
సాక్షి, నల్గొండ: మిర్యాలగూడ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తు తెలియని లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళ ఉన్నారు. నార్కట్‌పల్లి–అద్దంకి హైవేపై మిర్యాలగూడ పట్టణ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ వద్ద అర్ధరాత్రి 12.10 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
తీర్థయాత్రలకు వెళ్లి వస్తుండగా..
మిర్యాలగూడ మండలం నందిపాడుకు చెందిన చెరుపల్లి చెరుపల్లి మహేష్ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటూ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. మూడురోజుల క్రితం అతని కుటుంబంతో పాటు బంధువులు కొందరు కలిసి కారులో తీర్థయాత్రలకు వెళ్లారు. యాత్ర ముగించుకుని ఆదివారం రాత్రి గుంటూరు వైపు నుంచి ఇంటికి తిరిగి వస్తూ మరో ఐదు నిమిషాల్లో ఇల్లు చేరతారనగా ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రమత్తులో ఉండి డ్రైవింగ్ చేస్తుండగా కారు డివైడర్ దాటి రావడంతో అటుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మహేష్ (32), అతని భార్య చెరుపల్లి జ్యోతి (30), కుమార్తె రిషిక (6), మహేష్ షడ్డకుడు బొమ్మ మహేందర్ (38), అతని కుమారుడు లియాన్‡్ష (2) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మహేందర్ భార్య మాధవిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మహేందర్‌ది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లి అని తెలిసింది. మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment