భక్తురాలు భవానీపై రాయి పడిన ప్రదేశం (ఇన్‌సెట్) భవానీ మృతదేహం
సాక్షి, సింహాచలం(విశాఖపట్టణం) : దేవస్థానం అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. దైవదర్శనానికి వస్తే బండరాయి రూపంలో మృత్యువు కాటేయడంతో తరలిరాని లోకాలకు ఓ యువతి వెళ్లిపోయింది. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన సింహగిరి మెట్ల మార్గంలో బుధవారం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే... శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుందామని సబ్బవరం మండలం పెదనాయుడుపాలెం గ్రామానికి చెందిన ఆదిరెడ్డి భవాని(28) బుధవారం మెట్లమార్గంలో నడిచి బయలుదేరింది. అదే సమయంలో మెట్లమార్గం విస్తరణ పనుల్లో భాగంగా పొక్లెయిన్ సాయంతో కొండప్రాంతాన్ని చదును చేస్తున్నారు. సరిగ్గా మార్గ మధ్యలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి ఓ బండరాయి జారివచ్చి భవానీతోపాటు కె.కోటపాడు మండలం పొడుగుపాలెం గ్రామానికి చెందిన సూరెడ్డి జగదీశ్వరికి తగిలింది. వీరిలో తీవ్ర గాయాలపాలైన భవాని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. జగదీశ్వరి గాయాలతో చికిత్స పొందుతోంది.
పరిహారం చెల్లించాలని డిమాండ్
ఆరిలోవ(విశాఖ తూర్పు): సింహాచలం అప్పన్నను దర్శించుకోవడానికి వస్తూ మెట్ల మార్గంలో బండరాయి తగలడంతో గాయాలపాలైన ఆదిరెడ్డి భవాని(28) హెల్త్‌సిటీలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అప్పటికే స్వగ్రామం నుంచి ఆస్పత్రికి చేరుకొన్న భవాని తల్లిదండ్రులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకొన్న ఆర్డీవో తేజ్ భరత్, సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రరావు, రూరల్ తహసీల్దారు ఆర్.నర్సింహమూర్తి ఆస్పత్రి వద్దకు చేరుకొన్నారు. భవానీ మృతదేహాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతున్న జగదీశ్వరి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్దకు చేరుకొన్న భవాని బంధువులు అధికారులను నిలదీశారు.
మెట్ల మార్గంలో పనులు జరిపిస్తూ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, నష్టపరిహారం చెల్లించా లని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్డీవో తేజ్‌భరత్, ఈవో కె.రామచంద్రరావు, మంత్రి అవంతి శ్రీనివాసరావు సోదరుడు మహేష్ చర్చించి మృతురాలి కుటుంబానికి దేవస్థానం తరఫున రూ.9లక్షలు పరిహారం అందించేందుకు అంగీక రించారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున బీమా సొమ్ము రూ.5లక్షలు ఇప్పించేందుకు యత్నిస్తామన్నారు. మరోవైపు తక్షణ సాయంగా దేవస్థానం తరఫున రూ.15వేలు, ప్రభుత్వం తరఫున రూ.5వేలు అందించారు. చికిత్స పొందుతున్న జగదీశ్వరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆర్టీవో తేజ్‌భరత్ సూచించారు.
రక్షణ లేకుండానే విస్తరణ పనులు
భవిష్యతలో మెట్లమార్గంలో నడిచి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా మెట్లమార్గాన్ని విస్తరించాలని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు సూచించారు. అందులో భాగంగా రూ.8 కోట్లతో కొండ దిగువ నుంచి పై వరకు ప్రస్తుతం ఉన్న మెట్ల మార్గాన్ని మరో పది అడుగుల వెడల్పున విస్తరించే పనులు చేపట్టారు. ఇప్పటికి కొండదిగువ తొలిపావంచా నుంచి కొంతమేర పైవరకు పనులు పూర్తిచేసి కొత్త మెట్లు నిర్మించేశారు. మధ్యలోకి వచ్చేసరికి లోయ ఉన్న ప్రాంతంవైపు విస్తరణ పనులు ప్రస్తుతం చేస్తున్నారు. ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో పొక్లెయిన్ సాయంతో చదును చేస్తున్నారు.
ఈ క్రమంలో కొండని తొలిచినప్పటి నుంచీ రాళ్లు కిందకు జారి మెట్లమార్గంలో పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కాంట్రాక్టర్‌గానీ, దేవస్థానం అధికారులుగానీ కనీస భద్రతా చర్యలు చేపట్టలేదు. ఆ రాళ్లను అక్కడే ఉంచేశారు తప్ప దూరంగా తరలించలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం... మెట్లపైకి మట్టి జారకుండా ఉండేందుకే అలా రాళ్లు పెట్టామని చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకి పెద్ద ఎత్తున రాళ్లు దొర్లుకుంటూ మెట్లమార్గంలోకి వచ్చి చేరాయి. విస్తరించే పనుల్లో భాగంగా ఆంజనేయస్వామి ఆలయం పైభాగం కూడా మూతపడింది. ఇదే ప్రాంతంలో మరిన్ని రాళ్లు పడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా దేవస్థానం అధికారులు, కాంట్రాక్టర్ పొక్లెయిన్‌తో ఇష్టారాజ్యంగా పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇవేమీ తెలియని భక్తులు మెట్లమార్గంలో నడిచివెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.
కుటుంబానికి అండ కోల్పోయాం
భవాని ఎంబీఏ చదువుకుని సబ్బవరంలోని ఓ టీవీ షోరూంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంది. ముగ్గురు కుమార్తెలలో భవాని పెద్దది. చదువు పూర్తిచేసిన అనంతరం ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతో కుటుంబాన్ని పోషిస్తుంది. తాను కూలి పనులు చేసుకొని కుమార్తెను చదివిస్తే, కుటుంబానికి అందివచ్చేసరికి ప్రాణాలు కోల్పోయింది. తన ఇద్దరు చెల్లిళ్లను చదివిస్తానని చెప్పేది. నాకు ధైర్యం చెప్పిన కుమార్తె ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోయింది.
– కూర్మినాయుడు, మృతురాలి తండ్రి
Comments
Please login to add a commentAdd a comment