డివైడర్‌ను ఢీకొని ధ్వంసమైన ఆటో
గుంటూరు, చిలకలూరిపేట: రోడ్డు డివైడర్‌ను ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, మూడేళ్ల బాలుడితో పాటు ఆరుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో పట్టణానికి చెందిన రహమత్ నగర్, తూర్పు మాలపల్లె, ఎన్‌టీఆర్ కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన వారు రోజు కూలీకి వెళతారు. సాయంత్రం పనులు ముగిశాక సుమారు 10 మంది కార్మికులు ఆటోలో పట్టణంలోని ఇళ్లకు బయలు దేరారు. జాతీయ రహదారిలోని ఏఎంజీ సంస్థ సమీపంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్టు వద్ద వేగంగా వస్తున్న ఆటో అదుపు తప్పి రోడ్డు మధ్య ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి పైకి ఎక్కింది. దీం తో ఆటోలో ఉన్న ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన కొరటాల వాణి(55) మృతి చెందగా, నేలపాటి దయమ్మ, గట్టుపల్లి శౌరమ్మ, షేక్ శిలార్‌బీ, షేక్ మీరాబీ, జి.విజయరాణి, ఆమె కుమారుడైన మూడేళ్ల బాలుడు జి.హర్షవర్థన్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో నేలపాటి దయమ్మ, గట్టుపల్లి శౌరమ్మ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కొందరిని గుంటూరు జీజీహెచ్‌కు, మరికొందరిని పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న అర్బన్ సీఐ జి.శ్రీనివాసరావు, పట్టణ ఎస్‌ఐ ఎం.ఉమామహేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అతివేగమే కారణమా?
ఆటో అతివేగంగా ప్రయాణించటమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే మోటార్‌బైక్‌ను తప్పించే క్రమంలో ఆటో డివైడర్‌ను ఢీకొని పైకి ఎక్కటంతో ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు. ఏదిఏమైనా చెక్‌పోస్టు సమీపంలో బ్యారన్ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి పైకి ప్రవేశించేందుకు ఉన్న జంక్షన్‌లో గతంలోనూ పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో జంక్షన్ వద్ద పోలీసులు గతంలోనే ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేశారు. ఇక్కడ క్రాస్‌రోడ్డు ఉన్నా పట్టించుకోకుండా అతివేగంగా ప్రయాణించటమే పలు ప్రమాదాలకు కారణంగా ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment