
సాక్షి, డెహ్రాడూన్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డెహ్రాడూన్ అటవీ పరిశోధనా సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుధా మిశ్రా అనే 73 ఏళ్ల వృద్ధురాలు స్పృహతప్పి పడిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. యోగా వేదిక వద్ద వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయని, అస్వస్థతకు గురైన వెంటనే మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఆమె మృతికి కారణాలను వైద్యులు వెల్లడిస్తారని ఎస్‌పీ ప్రదీప్ రాయ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో దాదాపు 50000 మంది ఔత్సాహికులు పాల్గొని యోగాసనాలు వేశారు.
యోగా విశ్వజనీనమైందని, ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే శక్తి దీనికుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం చేకూరుతుందని చెప్పారు.