Miryalaguda Young Man Deceased in US Road Accident - Sakshi
Sakshi News home page

అమెరికాలో రోడ్డుప్రమాదం.. అన్నారం యువకుడి మృతి

Published Wed, May 11 2022 10:29 AM | Last Updated on Wed, May 11 2022 10:46 AM

Miryalaguda Young Man Deceased in US Road Accident - Sakshi

క్రాంతికిరణ్‌రెడ్డి(ఫైల్‌)

సాక్షి, మిర్యాలగూడ టౌన్‌: అమెరికాలో ఈనెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం బి.అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి(24) మృతిచెందడంతో అతడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి–అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు సారెడ్డి చంద్రకాంత్‌రెడ్డి, సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి. దంపతులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివిస్తున్నారు.

అన్నదమ్ములిద్దరూ చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లారు. ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు క్రాంతికిరణ్‌రెడ్డి హైదరాబాద్‌లోని సీవీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీ.టెక్‌ పూర్తి చేశాడు. అదే సమయంలో టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం రావడంతో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలోని సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదివేందుకు 2021 జూలై 23వ తేదీన సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి వెళ్లాడు. ఆ తర్వాత తన అన్న సారెడ్డి చంద్రకాంత్‌రెడ్డి 2021 నవంబర్‌లో వెళ్లాడు. అన్నదమ్ములిద్దరూ ఒకే దగ్గర ఉంటూ ఎంఎస్‌ చదువుతున్నారు.

కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు 

ఈ నెల 7వ తేదీన తన స్నేహితులతో కలిసి క్రాంతికిరణ్‌రెడ్డి బయటికి వెళ్లగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ విషయాన్ని వెంటనే చెబితే తన తల్లిదండ్రులు ఇబ్బంది పడతారని భయపడి.. అన్న చంద్రకాంత్‌రెడ్డి మంగళవారం ఈ సమాచారం అందించాడు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే సారెడ్డి క్రాంతి కిరణ్‌రెడ్డి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పరిసరాల ప్రజలు పెద్దఎత్తున వారి ఇంటికి తరలివచ్చారు. తల్లి అరుణ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. 

చదవండి: (పెళ్లి సంబధాలను చేడగొడుతున్నాడు.. ఇక పెళ్లి కాదని..)

మా కుమారుడి మృతదేహాన్ని తీసుకురండి..
క్రాంతికిరణ్‌రెడ్డి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని మృతుడి తల్లిదండ్రులు సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. తన కుమారుడి మృతదేహాన్ని తమకు అప్పగిస్తే కళ్లారా చూసుకుంటామని బోరునవిలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు స్పందించి విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి మృతదేహం తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement