ఆటో బోల్తా.. రైతు కూలీలకు తీవ్రగాయాలు
Published Fri, Aug 30 2013 4:52 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
నరసరావుపేటటౌన్, న్యూస్‌లైన్ : పరిమితికి మించి ప్రయాణం... మితిమీరిన వేగం.. ప్రమాదానికి కారణమైంది. పొలానికి వెళ్తున్న కూలీలను గాయాలపాల్జేసింది. ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తొమ్మిది మంది మహిళలు తీవ్రంగా గాయపడగా.. మరికొందరికి స్పల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణంలోని కోటప్పకొండ రోడ్డులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని బోయబజారుకు చెందిన మహిళా రైతు కూలీలు రోజు పత్తిలో కలుపు తీసేందుకు పరిసర ప్రాంత గ్రామాలకు వెళ్తుంటారు.
గురువారం ఉదయం కూడా సుమారు 20 మంది కూలీలు బోయబజారులో ఆటో ఎక్కి కేసానుపల్లి గ్రామ శివారులోని పత్తి పొలాల్లో కలుపు తీసేందుకు బయలుదే రారు. మార్గంమధ్యలో కోటప్పకొండ రోడ్డు సాంబశివరావుపేట సమీపంలోకి రాగానే ఆటో అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ సంఘటనలో ఒంటేరు వెంకటలక్ష్మి, మండ్ల రాణి, షేక్ శ్యామ, ఎ.నారాయణమ్మ, యనమల పుష్ప, మీనిగ రమాదేవి, మల్లా పిచ్చమ్మ, నలబోతుల నాగేంద్రం, మీనిగ కాశమ్మలకు తీవ్రగాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారం మేరకు.. 108 సిబ్బంది అక్కడకు చేరుకొని బాధితులను ఏరియా వైద్యశాలకు తరలించారు. టూటౌన్ సీఐ కోటేశ్వరరావు సిబ్బందితో వచ్చి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. చికిత్స పొందుతున్న వారి వివరాలు తెలుసుకున్నారు. సంఘటనతో ఆందోళన చెందిన ఆటో డ్రైవర్ కేసానుపల్లికి చెందిన నారాయణ పరారుకాగా పోలీసులు ఆటోను స్టేషన్‌కు తరలించారు. వెంకటలక్ష్మి, రమాదేవి, పిచ్చమ్మల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Advertisement
Advertisement