తలిదండ్రులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలు తెలుసుకొని క్లూస్ టీమ్ ఆధారంగా వివరాలు సేకరించారు. తన కూతురు చదువులో ఒత్తిడికి లోనయ్యేదని.. ఆ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తండ్రి సాయికిరణ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో విషాదం.. ఇద్దరు బాలింతలు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు బాలింతలు మృతి చెందడం కలకలం రేపుతోంది. బాధిత బంధువుల ఆందోళనతో అస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లా చెదురుపల్లి గ్రామానికి చెందిన సిరివెన్నెల రెండో కాన్పు కోసం మలక్‌పేట ఏరియా ఆసుపత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించకుండానే ఆపరేషన్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె డెంగ్యూ జ్వరం ఉన్నది గుర్తించకుండా డెలీవరీ చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని తెలిపారు. వెంటనే బాలింతను గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్లేట్లేట్స్ తగ్గిపోవడంతో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ముందస్తు వైద్య పరీక్షలు చేయకుండా ఆమె మరణించినట్లు గాంధీ వైద్యులు తెలిపారు. ఇదే క్రమంలో మరో బాలింత శివాని సైతం డెలివరీ అనంతరం అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యానికి ఇద్దరు బాలింతలు బలయ్యారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మలక్‌పేట ఆసుపత్రి ఎదుట, చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మృతికి కారణమైన డాక్టర్లను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకుకదిలే ప్రస్తకే లేదని వెల్లడించారు. వైద్యాధికారులు ఏమన్నారంటే.. మలక్‌పేట ఆసుపత్రిలో బాలింతల మృతిపై వైద్యుల నిర్లక్ష్యం లేదని వైద్యాధికారి సునీత వెల్లడించారు. సిరివెన్నెలకు డెంగ్యూ ఫీవర్ లేదని తెలిపారు. డెంగ్యూ ఉంటే తాము డెలివరీ చేయమని పేర్కొన్నారు. అన్ని పరీక్షలు చేశాకే డెలివరీ చేశమన్నారు. డెలివరీ తర్వాత సిరివెన్నెలకు హార్ట్‌రేట్ పెరిగిందని, హార్ట్ ప్రాబ్లమ్ రావడంతో గాంధీకి తరలించామన్నారు. శివానికి హైపోథైరాయిడ్ సమస్య ఉందన్నారు. చదవండి: పండుగ ప్రయాణం.. నరకయాతన -
విదేశాల నుంచి వచ్చిన కుమార్తె.. దైవదర్శనానికి వెళ్లివస్తూ..
సాక్షి, ఇల్లెందు(ఖమ్మం): విదేశాల్లో విద్యనభ్యపిస్తున్న కుమార్తె ఇటీవల వచ్చింది. ఆమెకు హైదరాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన తల్లిదండ్రులు, సోదరి పది రోజుల పాటు హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో గడిపారు. ఇక వేములవాడలో రాజన్నను దర్శించుకుని స్వస్థలానికి వెళ్లాక కుమార్తె పెళ్లి సంబంధాలు చూడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆనందంగా మాట్లాడుకుంటూ కారులో బయలుదేరిన వారి ప్రయాణంలో విషాదం చోటు చేసుకుంది. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మిగతావారు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట హైవేపై ప్రమాదం ఇల్లెందుకులోని సుభాష్‌నగర్‌కు చెందిన ఆర్ఎంపీ రమేష్ కుమార్తె విదేశాల్లో చదువుకుంటోంది. ఇటీవల ఆమె హైదరాబాద్ రాగా, తన భార్య చిప్ప స్వరూపరాణి(42), చిన్న కుమార్తె శ్రావ్యతో కలిసి హైదరాబాద్‌లో స్వాగతం పలికాడు. అక్కడే పది రోజుల పాటు బంధువుల ఇంట్లో ఉంటూ పర్యాటక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం వేములవాడలో రాజరాజేశ్వరుడి దర్శనానికి గురువారం ఉదయం బయలుదేరగా, సిద్ధిపేట హైవే రోడ్డు మీద కొండిపాక మండలం తిమ్మారెడ్డిపల్లి వద్ద వీరు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో స్వరూపరాణి అక్కడిక్కడే మృతి చెందింది. కారులో ఉన్న రమేష్, ఆయన ఇద్దరు కుమార్తెలు, సమీప బంధువు గాయాలతో బయటపడ్డారు. కాగా, ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఇల్లెందులో విషాదం అలుముకుంది. గత 25ఏళ్లుగా ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్న రమేష్, మెడికల్ షాపు నిర్వాహకురాలిగా స్వరూపరాణికి స్థానికంగా మంచి పేరు ఉంది. ఈ మేరకు ఆమె మృతి విషయం తెలియగానే కెమిస్ట్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు పసుమర్తి లక్ష్మణ్‌రావు తదితరులు సంతాపం తెలిపారు. చదవండి: మంత్రాలతో నీ కొడుకు ఆరోగ్యం నయం చేస్తానంటూ.. -
విందుకు వెళ్తుండగా మహిళ ప్రాణం తీసిన స్కార్ఫ్
యానాం: ఆనందంగా ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బైక్‌పై వెళుతున్న ఆ కుటుంబాన్ని స్కార్ఫ్ రూపంలో ప్రమాదం వెంటాడింది. ఆ మహిళ ధరించిన స్కార్ఫ్ బైక్ వెనుక చక్రంలో చిక్కుకు పోవడంతో ఆమె కింద పడటంతో తలకు తీవ్రగాయాలై మృతిచెందింది. గురువారం కాట్రేనికోన మండలం పల్లంకు చెందిన దంపతులు పాలెపు లక్ష్మణ్, పాలెపు దుర్గ (25) యానాం శివారు సావిత్రినగర్‌లో బంధువుల ఇంటిలో ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు బైక్‌పై తమ మూడేళ్ల కుమారైతో వెళ్తున్నారు. మార్గమధ్యలో దొమ్మేటిపేట ఇసుక కాలువ వద్దకు వచ్చేసరికి దుర్గ ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ బైక్ వెనుక చక్రంలో చిక్కుకుపోయింది. దీంతో బైక్ అదుపుతప్పి ఆమె రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరిన ఆమెను స్థానికులు యానాం జీజీహెచ్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్సపొందుతూ దుర్గ మృతిచెందింది. భర్త లక్ష్మణ్‌కు, కుమారైకు స్వల్ప గాయాలయ్యాయి. యానాం ట్రాఫిక్ ఎస్సై కట్టా సుబ్బరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జీడిమెట్లలో ఘోరం: అగ్నిప్రమాదంలో మహిళ సజీవ దహనం
జీడిమెట్ల: ల్యాబ్‌కు సంబంధించిన ఫర్నిచర్ తయారుచేసే ఓ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా, మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. జీడిమెట్లకు చెందిన సురేశ్‌కుమార్ అనే వ్యక్తి జీడిమెట్ల ఫేజ్ -5లో ఆర్ట్ ఫ్యాబ్రికేషన్స్ పేరిట ఇండస్ట్రీ, క్లినికల్ ల్యాబ్ ఎక్విప్మెంట్ తయారు చేసే పరిశ్రమను నడుపుతున్నాడు. శనివారం పరిశ్రమలో పనిచేసే 60 మంది కార్మికులు పనిచేస్తుండగా, మధ్యాహ్నం 12 గంటల సమయంలో రెండో అంతస్తులోని ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అక్కడున్న వారంతా పరుగులు తీశారు. ల్యాబ్‌లో అపురూ పకాలనీకి చెందిన యశోద (40), లక్ష్మి (28), కృష్ణవేణి (57) క్లీనింగ్ పనులు చేస్తున్నారు. యశోద మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మి, కృష్ణవేణి గాయపడగా వారిని చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జీడిమెట్ల పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని 2 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. పరిశ్రమకు అనుమతుల్లేవు.. ఫ్యాబ్రికేషన్స్ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి అనుమతుల్లేవని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమలో మంటలను నియంత్రించేం దుకు ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా లేవని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన మహిళ కుటుంబానికి నష్టప రిహారం ఇప్పించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆక్సిజన్ అందక.. ఊపిరి ఆగింది!
సాక్షి, చిలకలగూడ: ఆక్సిజన్ అందక మహిళ మృతి చెందింది. ఆరు ఆస్పత్రులు తిరిగినా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్‌లోనే తుది శ్వాస విడిచింది. ఈ ఘటన సికింద్రాబాద్ సీతాఫల్మండిలో జరిగింది. సీతాఫల్మండి బ్రాహ్మణబస్తీకి చెందిన శేషాచార్యులు, పుష్పవల్లి దంపతులకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. మూడో కుమార్తె అనితకుమారి (48) భర్త వేణుగోపాల్‌తో కలసి బెంగళూర్‌లో నివసిస్తున్నారు. అనితకుమారి స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించగా నెగెటివ్ వచ్చింది. ఈనెల 21న కారులో బెంగళూర్ నుంచి తల్లి గారింటికి వచ్చింది. 22 సాయంత్రం శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి బయల్దేరారు. కమల ఆస్పత్రి, యశోద, ఓమ్ని, గ్లోబల్, నక్షత్ర ఆస్పత్రులకు వెళ్లగా, ఆక్సిజన్ కొరత ఉందని, పడకలు ఖాళీ లేవని అడ్మిట్ చేసుకోలేదు. ఎల్బీనగర్ సమీపంలోని ఓజోన్ ఆస్పత్రిలో ఆక్సిజన్, బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే అనితకుమారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. వారం రోజుల క్రితమే సోదరి మృతి... అనితకుమారి సోదరి కల్యాణి (51) వారం రోజుల కింద ఇలాగే మృతి చెందడం గమనార్హం. మియాపూర్‌లో నివసిస్తున్న కల్యాణి ఈనెల 16న స్వల్ప అస్వస్థతకు గురైంది. కరోనా టెస్ట్‌లో నెగెటివ్ వచ్చింది. సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. పలు ఆస్పత్రులకు తిరిగినా బెడ్లు ఖాళీ లేవని చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకువెళ్లారు. అదే రోజు రాత్రి కల్యాణి మృతి చెందింది. వారం రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో బ్రాహ్మణబస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరి ఇద్దరి మృతికి ప్రభుత్వ వైఫల్యాలే కారణమని మృతుల సోదరులు విజయసారథి, వేణుగోపాల్ ఆరోపించారు. -
విషాదం: కోతుల భయంతో గుండె ఆగింది
సాక్షి, ధర్మపురి: కోతులు దాడి చేస్తాయేమోనన్న భయంతో ఓ మహిళ గుండె ఆగి మరణించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బట్టపల్లి మోహన్ ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం కుటుంబంతో ధర్మారానికి వచ్చాడు. ఇక్కడే ఉంటూ వడ్రంగి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మోహన్ కూతురు రేవతి (34)కి వివాహం అయినప్పటికీ ధర్మారంలో తండ్రి వద్దనే ఉంటోంది. ఉదయం ఇంటి నుంచి రేవతి బయటకు వస్తున్న సమయంలో గుంపుగా వచి్చన కోతులు పెద్దగా అరుస్తూ ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వాటిని చూసిన రేవతి భయంతో అక్కడే కుప్పకూలింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. గుండెపోటుతోనే మరణించిందని వైద్యులు తెలిపారు. కాగా, రేవతికి ముగ్గురు పిల్లలున్నారు. చదవండి: కొత్త ట్విస్ట్: యువతికి షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్ -
దారుణం: ఇంటికి నిప్పు.. అత్యాచార బాధితురాలు మృతి
జైపూర్: రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆత్యాచార బాధిత మహిళ ఇంటిని గుర్తుతెలియని వ్యక్తులు కిరోసిన్‌తో తగలబెట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఆమె తీవ్రంగా కాలిపోయింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమన్‌గర్ జిల్లాలోని గోలువాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ ఇంటికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి బయట నుంచి ఆమెను పేరుతో పిలిచారు. దీంతో ఆమె ఇంటి తలపు తీయగా కిరోసిన్ పోసి వెంటనే నిప్పుపెట్టి పారిపోయారు. ఇంటిలో ఒక్కసారిగా తీవ్రంగా మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకున్న ఆ మహిళ శరీరం సగం కంటే ఎక్కువగా కాలిపోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆమె శనివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మహిళ అమ్మమ్మ తన మనమరాలిపై ఆత్యాచారం చేసిన నిందితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి మృతిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతి చెందిన అత్యాచార బాధిత మహిళ కుటుంబ సభ్యులకు రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రూ.5 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించినట్ల సీఎం కార్యాలయం ప్రకటించింది. చదవండి: సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ దర్శకుడు -
దారుణం: భార్య ఆత్మను వెళ్లగొట్టాలని కూతురునే..
చెన్నై: మూఢ నమ్మకాల పేరుతో ఓ తండ్రి కన్న కూతురునే పొట్టన బెట్టుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామనాథపురానికి చెందిన వీరసెల్వం విపరీతంగా మూఢ నమ్మకాలు, తాంత్రీక పూజలను నమ్ముతాడు. ఆయన కూతురు తరుణి(19) గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే తరుణి ఇటీవల తన తల్లి సమాధి ఉన్న ప్రాంతం వద్దకు వెళ్లి వచ్చింది. దీంతో తన భార్య ఆత్మ తరుణి శరీరంలోకి ప్రవేశించిందని అందువల్లనే ఆమె అనారోగ్యానికి గురైనట్లు వీరసెల్వం భావించాడు. ఏదీఏమైనా ఆమె శరీరం నుంచి తన భార్య ఆత్మను బయటకు పంపించాలని తాంత్రికపూజలు చేయడం మొదలుపెట్టాడు. భార్య ఆత్మను కూతురు శరీరం నుంచి వెళ్లగొట్టాలని ఆమె మెడ, నడుముపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే తరుణి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆమె మృతి చెందడాని తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం కారణమని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: అందమైన అమ్మాయిలను చూపిస్తూ మసాజ్ -
వివాహేతర సంబంధం; ఇద్దరు ఆత్మహత్య..
సాక్షి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలోని దేవునూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గామ్రంలోని పెద్దజాలుగుంట వద్ద ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. జిల్లాలోని ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలోనీ పెద్దజాలుగుంట వద్ద ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. మృతి చెందిన వారు బాకాటి సుమన్(35), ముల్కనూరు చెందిన సుంచు మాధవి(35)గా పోలీసులు గుర్తించారు. అయితే వీరి ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమన్, మాధవికి వరసకు అల్లుడు అవుతాడని తెలుస్తోంది. -
పాఠశాలలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. మహిళ మృతి
సాక్షి, మధిర : డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో ట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాలలోకి దూసుకుపోయింది. వంట చేస్తున్న మధ్యాహ్న భోజన వర్కర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. పాఠశాల హెచ్ఎం ఆదినారాయణ కథనం ప్రకారం... మండల పరిధిలోని రామచంద్రాపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తరగతులు పూర్తయిన అనంతరం మధ్యాహ్న భోజనం చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో పంతంగి నర్సింహారావు అనే ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండి ట్రాక్టర్ నడిపాడు. ఆ ట్రాక్టర్ అదుపుతప్పి పాఠశాలలోకి దూసుకువచ్చి అక్కడే వంటచేస్తున్న వంట మనిషి జాన్‌పాటి లక్షి్మ(65)ని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పాఠశాలకు ప్రహరీ లేకపోవడం, నర్సింహారావు మద్యం మత్తులో అతివేగంగా ట్రాక్టర్ నడపడంతో అదుపుతప్పి పాఠశాల ఆవరణలోకి దూసుకుపోయింది. ఈ ఆవరణలో ఉన్న జాతీయ జెండా దిమ్మెసైతం ధ్వంసమైంది. ఈ దిమ్మెను ఢీకొట్టి తరగతిగదిలోకి దూసుకుపోవడంతో తలుపులు, తరగతి గోడసైతం కుప్పకూలిపోయాయి. హఠాత్పరిణామంతో.. అతిసమీపంలో ఉన్న విద్యార్థులందరూ భయంతో పరుగులు తీశారు. తరగతి గదిలోనే విద్యార్థులు ఉన్నట్లయితే ఈ సంఘటనలో ఎంత ప్రాణనష్టం జరిగి ఉండేదోనని ఆ సంఘటన తీరును చూసిన గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేశారు. మృతురాలి భర్త గతంలోనే చనిపోయాడు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లక్ష్మి సుమారు 15 సంవత్సరాలుగా ఇదే పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట తయారు చేస్తోంది. రోజూ నాణ్యమైన భోజనాన్ని తయారుచేయడం, విద్యార్థులతో కలిసిపోవడం, గ్రామస్తులతో కలివిడిగా ఉండే లక్ష్మి మృతిని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. వైరా ఏసీపీ సత్యనారాయణ, మండల విద్యాశాఖాధికారి వై.ప్రభాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ లవణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నబిడ్డను చూడకుండానే..
సాక్షి, హైదరాబాద్: నవమాసాలు మోసి, బిడ్డను కని.. అమ్మతనాన్ని ఆనందించకుండానే ఆ తల్లి కన్నుమూసింది. మరోపక్క పుట్టిన బిడ్డ కనీసం ముర్రుపాలకూ నోచుకోలేదు. తల్లి స్పర్శకు నోచుకోక ఆస్పత్రి ఎన్ఐసీయూలో ప్రస్తుతం ఆ శిశువు క్షేమంగా ఉన్నా.. తల్లిని కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. కరీంనగర్‌కు చెందిన గర్భిణి షహనాజ్ (24) తీవ్ర జ్వరం, జలుబు, తలనొప్పితో బాధపడుతుండటంతో వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. స్వైన్‌ఫ్లూగా అనుమానించిన వైద్యులు.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఆమెను బంధువులు వెంటిలేటర్ సాయంతో ఈ నెల 18న రాత్రి పొద్దుపోయాక గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. అప్పటికే ఆమెకు నెలలు నిండటం, పరిస్థితి విషమంగా ఉండటంతో 19వ తేదీన సిజేరియన్ చేశారు. ఆడశిశువు జన్మించింది. శిశువుకు పరీక్షలు నిర్వహించగా, ఫ్లూ నెగటివ్ రావడంతో బిడ్డను ఇదే ఆస్పత్రి పీడియాట్రిక్ విభాగంలోని ఎన్ఐసీయూకు తరలించారు. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉండటంతో తల్లిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఫ్లూ బారి నుంచి కాపాడేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినా.. పరిస్థితి విషమించి షహనాజ్ సోమవారం కన్నుమూసింది. బిడ్డను కళ్లారా చూడకుండానే మృతి చెందడం, తల్లిపాల కోసం బిడ్డ గుక్కపట్టి ఏడవటం కలచివేసింది. విజృంభిస్తోన్న వైరస్ చలికాలంలో విజృంభించే హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూకారక వైరస్.. ప్రస్తుతం సీజన్‌తో సంబంధం లేకుండా విస్తరిస్తోంది. జనవరి నుంచి రాష్ట్రంలో 148 కేసులు నమోదు కాగా, వీరిలో హైదరాబాద్ జిల్లావాసులే యాభై మందికిపైగా ఉన్నారు. బాధితుల్లో ఇప్పటికే ఒకరు మృతిచెందగా, తాజాగా బాలింత మృతితో మృతుల సంఖ్య రెండుకు చేరింది. గాలి ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ప్రస్తుతం గాంధీలో మౌలాలికి చెందిన బాలిక (11)తో పాటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మరో నలుగురు ఫ్లూ పాజిటివ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్తే మందు.. – డాక్టర్ శ్రీధర్, స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్, ఉస్మానియా ఆస్పత్రి – సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపించగానే స్వైన్‌ఫ్లూగా అనుమానించాల్సిన పనిలేదు. – రోగ నిరోధకశక్తి తక్కువుండే మధుమేహులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారు ఫ్లూ బారినపడే అవకాశాలు ఎక్కువ. – స్వైన్‌ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు మూడు రోజుల కంటే ఎక్కువ వేధిస్తే వైద్యులను సంప్రదించాలి. – వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు ఇది నేర్పించాలి. – స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న వారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. -
కట్నం తేకుంటే చచ్చిపో..
సాక్షి, దండేపల్లి(మంచిర్యాల): అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందింది. దీంతో 11 నెలల చిన్నారి అనాథగా మారింది. ఎస్సై విజయ్‌కుమార్, మృతురాలి కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. దండేపల్లి మండలం పెద్దపేటకు చెందిన ఆముదాల ప్రసూణ(మహాతి) (21)కు వెల్గటూర్ మండలం స్తంభంపెలి్లకి చెందిన తర్ర రాకేష్‌తో 2017లో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.11లక్షల నగదు తోపాటు, రూ.4లక్షల బంగారు ఆభరణాలు, మరో రూ.2లక్షల సామగ్రిని కట్నంగా అందించారు. ఆ తరువాత అదనంగా మరో ఐదు లక్షలు కట్నం తేవాలని భర్త, అత్త, మామ, ఆడబిడ్డ మానసికంగా, శారీరకంగా వేధించారు. ఈ విషయాన్ని తన తండ్రికి ఎప్పటికప్పుడు చెప్పింది. ఒప్పుకున్నకాడికి కట్నం ఇచ్చానని, అదనపు కట్నం ఇవ్వలేదనని బాధితురాలి తండ్రి చెప్పాడు. 2018లో ప్రసూణకు ఆడపాప జన్మించింది. అప్పటినుంచి ఆమెకు వేధింపులు మరింత పెరిగాయి. అదనపు కట్నం తేవాలని, లేకుంటే విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. గదిలో బందించి దాడి చేశారు. విషయం తండ్రికి ఫోన్‌చేసి చెప్పడంతో 15రోజుల క్రితం తండ్రి తన కూతురిని పుట్టింటికి తీసుకువచ్చాడు. అయినా రాకేష్ పదేపదే ఫోన్‌చేసి కట్నం తీసుకురాకుంటే చచ్చిపో అని అనడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఈ నెల 8న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. మళ్లీ కరీంనగర్‌కు తీసుకువచ్చి చికిత్స అందిస్తుండగా బుధవారం మృతి చెందింది. దీంతో చిన్నారి పాప అనాథగా మారింది. తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రసూణ మృతదేహం.. -
అదృశ్యమైన యువతి ట్యాంక్‌బండ్‌లో శవమై..
సాక్షి, అడ్డగుట్ట : తుకారాంగేట్‌లో అదృశ్యమైన యువతి హుస్సేన్ సాగర్‌లో శవమై తేలింది. గాంధీ మార్చురీలో భద్రపరిచిన యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఆలస్యంగా గుర్తించడంతో వారికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే బుద్ధానగర్‌కు చెందిన అంజయ్య కుమార్తె రాణి(18) వెస్ట్‌మారేడ్‌పల్లిలోని వెస్లీ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. గత నెల 21న కాలేజీకి వెళ్లిన రాణి తిరిగి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో గత నెల 22న తుకారాంగేట్ పోలీస్‌స్టేసన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 23న హుస్సేన్ సాగర్‌లో మృతదేహం.... హుస్సేన్ సాగర్‌లో 23న గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం రాంగోపాల్‌పేట్ పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీలో భద్రపరిచారు. మరుసటిరోజు పేపర్లో వార్త చూసిన తుకారాంగేట్ పోలీసులు ఆమె కుటుంబసభ్యులను మార్చురీకి తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించారు. అయితే మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి ఉండడంతో వారు గుర్తు పట్టలేకపోయారు. అయితే, రోజులు గడుస్తున్నా మృతురాలి ఆచూకీ తెలియకపోవడంతో మరోసారి మృతదేహాన్ని పరిశీలించాలని పోలీసులు అంజయ్య కుటుంబ సభ్యులకు సూచించారు. సోమవారం గాంధీ మార్చురీకి వచి్చన వారు పుట్టు మచ్చలు, పట్టీల ఆధారంగా మృతురాలు రాణిగా గుర్తించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. రాణి మృతదేహం.. రాణి(ఫైల్) -
పెళ్లి జరిగిన 45 రోజులకు..
సాక్షి, నాయుడుపేట(నెల్లూరు) : ఆ యువతి ఏ కష్టం వచ్చిందో.. ఏమో.. ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందింది. అయితే ఈ యువతి నెల్లూరులో పోలీసులకు తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు చేసుకున్నట్లు మరణ వాంగ్మూలం సైతం ఇచ్చింది. ఈ ఘటన నాయుడుపేట మండల పరిధిలోని పుదూరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓజిలి మండలం వెంకటరెడ్డిపాళెం పంచాయతీ పరిధిలోని బత్తలపురం గ్రామానికి చెందిన చిట్టేటి గురువయ్య, అల్లెమ్మల కుమార్తె శ్రావణి(21). ఆమెకు ఏడాది వయస్సులోనే తల్లిదండ్రులు మృతిచెందారు. చిన్నతనం నుంచి పుదూరులో ఉన్న అమమ్మ–తాతయ్యల వద్దే శ్రావణి ఉండేది. ఆ యువతికి వారి సమీప బంధువైన పుదూరు గ్రామానికి చెందిన వెలుగు చెంచయ్య కుమారుడు గురుశేఖర్‌తో సెప్టెంబర్ 30వ తేదీన పెద్దల సమక్షంలో వివాహమైంది. కాగా, యువతి ఈ నెల 12వ తేదీన ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించి ప్రథమ చికిత్స అందించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో అక్కడి వైద్యులు వెంటనే చెన్నైకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బుధవారం రాత్రి చెన్నైలోని జీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా మృత్యువాత పడినట్లు తెలిపారు. ఈ మేరకు మృతురాలి తాత వెలుగు నాగయ్య శ్రావణి కడుపునొప్పి తాళలేక ఇంటి వద్ద ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణి వివాహం జరిగి 45 రోజులు కావడంతో ఆమె మృతిపై స్థానిక తహసీల్దారుకు ఫిర్యాదు చేసి రెవెన్యూ అధికారుల సమక్షంలో చెన్నైలోని జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లి పంచానామా జరిపి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.వెంకటేశ్వరరావు తెలిపారు. అయితే శ్రావణికి ఇష్టం లేని పెళ్లి చేసి ఆమె మృతికి కారకులైనారని బత్తలపురం గ్రామానికి చెందిన శ్రావణి తండ్రి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. -
బైక్ లారీ కిందకు వెళ్లిపోవడంతో..
మేడ్చల్: బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగా, ఆమె భర్త కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలం, గుంటిపల్లి గ్రామానికి చెందిన శ్యామ్‌కుమార్ శుక్రవారం తన అత్తగారి ఊరైన మెదక్ జిల్లా, జీడీపల్లి గ్రామానికి వెళ్లాడు. తన కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో డాక్టర్‌కు చూపించేందుకు గాను భార్య సరస్వతి కుమారుడు కేశవర్ధన్(8)తో కలిసి బైక్‌పై ఘనాపూర్ మెడిసిటి ఆసుపత్రికి వస్తుండగా మేడ్చల్ ఆర్టీసీ డిపో వద్ద కంటెయినర్ ఢీకొనడంతో బైక్ లారీ కిందకు వెళ్ళిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం నగర శివార్లలోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సరస్వతి మృతి చెందింది. శ్యాంకుమార్, కేశవర్ధన్ చికిత్స పొందుతున్నారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
45ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. స్వయంగా అబార్షన్.. విషాదం
సాక్షి, చిత్తూరు: నడి వయసులో గర్భం దాల్చిన వివాహిత స్వయంగా అబార్షన్ చేసుకొని ప్రాణాలను కోల్పోయింది. ఇంట్లో పెళ్లి వయస్సు వచ్చిన ఇద్దరు పిల్లలుండగా ఓ మహిళ మరోసారి గర్భం దాల్చడంతో, ఈ వయసులో ప్రసవిస్తే చుట్టుపక్కల వాళ్లు సూటిపోటి మాటలు అంటారని భావించి తనకు తానే బలవంతంగా అబార్షన్ చేసుకోవడానికి ప్రయత్నించింది. చివరకు తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలతో బయటపడ్డ ఆడ శిశువు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. మదనపల్లెలోని అమ్మినేని వీధి సమీపంలో నివసిస్తున్న ఇనయతుల్లా, కదిరున్నీషా (45) దంపతులు టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పెళ్లీడుకొచ్చిన కొడుకు, కూతురు ఉన్నారు. అయితే ఎనిమిది నెలల క్రితం కదిరున్నీషా (45) గర్భం దాల్చింది. ఈ విషయాన్ని భర్తకు తెలియకుండా రహస్యంగా ఉంచింది. రాను రాను ఉదరభాగం ముందుకువచ్చి గర్భం దాల్చినట్టు కనబడటంతో ఆందోళన చెందిన మహిళ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో బలవంతంగా అబార్షన్ చేసుకుంది. వెలికి వచ్చిన ఆడశిశువును ప్లాస్టిక్ కవర్లో చుడుతూ అధిక రక్తస్రావం కారణంగా బాత్రూంలోనే కుప్పకూలిపోయింది. కాసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఇది గమనించి ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆటోలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కదిరున్నీషా మరణించింది. శిశువుకు వైద్యులు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా భార్య చనిపోవడంతో భర్త ఇనయతుల్లా, పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
సాక్షి, సింహాచలం(విశాఖపట్టణం) : దేవస్థానం అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. దైవదర్శనానికి వస్తే బండరాయి రూపంలో మృత్యువు కాటేయడంతో తరలిరాని లోకాలకు ఓ యువతి వెళ్లిపోయింది. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన సింహగిరి మెట్ల మార్గంలో బుధవారం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే... శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుందామని సబ్బవరం మండలం పెదనాయుడుపాలెం గ్రామానికి చెందిన ఆదిరెడ్డి భవాని(28) బుధవారం మెట్లమార్గంలో నడిచి బయలుదేరింది. అదే సమయంలో మెట్లమార్గం విస్తరణ పనుల్లో భాగంగా పొక్లెయిన్ సాయంతో కొండప్రాంతాన్ని చదును చేస్తున్నారు. సరిగ్గా మార్గ మధ్యలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి ఓ బండరాయి జారివచ్చి భవానీతోపాటు కె.కోటపాడు మండలం పొడుగుపాలెం గ్రామానికి చెందిన సూరెడ్డి జగదీశ్వరికి తగిలింది. వీరిలో తీవ్ర గాయాలపాలైన భవాని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. జగదీశ్వరి గాయాలతో చికిత్స పొందుతోంది. పరిహారం చెల్లించాలని డిమాండ్ ఆరిలోవ(విశాఖ తూర్పు): సింహాచలం అప్పన్నను దర్శించుకోవడానికి వస్తూ మెట్ల మార్గంలో బండరాయి తగలడంతో గాయాలపాలైన ఆదిరెడ్డి భవాని(28) హెల్త్‌సిటీలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అప్పటికే స్వగ్రామం నుంచి ఆస్పత్రికి చేరుకొన్న భవాని తల్లిదండ్రులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకొన్న ఆర్డీవో తేజ్ భరత్, సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రరావు, రూరల్ తహసీల్దారు ఆర్.నర్సింహమూర్తి ఆస్పత్రి వద్దకు చేరుకొన్నారు. భవానీ మృతదేహాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతున్న జగదీశ్వరి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్దకు చేరుకొన్న భవాని బంధువులు అధికారులను నిలదీశారు. మెట్ల మార్గంలో పనులు జరిపిస్తూ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, నష్టపరిహారం చెల్లించా లని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్డీవో తేజ్‌భరత్, ఈవో కె.రామచంద్రరావు, మంత్రి అవంతి శ్రీనివాసరావు సోదరుడు మహేష్ చర్చించి మృతురాలి కుటుంబానికి దేవస్థానం తరఫున రూ.9లక్షలు పరిహారం అందించేందుకు అంగీక రించారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున బీమా సొమ్ము రూ.5లక్షలు ఇప్పించేందుకు యత్నిస్తామన్నారు. మరోవైపు తక్షణ సాయంగా దేవస్థానం తరఫున రూ.15వేలు, ప్రభుత్వం తరఫున రూ.5వేలు అందించారు. చికిత్స పొందుతున్న జగదీశ్వరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆర్టీవో తేజ్‌భరత్ సూచించారు. రక్షణ లేకుండానే విస్తరణ పనులు భవిష్యతలో మెట్లమార్గంలో నడిచి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా మెట్లమార్గాన్ని విస్తరించాలని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు సూచించారు. అందులో భాగంగా రూ.8 కోట్లతో కొండ దిగువ నుంచి పై వరకు ప్రస్తుతం ఉన్న మెట్ల మార్గాన్ని మరో పది అడుగుల వెడల్పున విస్తరించే పనులు చేపట్టారు. ఇప్పటికి కొండదిగువ తొలిపావంచా నుంచి కొంతమేర పైవరకు పనులు పూర్తిచేసి కొత్త మెట్లు నిర్మించేశారు. మధ్యలోకి వచ్చేసరికి లోయ ఉన్న ప్రాంతంవైపు విస్తరణ పనులు ప్రస్తుతం చేస్తున్నారు. ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో పొక్లెయిన్ సాయంతో చదును చేస్తున్నారు. ఈ క్రమంలో కొండని తొలిచినప్పటి నుంచీ రాళ్లు కిందకు జారి మెట్లమార్గంలో పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కాంట్రాక్టర్గానీ, దేవస్థానం అధికారులుగానీ కనీస భద్రతా చర్యలు చేపట్టలేదు. ఆ రాళ్లను అక్కడే ఉంచేశారు తప్ప దూరంగా తరలించలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం... మెట్లపైకి మట్టి జారకుండా ఉండేందుకే అలా రాళ్లు పెట్టామని చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకి పెద్ద ఎత్తున రాళ్లు దొర్లుకుంటూ మెట్లమార్గంలోకి వచ్చి చేరాయి. విస్తరించే పనుల్లో భాగంగా ఆంజనేయస్వామి ఆలయం పైభాగం కూడా మూతపడింది. ఇదే ప్రాంతంలో మరిన్ని రాళ్లు పడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా దేవస్థానం అధికారులు, కాంట్రాక్టర్ పొక్లెయిన్‌తో ఇష్టారాజ్యంగా పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇవేమీ తెలియని భక్తులు మెట్లమార్గంలో నడిచివెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబానికి అండ కోల్పోయాం భవాని ఎంబీఏ చదువుకుని సబ్బవరంలోని ఓ టీవీ షోరూంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంది. ముగ్గురు కుమార్తెలలో భవాని పెద్దది. చదువు పూర్తిచేసిన అనంతరం ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతో కుటుంబాన్ని పోషిస్తుంది. తాను కూలి పనులు చేసుకొని కుమార్తెను చదివిస్తే, కుటుంబానికి అందివచ్చేసరికి ప్రాణాలు కోల్పోయింది. తన ఇద్దరు చెల్లిళ్లను చదివిస్తానని చెప్పేది. నాకు ధైర్యం చెప్పిన కుమార్తె ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోయింది. – కూర్మినాయుడు, మృతురాలి తండ్రి -
ప్రాణం తీసిన పెరుగుచెట్టు
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : దశాబ్దాల కాలం చరిత్ర గల మర్రి చెట్టు (పెరుగుచెట్టు) గురువారం ఉదయం ఒక్కసారిగా నేలకొరిగింది. చెట్టు ఒక్కసారిగా నేలకి ఒరగడంతో అటుగా వెళ్లుతున్న ఓ మహిళ దాని కింద పడి దుర్మరణం పాలైంది. చెట్టు పడిపోయిందని తెలుసుకున్న నగరవాసులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తంచేశారు. ఎటువంటి గాలి, వాన లేకుండా చెట్టు నేలకొరగడంపై ఎవరి హస్తమైనా ఉందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలోని పెరుగుచెట్టు సెంటర్ వద్ద ఓ మర్రిచెట్టు ఉంది. దశాబ్దాల కాలం నుంచి ఈ చెట్టు వద్ద పాలు, పెరుగు విక్రయిస్తున్నారు. దాంతో ఈ ప్రాంతానికి పెరుగుచెట్టు సెంటరుగా పేరు వచ్చిందని పెద్దలు చెబుతున్నారు. ఈ చెట్టుకు స్థానికులు తరచూ పూజలు కూడా చేస్తుంటారు. గతంలో భారీ గాలివానలు వచ్చిన సందర్భాల్లో కూడా ఈ చెట్టు కొమ్మలు కూడా ఒరిగిన సందర్భాలు లేవని, గురువారం మాత్రం ఒక్కసారిగా నేలకూలిందని స్థాని కులు అంటున్నారు. చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న నగరపాలకసంస్థ కమిషనర్ ఎ.మోహనరావుతో పాటు ఏఈ రామారావు, పోలీసులు, ఫైర్‌స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చెట్టును తొలగించి, మహిళ మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ దుర్మరణం పెరుగుచెట్టు ఒక్కసారిగా నేలకు ఒరగడంతో అటుగా వెళుతున్న స్థానిక 9వ డివిజన్‌కు చెందిన మాణిక్యాల వెంకటరమణ(48)అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. చెట్టు మీద పడటంతో బయటకు వచ్చే మార్గం లేక ఆమె మృతి చెందినట్టు తెలుస్తోంది. వెంకటరమణ తన కుటుంబసభ్యులతో కలిసి కాలువల వెంబడి పనికిరాని వస్తువులను సేకరించి విక్రయించుకుని జీవిస్తుంటారు. గురువారం ఉదయం కూడా తన కుమారులతో కలిసి చెట్టు కింద ప్రాంతంలో పనికిరాని వస్తువులను సేకరిస్తుండగా ఒక్కసారిగా చెట్టు కూలిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన వారు ప్రమాదం నుంచి తప్పిం చుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాపత్రికి తరలించారు. మృతురాలి భర్త సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వన్‌టౌన్ ఎస్సై నరహరశెట్టి రామకిషోర్‌బాబు తెలిపారు. పథకం ప్రకారమే జరిగిందా ? సుమారు 100 ఏళ్ల చరిత్ర గల మర్రిచెట్టు (పెరుగుచెట్టు) ఒక్కసారిగా నేలకు ఒరగడంపై నగరవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చె ట్టుకు ఆనుకుని ఉన్న స్థలంలో భారీ వాణిజ్య భవనం నిర్మాణంలో ఉంది. చెట్టు కారణంగా సదరు భవనం కనిపించకుండా పోయిందనే ఉద్దేశంతో చెట్టు వేరులను కొద్దిరోజులుగా ధ్వంసం చేస్తూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. అలానే చెట్టు మొదల్లో కెమికల్ పోయడంతో దాని ప్రభావంతో ఒక్కసారిగా చెట్టు కూలినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. పెరుగుచెట్టు కారణంగా తన భవనం ము సుకుపోయిందని చెట్టును తొలగించాలంటూ సద రు భవన నిర్మాణదారుడు అటవీశాఖ కార్యాలయంలో వినతి సమర్పించగా.. అధికారులు చె ట్టును తొలగించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. దీంతో ఎలాగైనా చెట్టును తొలగించేందుకు భవన నిర్మాణదారుడు ప్రయత్నం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచా రణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. -
పాపం.. పల్లవి
సాక్షి, తిరుమలాయపాలెం: రోజువారీగా విధి నిర్వహణకు పయనమైంది. ఉద్యోగ బాధ్యతలను పూర్తి చేసింది. కారులో ఇంటికి బయలుదేరింది. ఇంతలోనే ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన బానోతు పల్లవి(45) ఖమ్మం జిల్లా డ్రగ్ కంట్రోల్ అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఖమ్మంలో బుధవారం విధులు ముగించుకుని హన్మకొండకు కారులో వెళ్తుండగా.. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు సమీపంలోని క్రాంతి గార్డెన్ వద్ద ఆగి ఉన్న కర్ర లారీని పల్లవి ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. కారు వెనుక సీటులో కూర్చున్న ఆమె తల ముందు సీటు రాడ్‌కు గుద్దుకుని.. కారు క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందింది. కారు డ్రైవర్ ఏడుకొండలుకు తీవ్ర గాయాలు కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. అతడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లవి మృతదేహాన్ని మెడికల్ అసోసియేషన్ నాయకులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించేందుకు సహకరిం చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని హన్మకొండకు తరలించారు. పల్లవి మృతి ఘటనపై ఆమె సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కాగా పల్లవికి భర్త కోటేశ్వరరావు, కుమారుడు వరుణ్, కుమార్తె ధరణి ఉన్నారు. మృతురాలు పల్లవి తండ్రి సోమ్లానాయక్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పల్లవికి మాజీ ఎంపీ సీతారాంనాయక్ మేనమామ కాగా, మాజీ మంత్రి చందూలాల్ బాబాయి. విషాదంలో ఉద్యోగులు హన్మకొండకు చెందిన పల్లవి ఉమ్మడి ఖమ్మం జిల్లా డ్రగ్ కంట్రోల్ అడిషనల్ డైరెక్టర్‌గా ఏడాదిన్నర క్రితం విధుల్లో చేరారు. అందరితో కలిసి మెలిసి ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. విధుల పట్ల అంకితభావంతో ఉండే ఆమె మృతి వార్త విని తోటి అధికారులు, ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు. డ్రగ్ కంట్రోల్ కార్యాలయంలో ప్రతీ నెల కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తారు. బుధవారం మామిళ్లగూడెంలోని ఏడీ కార్యాలయంలో ఉద్యోగులతో రివ్యూ సమావేశం నిర్వహించి అనంతరం కారులో హన్మకొండ వెళుతుండగా ప్రమాదంలో మృతిచెందింది. ఏడీ మరణవార్త తెలియడంతో డ్రగ్ కంట్రోల్ కార్యాలయంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని మార్చురీకి తీసుకురావడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఉద్యోగులు నివాళులర్పించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, తెలంగాణ హోల్‌సేల్, రిటైల్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు నివాళులర్పించారు. -
ఆమె ఆత్మహత్యకు అత్తింటివారే కారణం
సాక్షి, శృంగవరపుకోట(శ్రీకాకుళం) : పట్టణంలోని విశాఖ-అరకు రోడ్డులో ఉంటున్న సాలూరు ప్రియాంక అనే వివాహిత బుధవారం సాయంత్రం ఐదు గం టల సమయంలో ఇంటిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మృతురాలు ప్రియాంక, నాయనమ్మ భాగ్యలక్ష్మి ఇంట్లో ఉండగా.. ట్యాంక్‌లో నీళ్లు పడుతున్నాయా లేదా చూసి వస్తానంటూ ప్రియాంక సాయంత్రం 5 గంటల సమయంలో మేడ మీదికి వెళ్లింది. ఎంతకూ మనుమరాలు కిందికి రాకపోవడంతో నాయనమ్మ భాగ్యలక్ష్మి మేడమీదికి వెళ్లి చూడగా ప్రియాంక గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. దీంతో హతాశురాలైన భాగ్యలక్ష్మి వెంటనే పట్టణంలో ఉన్న తమ బంధువులకు ఫోన్ చేయగా, వాళ్లు వచ్చి ప్రియాంకను కిందికి దించారు. అయితే అప్పటికే ఆమె మరణించడంతో పోలీసులకు... శ్రీకాకుళంలో ఉద్యోగం చేస్తున్న మృతురాలి తల్లి అరుణకుమారికి సమాచారం అందించారు. రెండు నెలల్లోనే.. ఎస్.కోటకు చెందిన సాలూరు లేటు ప్రసాద్, అరుణకుమారిల కుమార్తె ప్రియాంక(23)ను హైదరాబాద్‌కు చెందిన అక్కుమహంతి గోపీకృష్ణకు ఇచ్చి ఏప్రిల్ నెల 17న వివాహం చేశారు. పెళ్లయిన కొద్ది రోజులకే ప్రియాంకకు వరకట్న వేధింపులు ఆరంభమయ్యాయి. హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రియాంక కొద్ది రోజులు అత్తింటి వేధిం పులు భరించి ఆ తర్వాత తన తల్లికి విషయం చెప్పింది. తర్వాత ఎస్.కోటలో తల్లి వద్దకు వచ్చిన ప్రియాంక స్థానిక పోలీస్‌స్టేషన్‌లో భర్త గోపీకృష్ణ, అత్త లక్ష్మీఇందిరలపై ఫిర్యాదు చేసింది. పోలీస్‌ల నిర్లక్ష్యమే కారణం.. మృతురాలు ప్రియాంక తొలుత హైదరాబాద్‌లో కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడ పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. సొంత ఊరులో ఫిర్యాదు చేసుకో అంటూ ప్రి యాంకను పంపేశారు. దీంతో ఎస్.కోట వచ్చి న ప్రియాంక గత నెల 18న ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్.కోట పోలీసులు హైదరాబాద్ వెళ్లి చిరునామా తెలియక వెనక్కి వచ్చేశారు. ప్రి యాంకకు అత్తింటి వారితో పాటు కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నుంచి తరచూ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవి. తన వల్ల కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి తెలిపింది. ఎస్.కోట ఎస్సై జి. రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓ ఆకతాయి చేష్టలతో యువతి ఆత్మహత్య
సాక్షి, పాములపాడు(కర్నూలు): ఓ ఆకతాయి బ్లాక్‌మెయిలింగ్ యువతి ప్రాణాలు తీసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మండలపరిధిలోని లింగాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లింగాల గ్రామానికి చెందిన గోవర్దన్, ఆకుతోట సోమేశ్వరమ్మ దంపతుల కుమార్తె విజయనిర్మల (17)కు గడివేముల మండలం గని గ్రామానికి చెందిన కురువ నవీన్ అనే యువకుడితో పరిచయం ఉంది. ఈ నెల 1న ఆ యువతి తన తండ్రితో కలిసి ఆత్మకూరుకు వెళ్లింది. అక్కడ తండ్రి మోటారు సైకిల్ రిపేరి చేయించుకుంటుండగా కొంత దూరంలో నవీన్, ఆ బాలిక కలిసి మాట్లాడుకుంటున్నారు. సిద్దాపురం గ్రామానికి చెందిన వడ్డె ఇరుగదిండ్ల అశోక్ వారి ఫొటోలు తీసి వాటిని వారికి చూపించి రూ.5వేలు నగదు, ఒక సెల్ ఫొన్ తీసుకుని పోయాడు. అంతటితో ఆగకుండా బాలిక తల్లి దండ్రులకు ఫోన్ చేసి రూ.5వేలు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే కుమార్తె ఫొటోలు ఫేస్బుక్లో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. అడిగిన మేర డబ్బు ఇచ్చేందుకు వారు అంగీకరించినా వాట్సప్‌లో యువతి ఫొటోలు పంపించాడు. దీంతో తీవ్రంగా కుంగిపోయిన యువతి ఈనెల 5న ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలిస్తే పరువు పోతుందని బంధువులకు చెప్పకుండా ఖననం చేశారు. అయితే, తన బిడ్డ ఆత్మహత్మకు కారణమైన నిందితుడు వడ్డె ఇరుగదిండ్ల అశోక్‌కు వదిలిపెట్టకూడదని భావించి యువతి తల్లి సోమేశ్వరమ్మ సోమవారం పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో మంగళవారం ఆత్మకూరు సీఐ కృష్ణయ్య, తహసీల్దార్ శివయ్య, ఎస్ఐ వరప్రసాద్ శ్మశాన వాటికలో పూడ్చిన శవాన్ని వెలికితీసి డాక్టర్ వెంకటరమణతో పంచనామా నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కుళాయి వద్ద ఘర్షణ.. మహిళ మృతి
గుక్క పట్టి ఏడుస్తున్న రెండు నెలల బిడ్డను వదిలి..గుక్కెడు మంచినీళ్ల కోసం ఆమె ఇంటి నుంచి బయటకు కదిలింది..మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా కుళాయి వద్ద నిరీక్షించింది.. ఆమె వంతు వచ్చే సరికి గొడవ ప్రారంభమైంది..మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. తోపులాటలో ఆమె కింద పడి ఈ లోకాన్ని వీడింది. ఈ విషాద ఘటన కర్నూలు నగరం లక్ష్మీనగర్‌లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నీటి సమస్య ఓ నిండు ప్రాణాన్ని తీయడం స్థానికులను కలచి వేసింది. కర్నూలు: కర్నూలు నగరం లక్ష్మీనగర్‌లో వీధికుళాయి దగ్గర వంతుల వారీగా నీళ్లు పట్టుకునే విషయంలో గొడవ చోటు చేసుకుని తీవ్ర ఘర్షణకు దారితీసింది. తోపులాటలో మౌలాబీ (23) అనే మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న షేక్షావలి, షేకున్బీ రెండో కూతురైన మౌలాబీకి డోన్‌కు చెందిన మహమ్మద్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఈమె రెండు నెలల క్రితం పుట్టినింటికి ప్రసవానికి వచ్చి బిడ్డకు జన్మనిచ్చింది. గురువారం ఇంటి పక్కన ఉన్న వీధి కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో సమీపంలో నివాసం ఉంటున్న రామచంద్రమ్మతో వివాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. రామచంద్రమ్మ కుటుంబ సభ్యులంతా కలిసి మౌలాబీని కిందకు తోసేయడంతో ఆమె అపస్మారకస్థితికి చేరుకుంది. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన వెంటనే కర్నూలు మూడో పట్టణ సీఐ హనుమంతనాయక్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు దారితీసిన పరిస్థితులపై ఇరుగుపొరుగువారిని విచారించారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రమ్మతో పాటు భర్త రత్నమయ్య, కూతురు మనీషాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
చిత్తూరు, బంగారుపాళెం: మండలంలోని నలగాంపల్లె వద్ద హైవేపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ రామకృష్ణయ్య కథనం..పలమనేరుకు చెందిన రంగబాబు బెంగళూరులోని చిక్‌బాన్స్‌వాడలో నివాసం ఉంటున్నారు. వేలూరులో ఓ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలసి బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో నలగాంపల్లె వద్ద హైవే మీద ఏర్పాటు చేసిన సూచిక బోర్డు దిమ్మెను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అంజనమ్మ(45) సంఘటన స్థలంలోనే మృతి చెందింది. రంగబాబు(62), అతని కుమారుడు ప్రసన్నకుమార్(40), బంధువు చంద్రశేఖర్ కుమారుడు శ్రీహరి(15) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న హైవే మొబైల్ పోలీసులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో బంగారుపాళెం వైద్య విధాన పరిషత్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. శ్రీహరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అంజనమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీపు ఢీకొని మోటార్ సైక్లిస్టు మృతి తిరుపతి క్రైం : జీపు ఢీకొని మోటార్ సైక్లిస్టు దుర్మరణం చెందిన సంఘటన బుధవారం తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో 34వ మలుపు వద్ద చోటుచేసుకుంది. వివరాలు..తిరుపతిలోని తిరుమలనగర్‌లో నివాసముంటున్న బలరాం (47) తిరుమలలోని ఓ షాపులో పనిచేసేవాడు. పనిముగించుకుని మోటార్ సైకిల్‌పై తిరుపతికి వస్తూ మృత్యువాత పడ్డాడు. 34వ మలుపు వద్ద వెనుక నుంచి జీపు అతడిని ఢీకొనడంతో బలరాం డివైడర్‌పై పడ్డాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
నెక్కల్లు ఘటనలో మరో మహిళ మృతి
గుంటూరు, తుళ్లూరు(తాడికొండ): నెక్కల్లు గ్రామంలో ఈ నెల 5న జరిగిన ఘటనలో మరో మహిళ మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. టీడీపీ నేతల దాడిలో గాయపడిన బీసీలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయడానికి వెళుతుండగా, టీడీపీ నేతల వెంటపడి కారుతో తొక్కించిన ఘటనలో మరో మహిళ పసుపులేటి వీరకుమారి(35) సోమవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇళ్ల మధ్య ఉన్న ఇంటి స్థలాల విషయంలో చెలరేగిన వివాదంలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలు అలూరి బ్రహ్మయ్య, ఆయన కుమారులు కలసి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. కారుతో తొక్కించిన ఘటనలో పసుపులేటి మహాలక్ష్మి(65) అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైం అప్పటినుంచి చికిత్స పొందుతున్న వీరకుమారి సోమవారం మరణించింది. పసుపులేటి కాటరాలు, పసుపులేటి బ్రహ్మయ్య, పసుపులేటి బాపయ్య, పసుపులేటి శిరీష, పసుపులేటి పిచ్చయ్య, వెంకటలక్ష్మిలకు కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. అమ్మలేని అనాథలుగా చిన్నారులు మృతురాలు వీరకుమారికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారు 9వ తరగతి, 8వ తరగతి చదువుతున్నారు. భర్త పసుపులేటి బాపయ్య కూడా ఈ ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. దంపతులిద్దరూ కూలి పనులకు వెళుతూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నారు. తల్లి మృతి చెందడంతో చిన్నారులిద్దరూ తల్లి మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇద్దరు పిల్లల రోదన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తల్లి మృతదేహం వద్ద ఇద్దరు చిన్నారులు.. ‘అమ్మా... లే అమ్మా అంటూ.. విలపిస్తున్న తీరు అక్కడికి చేరుకున్న వారి హృదయాలను కదిలించింది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బీసీ సంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలి ఇద్దరు మహిళల మరణానికి కారణమైన నిందితులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలి. న్యాయం కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వెళుతున్న బీసీలపై టీడీపీ నేతలు మానవత్వం మరచి కారుతో తొక్కించడం రాక్షస చర్య. పోలీసులు కేసును పక్కదోవ పట్టించకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. దుర్ఘటనలో మృతి చెందిన, గాయపడిన బీసీ కుటుంబాలకు న్యాయం జరిగేవరకూ వైఎస్సార్సీపీ వారికి అండగా ఉంటుంది.–ఉండవల్లి శ్రీదేవి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి -
మోటార్ సైకిల్‌ను ఢీకొన్న ట్రాక్టర్
విజయనగరం, తెర్లాం: ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన మల్లేడ మంగ (22) ఆమె భర్త రమేష్ తెర్లాం నుంచి సొంత గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. సరిగ్గా సూరీడు తోట దాటిన తర్వాత ఉన్న మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న మంగ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న తెర్లాం ఎస్సై ఎ.నరేష్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రమేష్‌ను వెంటనే రాజాం ఆస్పత్రికి తరలించారు. మంగ మృతదేహానికి కుటుంబ సభ్యుల సమక్షంలో శవపంచనామ చేపట్టి పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ఏడాదిన్నర కిందట వివాహం కునాయవలసకు చెందిన మల్లేడ రమేష్‌కు మంగతో ఏడాదిన్నర కిందట వివాహం కాగా వీరికి ఆరు నెలల పాప ఉంది. మంగకు అనారోగ్యంగా ఉండడంతో తెర్లాంలోని ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంగ మృతితో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
తూర్పుగోదావరి, పి.గన్నవరం: మండలంలోని యర్రంశెట్టి వారిపాలెం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. మోటారు సైకిల్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మోటారు సైకిల్ నడుపుతోన్న వ్యక్తి ప్రమాదం నుంచి స్వల్ప గాయలతో బయటపడ్డాడు. పి.గన్నవరం ఎస్సై ఎస్.రాము కథనం ప్రకారం.. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన లంకే లత(30) గురువారం సిద్ధాంతం గ్రామంలో బంధువుల ఇంట జరిగే శుభ కార్యక్రమానికి వెళుతోంది. పి.గన్నవరంలో బస్ దిగి రావులపాలెం వైపు వెళ్లే బస్సు కోసం ఎదురు చూస్తోంది. ఈక్రమంలో అదే శుభ కార్యక్రమానికి మోటారు సైకిలుపై వెళుతున్న ఆమె మరిది, నక్కా రామేశ్వరం గ్రామానికి చెందిన ఓలేటి జయేంద్ర స్థానిక సెంటర్లో వదినను చూసి ఆగాడు. ఆమెను మోటారు సైకిల్‌పై ఎక్కించుకుని సిద్ధాంతం గ్రామానికి బయల్దేరాడు. యర్రంశెట్టివారిపాలెం వంతెనపై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లతకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను 108 అంబులెన్స్‌లో పి.గన్నవరం సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే ఆమె మరణించింది. మోటారు సైకిల్‌ను నడుపుతున్న జయేంద్రకు స్వల్ప గాయాలయ్యాయి. లత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. స్టేషన్ సమీపంలో ఏజీ రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ట్రాక్టర్ యజమాని నుంచి ఆర్థిక సాయం అందించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ యజమాని అందుబాటులో లేకపోవడంతో, న్యాయం చేస్తామని ఎస్సై హామీ ఇచ్చారు. లిఖిత పూరకంగా హామీ ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈక్రమంలో రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు ఆందోళన కారులతో చర్చించి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. అమలాపురం సీఏ శ్రీరామ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆందోళన చేసిన 18మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. తల్లి మృతితో అనాథలైన పిల్లలు.. ఓడలరేవు గ్రామానికి చెందిన వికలాంగురాలైన లంకే లత భర్త గతంలో మరణించాడు. ఆమెకు తొమ్మిదేళ్ల కుమార్తె అనూష, ఐదేళ్ల కుమారుడు అభి ఉన్నారు. భర్త మరణించడంతో జీవనాధారం కోల్పోయిన లత ఓడలరేవులోని ఒక కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తోంది. యర్రంశెట్టివారిపాలెం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో ఇద్దరు పిల్లలు దిక్కులేని వారయ్యారు. తల్లి మృతదేహం వద్ద పిల్లలు విలపించిన తీరు అందరితో కంటతడిపెట్టించింది. -
ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘోరం
కర్ణాటక, చిక్కబల్లాపురం : ఆలయానికి వెళ్లి వస్తుండగా మృత్యువు వెంటాడింది. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొని తర్వాత టిప్పర్ కిందకు దూసుకెళ్లడంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం రాత్రి నగరం సమీపంలోని అగలగుర్కి వద్ద జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. చిక్కబళ్లాపురం తాలూకా మంచనబలె గ్రామానికి చెందిన దీప(22). మంగళవారం ఆమె తనకుటుంబ సభ్యులతో కలిసి కారులో బెంగళూరు చిక్కజాల ఉప్పారహళ్లి లోని మునేశ్వరదేవాలయం వెళ్లింది. పూజలు ముగించుకొని వస్తుండగా రాత్రి సుమారు 10 గంటల సమయంలో అగలగుర్కి సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని టిప్పర్ లారీ కిందకు దూసుకెళ్లింది. ఘటనలో కారు నుజ్జునుజ్జు కావడంతో డ్రైవింగ్ చేస్తున్న దీప అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న జయమ్మ, రత్నమ్మ, శాంత, పవన్, సంగీతలు తీవ్రంగా గాయపడగా వారిని బెంగళూరుకు తరలించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వరుణ్‌కుమార్ తెలిపారు. -
గర్భసంచి ఆపరేషన్ కోసం వస్తే.. ప్రాణాలు పోయాయి
నిర్మల్‌టౌన్: గర్భసంచి ఆపరేషన్ కోసం వస్తే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే ఇలా జరిగిందని బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు, వైద్యుల వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం వాంకిడి అనుబంధ గ్రామం చిన్నరాజురకు చెందిన లలిత(44) గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం నిర్మల్ ప్రసూతి ఆసుపత్రికి తీసుకొచ్చా రు. సోమవారం లలితకు అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మంగళవారం ఆపరేషన్ నిర్వహించారు. ఈక్రమంలో ముందుగా మత్తుమందును ఇచ్చారు. ఆపరేషన్ ప్రారంభిం చిన కొద్ది సేపటికి పరిస్థితి విషమించి లలిత మృతిచెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే లలిత మృతిచెందిందని ఆమె భర్త రాములు, బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి వద్ద ఆందో ళన చేపట్టారు. డీఎంఅండ్‌హెచ్‌వో జలపతి నాయ క్, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ సురేష్, సీఐ జాన్‌దివాకర్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఆపరేషన్ నిర్వహించిన వైద్యురాలు రజిని, అనస్తిసియా నిపుణులు మృతి చెందిన విధానాన్ని వారికి వివరించారు. ఆపరేషన్ నిర్వహించిన సమయంలో లలితకు అకస్మాత్తుగా గుండెపోటు, ఫిట్స్ రావడంతోనే మరణించిందని తెలిపారు. రోగిని రక్షించేందుకు ప్రయత్నించిన ఫలితం దక్కలేదని వివరించారు. రోగి బంధువులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీఐ జాన్‌దివాకర్ వారిని సముదాయించి పంపించారు. -
గమ్యం చేర్చింది.. ప్రాణం తీసింది
చిత్తూరు, సూళ్లూరుపేట: గమ్యం చేర్చిన బస్సే ఆమె ప్రాణం తీసింది. ఈ ఘటన మంగళవారం సూళ్లూరుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం సంతవేలూరుకు చెందిన కుప్పాని కవిత (35) సూళ్లూరుపేటలోని నారాయణ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె మంగళవారం విధులకు హాజరయ్యేందుకు సంతవేలూరులో సూళ్లూరుపేట – శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్సు ఎక్కింది. స్థానిక వినాయకుడి గుడి సెంటర్లోని బస్‌స్టాప్‌లో దిగుతుండగా చీర డోర్‌కు ఇరుక్కుని అదుపుతప్పి కింద పడిపోయింది. బస్సు డ్రైవర్ ఆమె దిగిందనుకుని వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. వెనుక టైర్ ఆమె మీదకు ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కొన ఊపిరితో ఉందనుకుని వెంటనే స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్ నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
గుంటూరు, చిలకలూరిపేట: రోడ్డు డివైడర్‌ను ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మూడేళ్ల బాలుడితో పాటు ఆరుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో పట్టణానికి చెందిన రహమత్ నగర్, తూర్పు మాలపల్లె, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన వారు రోజు కూలీకి వెళతారు. సాయంత్రం పనులు ముగిశాక సుమారు 10 మంది కార్మికులు ఆటోలో పట్టణంలోని ఇళ్లకు బయలు దేరారు. జాతీయ రహదారిలోని ఏఎంజీ సంస్థ సమీపంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టు వద్ద వేగంగా వస్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డు మధ్య ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి పైకి ఎక్కింది. దీం తో ఆటోలో ఉన్న ఎన్టీఆర్ కాలనీకి చెందిన కొరటాల వాణి(55) మృతి చెందగా, నేలపాటి దయమ్మ, గట్టుపల్లి శౌరమ్మ, షేక్ శిలార్బీ, షేక్ మీరాబీ, జి.విజయరాణి, ఆమె కుమారుడైన మూడేళ్ల బాలుడు జి.హర్షవర్థన్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో నేలపాటి దయమ్మ, గట్టుపల్లి శౌరమ్మ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కొందరిని గుంటూరు జీజీహెచ్‌కు, మరికొందరిని పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న అర్బన్ సీఐ జి.శ్రీనివాసరావు, పట్టణ ఎస్ఐ ఎం.ఉమామహేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే కారణమా? ఆటో అతివేగంగా ప్రయాణించటమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే మోటార్‌బైక్‌ను తప్పించే క్రమంలో ఆటో డివైడర్‌ను ఢీకొని పైకి ఎక్కటంతో ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు. ఏదిఏమైనా చెక్‌పోస్టు సమీపంలో బ్యారన్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి పైకి ప్రవేశించేందుకు ఉన్న జంక్షన్లో గతంలోనూ పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జంక్షన్ వద్ద పోలీసులు గతంలోనే ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేశారు. ఇక్కడ క్రాస్‌రోడ్డు ఉన్నా పట్టించుకోకుండా అతివేగంగా ప్రయాణించటమే పలు ప్రమాదాలకు కారణంగా ఉంటోంది. -
వరికోత మిషన్ కింద పడి మహిళా రైతు మృతి
సాక్షి, గణపురం : వరికోత మిషన్ కింద పడి మహిళా రైతు మృతిచెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మరావుపేట గ్రామానికి చెందిన చిన్నపాక సమ్మక్క(50) అదే గ్రామానికి చెందిన రైతు పోశాల రాజయ్య పొలంలోకి కూలీ పనులకు వెళ్లింది. వరికోత మిషన్ వరిని కోస్తూ వెనుక వైపు వెళ్లడంతో వెనుక పనిచేస్తున్న సమ్మక్కపై నుంచి మిషన్ వెళ్లింది. దీంతో సమ్మక్క అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు గణపురం ఎస్సై గోవర్ధన్ తెలిపారు. అధికారులు స్పందించి మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
కుమార్తెకు సెండాఫ్ ఇచ్చి వస్తుండగా..
స్టేషన్‌ఘన్‌పూర్: ఉన్నత చదువుల కోసం కుమార్తెను ఆస్ట్రేలియాకు పంపేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో సెండాఫ్ ఇచ్చి తిరిగి వస్తుండగా జనగామ జిల్లా ఘన్పూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హన్మకొండ బాలసముద్రంకు చెందిన ఝాన్సీరాణి(45) మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానిక ఎస్సై రవి కథనం ప్రకారం... హన్మకొండ బాలసముద్రంకు చెందిన వీరారెడ్డి, ఝాన్సీరాణి దంపతుల కుమార్తె కృష్ణశ్రేయను ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు పంపించేందుకు ఝాన్సీరాణి తల్లిదండ్రులైన హేమలత, సుదర్శన్‌రెడ్డితో కలిసి ఐదుగురు కారులో హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు ఆదివారం వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున కృష్ణశ్రేయను ఫ్లైట్ ఎక్కించిన తర్వాత నలుగురు తిరిగి హన్మకొండకు బయల్దేరారు. వీరారెడ్డి కారు డ్రైవింగ్ చేస్తుండగా పక్క సీట్లో ఝాన్సీరాణి, అచ్చాయమ్మ, సుదర్శన్‌రెడ్డి వెనుక సీట్లో కూర్చున్నారు. ఈ క్రమంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఘన్పూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఝాన్సీరాణితోపాటు మిగిలిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రవి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో గాయపడ్డ వారిని చికిత్సనిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన ఝాన్సీరాణి మార్గమధ్యలోనే మృతిచెందినట్లు తెలిపారు. మిగిలిన వారు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. -
డెలివరీ కోసం వెళ్తే.. ప్రాణం తీశారు
సాక్షి, వనస్థలిపురం : వనస్థలిపురం లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్లో అందించిన వైద్యం వికటించడంతో శ్వేత(28) అనే మహిళ మృతి చెందింది. వివరాలు.. చౌటుప్పల్‌కి చెందిన శ్వేత ప్రసవం కోసం గత నెలలో లైఫ్ స్ప్రింగ్ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు పెద్ద పేగు కత్తిరించారు. ఆ తర్వాత ఒక పేగుకు బదులు మరో పేగు అతికించారు. అంతేకాకుండా కుట్లు కూడా సరిగా వేయలేదు. దీంతో ఇన్ఫెక్షన్ సోకి శ్వేత మరణించింది. కాగా వైద్యులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో శ్వేత మరణించిందని ఆమె బంధువులు ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యంగానే ఆమె మృతి చెందిందని ఆరోపించారు. -
స్వైన్‌ఫ్లూ కలకలం
భువనేశ్వర్/ఖుర్దారోడ్ : రాష్ట్రంలో ఈ సీజన్లో తొలి స్వైన్‌ఫ్లూ కేసును ఖుర్దా జిల్లాలోని నచుని ప్రాంతంలో సోమవారం గుర్తించారు. కొద్దిరోజుల నుంచి జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన ఓ మహిళకు వైద్య పరీక్షలు చేయగా బాధిత మహిళకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని స్థానిక ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం(ఆర్ఎంఆర్సీ) కూడా ఖరారు చేయడంతో స్వైన్‌ఫ్లూ కేసు వెలుగులోకి వచ్చింది. స్వైన్‌ఫ్లూ బారిన పడిన మహిళ 23 ఏళ్ల యువతి కావడం బాధాకరం. 2017లోనే రాష్ట్రం స్వైన్‌ఫ్లూ భయానక పరిస్థితులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో సుమారు 400 మంది స్వైన్‌ఫ్లూ బారిన పడగా, 50 మంది చనిపోయినట్టు వైద్యవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు నగరంలో చోటు చేసుకున్న తాజా సంఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్వైన్‌ఫ్లూ విస్తరించకుండా తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
ఎంపీ జీవీఎల్ కారు ఢీకొని మహిళ మృతి
తాడేపల్లి రూరల్: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారు ఢీకొని ఓ మహిళ మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గుంటూరు జిల్లా మంగళగిరి బాలాజీనగర్‌కు చెందిన తెన్నేరు అంజమ్మ (38), తోట శైలజలు కలసి మంగళగిరి నుంచి ఆటోలో కొలనుకొండ బయలుదేరారు. అక్కడివరకు వచ్చి, జాతీయ రహదారిపై గుంటూరు–విజయవాడ రోడ్డులో ఉన్న సాయిబాబా గుడి వద్ద దిగి విజయవాడ–గుంటూరు రోడ్డులో ఉన్న యువ అకాడమీ వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అంజమ్మ దుర్మరణం చెందగా, శైలజకు తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ చాకచక్యంగా కారు బోల్తా కొట్టకుండా వ్యవహరించడంతో ఎంపీకి ప్రమాదం తప్పినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఎంపీ కిందకు దిగి గాయపడిన మహిళను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి, ఆయన అక్కడి నుంచి వేరే కారులో తిరిగి వెళ్లారు. రోడ్డు ప్రమాదానికి గురైన కారును తాడేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకుని, డ్రైవర్ ఎం. మణికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఆపరేషన్ పేరుతో మా అమ్మను చంపేశారు’
షాద్‌నగర్‌టౌన్ రంగారెడ్డి : కంటి ఆపరేషన్ చేస్తామని తీసుకెళ్లి మా అమ్మను చంపేశారని, చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేశంపేట మండలం దత్తాయపల్లి గ్రామానికి చెందిన గంట్లవెళ్లి చెన్నమ్మ కుమారుడు సాయిలు ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మృతురాలి కొడుకు సాయిలు మాట్లాడుతూ... కంటివెలుగు పథకంలో భాగంగా దత్తాయపల్లి గ్రామంలో ఈనెల 17న వైద్య శిబిరం నిర్వహించారని, తన తల్లి చెన్నమ్మ పరీక్షల నిమిత్తం శిబిరానికి వెళ్లినట్లు తెలిపారు. కంటి పరీక్షల అనంతరం ఆపరేషన్ చేయాలంటూ చెప్పి ప్రభుత్వ వాహనంలో కొత్తూరులోని కంటి ఆస్పత్రికి తరలించారని, ఆమెతో పాటు గ్రామంలోని మరికొందరు కూడా వెళ్లినట్లు చెప్పారు. సాయంత్రం అయినా ఆపరేషన్ కోసం వెళ్లి నర్సమ్మ ఇంటికి తిరిగి రాలేదన్నారు. మరుసటిరోజు కొత్తూరు ఆసుపత్రి నుంచి మా ఇంటికి ఇద్దరు వ్యక్తులు చెన్నమ్మ పరిస్థితి విషమంగా ఉందని, షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పారన్నారు. విషయం తెలుసుకొని ఆస్పత్రికి వెళితే అప్పటికే చెన్నమ్మ మృతి చెందిందని డాక్టర్లు తెలిపారని కన్నీరుపెట్టుకున్నాడు. చెన్నమ్మ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చెన్నమ్మ మృతి చెందిందని వాపోయారు. వినతిపత్రం అందించిన వారిలో సంఘమేశ్వర్, భీమయ్య, సురేష్, జంగయ్య, యాదయ్య ఉన్నారు. -
చేతులు శుభ్రం చేసుకోక..మహిళ మృతి
మానవపాడు (అలంపూర్): వ్యవసాయ పొలానికి పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయడంతో ఓ మహిళ మృతిచెందింది. ఎస్ఐ పర్వతాలు కథనం ప్రకారం.. మండలంలోని చంద్రశేఖర్‌నగర్ కాలనీకి చెందిన చిన్న రామన్న వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంటకు ఎలుకల బెడద ఎక్కువ కావడంతో బుధవారం భార్య పెద్ద ముణెమ్మ(51) గుళికల మందు పిచికారీ చేసింది. ఈ క్రమంలో ఆమె చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకుండానే భోజనం చేసింది. దీంతో బుధవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే మానవపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించగా గురువారం ఉదయం మృతిచెందింది. ముణెమ్మ భర్త చిన్న రామన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
బుద్దారంలో రీ పోస్టుమార్టం
గోపాల్పేట (వనపర్తి): బు ద్దా రం గ్రామానికి చెందిన ఎం. మణెమ్మ (58) గతనెల 24న చనిపోయింది. మహబూబ్‌నగర్‌లోని ట్రాన్స్‌కో కార్యాలయంలో విధులు ని ర్వహించే మణెమ్మ రోజులా గే ఇంటికి వస్తుండగా జడ్చర్ల బ్రిడ్జివద్ద చనిపో యింది. కుటుంబసభ్యులు మరుసటి రోజు అం త్యక్రియలు జరిపించారు. అయితే ఆమె మృ తిపై కూతురు శ్వేతకు అనుమానం రావడంతో ఈనెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం మహిళ మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. జడ్చర్ల ఏఎస్ఐ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ రవి, తహసీల్దార్ ఏసయ్య సమక్షంలో పోస్టుమార్టం జరిగింది. త్వరలో మృతికి గల కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
తల్లి మరణంతో ఆగిన తనయుడి వివాహం
చందుర్తి(వేములవాడ) : తెల్లవారితే తనయుడి పెళ్లి జరగాల్సిన ఇంట్లో తల్లి హఠాన్మరణంతో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటన చందుర్తి మండలం మూడపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాచర్ల బూదవ్వ(42) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ మధ్య తన కొడుకు ప్రశాంత వివాహం నిశ్చయమైంది. ఈ నెల 15న ఉదయం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన యువతితో జరగాల్సి ఉంది. మంగళవారం పెళ్లి పనుల్లో నిమగ్నమైన బూదవ్వ కళ్లు తిరుగుతున్నాయని పడుకుంది. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు బూదవ్వను నిద్ర లేపేందుకు యత్నించగా అప్పటికే మరణి చింది. దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది.కాగా బూదవ్వ మహిళా రైతు కావడంతో వ్యవసాయాధికారులు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. -
మూల మలుపు... మృత్యు పిలుపు..
కొణిజర్ల, ఖమ్మం : మండలంలోని పల్లిపాడు నుంచి ఏన్కూర్ వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టిన తర్వాత పల్లిపాడు-లాలాపురం గ్రామాల మధ్యనున్న మూల మలుపు.. మృత్యు పిలుపుగా మారింది. ప్రాణాలు తీస్తున్నది. ఈ మూల మలుపు వద్ద కల్వర్టును వెడల్పు చేయకపోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. ఇది, ప్రమాదాలకు కారణమవుతోంది. శుక్రవారం ఉదయం పల్లిపాడు సమీపంలో రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో మహిళ మృతిచెందింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. పల్లిపాడు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. పల్లిపాడుకు చెందిన పదిమంది కూలీలను పక్క గ్రామానికి ఆటో డ్రైవర్ లకావత్ కృష్ణ తీసుకెళుతున్నాడు. పల్లిపాడు-లాలాపురం మధ్యనున్న మూల మలుపు వద్ద లాలాపురం వైపు నుంచి వస్తున్న ట్రాలీ ఆటో ఎదురుగా ఢీకొంది. ఆటోలో కుడి వైపు కూర్చున్న పల్లిపాడుకు చెందిన ధరావత్ లక్ష్మి(35) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ లకావత్ కృష్ణ, ప్రయాణికులు కోలబోయిన సువర్ణ, భూక్యా నాగమణి, భూక్యా మంగమ్మ, ధరావత్ కావేరి, గుగులోత్ కాంతమ్మ, గుగులోత్ సుజాత, ఎనగంటి పద్మ, భూక్యా సమత, సపావట్ అరుణ గాయపడ్డారు. వీరిలో కోలబోయిన సువర్ణ పరిస్థి«తి విషమించింది. ఖమ్మంలోని ప్రయివేట్ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఇచ్చినప్పటికీ 108 వాహనం వెంటనే రాలేదు. దీంతో క్షతగాత్రులను ఆటోలలో, ఇతర వాహనాలలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కొణిజర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఫిర్యాదు చేసేందుకు వచ్చి పరలోకానికి..
మృత్యువు ఎవరిని ఎలా కబళిస్తుందో చెప్పలేం. ప్రజా సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసేం దుకు వచ్చిన ఓ మహిళ అకస్మాత్తుగా.. అందరి కళ్లెదుటే కుప్పకూలి మృత్యువు ఒడిలోకి చేరింది. ఈ విషాద సంఘటన జి.సిగడాం ఎంపీడీవో కార్యాలయం వద్ద సోమవారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని బొబ్బిలివీధికి చెందిన కెల్ల అన్నపూర్ణ (65) ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. జి.సిగడాం శ్రీకాకుళం : బొబ్బిలివీధిలో గత ఆరు నెలలుగా మంచినీటి కుళాయిలు పని చేయడంలేదు. ఈ సమస్యపై స్థానికులు పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలే దు. దీంతో మరోసారి గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేయాలని భావించారు. ఇదే వీధికి చెందిన ఇజ్జి లక్ష్మి, శాంతికుమారి, విశాలాక్షి, పార్వతి, అప్పలనారాయణమ్మ, శ్రీదేవి తదితరులతో కలిసి కెల్ల అన్నపూర్ణమ్మ కూడా మండల పరిషత్ కార్యాలయానికి సోమవారం వచ్చారు. మెట్లు ఎక్కుతుండగా అన్నపూర్ణమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే తోటి మహిళలు ఈమెకు సపర్యలు చేయడంతో పాటు ప్రాథమిక చికిత్స అందించేందుకు స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వైద్యుడిని రప్పించారు. అన్నపూర్ణమ్మను పరీ క్షించిన వైద్యుడు అప్పటికే ఆమె చనిపోయినట్టు ధ్రువీకరించారు. అప్పటి వరకూ అందరి తో కలిసి..కలివిడిగా మాట్లాడిన అన్నపూర్ణమ్మ ఇక లేరని తెలిసి తోటి మహిళలు కన్నీటి పర్యం తమయ్యారు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని భోరున విలపించారు. మృతురాలి అన్నపూర్ణకు భర్త నర్శింహులు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం! బొబ్బిలివీధిలో గత ఆరు నెలలుగా కుళాయిలు పని చేయడం లేదు. దీంతో నీటి సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు కూడా ఇదే సమస్యను మరోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు మహిళలు వచ్చారు. ఈ క్రమంలో అన్నపూర్ణమ్మ అర్ధంతరంగా తనువుచాలించింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం జరిగిందని.. నీటి సమస్య పరిష్కరించి ఉంటే..ఈ ఘటన జరిగి ఉండేది కాదని మహిళలు మండిపడుతున్నారు. కాగా ఎంపీడీఓ బాసూరి శంకరరావు, సిబ్బంది అన్నపూర్ణమ్మ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం వ్యక్తం చేశారు. -
బైక్ పైనుంచి ఎగిరి టిప్పర్ కింద పడి..
శాయంపేట(భూపాలపల్లి) : స్పీడ్ బ్రేకర్, త్రిబుల్ రైడింగ్ ఓ మహిళ ప్రాణం తీసింది. స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ పైనుంచి ఓ మహిళ ఎగిరిపడగానే ఆమె తల మీదుగా వెనకాలే వస్తున్న టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మాందారిపేట స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, ఎస్సై జక్కుల రాజబాబు కథనం ప్రకారం... హన్మకొండలోని రాయపురకు చెందిన మంథుర్తి రాధిక(29), ఆమె భర్త శ్రీనివాస్, అత్త రాధమ్మ కలిసి రేగొండ మండలం తిర్మిలగిరి గ్రామానికి ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ క్రమంలో మాందారిపేట స్టేజీ సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ల వద్ద ద్విచక్రవాహనం ఎగరడంతో వెనకాల కూర్చున్న రాధమ్మ ముందుకు పడిపోయింది. దీంతో ఆమెను పట్టుకునే క్రమంలోనే రోడ్డుపై పడిపోయింది. వెనకాలే వస్తున్న టిప్పర్ వెనక టైరు రాధిక తలపై నుంచి వెళ్లడంతో తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందింది. పరకాల వైవీఎస్ సుధీంధ్ర, సీఐ షాదుల్లాబాబా, ఎస్సై జక్కుల రాజబాబు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి సోదరుడు న్యాల కర్ణాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై రాజబాబు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యానికి ..బాలింత మృతి
విజయనగరం ఫోర్ట్ : ఘోషాస్పత్రిలో తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నా వైద్య సిబ్బందిలో మార్పు రావడం లేదు. కొద్ది రోజుల కిందట చీపురుపల్లి మండలం జి.ములగాం గ్రామానికి చెందిన భవాని, సత్యనారాయణ దంపతులకు జన్మించిన మగ శిశువు ఘోషాస్పత్రిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో శిశువు తండ్రి పోలీసులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మరో విచారకర సంఘట చోటుచేసుకుంది. మగ బిడ్డ పుట్టాడని ఎంతో సంబరపడ్డ ఆ తల్లి పుట్టిన శిశువును తనివితీరా ముద్దాడకుండానే తనువు చాలించింది. బాలింత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం పోరలి గ్రామానికి చెందిన కొప్పల సంతోషి ఈనెల 25న ప్రసవం కోసం ఘోషాస్పత్రి లో చేరింది. 26వ తేదీ రాత్రి 10.20 గంటల సమయంలో ఆమెకు సాధారణ ప్రసవం అవ్వగా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వైద్య సిబ్బంది ఆమెను కాన్పు గది నుంచి వార్డుకు తరలించారు. రాత్రి ఒంటి గంట సమయంలో సంతోషికి తీవ్ర రక్తస్రావం అవ్వడంతో ఆమె బంధువు నర్సు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె నేను డ్యూటీలో లేను.. ఇంకోనర్సుకు చెప్పు అని తెలిపింది. ఇలా ఒకరు మీద ఒకరు చెప్పుకుంటూ శుక్రవారం ఉదయం వరకు బాలింతను పట్టించుకోలేదు. ఉదయం 6 గంటల సమయంలో వైద్యురాలి వద్దకు బాలింతను తీసుకుని వెళ్లగా వారు రక్తం ఎక్కించారు. అయినప్పటికీ రక్తస్రావం అగకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో రక్తస్రావం తగ్గడానికి గర్భసంచి తొలిగించాలని బంధువులకు చెప్పారు. బంధువులు అందుకు అంగీకరించడంతో ఆపరేషన్ చేసి గర్భసంచి తొలిగించారు. ఆపరేషన్ అనంతరం రక్తస్రావం తగ్గిందని వైద్యురాలు బంధువులకు తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రక్తస్రావం అగినప్పటికి బ్రెయిన్లో సమస్య ఉందని.. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించాలని సిబ్బంది సూచించారు. దీంతో 2.45 గంటల సమయంలో అంబులెన్స్‌లో సంతోషిని కేజీహెచ్‌కు తరలించారు. అయితే కేజీహెచ్ గేట్ వద్ద సంతోషిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని చెప్పారు. మృతదేహంతో ఆందోళన సంతోషి చనిపోయిందని కేజీహెచ్ సిబ్బంది చెప్పడంతో రాత్రి ఎనిమిది గంటలకు అంబులెన్స్‌లో మృతదేహాన్ని తీసుకువచ్చి స్థానిక ఘోషాస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. మా బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారంటూ రోధించారు. ఘోషాస్పత్రిలోనే చనిపోతే విశాఖకు తరలించా రని ఆరోపించారు. ఆందోళన విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ సీతారామరాజు ఆస్పత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. సంఘటనపై విచారణ చేపడతామని చెప్పగా, ఇంతవరకు ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయని, ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారని బాధితులు ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరగడంతో రెండో పట్టణ ఇన్చార్జి సీఐ చంద్రశేఖర్, ఎస్సైలు అశోక్, దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘోషాలోనే చనిపోయింది ఘోషాస్పత్రిలోనే మా చెల్లి చనిపోయింది. ఏమీ తెలియకుండా వైద్యులు కేజీహెచ్‌కు తీసుకెళ్లమని చెప్పారు. అక్కడ వైద్యులు పరీక్షించి చనిపోయిందని చెప్పారు. ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే మా చెల్లి చనిపోయింది. – జి. చంద్రినాయుడు, మృతిరాలి సోదరుడు విచారణ చేయిస్తాం వైద్యుల నిర్లక్ష్యం లేదు. సంతోషి కోమాలోకి వెళ్లిపోవడంతో మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించాం. సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తాం. వైద్య సిబ్బంది నిర్లక్షం ఉంటే చర్యలు తీసుకుంటాం. కె.సీతారామరాజు, సూపరింటెండెంట్ , ఘోషాస్పత్రి -
దైవదర్శనానికి వెళ్తూ కానరాని లోకాలకు..
చందంపేట(దేవరకొండ) యాదాద్రి : తొలి ఏకాదశిని పురస్కరించుకుని దైవ దర్శనానికి వెళ్తూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంతో కానరానిలోకాలకు వెళ్లింది. ఈ ఘటన చందంపేట మండలంలోని దేవరచర్ల శివారులో సోమవారం జరిగింది. ఎస్ఐ సతీష్‌కుమార్ తెలిపిన ప్రకారం.. నేరెడుగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామానికి చెందిన కలకటి మం జుల(21), భర్త అంతయ్య, ఏడు నెలల కుమార్తెతో కలిసి దేవరచర్ల మునిస్వామి ఆలయానికి బైక్‌పై బయలుదేరారు. ఆలయ సమీపంలో ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా సివిల్ సప్లయ్ కిరోసిన్ ట్యాంకర్ ఎదురుగా రావడంతో అంత య్య ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి బోల్తా పడిం ది. దీంతో మం జుల బైక్ పైనుం చి కిందపడింది. వేగంగా వస్తున్న ట్యాంకర్ మంజు ల పైనుంచి వెళ్లడంతో ఆమె ము ఖం ఛిద్రమైంది. దీంతో మంజుల అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంలో అంతయ్య, కుమార్తెకు స్వల్పగా గాయాలయ్యా యి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మే రకు కేసు దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ సతీష్‌కుమార్ తెలిపారు. అదేవిధంగా కంబాలపల్లి గ్రా మానికి చెందిన సీత శ్రీనివాస్ తన భార్య పిల్లలతో కలిసి బైక్‌పై వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలయ్యారు. -
కుమరాంలో డయేరియాతో మహిళ మృతి..!
గరివిడి(చీపురుపల్లి) : గరివిడి మండలం కుమరాం గ్రామంలో మంగళవారం వేకువజామున తీవ్రమైన వాంతులు, విరేచనాలతో బీంపల్లి కనకమ్మ (43) అనే మహిళ మృతి చెందారు. డయేరియా సోకిన కారణంగానే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పినట్లు ఆమె భర్త రాముడు పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలోనూ జ్వర పీడితులు.. వారం రోజులుగా గ్రామంలో జ్వరాలు తిష్ఠ వేశాయని, ప్రతీ ఇంటిలోనూ జ్వర పీడితులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అందరూ చీపురుపల్లి సీహెచ్‌సీకి, ప్రైవేటు ఆస్పత్రులకు తిరుగుతున్నారని, పట్టించుకోవాల్సిన వైద్యాధికారుల జాడ కానరావడం లేదని స్థానికులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా కానరాని పారిశుద్ధ్య పనులు.. కుమరాంలో నాలుగేళ్లుగా ఒక్కసారి కూడా పారిశుద్ధ్య పనులను సంబంధిత అధికారులు చేయించ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక సర్పంచ్ బి.రాములమ్మ వయసు పైబడడం, పైపెచ్చు అప్పట్లో దళిత రిజర్వేషన్ కావడంతో ఆమెను అధికార పార్టీ నాయకులు సర్పంచ్‌ను చేశారు. అక్కడి ఉప సర్పంచ్ జంపాన రవిరాజు పంచాయతీ వ్యవహారాలు అన్ని నడిపిస్తారని, నిధులు, కాంట్రాక్ట్ పనులు అన్ని ఆయన చూసుకుంటారని స్థానికులు చెబుతున్నారు. డబ్బులు వచ్చే పనులు అయితే చేయిస్తారు తప్ప ప్రజలకు అవసరమైన పారిశుద్ధ్య పనులు వంటివి అసలు పట్టించుకోరని, అసలు నాలుగేళ్లుగా పారిశుద్ధ్య పనులు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదేమని అడిగితే సర్పంచ్‌ను అడగమంటున్నారు.. పారిశుద్ధ్య పనులు ఎందుకు చేపట్టడం లేదని స్థానికులు ఉప సర్పంచ్‌ను అడిగితే తాను సర్పంచ్‌ను కాదని, మీరు వెళ్లి సర్పంచ్‌నే అడగాలని ఆమె మీద నెపం నెట్టివేస్తారని చెబుతున్నారు. సర్పంచ్‌కు కనీసం చదువు రాదు. పంచాయతీ పనుల్లో అనుభవం లేదు. ఇలాంటి నాయకులను ఎన్నుకుని తాము అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా ప్రజలు జ్వరాలతో అవస్థలు పడుతుంటే కనీసం ఏఎన్ఎం కూడా గ్రామానికి రాలేదని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగజేసుకుని తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని, లేకుంటే మరిన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు. -
కంటి వైద్యానికి వెళ్తూ..కానరాని లోకాలకు
కంటి వైద్యానికి తల్లిని కారులో తీసుకెళుతున్నాడు ఆ కొడుకు. మరికొద్ది సేపట్లోనే ఆస్పత్రికి చేరుకుంటామనగా ఆ వాహనాన్ని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ దుర్ఘటనలో తల్లి దుర్మరణం చెందారు. కొడుకుతో పాటు కారులో ఉన్న మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. శస్త్రచికిత్స చేయించడానికి తీసుకువెళుతుండగా తల్లి మృత్యువాతపడటంతో.. ఆమె మృతదేహం వద్ద కొడుకు విలపించిన తీరు అందరినీ కలచివేసింది. సోంపేట: మండలంలోని బేసిరామచంద్రాపురం గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో వజ్రపుకొత్తూరు మండలం సైనూరు గ్రామానికి చెందిన బత్తిని ఈశ్వరమ్మ (50) మృతి చెందారు. బారువ పోలీçసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సైనూరు గ్రామానికి చెందిన బత్తిని ఈశ్వరమ్మ కంటి చూపు మందగించడంతో కుమారుడు దుర్గారావు, అల్లుడు సంగారు లక్ష్మణరావు, మరో బంధువు సంగారు సరోజనితో కలసి సోంపేటలోని కంటి ఆస్పత్రికి శస్త్రచికిత్సకు గురువారం కారుపై తీసుకెళుతున్నారు. సైనూరు నుంచి ఉదయం బయలు దేరారు. సోంపేట ఆస్పత్రికి మరో పది నిమిషాల్లో చేరుకుంటారనగా లారీ రూపంలో వారికి ప్రమాదం ఎదురైంది. ఈ కారును బేసి రామచంద్రపురం గ్రామం జాతీయ రహదారి వద్ద పలాస నుంచి కంచిలి వెళుతున్న లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఇందులో వెనుక సీట్లో ఉన్న ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. లక్ష్మణరావు, సరోజని, దుర్గారావుకు స్వల్ప గాయాలయ్యాయి. కంటికి శస్త్రచికిత్స చేయించడానికి తీసుకువస్తుండగా ఈశ్వరమ్మ మృతి చెందడంతో కుమారుడు దుర్గారావు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈశ్వరమ్మ భర్త చలపతిరావు వలస కార్మికుడు. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బారువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైనూరులో విషాదఛాయలు వజ్రపుకొత్తూరు: మండలంలోని సైనూరుకు చెందిన ఈశ్వరమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ‘కంటి వైద్యానికి వెళ్తూ కనిపించకుండా పోయావా? ఇంతలోనే వెళ్లి అంతలోనే మాయం అయ్యావా’ అంటూ బంధువుల రోదనలు చూపరులకు కంటితడిపెట్టించాయి. గ్రామస్తులు, బంధువులు మృతురాలి ఇంటి వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. మృతురాలికి భర్త బత్తిని చలపతిరావు విదేశాల్లో పనులు చేసుకుంటున్నాడు. కాగా, ఆమెకు కుమారుడు దుర్గారావు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినందుకు..
సాక్షి, చిత్తూరు : ఎన్ని ప్రాణాలు పోతున్నా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలైంది. వివరాలు.. పుత్తూరు పట్టణం ఆచారి వీధికి చెందిన నిఖిలను డెలివరీ కోసం శనివారం పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ప్రసవం అనంతరం అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో ఆదివారం రాత్రి ఆమె మరణించింది. ప్రసవానంతరం సరైన చికిత్స చేయకుండా నిఖిల మరణానికి కారణమయ్యారంటూ ఆస్పత్రి సిబ్బందిపై మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి తీరుకు నిరసనగా రోడ్డుపై ధర్నాకు దిగి ఆందోళన చేపట్టారు. -
వరకట్నం వేధింపులకు తల్లీకూతురు బలి
అడ్డగూడూరు(తుంగతుర్తి) : వరకట్నం వేధింపులకు తల్లీకూతురు బలయ్యారు. ఈ విషాద సంఘటన బుధవారం అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామంలో జరిగింది. ఎస్ఐ శివనాగప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. చిర్రగూడూరు గ్రామానికి చెందిన శ్రీరాముల అశోక్‌కు గుండాల మండలం పాచిళ్ల గ్రామానికి చెందిన ఉమ(29)తో 2013లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెల సంతానం. వీరిలో పెద్దమ్మాయి మిల్కీ, చిన్నమ్మాయి అశ్విత(8నెలలు). కొంతకాలంగా అశోక్ వరకట్నం తేవాలని భార్యను వేధిస్తున్నాడు. బుధవారం ఉదయం భార్యాభర్త నడుమ తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం ఇంట్లో ఉమ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చిన్నకుమార్తె అశ్వితకు కూడా మంటలు వ్యాపించడంతో 90శాతం కాలిపోయారు. వెంటనే గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లీకూతురు మరణించినట్టు తెలిపారు. ఉమ తల్లిదండ్రులు మాత్రం అశోక్ వరకట్నం కోసం తమ కూతురు, మనుమరాలిపై కిరోసిన్ పోసి హత్య చేశాడని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యోగా వేడుకల్లో వృద్ధురాలు మృతి
సాక్షి, డెహ్రాడూన్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డెహ్రాడూన్ అటవీ పరిశోధనా సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుధా మిశ్రా అనే 73 ఏళ్ల వృద్ధురాలు స్పృహతప్పి పడిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. యోగా వేదిక వద్ద వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయని, అస్వస్థతకు గురైన వెంటనే మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఆమె మృతికి కారణాలను వైద్యులు వెల్లడిస్తారని ఎస్పీ ప్రదీప్ రాయ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో దాదాపు 50000 మంది ఔత్సాహికులు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా విశ్వజనీనమైందని, ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే శక్తి దీనికుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందని చెప్పారు. -
వైద్యం వికటించి యువతి మృతి
గజ్వేల్‌రూరల్ : ఓ యువతి అబార్షాన్ కోసం గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రాగా అధిక రక్తస్రావంతో మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరగ్గా... బుధవారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. వైద్యాధికారులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గజ్వేల్ పట్టణంలోని పద్మసాయి ఆసుపత్రిలో మంగళవారం రాత్రి సమయంలో రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లికి చెందిన ఓ యువతి(22) అబార్షన్‌కోసం మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వచ్చింది. చికిత్స అందిస్తున్న క్రమంలో యువతికి అధిక రక్తస్రావం కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా... మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న గజ్వేల్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. యువతి మృతి చెందిన విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో బలరాం ఆధ్వర్యంలోని వైద్యబృందం గజ్వేల్‌కు చేరుకొని ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కరుణసాయి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ డీఎఅండ్‌హెచ్‌వో బలరాం ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న గజ్వేల్ ఐఎంఏ శాఖ సభ్యులు పద్మసాయి ఆసుపత్రికి చేరుకొని వైద్యాధికారులను నిలదీశారు. ఎలాంటి అనుమతులు లేకున్నా ఆసుపత్రులు కొనసాగుతున్న విషయం తెలిసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అనుమతులు లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లుగా గతంలోనే వైద్యాధికారులకు తెలియజేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. -
భర్త కళ్లెదుటే దారుణం
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): భర్త కళ్లెదుటే దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సిటీ బస్సు ఢీకొనడంతో ఒక వివాహిత అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మధురవాడ దరి కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన యతిరాజుల రోజా (21)కి శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం సింగూరు గ్రామానికి చెందిన గురుగుబిల్లి జగదీశ్వరరావుతో 2017 ఫిబ్రవరిలో వివాహం జరిగింది. జగదీశ్వరరావు ఆర్మీలో పనిచేస్తున్నారు. దీంతో రోజా తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. రోజా ప్రస్తుతం రామాటాకీస్ దరి శ్రీనగర్‌లో గల ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆర్మీ నుంచి జగదీశ్వరరావు ఆదివారమే కొమ్మాదిలోని అత్తవారింటికి వచ్చాడు. వీరిద్దరూ సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై కోస్టల్ బ్యాటరీలో గల నేవల్ క్యాంటీన్‌కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మార్గ మధ్యలో కొత్త వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ జంక్షన్ దాటిన తరువాత వెనుక నుంచి వచ్చిన 52డీ సిటీబస్ (వాల్తేరు డిపో) ఢీకొట్టింది. దీంతో రోజా రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. కళ్లెదుటే భార్య మరణించడంతో జగదీశ్వరరావు తట్టుకోలేక కన్నీటిపర్వంతమయ్యాడు. మూడో పట్టణ ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని అంబులెన్సులో కేజీహెచ్‌కి తరలించారు. సీఐ మళ్ల మహేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పండగపూట విషాదం
ఆదిలాబాద్ : రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు రంజాన్ పండగ పూట ఆ ఇంట్లో విషాదం మిలిచ్చింది. ఇద్దరి చిన్నారులను ఆలనాపాలనకు దూరం చేసింది. మావల గ్రామపంచాయతీ పరిధిలోని సుభాష్‌నగర్‌కాలనీకి చెందిన మహుబూబి(50) శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..సుభాష్‌నగర్ నుంచి ఆటోలో తన మనవరాలు సానియమెహరి(9)తో కలిసి కిన్వాట్ వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌కు వస్తుండగా, పంజాబ్‌చౌక్ ప్రాంతంలో ఈ ఆటో మరో ఆటోకు తగలించడంతో ఆటోలో ఉన్న చిన్నారి చేతికి గాయమైంది. దీంతో అక్కడి నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా వేగంగా వస్తున్న ఆటో బస్టాండ్ దగ్గర రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని తప్పించబోయి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహుబూబి అక్కడిక్కడే మృతి చెందగా చిన్నారి సానియా, సుభాష్‌నగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ రాహుల్, రోడ్డుపై వెళ్తున్న గాంధీనగర్‌కు చెందిన సంతోష్‌లకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ స్వామి తెలిపారు. ఆలనాపాలనకు దూరమైన చిన్నారులు ఓ పక్క సంతోషంగా పండుగా చేసుకునే సమయంలో..రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మహూబూబిపైనే ఆధారపడి ఉన్న ఇద్దరు చిన్నారులు ఆలనాపాలనకు దూరమయ్యారు. మహూబూబి కూతురు సిరాజ్ 2011లో మృతి చెందింది. ఆమె భర్త వేరే కాపురం పెట్టడంతో కూతురు పిల్లలు సానియా, కుమారుడు ఆర్మాన్‌ను తనే పెంచుతోంది. భర్త ఎస్కే సలీంతో కలిసి పిల్లల ఆలనాపాలన చూస్తోంది. చిన్ననాడే తల్లిని కోల్పోయి..తండ్రికి దూరమైన ఆ చిన్నారులు ఇప్పుడు అమ్మమ్మను కూడా పోగొట్టుకోవడంతో అనాథలుగా మారారు. రంజాన్ పండుగ కోసం పిల్లలకు కొత్త బట్టలు కొన్న మహూబూబి, కిన్వాట్లో ఉన్న తన పెద్ద కూతురికి రంజాన్ బట్టలు కొనిద్దామనే ఉద్దేశంతో కిన్వాట్ బయలుదేరి మృత్యువాత పడింది. మరో పక్క తొమ్మిదేళ్ల సానియ ఆస్పత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. ఎంతో ప్రేమగా పెంచుతున్న అమ్మమ్మ చనిపోయింది..నిత్యం తనతో ఆడుకునే అక్క కనిపించక చిన్నారి ఆర్మన్‌ను చూస్తూ తాత సలీం కన్నీరుమున్నీరయ్యారు. చిన్నప్పుడు కన్న తల్లి..పెంచి పెద్ద చేస్తున్న అమ్మమ్మను కోల్పోయిన ఆ చిన్నారులను చూసి చుట్టుపక్కల వారు కన్నీటి పర్యంతమయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
గజపతినగరం రూరల్: మండలంలోని కొత్తబగ్గాం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ గురువారం చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కొత్తబగ్గాం గ్రామానికి చెందిన కానూరు రామయ్యమ్మ (63) బుధవారం రాత్రి బహిర్బూమి వెళ్తుండగా, మెంటాడ నుంచి గజపతినగరం వైపు వస్తున్న వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామయ్యమ్మ తీవ్రంగా గాయపడింది. వెంటనే క్షతగాత్రురాలిని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలి కుమారుడు నారాయణరావు ఫిర్యాదు మేరకు ఎస్సై పి. వరప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యు తీగలు
వీరఘట్టం : పశువుల మేత కోసం గడ్డి కోయడానికి వెళ్లిన మహిళా రైతు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందారు. రెండు నెలల క్రితం గుండెపోటుతో తండ్రి మృతి చెందిన విషాదం నుంచి తేరుకోకముందే తల్లి కూడా మరణించడంతో కొడుకు ఒక్కసారిగా కుప్పకూలిపోయి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ విషాదకర సంఘటన వీరఘట్టం మండలం కంబర గ్రామంలో బుధవారం జరిగింది. మండలంలోని కంబర గ్రామానికి చెందిన అధికారి సీతమ్మ(62).. తమ ఆవులకు మేత సమకూర్చడం కోసం పచ్చిగడ్డి కోసి తెచ్చేందుకు సమీపంలోని చెరుకు తోటలోకి వెళ్లారు. కడకెల్ల ఫీడరు పరిధిలో ఉన్న విద్యుత్ వైర్లు తరచూ తెగిపడుతూ లైన్ బ్రేక్‌డౌన్ అవుతోంది. బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో లైన్ మూడుసార్లు ట్రిప్ కావడంతో వెంటవెంటనే లైన్ చార్జ్ చేశారు. తర్వాత లైన్ బాగుచేశారు. కంబర సమీపంలో చెరుకు తోటలో 11 కె.వి.ఎ.హెటీ లైన్ వైరు తెగి సమీపంలో ఉన్న ఎల్.టి.లైన్‌పై పడింది. దీంతో లైన్ ట్రిప్ కావడం, తర్వాత లైన్ ఓకే అయ్యింది. అప్పటికే అక్కడ తెగిపడి ఉన్న ఎల్.టి. విద్యుత్ వైరును గమనించకుండా సీతమ్మ గడ్డి కోసేందుకు వెళుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో... పెద్ద పెద్ద కేకలు వేస్తూ అక్కడే ఆమె కుప్పకూలి పోయింది. ఆమెతో పాటు వెళ్లిన లెంక అప్పలస్వామి కాపాడేందుకు ప్రయత్నించగా.. స్వల్పంగా షాకు తగలడంతో వెనక్కి వచ్చి భయంతో కేకలు వేశాడు. అనంతరం సమీపంలో ఉన్న రైతులు వచ్చి కరెంటు ఆఫీసుకు సమాచారమివ్వడంతో విద్యుత్‌సరఫరా నిలిపివేశారు. అప్పటికే సీతమ్మ చనిపోయింది. కాగా గతంలోనూ ఇక్కడ ఈ విద్యుత్ వైర్లు తెగి మంటలు చెలరేగి చెరుకు తోట దగ్దమైన సంఘటనలు ఉన్నాయి. కంబరలో విషాదఛాయలు పొలానికి వెళ్లిన సీతమ్మ మృతి వార్త విన్న గ్రామస్తులు, బంధువులు హుటాహుటిన సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. వీరి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్.ఐ జి.అప్పారావు, పాలకొండ ఏడీఏ ఫణీంద్ర కుమార్, ఏఈ హరికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గ్రామ పెద్ద పొదిలాపు కృష్ణమూర్తి నాయుడుతో మాట్లాడారు. తమ డిపార్ట్మెంట్ నుంచి సీతమ్మ కుటుంబానికి రావాల్సిన పరిహారాన్ని ఇప్పించేందుకు చర్యలు చేపడతామని ఏడీఏ తెలిపారు. అనంతరం ఎస్.ఐ అప్పారావు కేసు నమోదు చేశారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టానికి తరలించారు. కంబర గ్రామానికి వచ్చే విద్యుత్ వైర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, తక్షణమే ఈ లైన్లను రహదారి పక్క గుండా మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్తులు సూచించారు. ఇటీవల ఈ గ్రామానికి వచ్చిన ఇందన శాఖా మంత్రి కళా వెంకటరావుకు ఇదే విషయమై వినతి పత్రమిచ్చినా ఫలితం లేదని వాపోయారు. -
వారి నిర్లక్ష్యానికి నిండుప్రాణాలు బలి..
బుధవారం ఉదయం ఏడుగంటలు.. మలికిపురం పద్మజా థియేటర్ వద్ద పంచాయతీ కుళాయి వద్దకు ఇద్దరు మహిళలు వచ్చి నీటిని పట్టుకుంటున్నారు. ఆ కుళాయికి సమీపంలోనే ఫెన్సింగ్, దానిపై నుంచే హైటెన్షన్ విద్యుత్ తీగలు వెళుతున్నాయి. ఆ ఫెన్సింగ్, వైర్లపై గడ్డిపాదులు పెరిగాయి. దీంతో విద్యుత్ ప్రవాహం ఫెన్సింగ్‌కు పాకింది. ఈ నేపథ్యంలో నీళ్లుపట్టుకుంటున్న ఆ మహిళలిద్దరూ షాక్‌కు గురయ్యారు. 15 నిమిషాల పాటు గిలగిలాకొట్టుకుంటూ ప్రాణాలు విడిచారు. విద్యుత్‌శాఖాధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.. మలికిపురం (రాజోలు): విద్యుదాఘాతంతో మలికిపురంలో బుధవారం ఇద్దరు మహిళల మృతి చెందారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన నల్లి వరలక్ష్మి(50), నల్లి పైడి కుమారి(22) అక్కడికక్కడే మృతి చెందారు. వరుసకు వీరిద్దరూ అత్తా కోడళ్లు. మలికిపురం పద్మజా థియేటర్ ఎదుట పంచాయతీ కుళాయి వద్ద ఉదయమే ఏడు గంటల సమయంలో తాగునీరు పడుతుండగా ఈ సంఘటన జరిగింది. కుళాయి పక్కన ఫెన్సింగ్ ఉంది. దాని పైనే హెచ్‌టీ విద్యుత్ లైన్ ఉంది. ఫెన్సింగ్, విద్యుత్ లైన్లను కలుపుతూ గడ్డి పాదులు పెరిగాయి. దీంతో విద్యుత్ ప్రవాహం ఫెన్సింగ్‌కు పాకింది. తాగునీటిని పడుతున్న సమయంలో ఇద్దరు మహిళలకు విద్యుత్ ప్రవహిస్తున్న ఫెన్సింగ్ తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యారు. సుమారు 15 నిమిషాల వరకూ అలాగే కొట్టుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ సమయంలో విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఫోన్ చేసినా స్పందన లేదని, అధికారులు స్పందించి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపి వేస్తే ప్రాణాలు దక్కేవని స్థానికులు పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా గ్రామస్తులు మృత దేహాలను సబ్ స్టేషన్‌కు తరలించారు. విద్యుత్ లైన్లపై గడ్డి, డొంకలను తొలగించడం లేదని, విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు చేరుకుని ఆందోళన కారులతో చర్చలు జరిపారు. మృతుల కుటుంబాలని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. భర్త చని పోయిన చోటే భార్య వరలక్ష్మి మృతి ప్రమాదంలో మృతి చెందిన నల్లి వరలక్ష్మి మృతి చెందిన చోటే గతంలో ఆమె భర్త పెద్దిరాజు మృతి చెందాడు. ఐదేళ్ల క్రితం పెద్దిరాజు కూడా ఇలానే ఉదయమే నిద్ర లేచిన తరువాత రోడ్డుపై నడిచి వెళుతుండగా లారీ ఢీకొని మృతి చెందారు. ప్రస్తుతం అదే చోట వరలక్ష్మి తాగునీటిని పడుతూ విద్యుత్ ఘాతానికి గురైంది. దీంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరో మృతురాలు నల్లి పైడి కుమారికి ఏంజిల్(7), పుష్ప శ్రీ(4) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త సుధాకర్ ఉపాధి నిమిత్తం ఇటీవల విదేశాలకు వెళ్లారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించం విధి నిర్వహణలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. మలికిపురంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు మహిళలు షాక్‌కు గురై చనిపోయారన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. -
ఇంటి సరుకులు తీసుకొస్తుండగా..
మిర్యాలగూడ అర్బన్ : ఇంటి సరుకులు తీసుకొస్తుండగా బైక్‌ను డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో తల్లి అక్కడిక్కడే మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పట్టణంలోని ఈదులగూడ పెట్రోల్ బంకు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం బొల్లిగుట్టతండాకు చెందిన లావూరి భద్రి(40) తన కుమారుడు సురేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటి సరుకులు తీసుకోవడానికి పట్టణానికి వస్తున్నారు. ఈదులగూడ పెట్రోల్ బంకు వద్దకు రాగానే డీజిల్ కోసం బంకులోకి వస్తున్న డీసీఎం వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్ ఒక్కసారిగా డీసీఎం వ్యాన్ కిందకు వెళ్లడంతో భద్రి అక్కడిక్కడే మృతి చెందింది. సురేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే 108 సహాయంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆ ఇంట్లో ఇద్దరూ మానసిక రోగులే.. లావూరి భద్రి భర్త హర్యలకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడు సురేష్, చిన్న కుమారుడు నరేష్ అంతా బాగానే ఉన్నా భర్త హర్యతో పాటు చిన్న కుమారుడు నరేష్ ఇద్దరూ మానసికంగా ఎదుగుదల లేకుండా ఉన్నారు. వారిలో మృతి చెందిన భద్రి, తీవ్ర గాయాలపాలైన సురేష్‌లు మాత్రమే ఎంతో తెలివితేటలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారి రోదనలతో ఆస్పత్రి మిన్నంటింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
మూఢనమ్మకాలతో మహిళ బలి
లావేరు : సైన్సుతో పోటీపడుతున్న నేటి రోజుల్లో ఇంకా గ్రామాల్లో మూఢనమ్మకాలు పోవడం లేదు. మూఢనమ్మకాలుకు లావేరు మండలంలోని పెద్దలింగాలవలస గ్రామంలో ఒక మహిళ ప్రాణం బలైంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన పాము కాటు సంఘటనే దీనికి నిదర్శనం. మృతురాలు భర్త పారంనాయుడు స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెద్దలింగాలవలస గ్రామానికి చెందిన పట్నాన చిన్నప్పమ్మ(48) అనే మహిళ బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం వారి ఇంటి ఎదుట ఉన్న ఇసుక పోగులు వద్దకు వెళ్లింది. చల్లగాలి వేయడంతో ఇసుక పోగులుపైన పడుకుండిపోయింది. అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఇసుక పోగులపై పాము వెళుతుండగా అక్కడ నిద్రిస్తున్న చిన్నప్పమ్మ దండపై కాటు వేసింది. వెంటనే నిద్రలో నుంచి మేల్కొన్న చిన్నప్పమ్మ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అయితే వారు చిన్నప్పమ్మను ఆస్పత్రికి తీసుకువెళ్లకుండా గ్రామంలో ఉన్న పాము కాటుకు మంత్రాలు వేసే మంత్రగాడి వద్దకు తీసుకువెళ్లారు. మంత్రగాడు మంత్రాలు వేసి ఇంటికి పంపించాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఎప్పటికి చిన్నప్పమ్మకు నొప్పి తగ్గకపోవడం, శ్వాస పీల్చడం కష్టం కావడంతో గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఆమెను లావేరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రి వైద్యుడు పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్ధారించాడు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన చిన్నప్పమ్మ పాము కాటుతో మృతి చెందడంతో ఆమె భర్త, కుమారుడు, కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయాన్ని మృతురాలు భర్త లావేరు పోలీసులుకు తెలియజేయడంతో వారు వచ్చి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. లావేరు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే వైద్యం అంది ఉంటే ప్రాణాలు దక్కేవి పాము కరిచిన వెంటనే మహిళను ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యసేవలు అందిస్తే ప్రాణాలు దక్కేవని పలువురు గ్రామస్తులు అంటున్నారు. మూఢనమ్మకాలతో పాము కాటుకు మంత్రాలు వేయించి వైద్యసేవలు అందకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే మహిళ నిండు ప్రాణాలు పోయాయని ఆవేదన చెందుతున్నారు. ఇక నుంచి అయినా ప్రజలు మూఢనమ్మకాలు విడనాడాలని పలువురు కోరుతున్నారు. -
అనాథల అమ్మ ఇక లేరు
కోటగిరి(బాన్సువాడ) నిజామాబాద్ : కోటగిరి మండల కేంద్రాని కి చెందిన అమ్మ అనాథాశ్రమం వ్యవస్థాపకురాలు పావని(40) అదివారం తెల్లవారుజామున అస్వస్థతతో మృతి చెందారు. పావని కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ వారంరోజులపాటు హైదరాబాద్‌లో చికిత్స పొంది ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. అదివారం కోటగిరిలో పావని అంత్యక్రియలు నిర్వహించారు ఎంపీపీ సులోచన, సర్పంచ్ స్వరూప పలువురు నాయకులు, గ్రామస్తులు హాజరయ్యారు. అనాథ పిల్లలకు అమ్మగా.. తల్లితండ్రులను కోల్పోయి దిక్కులేని అ«నాథలుగా మారిన చిన్నారులను «అక్కున చేర్చుకుని 13 ఏళ్లక్రితం అమ్మ అనాథ ఆశ్రమాన్ని పావని ఏర్పాటు చేశారు. ఇద్దరు పిల్లలతో ఆశ్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇరవై మంది అశ్రమంలో ఉంటున్నారు. సొంత స్థలం లేకున్నా, అధికారుల సహకారంతో ప్రభుత్వ స్థలం సేకరించి, విరాళాలతో అనాథ పిల్లల కోసం శాశ్వత భవనం ఏర్పాటు చేసింది. ఆశ్రమంలో పెరిగిన అనాథ అమ్మాయి భారతికి ఇటీవల వివాహం కూడా చేశారు పావని. పావని మృతి వార్త తెల్సుకున్న పలువురు కంట తడిపెట్టారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కల్లూరు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇమ్మడి శాంతాదేవి (47) మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున ఇమ్మడి చిన్న వీరభద్రరావు, శాంతాదేవి దంపతులు ద్విచక్ర వాహనం పై యోగా క్లాసుకు స్థానిక షుగర్ ఫ్యాక్టరీకి వెళుతుండగా ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదంలో అంతకు ముందే మృతి చెందిన గేదె పైకి ద్విచక్ర వాహనాన్ని ఎక్కించడంతో అదుపు తప్పి పడి పోయింది. ఈ ప్రమాదంలో వాహనం వెనుక కూర్చున్న శాంతాదేవి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం పెనుబల్లి తరలించారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కల్లూరులోని చిన్న వీరభద్రం ఇంటికెళ్లి శాంతాదేవి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. -
గెట్ టు గేదర్‌కు వచ్చి..
వంగర : ఎం.సీతారాంపురం గ్రామంలో 1994–95 పదోతరగతి బ్యాచ్ పూర్వపు విద్యార్థులు ఈ నెల 20న జరుపుకున్న గెట్‌టుగేదర్ కార్యక్రమానికి వచ్చిన మహిళ మద్దూరి కాశీరత్నం(38) సోమవారం గుండెపోటుతో మృతిచెందారు. తోటి స్నేహితుల సమాచారం మేరకు ఎం.సీతారాంపురం పాఠశాలకు వచ్చిన ఆమె పూర్వపు విద్యార్థులు(స్నేహితులు) అందరితో కలిసి సరదాగా గడిపారు. అనంతరం తన కన్నవారి గ్రామం మద్దివలసకు చెందిన తల్లి బెజ్జిపురం నరసమ్మ వద్దకు చేరింది. సోమవారం ఉదయం స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా శంకవరానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా ఆరోగ్యంలో తేడా అనిపించడంతో భర్త ఉదయ్‌భాస్కరనాయుడు సపర్యలు చేశారు. ఫలితం లేకపోయింది. ఆమె గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కలే ఉన్న ఆమె స్నేహితులు(పూర్వ విద్యార్థులు) కుప్పకూలిపోయారు. అంతా కలిసి మద్దివలస గ్రామానికి చేరుకొని కాశీరత్నం మృతదేహం వద్ద రోదించారు. తన స్నేహితురాలు ముందు రోజు తమతో సరదాగా ఉందని, ఒక్కసారి మృత్యువు కబళించడంతో వారంతా విషన్నవదనంలోకి వెళ్లిపోయారు. -
భర్త వేధింపులకు బలైన మహిళ
వర్గల్(గజ్వేల్) : తాగుడుకు బానిసైన భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఒంటికి నిప్పించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వర్గల్ మండలం సింగాయపల్లిలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నల్ల పాపయ్య, శ్రీమతి భార్యాభర్తలు. వారికి పదో తరగతి చదువుతున్న అంజలి , ఏడో తరగతి చదువుతున్న అక్షయ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పాపయ్య తాగుడుకు బానిసై భార్యపై లేనిపోని అనుమానాలు పెట్టుకుని శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమీప పరిశ్రమలో దినసరి కూలీగా పనిచేస్తూ శ్రీమతి కాలం నెట్టుకొచ్చింది. ఈ నెల 16న ఉదయం గొడవపడి భర్త కొట్టడంతో శ్రీమతి తీవ్ర మనో వేదనకు గురైంది. కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగు పొరుగువారు 108 అంబులెన్స్‌లో గజ్వేల్ ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం శ్రీమతి మృతి చెందింది. ఆమె మరణ వాంగ్మూలం ఆధారంగా ఆత్మహత్యకు పురికొల్పి, ఆమె చావుకు కారణమైన భర్త పాపయ్యపై కేసు నమోదు చేశామని ఏఎస్ఐ దేవీదాస్ తెలిపారు. కంటతడి పెట్టించిన కూతుళ్ల రోదనలు.. తండ్రి పెడుతున్న బాధలు భరించలేక తల్లి తనువు చాలించడంతో ఇరువురు కూతుళ్లు అంజలి, అక్షయ పెనువిషాదంలో కూరుకుపోయారు. ఇక మాకు దిక్కెవరు, మమ్మల్ని చూసుకునేదెవరంటూ వారు విలపిస్తున్న తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. తండ్రి కటకటాల పాలవడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మృతురాలి భర్త పాపయ్య పోలీసులకు లొంగిపోగా, అతని తల్లి అండమ్మ కోడలి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. -
కాంక్రీట్ మిల్లర్‌లో నలిగిన మహిళ తల
ఆమదాలవలస : పట్టణంలోని సాగర్ డిగ్రీ కళాశాల పక్కన జరుగుతున్న గృహ నిర్మాణం వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనులు వద్ద జరిగిన ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికురాలు మృతి చెందింది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధి ఒకటో వార్డు జగ్గుశాస్త్రులపేటకు చెందిన దండుపాటి లక్ష్మి(40) భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది. పట్టణంలోని ఎస్.అప్పలనాయుడు గృహ నిర్మాణ పనులకు శుక్రవారం ఉదయం ఆమె వచ్చింది. మధ్యాహ్నం సమయంలో కాంక్రీట్ కలుపుతున్న మిల్లర్ వద్ద ఆమె పనిచేస్తుండగా తన తలకు చుట్టుకుని ఉన్న చుమ్మ(క్లాత్) ప్రమాదవశాత్తు మిల్లర్‌లోకి లాగేసింది. ఆ క్లాత్‌తో పాటు ఆమె జుత్తు కూడా యంత్రంలోకి లాగేసి తల మొత్తం యంత్రంలో చిదిమేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. గృహ యజమాని 108కు సమాచారం అందించాడు. ఆ వాహనం వచ్చేలోపే ఆమె ప్రాణాలు విడిచిపెట్టడంతో చేసేది లేక వైద్య సిబ్బంది వెనుదిరిగారు. అప్పటివరకూ సరదాగా గడిపి... అప్పటివరకు తమతో సరదాగా మాట్లాడుతూ గడిపిన లక్ష్మి ఒక్కసారిగా ఇలా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడంతో తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం కావడంతో భర్త రాముతో పాటు లక్ష్మి నిత్యం కూలీ పనులకు వెళ్తుంది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రాజేశ్వరికి వివాహం కాగా కుమారుడు షణ్ముఖరావు పట్టణంలో ఐటీఐ చదువుతున్నాడు. చిన్న కుమార్తె తేజేశ్వరి మండలంలోని అక్కులపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదివి, ఇటీవల వచ్చిన ఫలితాల్లో పాసైంది. తమ తల్లి మరణవార్త విన్న పిల్లలు తల్లడిల్లిపోయి కన్నీరుమున్నీరై విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. అయితే విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ జి.వాసుదేవరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును కార్మికులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
శుభ కార్యానికి వచ్చి మృత్యు ఒడిలోకి
చిన్నశంకరంపేట(మెదక్) : సోదరి ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకలకు హాజరైన మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో విషాదం నింపింది. శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలు గ్రామస్తుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గొట్టం మాధవి(24) శనివారం ఉదయం ఇంటి ఇనుప మెట్లకు విద్యుత్ సరఫరా జరగడంతో విద్యుత్ షాక్‌కు గురై ప్రమాదవశాత్తు మృతి చెందింది. తన సోదరి రుద్రారం గ్రామానికి చెందిన లావణ్య ఇంట్లో ఈ నెల 10న జరిగిన పెళ్లి వేడుకలకు హాజరైన మాధవి శనివారం ఉదయం స్లాబ్‌పైకి వేసిన ఇనుప మెట్లు ఎక్కుతూ విద్యుత్ షాక్ గురైంది. శుక్రవారం రాత్రి వీచిన గాలికి విద్యుత్ వైర్లు ఇంటి ఇనుప మెట్లకు తాకి విద్యుత్ సరఫరా అయిందని భావిస్తున్నారు. మెట్లపైకి ఎక్కుతున్న మాధవి విద్యుత్ షాక్‌తో ఒక్కసారిగా పడిపోవడంతో వెంటనే నార్సింగి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మాధవికి అఖిల్, అల్పేష్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. భర్త నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నశంకరంపేట ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపారు. -
కుమారుడి పెళ్లి చూడకుండానే..
కొలిమిగుండ్ల: మరికొన్ని గంటల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. ఈ వేడుక కోసం బంధువులంతా తరలిరావడంతో సందడి నెలకొంది. మరో వైపు వధువు తరఫు వారు వరుడి ఇంటికి బయలుదేరారు. వరుడి కుటుంబ సభ్యులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంతలో వరుడి తల్లి గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లెలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బూసిగారి కంబయ్య, దేవమ్మ(45) దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. చివరి కుమారుడు లక్ష్మణుడికి వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియం మండలం ఎస్. ఉప్పలపాడుకు చెందిన యువతితో వివాహం కుదిరింది. శనివారం ఉదయం 8 గంటలకు వరుడి స్వగృహంలోనే పెళ్లి తంతు జరగాల్సి ఉంది. సంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకును చేశాక బంధువులందరితో కలసి గ్రామంలోని దేవాలయాల్లో టెంకాయలు కొట్టేం దుకు మేళతాళాలతో బయలు దేరి వెళ్లారు. ఇంటి వద్దే ఉన్న దేవమ్మ ఒక్క సారిగా గుండె పోటు రావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. అంతవరకూ ఉత్సాహంగా గడిపిన ఆమె ఇక లేదని తెలియడంతో కుటుంబ సభ్యులు, బం«ధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
మహబూబాబాద్ రూరల్ : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ పట్టణ శివారు సాలార్ తండాలో చోటుచేసుకుంది. మృతురాలి తల్లి గుగులోత్ చావ్లీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి గ్రామ శివారు జేత్రాం తండాకు చెందిన గుగులోత్ చావ్లీ కుమార్తె అరుణ(27)ను మహబూబాబాద్ పట్టణ శివారు సాలార్‌తండాకు చెందిన భూక్యా కృష్ణ మహర్షికి ఇచ్చి 9 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వివాహం అయినప్పటి నుంచి కృష్ణమహర్షి భార్య అరుణను హింసించేవాడు. అంతేకాకుండా ఆమె మామ లక్పతి, మరిది బ్రహ్మమహర్షి అలియాస్ బన్ను కూడా వేధించేవారు. గతంలో ఈ వేధింపులపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయినప్పటికీ వారు తమ పద్ధతి మార్చుకోలేదు. వేధింపుల గురించి అరుణ తన తల్లి గుగులోత్ చావ్లీకి పలుమార్లు చెప్పుకుంటూ బాధపడేది. కాగా, ఈ నెల 9వ తేదీ రాత్రి 11.30 గంటలకు భూక్యా అరుణ విషం తీసుకుందని తల్లి చావ్లీకి ఫోన్ ద్వారా ఆమె భర్త సమాచారం అందించాడు. మొదట మానుకోట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక వైద్యులు హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. అయినప్పటికీ సదరు వ్యక్తులు హైదరాబాద్ తీసుకెళ్లకుండా మానుకోటలోనే అరుణకు వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో 10వ తేదీ ఉదయం ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు అరుణ మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి మానుకోట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. తన కుమార్తె మృతిపై అనుమానంగా ఉందని, ఆమెకు బలవంతంగా విషం తాగించారని, కుడి కన్నుపై బలమైన గాయం ఉందని, చెవుల నుంచి రక్తం వస్తుందని, మెడ మొత్తం కమిలిపోయి ఉందని తల్లి గుగులోత్ చావ్లీ రోదిస్తూ తెలిపింది. అరుణ మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చావ్లీ మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. టౌన్ సీఐ జబ్బార్ ఏరియా ఆస్పత్రికి వెళ్లి అరుణ మృతదేహాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
కొత్తవలస విజయనగరం : అనకాపల్లి నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన కొత్తవలస జంక్షన్లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సబ్బవరం రోడ్డు గవరపాలెంనకు చెందిన మాదాబత్తుల బంగారమ్మ (62) బజారు పనిమీద కొత్తవలస జంక్షన్లో రోడ్డు దాటుతుండగా, ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బంగారమ్మను విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో గవరపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. రెండు నెలల ముందే తండ్రి మృతి చెందగా.. ఇప్పుడు తల్లి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. కొత్తవలస హెచ్‌సీ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చికెన్ సెంటర్లో విద్యుదాఘాతం
తెర్లాం : విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన డి. గదబవలసలో జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని డి.గదబవలస గ్రామానికి చెందిన చెల్లూరి లక్ష్మి (38) గ్రామంలోని ఒకటో అంగన్వాడీ కేంద్రంలో హెల్పర్(ఆయా)గా పనిచేస్తోంది. ఈమె భర్త బలరాం గ్రామంలోనే చికెన్ సెంటర్ నడుపుతుంటాడు. లక్ష్మి ఖాళీ సమయాల్లో భర్తకు తోడుగా చికెన్ సెంటర్లో పనిచేసేది. అప్పటిలాగే బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో కోళ్లను శుభ్రం చేసేందుకు (వెంట్రుకలు తీసేందుకు) గ్రైండర్లో కోళ్లు వేసి స్విచ్ ఆన్ చేయగా, షాక్ కొట్టడంతో లక్ష్మి స్పృహ కోల్పోయింది. వెంటనే లక్ష్మిని ఆమె భర్త బలరాం, కుటుంబ సభ్యులు రాజాంలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. మృతురాలు లక్ష్మికి భర్తతో పాటు ముగ్గురు ఆడపిల్లలున్నారు. అంతవరకు తమతో కలిసి ఉన్న తల్లి మృతి చెందడాన్ని పిల్లలు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహం వద్ద వారు విలపిస్తున్న తీరు పలువురిని కంట తడిపెట్టించింది. లక్ష్మి మృతి విషయాన్ని వీఆర్ఓ శ్రీనివాసరావు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హెచ్‌సీ శ్రీనివాసరావు గ్రామానికి చేరుకుని పెద్దల సమక్షంలో శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.విద్యుదాఘాతంతో మహిళ మృతి -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
విజయనగరం టౌన్ : ద్విచక్రవాహనం అదుపు తప్పి పడిపోవడంతో మహిళ మృతి చెందింది. దీనికి సంబంధించి రూరల్ పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంకలాం గ్రామానికి చెందిన దన్నాన సంతోషి (27) భర్త పైడిరాజు, ఇద్దరు పిల్లలో గురువారం రాత్రి గ్రామంలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యారు. వివాహం అనంతరం తిరుగుప్రయాణంలో ద్విచక్రవాహనంపై వస్తుండగా, ఎల్లమ్మ తల్లి గుడి వద్ద బైక్ అదుపు తప్పడంతో అందరూ కింద పడిపోయారు. అయితే సంతోషి తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారకస్థితికి చేరుకుంది. దీంతో స్థానికుల సహాయంతో భర్త ఆమెను కేంద్రాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రూరల్ ఎస్సై రామకృష్ణ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గాలిలో 144 మంది.. పేలిన విమానం ఇంజన్!
ఫిలిడెల్ఫియా : గగనతలంలో అనూహ్యరీతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ అమెరికా విమానం ఇంజన్ మధ్యలో పేలిపోయింది. ఆ ఇంజన్ శకలం దూసుకొచ్చి.. విమానం కిటికీని ఢీకొట్టింది. దీంతో విమానానికి రంధ్రం ఏర్పడి.. ప్రయాణికుల్లో తీవ్ర భయోత్పాతాన్ని సృష్టించింది. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోగా, ఏడుగురు గాయపడ్డారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ చెందిన విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఇంజన్ పేలిపోయింది. ఇంజన్ శకలం దూసుకొచ్చి కిటికీని ఢీకొట్టడంతో.. కిటికీ పక్కనే సీట్లో కూర్చున్న మహిళ తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. అయితే, పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి.. వెంటనే సమీపంలో ఉన్న ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో విమానాన్ని దింపడంతో పెనుప్రమాదం తప్పింది. పెద్దసంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. డల్లాస్ నుంచి 144 మంది ప్రయాణికులతో బయలుదేరిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ 1380 ఫిలిడెల్ఫియాలో అత్యవసరంగా దిగింది. విమానం ఇంజన్ ఒక్కసారిగా పేలడం.. విమానానికి రంధ్రం పడటంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళలకు గురైయ్యారు. అతి కష్టం మీద విమాన సిబ్బంది ఆ రంధ్రాన్ని మూసివేశారు. ఈ సందర్భంగా విమానంలోకి గ్యాస్ ప్రవేశించడంతో ఊపిరాడక ప్రయాణికులు తీవ్ర అవస్థపడ్డారు. వారికి అత్యవసరంగా సిబ్బంది ఆక్సీజన్ మాస్కులు అందించారు. ఈ ఘటనలో మృతిచెందిన మహిళను జెన్నిఫర్ రియోర్డాన్ గుర్తించారు. ఆమె బ్యాంకు ఉద్యోగి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా ప్రాణాలు కాపాడు దేవుడా.. అని ప్రార్థించాం గాలిలో ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. విమానం ఫిలడెల్ఫియా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేంతవరకు ప్రార్థనలు చేస్తూ.. భయాందోళనతో గడిపారు. ‘విమాన ప్రమాదం జరిగిన తరువాత మాకు గాలి ఆడలేదు. ఒక్కసారిగా ఆక్సిజన్ ముసుగులు తెరుచుకున్నాయి. మా ప్రాణాలు కాపాడు దేవుడా అని అందరం ప్రార్ధించాం’ అని న్యూయార్క్ ప్రయాణికుడొకరు తెలిపారు. ప్రమాదం జరిగిందని తెలిసిన తరువాత తన భర్త చేతిని గట్టగా పట్టుకున్నానని, ఆ సమయంలో తన పిల్లల గుర్తుకు వచ్చారని, మళ్ళి వాళ్ళను తిరిగి చూడగలనా అన్న భయం కలిగిందని ఓ ప్రయాణికురాలు తెలిపారు. ప్రమాదంలో మరణిచిన రియోర్డాన్ న్యూ మెక్సికో విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్. ఆమె గతంలో సమాజ సంబంధాల రంగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 2009 నుంచి సౌత్‌వెస్ట్ ఏయిర్ లైన్స్‌లో ఇలాంటి ప్రమాదం జరగటం మొదటిసారి అని సంస్థ సిబ్బంది తెలిపారు. విమానం 30,000 వేల అడుగులో ఉండగా ఇంజన్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించామని, ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో గ్యాస్ లీకైందని విమాన సిబ్బంది తెలిపారు. గ్యాస్ లీకైన వెంటనే విమానంలో ఆక్సిజన్ మాస్క్‌లు తెరుచుకున్నాయని, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదన్నారు. తరువాత ప్రయాణికులను సౌత్‌వెస్ట్ బోయింగ్ 737-700 విమానంలో ప్రయాణికులను లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌కు సురక్షితంగా తరలించామని సౌత్‌వెస్ట్ విమాన అధికారులు తెలిపారు. -
మహిళ ప్రాణాన్ని బలిగొన్న ఎలక్ట్రికల్ హీటర్
ద్వారకాతిరుమల: ఎలక్ట్రికల్ హీటర్‌తో వేడినీటిని కాస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని సీహెచ్.పోతేపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తుపాకుల వెంకటలక్ష్మి (39), భర్త వెంకన్నబాబు కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఇదిలా ఉంటే వెంకటలక్ష్మి రోజులానే ఇంట్లో ఎలక్ట్రికల్ హీటర్‌తో ఒక స్టీలు బిందెలో నీటిని కాస్తోంది. అయితే ప్రమాదవశాత్తు ఆమె కాలు బిందెకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను హుటాహుటిన స్థానిక వైద్యులతో పరీక్ష చేయించగా, ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సంఘటనా స్థలాన్ని భీమడోలు సీఐ బి.నాగేశ్వర్‌నాయక్, దెందులూరు ఎస్సై శంకర్లు పరిశీలించారు. దీనిపై కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
మరణించి.. మరొకరికి వెలుగునిచ్చి..
పెందుర్తి: మరణంలోనూ ఆమె మరొకరికి వెలుగునిచ్చింది. పెందుర్తి మండలం పినగాడిలో మంగళవారం విద్యుదాఘాతంతో ఓ మహిళ మృత్యువాత పడింది. ఇంటిపై ఉతికిన దుస్తులు ఆరేస్తుండగా సమీపంలోని విద్యుత్ వైర్లు తగలడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. మృతురాలి కళ్ళను కటుంబసభ్యులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలివి.. పినగాడి బీసీ కాలనీలో వంటాకుల నాగమణి(48) కుమార్తెతో కలిసి నివాసం ఉంటుంది. మంగళవారం ఉదయం 8.40 సమయంలో ఉతికిన బట్టలు ఆరబెట్టేందుకు మేడ మీదకు వెళ్ళింది. ఈ క్రమంలో సమీపంలోని విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు నాగమణి చేయి తగలడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం తెలుసుకున్న పెందుర్తి సీఐ పి.సూర్యనారాయణ, ఎస్ఐ రామారావు ఘటనాస్థలికి వెళ్ళి వివరాలు సేకరించారు. కేజీహెచ్ ఐబ్యాంక్ ప్రతినిధులు కుటుంబసభ్యులకు నేత్రదానం గురించి వివరించగా నాగమణి నేత్రాలను ఇచ్చేందుకు అంగీకరించారు. వైద్యులు ఆమె కళ్ళను సేకరించారు. -
ఈత రాకపోవడంతో
వేంపల్లె : మండల పరిధిలోని టి.వెలమవారిపల్లె గ్రామానికి చెందిన బండె నూర్జహాన్(40) మంగళవారం సాయంత్రం బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కుప్పాలపల్లెకు చెందిన బైబిరెడ్డి సన్న నిమ్మతోటను టి.వెలమవారిపల్లెకు చెందిన బండె గుర్రప్ప కౌలుకు తీసుకున్నాడు. గుర్రప్ప, భార్య నూర్జహాన్ నిమ్మతోటలో పని చేసేందుకు వెళ్లారు. నీరు తాగేందుకు తేవడానికి బిందెను తీసుకొని బావిలోకి దిగింది. అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడింది. ఈత రాకపోవడంతో బయటకు రాలేక చనిపోయింది. ఆమె ఎంత సేపటికి రాకపోవడంతో భర్త గుర్రప్ప బావి దగ్గరికి వెళ్లి చూడగా నీళ్లలో తేలియాడుతోంది. గుర్రప్ప కేకలు వేయడంతో చుట్టూ పొలాల్లో ఉన్న రైతులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలాన్ని వేంపల్లె ఎస్ఐ చలపతి పరిశీలించారు. మృతదేహానికి వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వడదెబ్బతో మహిళ మృతి
కోదాడరూరల్ : వడదెబ్బతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని చిమిర్యాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కొండ సుశీల (55)ఏపీలోని మక్కపేటకు మిరప కూలీ పనులకు వెళ్తుంది. బుధవారం రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఇంటి వద్ద చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ గడిపూడి శ్రీకాంత్ కోరారు. -
ప్రసాదం తిని ఇద్దరు మహిళల మృతి
కోయంబత్తూరు : ప్రసాదం తిని అస్వస్థతకు గురైన ఇద్దరు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తమిళనాడులోని మెట్టుపాలాయంలోని సెల్వముత్తు మరియమ్మమ్ ఆలయంలో ప్రసాదం తిని సుమారు 30మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఆలయంలో ప్రసాదం స్వీకరించిన 30 మంది భక్తులకు వాంతులు, విరేచనాలు కావడంతో వారిని మెట్టుపాలాయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌గా నిర్ధారించిన వైద్యులు చికిత్స చేపట్టారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోకనాయకి, సావిత్రి గురువారం ఉదయం మృతి చెందారు. మిగతా 28మందికి డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఆలయంలో తయారుచేసే ప్రసాదానికి పాడైపోయిన నెయ్యి, నూనె వాడటమే ఫుడ్ పాయిజన్ కావడానికి కారణంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పాముకాటుతో మహిళ మృతి
రాయపోలు(దుబ్బాక): పాముకాటుకు గురైన మహిళ ఆసుపత్రిలో చికి త్స పొందుతూ మృతిచెందిన సంఘటన దౌల్తాబాద్ మండలం ఉప్పర్‌పల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మద్దెల ఎల్లమ్మ(38) ఆదివారం పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆరుబయట కూర్చున్న కాసేపటికే అస్వస్థతకు గురైన ఎల్లమ్మ నోట్లో నుంచి నురగలు కక్కింది. దీంతో పాముకాటు వేసిందని నిర్ధారించుకున్న కుటుంబసభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి ఎల్లమ్మ మృతిచెందింది. మృతురాలికి భర్త పెంటయ్యతో పాటు ఓ కూతురు దివ్య ఉంది. కొడుకులు లేకపోవడంతో ఎల్లమ్మకు కూతురు తలకొరివి పెట్టింది. -
ఓవర్ టేక్ చేయబోయి అదుపు తప్పిన కారు ఒకరి మృతి
సిద్దిపేటటౌన్: ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం సిద్దిపేట శివారు ఇమాంబాద్ వద్ద జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం షాద్‌నగర్‌కు చెందిన రాళ్లబండి వెంకటరామరాజు కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిఖనిలో ఉండే బంధువుల ఇంట్లో పెళ్లికి ఆదివారం వెళ్లారు. పెళ్లి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్లారు. దర్శనం చేసుకున్న అనంతరం షాద్‌నగర్‌కు తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో సిద్దిపేట పట్టణ శివారు ఇమాంబాద్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయిన కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో వెంకటరామరాజు భార్య కనకదుర్గ సీట్ బెల్ట్ ధరించకపోవడంతో ప్రమాద స్థలంలోనే మృతి చెందింది. రామరాజు, అతడి కొడుకు కృష్ణమోహన్, కోడలు మధుమిత, మనమరాలు తన్విశ్రీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
బైక్ పైనుంచి దూకిన మహిళ మృతి
తొగుట(దుబ్బాక): బైక్ పైనుంచి దూకి గాయపడిన మహిళ సోమవారం మరణించిందని తొగుట ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన నరెడ్ల భారతమ్మ (50) రోజూ సిద్దిపేటలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం సిద్దిపేటకు వెళ్లి తిరిగి వచ్చేందుకు ఘణపురం వెళ్లే ఆటోలో మెట్టు వరకు వచ్చింది. అక్కడ మరో ఆటోకోసం ఎదురుచూస్తున్న క్రమంలో వేములఘాట్ మదిర తుర్కబంజేరుపల్లికి చెందిన ఇరుగదిండ్ల ప్రశాంత్ బైక్ ఎక్కింది. ఈ క్రమంలో అతడు ఎల్లారెడ్డిపేట స్టేజీ వద్ద బైక్ ఆపకుండా వెళ్తున్నాడు. దీంతో భయాందోళనకు గురైన భారతమ్మ బైక్ పైనుంచి కిందకు దూకింది. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమెను ప్రశాంత్ చికిత్స కోసం సిద్దిపేటకు తరలించాడు. పరిస్థితి విషమంగా మారడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రజ్ఞాపూర్ వద్ద భారతమ్మ మృతిచెందింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ వివరించారు. -
మహిళను చిదిమేసిన లారీ
గజ్వేల్‌రూరల్: లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన సంఘటన మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా జగదేవ్‌పూర్ వెళ్లే మార్గంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఎర్ర కలమ్మ(46) కూలీ పనులు చేస్తుంది. సోమవారం ఉదయం ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద జగదేవ్‌పూర్ మార్గంలో రాజీవ్ రహదారిని దాటుతుండగా గజ్వేల్ నుంచి భువనగిరి వైపు వెళ్తున్న హరియాణకు చెందిన లారీ (హెచ్ఆర్ 55క్యూ 7034) ఆమెను ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కలమ్మ కాలు తెగిపడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాజీవ్ రహదారిపై రోడ్లకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గజ్వేల్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ సీఐ నర్సింగరావులు సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రోడ్డుపైనే బైఠాయించారు. మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ రోడ్డుపై «రాస్తారోకో చేస్తున్న వారికి నచ్చజెప్పి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. మృతురాలు కలమ్మకు కొడుకు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ రూ. 10 వేలు ఆర్థిక సాయం చేశారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి ప్రతాపరెడ్డి బాధిత కుటుంబీకులను పరామర్శించారు.