తిరుపతి జిల్లాకు చెందిన ముగ్గురి దుర్మరణం
మరో వ్యక్తికి తీవ్రగాయాలు
రేణిగుంట/ఓజిలి: అమెరికాలోని రాండాల్ఫ్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతిచెందిన వారిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, మరో మహిళ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భార్య. కేవీబీపురం మండలం అంజూరుపాళెంలో ప్రభుత్వ పాఠశాలలో హెచ్‌ఎంగా పని చేస్తున్న తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామానికి చెందిన డేగపూడి భాస్కర్‌రెడ్డి, లత దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
శ్రీకాళహస్తి పట్టణంలోని బంగారమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. పెద్ద కుమార్తె హరిత (30)కు కేవీబీ పురం మండలం కాళంగి ఆదరం గ్రామానికి చెందిన సాయి (32) అనే వ్యక్తితో 2022లో వివాహం జరిగింది. సాయికి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. అతనితోపాటు ఆమె కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాకు వెళ్లి సాఫ్ట్‌వేర్ కంపెనీలో తనకు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమెకు ఉద్యోగ అవకాశం వచ్చి మరో వారం రోజుల్లో ఉద్యోగంలో చేరనుంది.
తొట్టంబేడు మండలం పెద్దకనపర్తికి చెందిన న్యాయవాది రమే‹Ùబాబు కుమారుడు శివ (29) సాయికి స్నేహితుడు. ఇతను కూడా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినర్. ఓజిలి మండలం రాజపాళెం గ్రామానికి చెందిన తిరుమూరు రవి, సుదర్శనమ్మ దంపతుల కుమారుడు తిరుమూరు గోపి (30) కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇతను కూడా సాయికి స్నేహితుడు. సోమవారం సాయంత్రం సాయి, అతని భార్య హరిత, స్నేహితులు శివ, గోపి కలిసి కారులో వెళుతుండగా మరో కారు వీరి కారును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో హరిత, శివ, గోపి మృతి చెందగా.. సాయి తీవ్రంగా గాయపడ్డాడు.
అయ్యో దేవుడా.. రాత్రే వీడియో కాల్ మాట్లాడారే..
మృతిచెందిన వారు ప్రమాదం జరిగిన ముందు రోజు రాత్రే తల్లిదండ్రులతో మాట్లాడారు. ‘అయ్యో దేవుడా.. రాత్రే వీడియో కాల్‌లో నవ్వుతూ మాట్లాడారే. కబుర్లెన్నో చెప్పారే. రోజులో ఒక్కసారైనా మాతో మాట్లాడకుండా ఉండే వారు కాదు.. దేవుడా మా బిడ్డలను తీసుకుపోయావే... మేము ఇంకెట్టా బతికేది’ అంటూ గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదిస్తున్నారు. హరిత, శివ మృతదేహాలు ఆదివారానికి స్వగ్రామాలకు రానున్నాయి. కాగా అమెరికాలో జరిగిన ప్రమాదం ఒకే మండలానికి చెందిన ఇద్దరిని పొట్టనపెట్టుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment