Dehradun
-
మాజీ ప్రేయసితో పాట
హ్యాపీగా ప్రేయసితో వెంకటేశ్ డెహ్రాడూన్‌లో పాట పాడుకుంటున్నారు. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని లొకేషన్లలో వెంకటేశ్, మీనాక్షీ చౌదరి పాల్గొనగా ఓ పాట షూట్ చేస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
ఘోర రోడ్డు ప్రమాదంలో యువతీ యువకులు మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు
ఉత్తరాఖండ్ : ఘోర రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల లోపు వయసున్న ఆరుగురు యువతీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పిల్లలు ప్రాణాలు పోయినా కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం హృదయ విదారకరంగా మారింది.మంగళవారం ఉదయం 1.30 గంటల సమయంలో డెహ్రడూన్‌లోని ఓఎన్జీసీ చౌక్ సమీపంలో యువతి యువకులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు భారీ కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికుల్లో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 25ఏళ్ల సిద్ధేష్ అగర్వాల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సిద్దేష్ను స్థానిక సినర్జీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి.అయితే రోడ్డు ప్రమాదంపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేసు నమోదు చేయలేదు. పైగా ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ తప్పేమి లేదని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై కాంట్ పోలీస్ స్టేషన్ ఎస్సై కేసీ భట్ మాట్లాడుతూ.. ప్రమాదంపై కేసు నమోదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. ఎవరూ ఫిర్యాదు చేయకపోతే మేం కేసు ఎలా ఫైల్ చేస్తాం. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. వాహనం నడుపుతున్న కారు యజమాని ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుత చట్టం ప్రకారం ఈ కేసులో అతను బాధ్యత వహించలేడు. కాబట్టే ఈ కేసులో చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎస్సై కేసీ భట్ వెల్లడించారు.కాగా, మృతుల్లో ఐదుగురు డెహ్రాడూన్‌కు చెందినవారు కాగా, ఒకరు చంబాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదం జరగడానికి ముందు యువతి యువకులు అర్థరాత్రి డ్రైవ్‌కు వెళ్లినట్లు సమాచారం.👉 చదవండి : చికెన్ బిర్యానీలో నిద్ర మాత్రలు..భర్తకు తినిపించిన భార్య.. ఆపై -
ఘోర కారు ప్రమాదం.. ఆరుగురి మృతి
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఓఎన్జీసీ క్రాసింగ్ వద్ద తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో కార్గో ట్రక్కును ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో ఇన్నోవా కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే కాంట్ పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ప్రయాణికుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.మృతులు, తీవ్రంగా గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. డెహ్రాడూన్ ఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్నోవా కారు బల్లూపూర్ నుంచి కాంట్ ప్రాంతం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.A tragic road accident occurred in Dehradun, in which six people lost their lives and one person was seriously injured. The incident took place near the ONGC Chowk in Dehradun, when a speeding truck collided violently with an Innova car.#DehradunAccident #TragicCrash pic.twitter.com/za532tIPBz— Archana Pandey (@p_archana99) November 12, 2024 -
రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్.. తప్పిన పెను ప్రమాదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదానికి కుట్రపన్నిన వైనం వెలుగు చూసింది. డెహ్రాడూన్‌లోని రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్ లభ్యం కావడంతో కలకలం చెలరేగింది. హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ వెళ్లే రైల్వే ట్రాక్ పై ఈ డిటోనేటర్ పడివుంది.పండుగల సమయంలో ఎవరో రైలు ప్రమాదానికి కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే రైల్వే ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదంతపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ డిటోనేటర్‌ను ఈ వ్యక్తి అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ట్రాక్‌పై డిటోనేటర్ ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్థానిక పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. ఇంతలో రైల్వే ట్రాక్‌పై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న దృశ్యం సీసీ కెమెరాలో కనిపించింది. పోలీసులు వెంటనే ఆ యువకుడిని గుర్తించి, అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఆ యువకుడిని ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అశోక్‌గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: బీఆర్ఐ నుంచి తప్పుకుని.. చైనాకు షాకిచ్చిన బ్రెజిల్ -
డెహ్రాడూన్‌లో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్ : ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడుగా ఉన్న వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌ను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అరెస్ట్ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు తెలిపారు. ఈ నెల 13వ తేదీన నటి జత్వాని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే విద్యాసాగర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆ వెంటనే అతడి కోసం ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. డెహ్రాడూన్‌లో ప్రత్యేక బృందాలు అతన్ని పట్టుకున్నాయని, ఈ నెల 20న అరెస్ట్ చేసి.. డెహ్రాడూన్ మూడో అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజి్రస్టేట్ ముందు హాజరు పరిచాయన్నారు. ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడ తీసుకొస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతా రివర్స్: సినీ నటి కాదంబరి జత్వాని తనను మోసం చేసిందని తొలుత కేసు పెట్టిందే కుక్కల విద్యాసాగర్. ఆమె ఫోన్లు వెనక్కు ఇవ్వద్దని, అలా ఇస్తే డేటా తొలగిస్తారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, పోరాడుతున్నది కూడా ఇతనే. పోర్జరీ సంతకాలతో భూమిని కొట్టేసేందుకు యత్నించిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇతని ఫిర్యాదుతో జత్వానిపై కేసు నమోదు చేసి.. ముంబై నుంచి ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇలా ఎంతో మందిని ఆమె మోసగించిందని విచారణలో తేలింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే టీడీపీ పెద్దలు ఆమెను అడ్డం పెట్టుకుని కొందరు ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపునకు దిగారు. ముగ్గురిని సస్పెండ్ కూడా చేశారు. కేసును తిమ్మినిబమ్మి చేసి తమ కక్ష సాధింపునకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇందులో భాగంగానే కుక్కల విద్యాసాగర్‌పై ఆమెతో ఉల్టా కేసు పెట్టించి, అరెస్ట్ చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిపై ఇలా కక్ష సాధిస్తున్నారు. -
బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ రోడ్‌వేస్‌కు చెందిన బస్సులో డెహ్రడూన్‌లోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ (ఐఎస్బీటీ)లో ఇద్దరు డ్రైవర్లు, సహా మరో ముగ్గురు ఆగస్టు 12వ తేదీన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 13వ తేదీ తెల్లవారుజామున బస్ టెర్మినల్‌లోని ఓ దుకాణం వద్ద బాలికను గార్డు గుర్తించాడు. వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ఉత్తరాఖండ్ రోడ్ వేస్ బస్సును గుర్తించారు. ఐదుగురిని అరెస్టు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నేరం జరిగిన బస్సు, మరో బస్సును దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించారు. మానసికంగా స్థిమితంగా లేని బాలిక సరైన సమాచారం ఇవ్వలేదు. తనది యూపీలోని మొరాదాబాద్ అని తెలిపింది. కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించింది. మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీలోని కశ్మీరీ గేట్ నుంచి బస్సులో డెహ్రడూన్‌కు వచ్చానని, అక్కడ ఐదుగురు వ్యక్తులు తనపై ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక చెప్పిందని డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశామని చెప్పారు. -
చార్ధామ్ యాత్రలో సరికొత్త రికార్డులు
డెహ్రాడూన్: ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో కొనసాగుతున్న చార్ధామ్ యాత్ర సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. మే 10న ఈ యాత్ర ప్రారంభం కాగా, గడచిన 50 రోజుల్లో 30 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించుకున్నారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాలను మే 10న తెరిచారు. మే 12న బద్రీనాథ్ తలుపులు తెరిచారు.గత ఏడాది ఏప్రిల్ 22న చార్ధామ్ యాత్ర ప్రారంభం కాగా 2023, జూన్ 30 నాటికి 30 లక్షల మంది నాలుగు ధామాలను దర్శించుకున్నారు. అయితే ఈసారి 50 రోజుల వ్యవధిలోనే 30 లక్షల మంది చార్‌ధామ్‌ను దర్శించుకున్నారు. చార్ధామ్లలో ఇప్పటివరకూ అత్యధిక సంఖ్యలో భక్తులు కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. 10 లక్షల ఆరు వేలమంది కేదార్‌నాథ్‌ను దర్శించుకున్నారు. బద్రీనాథ్‌ను ఎనిమిది లక్షల 20వేల మంది దర్శించుకున్నారు.గంగోత్రిని ఇప్పటివరకూ నాలుగు లక్షల 98వేల మంది దర్శించుకున్నారు. అలాగే యమునోత్రిని నాలుగు లక్షల 70 వేల మంది సందర్శించుకున్నారు. 2023లో చార్‌ధామ్‌ను 56 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. ఈసారి ఆ రికార్డులు దాటవచ్చనే అంచనాలున్నాయి. -
ఆ రాష్ట్రంలో.. 1952 తర్వాత 1998లోనే మహిళా ఎంపీ!
ఉత్తరాఖండ్‌లో ఇంతవరకూ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంది. ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉత్తరాఖండ్ పేరుగాంచింది. అయితే రాజకీయాల్లో ఇక్కడ నేటికీ లింగవివక్ష కనిపిస్తూనే ఉంది. 1952లో రాష్ట్రంలోని తెహ్రీ నుంచి ఎన్నికైన కమలేందు మతి షా ఉత్తరాఖండ్ నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ. 1998లో నైనిటాల్ నుంచి ఎన్నికైన రెండో మహిళా ఎంపీ ఇలా పంత్. ఈ విధంగా చూస్తే రాష్ట్రం నుంచి లోక్‌సభకు మహిళా ఎంపీ చేరేందుకు 46 ఏళ్లు పట్టింది. 2012లో మాలా రాజ్య లక్ష్మి షా అనే మరో మహిళ ఎంపీ స్థాయికి చేరుకోగలిగారు. ఏడు దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ముగ్గురు మహిళలకు మాత్రమే లోక్‌సభలో ప్రాతినిధ్యం దక్కింది. 2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెహ్రీ నుంచి మాలా రాజ్యలక్ష్మి షా ఎంపీ అయ్యారు. 1952 ఎన్నికల్లో తెహ్రీ గర్వాల్ సీటు నుంచి రాజమాత కమలేందు మతి షా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. నాటి రోజుల్లో కాంగ్రెస్‌కు భారీ మద్దతు ఉన్నప్పటికీ, ఇక్కడి ఎన్నికల్లో కమలేందు మతి షా విజయం సాధించారు. నాటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ కృష్ణ సింగ్ ఓటమి చవిచూశారు. -
ఉత్తరఖండ్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్.. తప్పిన ఘోర ప్రమాదం
డెహ్రాడూన్: క్లోరిన్ గ్యాస్ లీకైన ఘటన ఉత్తరఖండ్‌లో చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌కు సమీపంలోని ప్రేమ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఝంజ్రా ప్రాంతంలో ఓ ఖాళీ ఇంట్లో క్లోరిన్ సిలిండర్ల నుంచి గ్యాస్ లీకైంది. మంగళవారం ఉదయం చోటుకున్న ఈ ఘటనతో సమీపంలో ఉన్న పలు నివాసాల్లోని ప్రజలు తీవ్రమైన శ్వాస ఇబ్బందలను ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పాడ్డాయి. అక్కడ నివసించే పలు కుంటుంబాలను పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. #WATCH | Uttarakhand: On receiving information about people facing difficulty in breathing due to leakage in the chlorine cylinder kept in the empty plot in the Jhanjra area of Prem Nagar police station in Dehradun, Police, NDRF, SDRF and Fire team reached the spot and are… pic.twitter.com/Xq7n71Ot3n — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 9, 2024 ఈ ఘటనపై సాహస్పూర్ ఎమ్మెల్యే సహదేవ్ సింగ్ స్పదిస్తూ... 7 క్లోరిన్ సిలిండర్లు ఖాళీగా ఉన్న ఇంట్లో నిల్వ ఉన్నాయని తెలిపారు. సిలిండర్ల నుంచి క్లోరిన్ లీకేజీ వల్ల ప్రమాదాకర పరిస్థితులు చోటు చేసుకున్నాయని అన్నారు. అయితే సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎస్ బృందాలు తీసుకున్న చర్యలు వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు. చదవండి: Ayodhya: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు? -
రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత?
దిక్కులేనివారికి దేవుడే దిక్కు అంటారు. ఐదు నెలల బాలుని విషయంలో ఈ మాట నూటికి నూరుపాళ్లు నిజమైంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన ఒక ముస్లిం కుటుంబానికి రైలులోని టాయిలెట్లో ఒక పసిబాలుడు కనిపించాడు. వారు ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. వారి ఫిర్యాదు మేరకు ఆ చిన్నారి సంబంధీకుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. డెహ్రాడూన్‌లోని జీఎంఎస్ రోడ్డులో నివాసం ఉంటున్న ఫర్నిచర్ వ్యాపారి ఫయాజ్ అహ్మద్ కుటుంబం ఆదివారం జ్వాలాపూర్ నుంచి డెహ్రాడూన్‌కు రైలులో తిరిగి వస్తోంది. ఈ నేపధ్యంలో ఆ కుటుంబానికి చెందిన ఒక మహిళకు టాయిలెట్లో ఐదు నెలల బాలుడు కనిపించాడు. దీంతో ఆ మహిళ కోచ్‌లోని వారందరికీ ఈ విషయాన్ని తెలిపింది. వారెవరూ ఆ బాలుడు తమకు చెందినవాడు కాదని స్పష్టం చేశారు. ఇంతలో డెహ్రాడూన్ స్టేషన్ వచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు బాలుడిని తమ ఇంటికి తీసుకువచ్చారు. ముందుగా ఆ బాలునికి వైద్య చికిత్స అందించారు. తరువాత ఇందిరానగర్ పోలీస్ పోస్ట్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ చిన్నారి సంబంధీకుల కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ చిన్నారిని పెంచే బాధ్యతను అధికారులు తమకు అప్పగిస్తే అందుకు తాను సిద్ధమేనని ఫయాజ్ తెలిపారు. కాగా ఆ చిన్నారికి ఇంకా పేరు పెట్టలేదు. ఇది కూడా చదవండి: ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు ఊహించని ఫలితం! -
ఎయిర్‌పోర్ట్‌లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!
ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు అర్జున్, అత్యంత సన్నిహితులు, స్నేహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చిన జంట టాలీవుడ్ ప్రముఖు కోసం గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు. మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. దీపావళి సందర్భంగా తొలిసారి మెగా కోడలిగా వేడుకలు జరుపుకుంది లావణ్య. తాజాగా మరోసారి రిసెప్షన్ వేడుకల కోసం బయలుదేరారు. డెహ్రాడూన్ వెళ్తూ హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో కనిపించారు. ఎందుకంటే లావణ్య త్రిపాఠి యూపీలోని ఫైజాబాద్‌లో పుట్టినా.. తన బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి డెహ్రాడూన్లోనే ఉన్నారు. అక్కడే లావణ్య పేరేంట్స్ ఉన్నారు. లావణ్య తరఫు బంధువుల కోసం మరోసారి రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరితో నిహారిక కొణిదెల కూడా డెహ్రాడూన్ వెళ్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #TFNExclusive: The newly wed couple Mega Prince @IAmVarunTej & @Itslavanya along with their family snapped at airport as they’re off to Dehradun for their reception ceremony!! 😍📸#VarunTej #LavanyaTripathi #VarunLav #TeluguFilmNagar pic.twitter.com/s2mQxVG4Ev — Telugu FilmNagar (@telugufilmnagar) November 15, 2023 -
కూరగాయల వ్యాపారి రూ.21 కోట్ల స్కాం: మాస్టర్ మైండ్ కోసం వేట
ఇంట్లో నుంచే పని, రివ్యూలు రాసే పార్ట్‌టైమ్ ఉద్యోగంతో భారీ ఆదాయం అంటూ కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలి ప్పిస్తానని మభ్య పెట్టి ఆరు నెలల్లో 21 కోట్లు ఆర్జించాడు. చివరికి డెహ్రాడూన్‌కు చెందిన వ్యాపారవేత్త ఫిర్యాదుతో అడ్డంగా బుక్కయ్యాడు. 10 రాష్ట్రాల్లో, 37 ఫ్రాడ్ కేసులు సహా, 855 ఇతర కేసులలో ఇతడిదే కీలక పాత్ర అని తేలింది. దీంతో అతనిపై పలు కేసులు నమోదు చేశారు. విచారణలో వెలుగు చూసిన విషయాలతో పోలీసులే నివ్వెరపోయారు. ఉత్తరాఖండ్ పోలీసు అధికారుల సమాచారం ప్రకారం రిషబ్ శర్మ ఫరీదాబాద్‌లో కొన్నేళ్లుగా కూరగాయల వ్యాపారం చేసుకునే వాడు. కానీ ఆ తరువాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ పేరుతో రూ. 21 కోట్ల మోసానికి తెగబడ్డాడు. అయితే తాజా బాధితుడు, డెహ్రాడూన్‌కు చెందిన వ్యాపారవేత్త రూ. 20 లక్షల మోసపోయాడు. దీంతో అతను ఉత్తరాఖండ్‌లోని పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు అక్టోబర్ 28న రిషబ్ శర్మను అరెస్ట్ చేశారు. సైబర్ స్కామర్‌గా ఏలా మారాడంటే...! కరోనా ఆంక్షల కారణంగా కూరగాయల వ్యాపారి గుర్గావ్కు రిషబ్ శర్మ కూడా భారీగా నష్టపోయాడు. దుకాణాన్ని మూసివేశాడు. ఈ సమయంలోనే కుటుంబ పోషణ నిమిత్తం వర్క్ ఫ్రం హోం ఆఫర్లపై దృష్టి పెట్టాడు. అలా అప్పటికే ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న పాత స్నేహితుడిని కలిశాడు. తాను కూడా రంగంలోకి దిగి పోయాడు. పలువుర్ని మోస పుచ్చటం మొదలు పెట్టాడు. దీని ద్వారా ఊహించని ఆదాయం లభించడంతో మరింత రెచ్చి పోయాడు. అలా కూరగాయల వ్యాపారి కాస్తా సైబర్ స్కామర్‌గా మారాడు. లక్షల మందిని మోసం చేశాడు. కేవలం ఆరు నెలల్లోనే అతను రూ. 21 కోట్లు సంపాదించాడని ఉత్తరాఖండ్ సీనియర్ పోలీసు అధికారి అంకుష్ మిశ్రా తెలిపారు. హోటల్ చైన్ అసలు వెబ్సైట్ మారియట్ డాట్ కామ్ పోలిన "మారియట్ బోన్వాయ్" పేరుతో నకిలీ వెబ్ సైట్ సృష్టించడమే అతని పని. తన ఉచ్చులో పడిన బాధితులకు హోటల్ యజమానిని అని, తన ఒక హోటల్లో పని చేస్తున్న సహోద్యోగి సోనియాను కూడా పరిచయం చేస్తాడు. ఆ హోటల్‌కు నకిలీ రివ్యూ రైటర్లకు తొలుత రూ.10 వేలు చెల్లించే వారిని ఆకర్షిస్తాడు. ఇందుకోసం టెలిగ్రామ్ గ్రూపును కూడా ప్రారంభించాడు. ఈ క్రమంలోనే డెహ్రాడూన్‌కు చెందిన బడా వ్యాపారికి ఈ ఏడాది ఆగస్టు 4న వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులోని నంబరుకు కాల్ చేయడం ఆలస్యం రిషబ్ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. ఇందులో భాగంగానే ఒక్కో రివ్యూకు రూ.10 వేలు చొప్పున రెండుసార్లు చెల్లించడంతో రిషబ్‌పై పూర్తి నమ్మకం ఏర్పడింది. దీంతో ఏకంగా రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు సదరు వ్యాపారి. తరువాత రిటర్న్స్ గురించి అడిగితే మరింత పెట్టుబడి పెట్టాలని డిమాండ్ చేశాడు. ఇక ఆ తరువాతనుంచి ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రిషబ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కీలక విషయాలను రాబట్టారు. ఇతర దేశాలకు రహస్యంగా పంపే ముందు దొంగిలించిన డబ్బు కోసం బ్యాంకు ఖాతాలను తెరవడానికి భారతదేశంలోని వ్యక్తులను నియమించు కునే అంతర్జాతీయ క్రిమినల్ గ్రూపులతో సంప్రదింపులు జరుపుతున్నాడని గుర్తించారు క్రిప్టో రూపంలో చైనా, సింగపూర్ వంటి దేశాల నిర్వాహకులకు కోట్లాది రూపాయలు చేరివేసినట్టు అంచనా వేశారు. అంతర్జాతీయ ముఠాలలో ఒకదానికి ఏజెంట్ అని, సాధారణంగా, ఈ ఏజెంట్లకు అసలు సూత్రధారి గురించి ఎటువంటి సమాచారం ఉండదని, మాస్టర్ మైండ్‌ని పట్టుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మిశ్రా తెలిపారు.. -
ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కొడియాల వద్ద 1500 వాహనాలు నిలిచిపోగా సుమారు 20 వేల మంది రోడ్ల మీద చిక్కుకుపోయారు. సుమారు 40 కి.మీ మేర యాత్రికులు, స్థానికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు దారిపొడవునా ఆవస్థలు పడుతున్నారు. కొడియాల్ వద్ద 40 కి.మీ. మేర సుమారు 1500 వాహనాలు నిలిచిపోయాయి. అందులో కనీసం 20 వేల మంది జనం ఎటూ మరలలేక అక్కడే నిలిచిపోయారు. రిషికేష్ యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వీరిలో ఏపీ, బెంగుళూరుకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరంతా తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా అక్కడ చిక్కుకున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈరోజు కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి వాతావారణ శాఖ వెల్లడిస్తూ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మమ్మల్ని ఎలాగైనా బయట పడేయమని విపత్తులో చిక్కుకున్న యాత్రికులంతా ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులని అభ్యర్థిస్తున్నారు. ఇది కూడా చదవండి: చెన్నైలో నిత్య పెళ్లికొడుకు కల్యాణసుందరం అరెస్ట్ -
ఉత్తర భారతాన్ని వదలని వానలు
డెహ్రాడూన్: రుతుపవనాలు మొదలైంది మొదలు దేశవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురిసిన వానలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. దక్షిణాదిన వరుణుడు కాస్త కనికరించినా ఉత్తరాదిన మాత్రం ఇప్పటికీ అలజడి సృష్టిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఢిల్లీ, మధ్యప్రదేశ్, యూపీలో రాష్ట్రాల్లో అయితే ఈ వర్షాలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. రోజులకు రోజలు జనం ఎటూ కదలడానికి లేకుండా ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ వర్షాల ఉధృతి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కూడా తాకింది. ఆ రాష్ట్రంలో వరణుడు మరోసారి సృష్టించిన బీభత్సానికి ఎటు చూసినా భీతావాహ దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మందాకిని నది ప్రవాహానికి తెగిపోయిన వంతెనలు, కూలిపోయిన ఇళ్ళే దర్శనమిస్తున్నాయి. మరోపక్క భారీ వర్షాల తాకిడికి గౌరీకుండ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్దాయి. ఇప్పటి వరకు నలుగురు మృతి చెందగా 19 మంది గల్లంతయ్యారని, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు ప్రజలను అప్రమత్తం చేశామని అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరినీ బయటకు రావొద్దంటూ ప్రకటనలు జారీ చేశామన్నారు. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయని తెలిపారు. ఇది కూడా చదవండి: కోడలి ప్రాణం కోసం అత్త త్యాగం.. ఇది కదా కావాల్సింది! -
ప్రజలకు వైద్యం అందించడంలో ఏపీనే నం.1.. కేంద్రం ప్రశంసలు
డెహ్రడూన్: ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందువరుసలో ఉందని కేంద్రప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రడూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కేంద్ర సమాఖ్య 15వ కాన్ఫరెన్స్‌ను స్వాస్థ్య చింతన్ శివిర్ పేరుతో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ, వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర సహాయ మంత్రులు భారతీప్రవీణ్ పవార్, ఎస్పీ సింగ్ భాగేలా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్‌దామీ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్త, 15 రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు పాల్గొన్నారు. ఏపీ తరపున మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న వైద్య విధానరాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వైద్య విధానాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఈ ప్రజంటేషన్లో ఏపీ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించింది. పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా బాగున్నాయని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా అక్కడి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని చెప్పింది. చదవండి: వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలి: సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2వేలకు పైగా ఆస్పత్రులు అత్యద్భుతం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకంలో ఏకంగా రెండువేలకుపైగా ఆస్పత్రులు అనుసంధానమై ఉన్నాయని, దేశంలోనే ఈ స్థాయిలో ఆస్పత్రుల్లో ఉచిత వైద్య పథకాలు ఎక్కడా అమలవడం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రజంటేషన్ సందర్భంగా తెలిపారు. ఏపీ ఆరోగ్యశ్రీ అమలు విషయంలో చురుగ్గా ఉండటం వల్ల ఆయుష్మాన్ భారత్ పథకం కూడా చాలా ఎక్కువ ఆస్పత్రుల్లో అమలవుతోందన్నారు. దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతున్నదని చెప్పారు. ఏపీలో ఈ స్థాయిలో ఎలా సాధ్యమైందో మిగిలిన రాష్ట్రాలు పరిశీలస్తే బాగుంటుందని సూచన చేశారు. ఏపీ మొత్తం జనాభా 5 కోట్ల వరకు ఉంటే.. వీరిలో ఏకంగా 80 శాతం మందికి దాదాపు నాలుగున్నర కోట్ల మందికి అబా ఐడీలను ఏపీ ప్రభుత్వం జారీ చేయగలిగిందని పేర్కొన్నారు. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వం చూపుతున్న చొరవను మిగిలిన రాష్ట్రాలు కూడా గుర్తించాలని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ విధానాలపై కేంద్ర ప్రభుత్వ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ రాష్ట్ర చొరవకు కేంద్ర సహకారం కూడా మరింతగా తోడైతే పేదలకు మేలు జరుగుతుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ పాల్గొన్నారు. -
106 ఏళ్ల వయసులో బంగారు పతకాలు సాధించిన బామ్మ
డెహ్రాడున్: హర్యానాలోని కద్మ అనే కుగ్రామానికి చెందిన రమాబాయి 18వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని 106 ఏళ్ల వయసులో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెం తోపాటు షాట్ పుట్ లో కూడా బంగారు పతకాలను గెలుచుకున్నారు. నడుము వాల్చి సేదదీరాల్సిన వయస్సులో రమాబాయి సాధించిన ఈ ఫీట్ నడుమొంచని నేటి యువతకు చెంపపెట్టు లాంటిది. ప్రపంచ రికార్డుతో మొదలు.. రెండేళ్ల క్రితం అంటే బామ్మ వయసు 104 ఏళ్ళున్నప్పుడు మనవరాలు షర్మిలా సంగ్వాన్ నింపిన స్ఫూర్తితో అథ్లెటిక్స్ వైపు అడుగులేసింది. సరిగ్గా ఏడాది దాటేసరికి 85 ఏళ్ళు పైబడిన కేటగిరీలో 100 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకుంది. వడోదరలో జరిగిన ఓపెన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగును 45.50 సెకన్లలో పూర్తి చేసి కొత్త రికార్డును సృష్టించింది. ఇక అక్కడి నుండి బామ్మ వెనుదిరిగి చూడలేదు. ఈ వ్యవధిలో రమాబాయి మొత్తం 14 ఈవెంట్లలో సుమారు 200 మెడల్స్ సాధించింది. తాజాగా జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ లో ఏకంగా మూడు బంగారు పతకాలను చేజిక్కించుకుని యువతకు ఆదర్శప్రాయంగా నిలిచింది. పతకాలను అందుకోవడానికి పోడియం వద్దకు వెళ్లిన బామ్మ తన కాళ్లకు శక్తినిచ్చిన మనవరాలికి కృతఙ్ఞతలు చెప్పారు. అలా మొదలైంది.. 2016లో వాంకోవర్‌లో జరిగిన అమెరికన్ మాస్టర్స్ గేమ్ ఈవెంట్లో పంజాబ్ కు చెందిన కౌర్ అనే బామ్మ 100 ఏళ్ల వయసులో 100 మీటర్ల పరుగుని 1 నిముషం 26 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. కౌర్ ఆ తర్వాత ఏడాదే ఆక్లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఈవెంట్లో మరో ఏడు సెకన్లను తగ్గిస్తూ తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. రమాబాయి మనవరాలు కౌర్ గురించి చెప్పినప్పుడు మొట్టమొదటిసారి రమాబాయికి కూడా అథ్లెటిక్స్ లో పాల్గొనాలన్న తృష్ణ కలిగింది. ఫిట్నెస్ కోసం.. అప్పటివరకు గృహిణి గాను, ఎప్పుడైనా వ్యవసాయం చేసుకుంటూ కాలం వెళ్లదీసిన బామ్మ రూటు మార్చింది. మైదానంలో అడుగుపెట్టి వయసు అడ్డంకులన్నిటినీ చెరిపేసి సాధన చేసింది. ఫిట్నెస్ కోసం పాలు, పాల ఉత్పత్తులు, తాజా ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంది. భారీ వాహనాన్ని నడిపే రమాబాయి మనవరాలు షర్మిల మొదట తన బామ్మకు క్రీడలవైపు వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చినప్పుడు మొత్తం కుటుంబం భయపడింది... ఈ వయసులో బామ్మను సరిగ్గా చూసుకోకపోతే గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తారని భయపడినట్లు వెల్లడించారు. కానీ తన బామ్మ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లేటు వయసులో చాంపియన్ గా అవతరించి మొత్తం గ్రామానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇది కూడా చదవండి: వేలాది పక్షుల మృతి.. పురుగు మందులే కారణం? -
రెండో పెళ్లికి పసిపిల్లలు అడ్డొస్తున్నారని..
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఒక యువకుడు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంతో తన ముక్కుపచ్చలారని ఇద్దరు కుమార్తెల ప్రాణం తీశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన డెహ్రాడూన్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని డోయీవాలా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ పిల్లల అమ్మమ్మ అల్లుని ఘాతుకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేశవ్పురి డోయివాలా నివాసి ఆశుదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన చిన్న కుమార్తె రీనాకు ఐదేళ్ల క్రితం జితేంద్రతో వివాహమయ్యిందని పేర్కొంది. తరువాత వారికి ఇద్దరు కుమార్తెలు కలిగారని, వారు ప్రస్తుతం పాలు తాగే వయసులో ఉన్నారని తెలిపింది. జితేంద్ర తన భార్య రీనాను తరచూ కొడుతుండేవాడు. కొన్నాళ్ల పాటు ఆమె భర్త పెట్టే బాధలను భర్తిస్తూ వచ్చింది. కొంతకాలం తరువాత పిల్లలను తండ్రి వద్దనే వదిలేసి, రీనా హైదరాబాద్ వెళ్లిపోయింది. దీంతో జితేంద్ర మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీనికి పిల్లలు అడ్డు వస్తున్నారని భావించాడు. పిల్లలను అంతమెందించి మరో వివాహం చేసుకోవాలనుకున్నాడు. శుక్రవారం రాత్రి పిల్లలకు అన్నం తినిపించి పడుకోబెట్టాడు. అర్థరాత్రి ఆ చిన్నారుల గొంతు నులిమి హత్య చేశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నారులు మృతి చెందివుండటాన్ని గుర్తించిన వారి అమ్మమ్మ డోయీవాలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు గురించి ఎస్ఎస్ఐ రితేష్ షా మాట్లాడుతూ మృతిచెందిన చిన్నారుల అమ్మమ్మ తన అల్లుడే ఈ హత్య చేశాడని ఆరోపిస్తున్నదని తెలిపారు. కాగా చిన్నారుల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. నిందుతుని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అతనిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఇది కూడా చదవండి: ఛాతీలో చాకు దిగబడి లివ్ ఇన్ పార్ట్నర్ మృతి.. -
ఇండిగో విమానం ఇంజీన్ ఫెయిల్: అత్యవసర ల్యాండింగ్!
న్యూఢిలీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఇండిగో విమానం ఇంజన్ ఒకటి ఫెయిల్ కావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజీన్ లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారమిచ్చిన పైలట్ అత్యవసర ల్యాండింగ్ అనుమతి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టర్న్బ్యాక్కు కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
హిందూ యువకుని ‘ముస్లిం వ్యవహారం’.. తండ్రి ఫిర్యాదుతో..
దేశంలో హిందూ- ముస్లిం వివాదాలకు సంబంధించిన ఉదంతాలు తరచూ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఇదే కోవలో తాజాగా డెహ్రాడూన్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ పరిధిలోని డోయీవాలా ప్రాంతంలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక యువకుని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమారుడు ఇంటిలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. తన 24 ఏళ్ల కుమారుడు ఇంటిలో ఉన్నట్టుండి నమాజ్ చేస్తున్నాడని, అలాగే అతని లాప్టాప్, మొబైల్ ఫోన్లలో ఆశ్చర్యకరమైన డేటా ఉందని తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం వైభవ్ బిజ్లవాణ్(24) గత మూడేళ్లుగా డిప్రెషన్లో ఉన్నాడు. అతనికి ఇస్లాంపై విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. పోలీసుల విచారణలో అతని ల్యాప్ టాప్, మొబైల్ ఫోను నుంచి సేకరించిన సమాచారం ప్రకారం వైభవ్ ముస్లిం మతానికి సంబంధించిన ఆచారవ్యవహారాలను నేర్చుకుంటున్నాడు. ప్రతీరోజూ వీటిని అనుసరిస్తున్నాడు. పోలీసుల దర్యాప్తులో.. వైభవ్ తన గది నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదని, గత మూడేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని వెల్లడయ్యింది. పోలీసులు వైభవ్‌కు సైకలాజికల్ టెస్ట్ చేయిస్తున్నారు. డెహహ్రాడూన్ పోలీసు అధికారి దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఆ యువకుడు నిత్యం గదిలోనే ఉంటున్నాడని, దీనిపై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. తమ బృందం పరిశీలనలో ఆ యువకుడు డిప్రెషన్లో బాధపడుతున్నాడని తెలిసిందన్నారు. ఆన్లైన్లో ఇస్లాం ఆచారాల గురించి తెలుసుకుంటున్నాడని, ఉర్దూ నేర్చుకుంటున్నాడని తెలిపారు. ఆ యువకునికి సంబంధించిన మెడికల్ రిపోర్టు రాగానే తదుపరి చర్యలు చేపడతామన్నారు. చదవండి: జులై 1 నుంచి అమర్నాథ్ యాత్ర -
90 శాతం పెరిగిన ఫ్యామిలీ టూర్లు.. టాప్ 4లో హైదరాబాద్!
సాక్షి, హైదరాబాద్: సకుటుంబ సపరివార సమేతంగా చేసే ప్రయాణాలు దేశంలో మళ్లీ ఊపందుకున్నాయి. కోవిడ్ నేపథ్యంలో గణనీయంగా పడిపోయిన ఫ్యామిలీ ట్రావెల్ గతేడాది 90 శాతం పెరిగింది. పరివార్‌తో కలిసి సందర్శించేందుకు ఎంపిక చేసుకునే నగరాల్లో టాప్–4లో హైదరాబాద్ నిలిచింది. పర్యాటకులకు వసతి సౌకర్యాలకు పేరొందిన ప్రముఖ సంస్థ ఎయిర్ బీఎన్బీ అధ్యయనం ఈ విశేషాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ బీఎన్బీ వేదికగా కుటుంబ ప్రయాణం గతేడాది 90 శాతం పెరిగిందని (ప్రపంచవ్యాప్త పెరుగుదలతో పోలిస్తే 30శాతం అధికం) దాదాపు 90,000 గమ్యస్థానాల్లో 15 మిలియన్లకు పైగా చెక్–ఇన్లు చోటుచేసుకున్నాయని ఈ స్టడీ తేల్చింది. గత ఏడాది కుటుంబ సమేతంగా టూర్లు వెళ్లడం పెరగడంతో పాటు తమ పెట్స్‌ను సైతం తమతో తీసుకువెళ్లడానికి పర్యాటకులు ఆసక్తి చూపించారు. అందుకు అనుగుణంగా తగిన వసతి సౌకర్యాల కోసం అన్వేషించారని అధ్యయనం వెల్లడించింది. అంతకు ముందుతో పోలిస్తే అత్యధికంగా పెంపుడు జంతువులు గతేడాది 5 మిలియన్ల పైగానే ప్రయాణాల్లో భాగం పంచుకున్నాయి. టాప్ 10 నగరాలివే శవ్యాప్తంగా ప్రజలు కుటుంబాలతో కలిసి తమకు ఇష్టమైన పలు ప్రాంతాలకు ప్రయాణించారు. అలా చేసిన ప్రయాణాల్లో అత్యధికులు ఎంచుకున్న గమ్యస్థానాల్లో గోవా తొలి స్థానంలో నిలువగా ఆ తర్వాత స్థానంలో బెంగళూర్ పూణె, మన హైదరాబాద్, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ వరుసగా టాప్–5లో చోటు దక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్తాన్‌లోని జైపూర్, మహారాష్ట్రలోని రాయ్‌ఘర్, కేరళలోని ఎర్నాకులం, న్యూఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని నైనిటాల్ వరుసగా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. -
ఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు.. వివరాలు.. ఉత్తరాఖండ్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన బస్సు ముస్సోరీ నుంచి డెహ్రాడూన్‌కు ప్రయాణిస్తుంది. దాదాపు 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు షేర్ ఘడి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. సుమారు 100 అడుగుల లోతులో పడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్ డ్రైవర్‌తో సహా 22 మంది గాయపడ్డారు. గాయాలయ్యాయి. సమాచారం వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకొన్నాయి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుల (ITBP) సహాయంతో గాయపడిన వారిని రెస్క్యూ చేసి ఆస్పత్రికి తరలించామని ముస్సోరీ పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ ఇద్దరు అమ్మాయిలు మరణించారు. మరొకొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Uttarakhand | Many feared injured after a roadways bus lost control and fell off the gorge on Mussoorie-Dehradun route. Rescue operation underway. Police, fire service team & ambulance on the spot. More Details awaited. pic.twitter.com/LZWvg3riML — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 2, 2023 -
చేసిందే చెడ్డ పని పైగా ఆత్మహత్యాయత్నం
భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రానా కోచ్ నరేంద్ర షాపై లైగింక వేధింపుల కేసు నమోదు అయింది. ఒక అమ్మాయిని వేధిస్తున్నట్టు ఆడియో ఆధారం లభించడంతో అతడిపై ఉత్తరాఖండ్ పోలీసులు పోక్సో(POCSO Act) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆడియో లీక్ విషయం తెలియగానే నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరేంద్ర షా డెహ్రాడూన్‌లో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. మోలి జిల్లాకు చెందిన మైనర్ యువతి చదువుకుంటూనే నరేంద్ర షా క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. కొన్నాళ్లుగా నరేంద్ర సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మైనర్‌తో నరేంద్ర షా ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆ ఆడియో వైరల్ కావడంతో అతడిపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 506తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు బుక్ చేశామని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ లోకేంద్ర బహుగుణ తెలిపాడు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేశామని ఆయన వెల్లడించాడు. ఆడియో లీకేజీతో తన పరువు పోయిందని నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం స్నేహ్ రానాకు కోచ్‌గా ఉన్న నరేంద్ర షా ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం మాజీ సభ్యుడు. నరేంద్రపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుసుకున్న ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అతడిని పదవి నుంచి తొలగించింది. టీమిండియా మహిళా క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్న స్నేహ్ రానా ఇటీవలే వుమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్ ఆడింది. గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె రెగ్యులర్ కెప్టెన్ బెత్ మూనీ గాయంతో టోర్నీకి దూరమవడంతో జట్టును నడిపించింది. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. టేబుల్ టాపర్స్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. నాట్ స్కీవర్ బ్రంట్ అర్ధ శతకంతో చెలరేగడంతో ఆ జట్టు తొలి సీజన్ చాంపియన్‌గా అవతరించింది. చదవండి: Kedar Jadhav: తండ్రి మిస్సింగ్ కేసులో క్రికెటర్‌కు ఊరట 'నెట్ బౌలర్‌గా ఆఫర్.. బోర్డు పరీక్షలను స్కిప్ చేశా' -
తండ్రి కట్టిన స్టేడియంలోనే తనయుడు సెంచరీ! శభాష్ అభిమన్యు
భారత జట్టులో చోటు కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ప్రస్తుతం జరగుతున్న రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. డెహ్రాడూన్ వేదికగా ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఈశ్వరన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌లతో ఈశ్వరన్ 165 పరుగులు సాధించాడు. అతడితో పాటు టాప్ఆర్డర్ బ్యాటర్ సుదీప్ ఘరామి 90 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఉత్తరాఖండ్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. తండ్రి కట్టిన స్టేడియంలోనే తనయుడు సెంచరీ అభిమాన్యు ఈశ్వరన్.. తన తండ్రి తన పేరిట నిర్మించిన గ్రౌండ్‌లోనే సెంచరీ సాధించడం విశేషం. అభిమన్యు తండ్రి రంగనాథన్ పరమేశ్వరన్ ఈశ్వరన్ డెహ్రాడూన్‌లో ఓ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాడు. దానికి అభిమన్యు క్రికెట్ అకాడమీగా పేరు పెట్టాడు. అయితే ఇప్పటివరకు చాలా రంజీ మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఈ వేదికలో బెంగాల్ జట్టుకు ఇదే తొలి మ్యాచ్. కాగా అభిమాన్యు ఈశ్వరన్ స్వస్థలం డెహ్రాడూన్ అయినప్పటకీ దేశీవాళీ క్రికెట్లో మాత్రం బెంగాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో తొలి సారిగా తన తండ్రి నిర్మించిన స్టేడియంలో అభిమాన్యు ఈశ్వరన్ మ్యాచ్ ఆడాడు. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించడంతో అభిమాన్యు తండ్రి ఆనందానికి అవధులు లేవు. అదే విధంగా తన పేరిట నిర్మించిన స్టేడియంలోనే మ్యాచ్‌లో ఆడిన తొలి క్రికెటర్‌గా ఈశ్వరన్ రికార్డులకెక్కాడు. -
Travel Couple: ప్రేమ పెళ్లి.. సొంత కారవ్యాన్‌లో కుటుంబంతో కలిసి..
