హోమం నిర్వహిస్తున్న దృశ్యం
సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన భైరవస్వామి ఆలయం వద్ద తాంత్రిక పూజలు ఆగడం లేదు. అర్ధరాత్రి అమావాస్య రోజుల్లో పెద్ద ఎత్తున ఈ పూజలు జరుగుతున్నాయి. అసలు ఈ పూజలు బయటి వ్యక్తులు చేస్తున్నారా.. లేక అధికారులే ఆ పూజలను ప్రోత్సహిస్తున్నారా.. అని కూడా పలువురు సందేహిస్తున్నారు. తాంత్రిక పూజలపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడమే ఈ అనుమానాలకు కారణమవుతోంది. గురువారం అర్ధరాత్రి అమావాస్య గడియల్లో భైరవస్వామికి తాంత్రిక పూజ జరిగిందని, అది దేవస్థానం అనుబంధ దేవాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అర్చకుల ఆధ్వర్యంలో ఇది జరిగిందని బహిర్గతమైంది. ఆ పూజలు ఈవో ఆదేశాల మేరకే జరిగాయన్న ప్రచారం జరుగుతోంది.
భక్తులకు దర్శనం కల్పించకుండా ఆపేసి..
దేవస్థానానికి అనుబంధంగా అడవివరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అటవీప్రాంతంలో భైరవస్వామి ఆలయం ఉంది. అమావాస్య రోజుల్లో భక్తులు భారీగా వస్తున్నారు. కొందరు అనధికార పురోహితులు స్వామికి మద్యంతో అభిషేకాలు, హోమాలు, తాంత్రిక పూజలు నిర్వహిస్తుండటంపై రెండేళ్లుగా దుమారం రేగుతోంది. దీంతో దేవస్థానం అధికారులు గతేడాది ఆలయం వద్ద నిఘా పెట్టారు. అయినా అమావాస్య రోజుల్లో ఆలయం వద్ద ఇటువంటి పూజలు ఆగడం లేదు. గురువారం అమావాస్య కావడంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆలయం వద్ద దేవస్థానానికి చెందిన కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో విధులు నిర్వర్తించే ఇద్దరు అర్చకులు.. మరికొంతమంది ప్రైవేటు అర్చకులతో కలిసి భైరవస్వామికి తాంత్రికపరమైన అభిషేకాలు, హోమం, పూజలు నిర్వహించారు. అప్పటికే అక్కడకు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు గంటల తరబడి దర్శనం కల్పించకుండా చేశారు.
భైరవస్వామి చెంత అర్ధరాత్రి తాంత్రిక పూజలు
అదేంటని భక్తులు ప్రశ్నిస్తే.. దేవస్థానం ఈవో చెప్పడంతోనే ఈ పూజలు చేస్తున్నామని వారు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై ఈవో వివరణ కోరేందుకు శుక్రవారం సాక్షి ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. భైరవస్వామి ఆలయం వద్ద జరుగుతున్న తాంత్రిక పూజలను దేవస్థానం అనువంశిక ధర్మకర్త సామాజిక వర్గానికి చెందినవారే ప్రోత్సహిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన ఐదేళ్లుగా ఈ విధమైన పూజలు జరిపేవారిని దగ్గరుండి ఆలయానికి తీసుకెళ్లిన సందర్భాలు, అలాంటి పూజలు జరిపే తాంత్రికులు ఏకంగా దేవస్థాన కార్యాలయంలోకి కూడా యథేచ్ఛగా తిరిగిన సందర్భాలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కంచరపాలేనికి చెందిన ఓ భక్తుడు వస్తే నవగ్రహ పూజలు జరిపినట్లు అర్చకుడు సంతోష్‌శర్మ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment