పేదవారి ఊటీ... కొల్లి మలై
వేసవి కాలం కుటుంబంతో కలసి సెలవులు హాయిగా, చల్లగా ఆస్వాదించాలనగానే సాధారణంగా ఉత్తర భారతదేశంలోని డెహ్రాడూన్, కులూ మనాలి లాంటివి గుర్తొస్తాయి. దక్షిణాదిలోనే చూద్దామనుకుంటే ఊటీ, కొడెకైనాల్ లాంటి వాటికి తప్ప వేరే సరికొత్త హిల్ స్టేషన్‌లు మనసులోకి రావు. చాలామందికి తెలియని ఓ వేసవి పర్యాటక కేంద్రం - ‘కొల్లి మలై’గా ప్రసిద్ధమైన కొల్లి హిల్స్.
తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో ఈ హిల్ స్టేషన్ ఉంది. పర్యాటకుల తాకిడికి ఇంకా పెద్దగా లోనుకాని ప్రాంతమిది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కొండ ప్రాంతం కేవలం 1500 మీటర్ల ఎత్తున ఉంటుంది. కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతకు ఇది నిలయం.
ప్రాథమికంగా ఈ కొల్లి హిల్స్‌లో ‘మలయాళీ గిరిజనులు’గా అందరూ పిలిచే స్థానిక గిరిజన తెగల వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. పట్టణ ప్రాంతపు నవ నాగరికులు ఎవరూ ఉండరు. అందుకే, ఈ కొల్లి హిల్స్‌కు కేంద్రస్థానమైన సెమ్మేడులో కూడా మనకు అపరిశుభ్రమైన రహదారులు కానీ, బహిరంగంగా ప్రవహించే మురుగు నీరు కానీ కనిపించవు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ గిరిజనులు కూడా ఎంతో సంస్కారయుతంగా ఉంటారు. చక్కగా దుస్తులు వేసుకుంటారు. వాళ్ళ ఇంటి ముందు కూడా ఓపెన్ డ్రెయిన్లేవీ ఉండవు. ఆ కొండ కోనల అభివృద్ధిలో చదువు కీలక పాత్ర పోషించిందని అనుకోవచ్చు.
ఒక్కసారి గతంలోకి వెళితే, కొల్లి హిల్స్‌కు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. తూర్పు కనుమల్లో భాగమైన ఈ కొండ ప్రాంతం ప్రస్తావన ప్రాచీన తమిళ రచనలైన ‘శిలప్పదికారం’, ‘మణిమేఖలై’, ‘పురననూరు’, ‘ఐన్‌కుర్నూరు’ లాంటి వాటిలో ఉంది. ఈ ప్రాంతానికి అన్ని వసతులూ ఉండేవనీ, అందరికీ ప్రాథమిక విద్య ఉండేదనీ చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. ఆ సంప్రదాయం ఇవాళ్టికీ కొనసాగుతోంది.
ఈ కొండల్లోని మహిళలు ఎంతో ఉత్సాహంగా కొత్త పనులు చేపడుతుంటారు. ఇక, ఈ కొల్లి హిల్స్‌కు ఒకప్పటి పాలకుడైన వాళ్విల్ ఒరి ఎంతో ముందుచూపున్న మనిషి అని ప్రాచీన సాహిత్యంలో ప్రస్తావన ఉంది. దాదాపు తొమ్మిది శతాబ్దాల తరువాత కూడా ఇప్పటికీ ఈ కొండ ప్రాంతం, ఇక్కడి ప్రజలపై ఆయన ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది.
చల్లగా ఉంటుంది... చలి పెట్టదు!
మిగిలిన హిల్ స్టేషన్ల వాతావరణానికి భిన్నంగా కొల్లి హిల్స్ ప్రశాంతంగా ఎండాకాలంలో కొద్ది రోజులు ప్రకృతి ఒడిలో సేద తీరడానికి అనువుగా ఉంటాయి. ఎండాకాలంలో ఇక్కడి పగటి ఉష్ణోగ్రత 28 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రిపూట ఉష్ణోగ్రత 16 నుంచి 22 డిగ్రీలే! అయితే, చలికాలంలో మాత్రం ఇక్కడ ఉష్ణోగ్రత - పగటిపూట 10 డిగ్రీలు, రాత్రి వేళ 5 డిగ్రీలు. అందుకే, వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి ఇది చక్కటి పర్యాటక ప్రాంతం. పైగా, ఇక్కడ తక్కువ ధరకే బస చేసేందుకు వీలుగా కొన్ని రిసార్ట్‌లు కూడా ఉన్నాయి. భోజనం కూడా తక్కువ ధరకే లభిస్తుంది. అందుకే, చాలామంది ఈ ప్రాంతాన్ని ‘పేదవాళ్ళ ఊటీ’ అని పిలుస్తుంటారు.
చుట్టుపక్కల చూడదగ్గవెన్నో!
నిజం చెప్పాలంటే, కొల్లి హిల్స్‌కు చేసే ప్రయాణం కూడా ఎంతో ఆసక్తికరంగా, ఉద్విగ్నభరితంగా, సాహసోపేతంగా ఉంటుంది. మైదాన ప్రాంతం నుంచి ఆ కొండల మీదకు దూరం కేవలం 15 కి.మీ.లే. కానీ, పాము మెలికలు తిరిగినట్లు, దాదాపు 73 మలుపులతో ఉంటుందా మార్గం. పగటి పూట ఈ ప్రయాణం చేస్తే బాగుంటుంది. అప్పుడు ఈ కొండల సౌందర్యాన్ని కళ్ళారా చూడవచ్చు. కెమేరాతో చక్కటి ఫోటోలు కూడా తీసుకోవచ్చు.
కొల్లి హిల్స్ పైకి చేరాక, అక్కడ ఉన్నంతలో పెద్ద పట్నం - సెమ్మేడు. అక్కడ బస చేసి, ఆ చుట్టుపక్కలి ప్రాంతాలకు తిరిగి రావచ్చు. సెమ్మేడులోనే హోటళ్ళు, రిసార్టులు ఉంటాయి. సెమ్మేడుకు 17 కి.మీ.ల దూరంలో ఓ జలపాతం ఉంది. ఋతుపవనాలు వచ్చి, తొలకరి జల్లులు కురిశాక, ఇక్కడకు వెళితే, ఆ పరిసరాలు ఎంత అందంగా ఉంటాయో! ఇక్కడకు దగ్గరలోనే ప్రాచీన సంగ కాలానికి చెందిన ఆరపాలీశ్వర ఆలయం ఉంది. ఈ శివుడి గుడి ఎంతో మహిమాన్వితమైనదని స్థానికుల నమ్మకం.
ఈ ‘పేదవారి ఊటీ’ని అభివృద్ధి చేయవచ్చని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం గడచిన ఏడేళ్ళుగా ఆ పనిలో ఉంది. పర్యాటక స్థలంగా కొల్లి హిల్స్‌ను ప్రోత్సహిస్తోంది. అలాగే, ఈ కొండల మీద ఓ రెండు వ్యూ పాయింట్లను సిద్ధం చేయాలని చూస్తోంది. అవే గనక సిద్ధమైతే, పర్యాటకులకు మరింత ఆకర్షణ తోడవుతుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఓ వరం. ఇక్కడ సేంద్రియ విధానంలో చిరుధాన్యాలను సహజంగా పండించి, అమ్ముతుంటారు. అలాగే, ఈ కొండల నిండా అనాస, పనస, సపోటా, బత్తాయి తోటలు పుష్కలం. మిరియాలు, కాఫీ లాంటి వాణిజ్య పంటలు ఈ కొండల్లో నివసించే గిరిజనులకు ప్రధాన దిగుబడి. ఈ ప్రాంతాన్ని సందర్శించినవారు గుర్తుగా ఇలాంటివి కొని తీసుకువెళ్ళచ్చు.
గిరిజనుల పవిత్ర అరణ్యాలు
మరో విశేషం ఏమిటంటే, ఈ కొల్లి హిల్స్ మీద దాదాపు వంద దాకా పవిత్రమైన అడవులు ఉన్నాయి. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ ‘ఎం.ఎస్. స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్’లో పనిచేస్తున్న డాక్టర్ ఇజ్రాయెల్ ఆలివర్ కింగ్ ఇక్కడి ప్రజలు పవిత్రంగా భావించే ఈ అడవులపై పిహెచ్.డి. చేశారు. ‘‘పవిత్రంగా భావించే ఈ అడవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ఎవరినీ గిరిజనులు అనుమతించరు.
ఈ ప్రాంతాల్లోనే వారు తమ బంధువులను, పూర్వీకులను ఖననం చేస్తారు. ఈ కొండలకే పరిమితమైన ఈ విలక్షణ ఆచారం, పవిత్ర అరణ్యాలనే ఈ పద్ధతి దేశంలో మరెక్కడా లేదు’’ అని కింగ్ వివరించారు. కొల్లి హిల్స్‌లోని ఈ మలయాళీ గిరిజనులు నేరాలకు పాల్పడరు. అందుకే, ఈ ప్రాంతంలో నేరాలు జరిగినట్లు పెద్దగా ఎప్పుడూ వినం. అయితే, ఇక్కడ జరిగే ఒకే ఒక్క నేరం - వ్యభిచారం. గమ్మత్తేమిటంటే, అలా వ్యభిచరిస్తూ పట్టుబడిన జంట పంది మాంసం వండి, మొత్తం గ్రామ ప్రజలకు విందు పెట్టడమే శిక్ష!
ఎలా వెళ్ళాలంటే...
తమిళనాడులోని సేలమ్ పట్టణం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో కొల్లి హిల్స్ ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సేలమ్‌కు రవాణా సౌకర్యాలున్నాయి. చక్కటి రైలు మార్గం కూడా ఉంది. మరింకేం! ఈ ‘పేదవారి ఊటీ’కి వెళ్ళి, ప్రకృతిలో తాదాత్మ్యం కండి!
* తమిళనాడులోని సేలమ్ పట్టణం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో కొల్లి హిల్స్ ఉన్నాయి.
* కొల్లి హిల్స్ మీద దాదాపు వంద దాకా పవిత్రమైన అడవులు ఉన్నాయి.
* పవిత్రంగా భావించే ఈ అడవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి
* ఎవరినీ ఇక్కడి గిరిజనులు అనుమతించరు.
- కె. జయదేవ్
(ఈ వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు, చలనచిత్ర రూపకర్త. సైన్స్ పత్రిక ‘నానో డెజైస్ట్’కు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.)