ప్రయాణంలో ఏమున్నది? అనే ఒకే ప్రశ్నకు వందల సమాధానాలు దొరుకుతాయి. సేద తీర్చే సెరువున్నది... నీడ కోసం చింత చెట్టున్నది... సిటారు కొమ్మన తేనెపట్టున్నది. వీటికి మించి మనల్ని కొత్తగా వెలిగించే తత్వం దాగున్నది. అందుకే రుచీపాండే, దీపక్ దంపతులు వ్యాన్నే ఇంటిని చేసుకొని లోకసంచారం చేస్తున్నారు... దెహ్రాదూన్(ఉత్తరాఖండ్) కాలేజీలో చదువుకునే రోజుల్లో రుచీ పాండే, దీపక్‌లు మంచి స్నేహితులు. ప్రేమలో పడడానికి ముందే ‘ట్రావెలింగ్’తో ప్రేమలో పడ్డారు. ప్రయాణం అంటే ఇద్దరికీ చెప్పలేనంత ఇష్టం. మొదట్లో దెహ్రాదూన్ నగరం ప్రతి మూలా చుట్టేశారు. ఆ తరువాత పొరుగు నగరాలు. ‘పెళ్లికి ముందు ఎన్నో అనుకుంటాం. పెళ్లి తరువాత అన్నీ ఆవిరైపోతాయి’ అని భారంగా నిట్టూర్చేవాళ్లను చూస్తుంటాం. అయితే ఒకేరకమైన అభిరుచులు ఉన్న రుచీ, దీపక్‌లు పెళ్లి తరువాత కూడా తమకు ఇష్టమైన ప్రయాణాలను మానలేదు. దీపక్‌ది రెండు సంవత్సరాలకు ఒకసారి బదిలీ అయ్యే ఉద్యోగం. ఎక్కడికి బదిలీ అయినా అక్కడి చుట్టుపక్కల కొత్త ప్రదేశాల గురించి ఆరా తీసి రుచీపాండేతో కలిసి ప్రయాణానికి ఛలో అనేవాడు. మొదట్లో టాటా ఇండికా వాడేవారు. ఆ తరువాత సఫారిలోకి షిఫ్ట్ అయ్యారు. ఒకప్పుడంటే తాము ఇద్దరమే కాబట్టి ఈ వాహనం ఓకే. కాని ఇప్పుడు ఇద్దరు పిల్లలు, రెండు పెంపుడు శునకాలు. కరోనా వల్ల హోటల్లో ఉండలేని పరిస్థితి, ఎక్కడ పడితే అక్కడ తినే వీలు లేకపోవడం... వీటిని దృష్టిలో పెట్టుకొని ‘కారవ్యాన్’పై దృష్టి పెట్టారు. గత సంవత్సరం ఫోర్స్ ట్రావెలర్ 3350 కొనుగోలు చేశారు. తమ సౌకర్యాలకు అనుగుణంగా దీన్ని మార్చుకోవడానికి యూఎస్ నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి బాగా ఖర్చయింది. ఇది ఒక ఎత్తయితే ‘వైట్–బోర్డ్ వెహికిల్’ కోసం ఆర్టీవో నుంచి అనుమతి పొందడం అనేది మరో ఎత్తు. ‘ఈ వాహనం మా కుటుంబం కోసమే, కమర్షియల్ వర్క్ కోసం కాదు అని ఉన్నతాధికారులను నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది’ అంటుంది రుచీపాండే. విదేశాలకు చెందిన రకరకాల కారవ్యాన్లను చూస్తూ డిజైన్‌పై ఒక అవగాహనకు వచ్చారు. ఈ వీడియోలను నిపుణులైన పనివాళ్లకు చూపిస్తూ వ్యాన్ డిజైన్ చేయించారు. మూడు నెలలు నాన్–స్టాప్‌గా కష్టపడిన తరువాత తమ కలల వాహనం సిద్ధం అయింది. ఖర్చు లక్షలు అయింది ఇందులో సౌకర్యవంతమైన సీట్లు, కిచెన్, బాత్రూమ్, రెండు బెడ్లు, వాటర్ ట్యాంక్, షవర్, గ్యాస్, మైక్రోవేవ్, పైన సోలార్ ప్యానల్స్, కెమెరాలు...ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంటిని మరిపించే సంచార ఇల్లు ఇది. దీన్ని తమ అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవడానికి చేసిన ఖర్చుతో సెకండ్ హ్యాండ్ వ్యాన్ కొనుగోలు చేయవచ్చు. తొలి ప్రయాణం లేహ్, లద్దాఖ్. దీపక్ తల్లిదండ్రులు కూడా వచ్చారు. నచ్చిన చోట ఆగడం, ప్రకృతి అందాలను వీక్షించడం...ప్రయాణంలోని మజాను దీపక్ తల్లిదండ్రులు ఆస్వాదించారు. ‘సాధారణ కారులో సుదూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కష్టం. భోజనం నుంచి నిద్ర వరకు రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండడం, స్మూత్ డ్రైవింగ్ వల్ల మా వ్యాన్‌లో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేశారు. గ్రామీణప్రాంతాలలో పార్కింగ్ అనేది కష్టం కాదు. అయితే పట్టణ ప్రాంతాలలో మాత్రం హోటల్ పార్కింగ్‌లను ఎంచుకునేవాళ్లం. వ్యాన్లోనే అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల బయట క్యాంప్ ఏర్పాటు చేసుకునే అవసరం రాలేదు’ అంటుంది రుచీ పాండే. గుజరాత్లో 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన అనుభవం తమకు ప్రత్యేకమైనది. వీరి భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? ఈ కారవ్యాన్పై నలభై దేశాలు చుట్టి రావాలనేది వారి కల. చదవండి: ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి -
కుటుంబం మొత్తాన్ని నరికి చంపిన పూజారి.. మృతదేహాల వద్ద క్షుద్రపూజలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబం మొత్తాన్ని ఓ ఉన్మాది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బండాకు చెందిన మహేష్ కుమార్ తివారీ అనే వ్యక్తి పూజారీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత ఏడేళ్లుగా డెహ్రాడూన్‌లోని రాణి పోఖారీలో నివసిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సోమవారం ఉదయం సొంత కుంటుంబాన్ని నరికి చంపాడు. 47 ఏళ్ల పూజారి కుటుంబంలోని అయిదగురిని కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుల్లో నిందితుడి తల్లి, భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. హత్య అనంతరం మృతదేహాల వద్ద క్షుద్రపూజలు నిర్వహించాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం 7:30 గంటలకు జరిగింది. అయితేఇంట్లో నుంచి కుటుంబ సభ్యుల అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న డెహ్రాడూన్ పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డెహ్రాడూన్ పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) కమలేష్ ఉపాధ్యాయ్ తెలిపారు. నిందితుడు ఇంత దారుణానికి ఎందుకు తెగబడ్డానేది ఇంకా తెలియలేదని, దీనిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి మూడేళ్ల కొడుకుని హతమార్చిన తల్లి