జయకృష్ణ మృదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
వినుకొండ(నూజెండ్ల): ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన వినుకొండ–నూజెండ్ల రహదారిపై ఆముదాలమిల్లు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నూజెండ్ల మండలం పాలుప్పలపాడుకు చెందిన కట్టెంపూడి జయకృష్ణ , బొల్లాపల్లి మండలం కనుమలచెరువుకు చెందిన కందుకూరి రాజు కొత్త ఉప్పలపాడులో అన్నదమ్ముల పిల్లలైన బాలరోజా, యోగేశ్వరమ్మలను రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. జయకృష్ణ భార్య బాలరోజా మూడు నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. రాజు భార్య యోగేశ్వరమ్మకు 6 నెలల బాబు ఉన్నాడు. యోగేశ్వరమ్మ తన అత్త ఇంటి వద్ద కనుమలచెరువులో ఉంది. వరుసకు తోడల్లుళ్లయిన జయకృష్ణ, రాజు మంగళవారం వినుకొండ వచ్చారు. కూలర్ కొనుగోలు చేసి కొత్త ఉప్పలపాడు బయలు దేరారు. వినుకొండ దాటి 2 కిలోమీటర్లు ప్రయాణించగానే నూజెండ్ల నుంచి వినుకొండ వస్తున్న ట్రాక్టరు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో జయకృష్ణ, రాజు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో నుజ్జునుజ్జయింది. ట్రాక్టరు ట్రక్కు తిరగబడింది. వినుకొండ ఎస్‌ఐ శివరామయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు
ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారనే వార్త తెలుసుకున్న పాత ఉప్పలపాడు, కొత్త ఉప్పలపాడు, కనుమలచెరువు గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. భార్యా పిలల్లకు దిక్కెవరయ్యా అంటూ గుండెలు బాదుకున్నారు. ఆస్పత్రి వద్ద రోదనలు మిన్నంటాయి.
మృతుల కుటుంబాలకు పరామర్శ
జయకృష్ణ తండ్రి కట్టెంపూడి పిచ్చయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూజెండ్ల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అతని కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment