
లావూరి భద్రి
మిర్యాలగూడ అర్బన్ : ఇంటి సరుకులు తీసుకొస్తుండగా బైక్‌ను డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో తల్లి అక్కడిక్కడే మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పట్టణంలోని ఈదులగూడ పెట్రోల్ బంకు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం బొల్లిగుట్టతండాకు చెందిన లావూరి భద్రి(40) తన కుమారుడు సురేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటి సరుకులు తీసుకోవడానికి పట్టణానికి వస్తున్నారు.
ఈదులగూడ పెట్రోల్ బంకు వద్దకు రాగానే డీజిల్ కోసం బంకులోకి వస్తున్న డీసీఎం వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్ ఒక్కసారిగా డీసీఎం వ్యాన్ కిందకు వెళ్లడంతో భద్రి అక్కడిక్కడే మృతి చెందింది. సురేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే 108 సహాయంతో ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
ఆ ఇంట్లో ఇద్దరూ మానసిక రోగులే..
లావూరి భద్రి భర్త హర్యలకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడు సురేష్, చిన్న కుమారుడు నరేష్ అంతా బాగానే ఉన్నా భర్త హర్యతో పాటు చిన్న కుమారుడు నరేష్ ఇద్దరూ మానసికంగా ఎదుగుదల లేకుండా ఉన్నారు. వారిలో మృతి చెందిన భద్రి, తీవ్ర గాయాలపాలైన సురేష్‌లు మాత్రమే ఎంతో తెలివితేటలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వారి రోదనలతో ఆస్పత్రి మిన్నంటింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment