మృతిచెందిన అధికారి సీతమ్మ
వీరఘట్టం : పశువుల మేత కోసం గడ్డి కోయడానికి వెళ్లిన మహిళా రైతు విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందారు. రెండు నెలల క్రితం గుండెపోటుతో తండ్రి మృతి చెందిన విషాదం నుంచి తేరుకోకముందే తల్లి కూడా మరణించడంతో కొడుకు ఒక్కసారిగా కుప్పకూలిపోయి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
ఈ విషాదకర సంఘటన వీరఘట్టం మండలం కంబర గ్రామంలో బుధవారం జరిగింది. మండలంలోని కంబర గ్రామానికి చెందిన అధికారి సీతమ్మ(62).. తమ ఆవులకు మేత సమకూర్చడం కోసం పచ్చిగడ్డి కోసి తెచ్చేందుకు సమీపంలోని చెరుకు తోటలోకి వెళ్లారు.
కడకెల్ల ఫీడరు పరిధిలో ఉన్న విద్యుత్ వైర్లు తరచూ తెగిపడుతూ లైన్ బ్రేక్‌డౌన్ అవుతోంది. బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో లైన్ మూడుసార్లు ట్రిప్ కావడంతో వెంటవెంటనే లైన్ చార్జ్ చేశారు. తర్వాత లైన్ బాగుచేశారు. కంబర సమీపంలో చెరుకు తోటలో 11 కె.వి.ఎ.హెటీ లైన్ వైరు తెగి సమీపంలో ఉన్న ఎల్.టి.లైన్‌పై పడింది.
దీంతో లైన్ ట్రిప్ కావడం, తర్వాత లైన్ ఓకే అయ్యింది. అప్పటికే అక్కడ తెగిపడి ఉన్న ఎల్.టి. విద్యుత్ వైరును గమనించకుండా సీతమ్మ గడ్డి కోసేందుకు వెళుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో... పెద్ద పెద్ద కేకలు వేస్తూ అక్కడే ఆమె కుప్పకూలి పోయింది.
ఆమెతో పాటు వెళ్లిన లెంక అప్పలస్వామి కాపాడేందుకు ప్రయత్నించగా.. స్వల్పంగా షాకు తగలడంతో వెనక్కి వచ్చి భయంతో కేకలు వేశాడు. అనంతరం సమీపంలో ఉన్న రైతులు వచ్చి కరెంటు ఆఫీసుకు సమాచారమివ్వడంతో విద్యుత్‌సరఫరా నిలిపివేశారు. అప్పటికే సీతమ్మ చనిపోయింది. కాగా గతంలోనూ ఇక్కడ ఈ విద్యుత్ వైర్లు తెగి మంటలు చెలరేగి చెరుకు తోట దగ్దమైన సంఘటనలు ఉన్నాయి.
కంబరలో విషాదఛాయలు
పొలానికి వెళ్లిన సీతమ్మ మృతి వార్త విన్న గ్రామస్తులు, బంధువులు హుటాహుటిన సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. వీరి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్.ఐ జి.అప్పారావు, పాలకొండ ఏడీఏ ఫణీంద్ర కుమార్, ఏఈ హరికృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
గ్రామ పెద్ద పొదిలాపు కృష్ణమూర్తి నాయుడుతో మాట్లాడారు. తమ డిపార్ట్‌మెంట్ నుంచి సీతమ్మ కుటుంబానికి రావాల్సిన పరిహారాన్ని ఇప్పించేందుకు చర్యలు చేపడతామని ఏడీఏ తెలిపారు. అనంతరం ఎస్.ఐ అప్పారావు కేసు నమోదు చేశారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పాలకొండ ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టానికి తరలించారు.
కంబర గ్రామానికి వచ్చే విద్యుత్ వైర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, తక్షణమే ఈ లైన్లను రహదారి పక్క గుండా మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్తులు సూచించారు. ఇటీవల ఈ గ్రామానికి వచ్చిన ఇందన శాఖా మంత్రి కళా వెంకటరావుకు ఇదే విషయమై వినతి పత్రమిచ్చినా ఫలితం లేదని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment