కాలం కత్తిగట్టింది.. కాపుకాసి కాటేసింది.. సాఫీగా సాగుతున్న ప్రయాణానికి కన్నీటి ముగింపు పలికింది. కుమార్తెను యూనివర్సిటీలో చేరుస్తున్నామన్న ఆనంద క్షణాల్లో ఘోరం జరిగి పోయింది.. రెప్పపాటులో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యు ఘంటికలు మోగాయి. ఒకే కుటుంబంలోని సభ్యుల ప్రాణాలు అనంత లోకాల్లో కలిసిపోయాయి. నిండు మనసుతో ఆశీస్సులు.. సరదా కబుర్లు, సందళ్లతో ఇంటి నుంచి యూనివర్సిటీకి సాగిన కారు ప్రయాణం ఊహించని కుదుపుతో విషాదాంతమైంది.
అమెరికా టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో భారత సంతతికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులున్నారు.
లియాండర్‌లో నివసించే అరవింద్ మణి (45), అతని భార్య ప్రదీపా అరవింద్(40), వారి 17 ఏళ్ల కుమార్తె ఆండ్రిల్ అరవింద్, ఆదిర్యాన్ (14)నివసిస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల హైస్కూల్ డిప్లామాను పూర్తి చేసుకున్న ఆండ్రిన్ అరవింద్‌కు కంప్యూటర్ సైన్స్ అంటే మహా ఇష్టం. డల్లాస్ యూనిర్సిటీలో చదవాలనేది ఆమె కోరిక. అందుకే కుమర్తె ఇష్టాన్ని కాదనలేని తల్లిదండ్రులు.. ఆమెను యూనివర్సిటీలో చేర్పించేందుకు కారులో బయలు దేరారు. ఆ ప్రయాణమే ఆఖరిదైంది! ఉన్నతమైన లక్ష్యాలు..ఎన్నో కోరికలతో ఇంటి నుంచి యూనివర్సిటీకి కారులో బయలు దేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదం రూపంలో అరవింద్ మణి కుటుంబాన్ని కబళించింది.
లాంపాస్ కౌంటీ సమీపంలో గత బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అరవింద్ మణి దంపతులు వారి కుమార్తె ఆండ్రిల్ అరవింద్ మృతి చెందారు.
కారు ప్రమాదం ఎలా జరిగింది?
కారు ప్రమాదంపై టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ (డీపీఎస్)అధికారి ట్రూపర్ బ్రయాన్ వాష్కో స్పందించారు. ‘కాపెరాస్ కోవ్‌కు చెందిన 31 ఏళ్ల జాసింటో గుడినో డ్యూరాన్, 23 ఏళ్ల యోసిలు గాస్మాన్ మార్టినెజ్‌లు హైపర్ కార్ ‘కాడిలాక్ సీటీఎస్’లో ప్రయాణిస్తున్నారు. సరిగ్గా ప్రమాదం జరిగిన ప్రాంతంలో అరవింద్ మణి ప్రయాణిస్తున్న 65 నుంచి 70 ఎంపీహెచ్ వేగంతో వెళ్తున్న కియా ‘టెల్లూరైడ్’ను.. 100 ఎంపీహెచ్ స్పీడుతో వస్తున్న కాడిలాక్ సీటీఎస్ ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రత దాటికి కియా కారు సగానికి పైగా ధ్వంసమైంది.అరవింద్ ఫ్యామిలీ కారు కూడా మంటల్లో చిక్కుకుంది. అరవింద్ కుటుంబ సభ్యులు ఘటనా స్థలంలో మరణించారు’అని తెలిపారు.
బతికే అవకాశాలు లేవు
ఘోర రోడ్డు ప్రమాదంపై 26 ఏళ్లలో నేను చూసిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం ఇది. అందుకు ప్రమాదం జరిగిన తీవ్రత, మరణాల సంఖ్యే కారణమని ట్రూపర్ బ్రయాన్ వాష్కో మీడియాకు తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బతికే అవకాశాలు ఉండవు అని వెల్లడించారు. కుటుంబాన్ని ఢీకొట్టిన కారు 160 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
విషాద సమయం.. పరిమళించిన మానవత్వం
ఇంతటి విషాదం నింపిన ఈ రోడ్డు ప్రమాదం 14ఏళ్ల అరవింద్ మణి కుమారుడు ఆదిర్యాన్ ఒంటరయ్యాడు. ఇక, ప్రమాదం తర్వాత దాతలు స్పందించి తీరు మానవత్వానికి అద్దం పడుతోంది. దుఃఖంలో ఉన్న బాలుడికి ఆర్థిక సహాయం అందించేందుకు ఫండ్ రైజర్ ఆర్గనైజర్ రాజారామన్ వెంకటాచలం గోఫండ్‌మీ ద్వారా ఫండ్ రైజ్ చేశారు. అందుకు 7లక్షల డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో దాతలు విరాళం ఇచ్చినట్లు రాజారామన్ చెప్పారు. ఆదిర్యాన్ భవిష్యత్ కోసం తాము ఫండ్ రైజ్ ప్రారంభించామని, బాలుడిని ఆదుకునేందుకు దాతలు భారీ మొత్తంలో విరాళం ఇచ్చినట్లు వెల్లడించారు. సేకరించిన ఫండ్‌తో బాలుడి భవిష్యత్‌ను అందంగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment