బానోతు పల్లవి
సాక్షి, తిరుమలాయపాలెం: రోజువారీగా విధి నిర్వహణకు పయనమైంది. ఉద్యోగ బాధ్యతలను పూర్తి చేసింది. కారులో ఇంటికి బయలుదేరింది. ఇంతలోనే ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన బానోతు పల్లవి(45) ఖమ్మం జిల్లా డ్రగ్ కంట్రోల్ అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఖమ్మంలో బుధవారం విధులు ముగించుకుని హన్మకొండకు కారులో వెళ్తుండగా.. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు సమీపంలోని క్రాంతి గార్డెన్ వద్ద ఆగి ఉన్న కర్ర లారీని పల్లవి ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది.
కారు వెనుక సీటులో కూర్చున్న ఆమె తల ముందు సీటు రాడ్‌కు గుద్దుకుని.. కారు క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందింది. కారు డ్రైవర్ ఏడుకొండలుకు తీవ్ర గాయాలు కావడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. అతడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లవి మృతదేహాన్ని మెడికల్ అసోసియేషన్ నాయకులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించేందుకు సహకరిం చారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని హన్మకొండకు తరలించారు. పల్లవి మృతి ఘటనపై ఆమె సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కాగా పల్లవికి భర్త కోటేశ్వరరావు, కుమారుడు వరుణ్, కుమార్తె ధరణి ఉన్నారు. మృతురాలు పల్లవి తండ్రి సోమ్లానాయక్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పల్లవికి మాజీ ఎంపీ సీతారాంనాయక్ మేనమామ కాగా, మాజీ మంత్రి చందూలాల్ బాబాయి.
విషాదంలో ఉద్యోగులు
హన్మకొండకు చెందిన పల్లవి ఉమ్మడి ఖమ్మం జిల్లా డ్రగ్ కంట్రోల్ అడిషనల్ డైరెక్టర్‌గా ఏడాదిన్నర క్రితం విధుల్లో చేరారు. అందరితో కలిసి మెలిసి ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. విధుల పట్ల అంకితభావంతో ఉండే ఆమె మృతి వార్త విని తోటి అధికారులు, ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు. డ్రగ్ కంట్రోల్ కార్యాలయంలో ప్రతీ నెల కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తారు.
బుధవారం మామిళ్లగూడెంలోని ఏడీ కార్యాలయంలో ఉద్యోగులతో రివ్యూ సమావేశం నిర్వహించి అనంతరం కారులో హన్మకొండ వెళుతుండగా ప్రమాదంలో మృతిచెందింది. ఏడీ మరణవార్త తెలియడంతో డ్రగ్ కంట్రోల్ కార్యాలయంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని మార్చురీకి తీసుకురావడంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఉద్యోగులు నివాళులర్పించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, తెలంగాణ హోల్‌సేల్, రిటైల్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment