The summer solstice
-
ఇక ‘కట్’కటే..
ఖమ్మం : వేసవి కాలం అయిపోయింది.. తొలకరి చినుకులు కురుస్తున్నాయి...ఇక విద్యుత్ గండం నుంచి గట్టెక్కినట్టేనని సంతోషపడుతున్నారా ..? అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వేసవి ముగిసిన వెంటనే ఎడాపెడా కోతలకు విద్యుత్ శాఖ రంగం సిద్ధం చేసింది. వేసవికాలంలో ఎన్నికలు ఉండడంతో గృహ వినియోగదారులపై కొంత ‘కరుణ’ చూపినా.. ఇప్పుడు తన పని తాను చేసుకుపోతోంది. విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించిన దాని ప్రకారమే విచ్చలవిడి విద్యుత్ కోతలతో జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరి కానున్నారు. ఇక వ్యవసాయ సీజన్ ప్రారంభమై, వినియోగం పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనలవి కాదు. అధికారికంగానే ఆరేసి గంటల చొప్పున కోతలు ప్రకటిస్తున్న విద్యుత్ శాఖ అనధికారికంగా మరింత కోత విధించే అవకాశం ఉంది. దీనికి తోడు చిన్నపాటి వర్షానికే విద్యుత్ వైర్లు తెగిపడటం, షార్ట్ సర్క్యూట్లు, లైన్ల మరమ్మతు వంటి కారణాలతో ఇంకెన్ని ఇబ్బందులోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే అమలు... నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) అధికారుల నుంచి ఆదేశాలు వెలువడిన వెంటనే జిల్లాలో గురువారం నుంచే విద్యుత్ కోతలు అమల్లోకి వచ్చాయి. జిల్లా కేంద్రంలో గంట, మున్సిపల్, మండల కేంద్రాల్లో రెండు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరు గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. అయితే ఇంకా ఎండల ప్రభావం తగ్గకపోవడంతో ఇప్పటి వరకు వ్యవసాయ సీజన్ ప్రారంభం కాలేదు. దీంతో జిల్లాకు కేటాయించే విద్యుత్ కంటే వినియోగం తక్కువగానే ఉంది. గత మూడు, నాలుగు రోజులుగా జిల్లాకు సగటున సుమారు 5.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. వినియోగం మాత్రం రోజుకు సగటున 5.4 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో ఇప్పుడు విద్యుత్ కోతలు విధించాల్సిన అవసరం లేదు. కానీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్న వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాల సగటు విద్యుత్ వినియోగం సరఫరా కంటే అధికంగా ఉంది. ఈ పరిస్థితిలో అన్ని జిల్లాల సగటు వినియోగం, సరఫరాను లెక్కేసి విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ జిల్లాల పరిధిలో వ్యవసాయ విద్యుత్ వినియోగం గణనీయంగానే ఉంటుంది. మరి ఇప్పుడే ఆరు గంటల కోత విధిస్తే.. ఖరీఫ్ ప్రారంభమై వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరిగితే మరిన్ని గంటల పాటు కోతలు తప్పవని విద్యుత్ శాఖ వర్గాలే చెపుతున్నాయి. వ్యవసాయానికి 6 గంటలే.. వ్యవసాయానికి ఆరు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలను ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. గ్రూప్ ఏ ప్రాంతానికి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రి 10 నుంచి 12 వరకు, గ్రూప్- బి ప్రాంతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు, రాత్రి 12 నుంచి 2 వరకు, గ్రూప్-సీ ప్రాంతానికి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు, తిరిగి రాత్రి 1 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తారు. అయితే ఇచ్చే ఆరుగంటలు కూడా నిరంతరం సరఫరా చేయకుండా సగం ఉదయం, సగం రాత్రి వేళల్లో ఇస్తే మడి కూడా తడవదని, అర్ధరాత్రి విద్యుత్‌తో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. -
పేదవారి ఊటీ... కొల్లి మలై
వేసవి కాలం కుటుంబంతో కలసి సెలవులు హాయిగా, చల్లగా ఆస్వాదించాలనగానే సాధారణంగా ఉత్తర భారతదేశంలోని డెహ్రాడూన్, కులూ మనాలి లాంటివి గుర్తొస్తాయి. దక్షిణాదిలోనే చూద్దామనుకుంటే ఊటీ, కొడెకైనాల్ లాంటి వాటికి తప్ప వేరే సరికొత్త హిల్ స్టేషన్లు మనసులోకి రావు. చాలామందికి తెలియని ఓ వేసవి పర్యాటక కేంద్రం - ‘కొల్లి మలై’గా ప్రసిద్ధమైన కొల్లి హిల్స్. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో ఈ హిల్ స్టేషన్ ఉంది. పర్యాటకుల తాకిడికి ఇంకా పెద్దగా లోనుకాని ప్రాంతమిది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కొండ ప్రాంతం కేవలం 1500 మీటర్ల ఎత్తున ఉంటుంది. కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతకు ఇది నిలయం. ప్రాథమికంగా ఈ కొల్లి హిల్స్‌లో ‘మలయాళీ గిరిజనులు’గా అందరూ పిలిచే స్థానిక గిరిజన తెగల వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు. పట్టణ ప్రాంతపు నవ నాగరికులు ఎవరూ ఉండరు. అందుకే, ఈ కొల్లి హిల్స్‌కు కేంద్రస్థానమైన సెమ్మేడులో కూడా మనకు అపరిశుభ్రమైన రహదారులు కానీ, బహిరంగంగా ప్రవహించే మురుగు నీరు కానీ కనిపించవు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ గిరిజనులు కూడా ఎంతో సంస్కారయుతంగా ఉంటారు. చక్కగా దుస్తులు వేసుకుంటారు. వాళ్ళ ఇంటి ముందు కూడా ఓపెన్ డ్రెయిన్లేవీ ఉండవు. ఆ కొండ కోనల అభివృద్ధిలో చదువు కీలక పాత్ర పోషించిందని అనుకోవచ్చు. ఒక్కసారి గతంలోకి వెళితే, కొల్లి హిల్స్‌కు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. తూర్పు కనుమల్లో భాగమైన ఈ కొండ ప్రాంతం ప్రస్తావన ప్రాచీన తమిళ రచనలైన ‘శిలప్పదికారం’, ‘మణిమేఖలై’, ‘పురననూరు’, ‘ఐన్కుర్నూరు’ లాంటి వాటిలో ఉంది. ఈ ప్రాంతానికి అన్ని వసతులూ ఉండేవనీ, అందరికీ ప్రాథమిక విద్య ఉండేదనీ చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. ఆ సంప్రదాయం ఇవాళ్టికీ కొనసాగుతోంది. ఈ కొండల్లోని మహిళలు ఎంతో ఉత్సాహంగా కొత్త పనులు చేపడుతుంటారు. ఇక, ఈ కొల్లి హిల్స్‌కు ఒకప్పటి పాలకుడైన వాళ్విల్ ఒరి ఎంతో ముందుచూపున్న మనిషి అని ప్రాచీన సాహిత్యంలో ప్రస్తావన ఉంది. దాదాపు తొమ్మిది శతాబ్దాల తరువాత కూడా ఇప్పటికీ ఈ కొండ ప్రాంతం, ఇక్కడి ప్రజలపై ఆయన ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది. చల్లగా ఉంటుంది... చలి పెట్టదు! మిగిలిన హిల్ స్టేషన్ల వాతావరణానికి భిన్నంగా కొల్లి హిల్స్ ప్రశాంతంగా ఎండాకాలంలో కొద్ది రోజులు ప్రకృతి ఒడిలో సేద తీరడానికి అనువుగా ఉంటాయి. ఎండాకాలంలో ఇక్కడి పగటి ఉష్ణోగ్రత 28 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రిపూట ఉష్ణోగ్రత 16 నుంచి 22 డిగ్రీలే! అయితే, చలికాలంలో మాత్రం ఇక్కడ ఉష్ణోగ్రత - పగటిపూట 10 డిగ్రీలు, రాత్రి వేళ 5 డిగ్రీలు. అందుకే, వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి ఇది చక్కటి పర్యాటక ప్రాంతం. పైగా, ఇక్కడ తక్కువ ధరకే బస చేసేందుకు వీలుగా కొన్ని రిసార్ట్లు కూడా ఉన్నాయి. భోజనం కూడా తక్కువ ధరకే లభిస్తుంది. అందుకే, చాలామంది ఈ ప్రాంతాన్ని ‘పేదవాళ్ళ ఊటీ’ అని పిలుస్తుంటారు. చుట్టుపక్కల చూడదగ్గవెన్నో! నిజం చెప్పాలంటే, కొల్లి హిల్స్‌కు చేసే ప్రయాణం కూడా ఎంతో ఆసక్తికరంగా, ఉద్విగ్నభరితంగా, సాహసోపేతంగా ఉంటుంది. మైదాన ప్రాంతం నుంచి ఆ కొండల మీదకు దూరం కేవలం 15 కి.మీ.లే. కానీ, పాము మెలికలు తిరిగినట్లు, దాదాపు 73 మలుపులతో ఉంటుందా మార్గం. పగటి పూట ఈ ప్రయాణం చేస్తే బాగుంటుంది. అప్పుడు ఈ కొండల సౌందర్యాన్ని కళ్ళారా చూడవచ్చు. కెమేరాతో చక్కటి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. కొల్లి హిల్స్ పైకి చేరాక, అక్కడ ఉన్నంతలో పెద్ద పట్నం - సెమ్మేడు. అక్కడ బస చేసి, ఆ చుట్టుపక్కలి ప్రాంతాలకు తిరిగి రావచ్చు. సెమ్మేడులోనే హోటళ్ళు, రిసార్టులు ఉంటాయి. సెమ్మేడుకు 17 కి.మీ.ల దూరంలో ఓ జలపాతం ఉంది. ఋతుపవనాలు వచ్చి, తొలకరి జల్లులు కురిశాక, ఇక్కడకు వెళితే, ఆ పరిసరాలు ఎంత అందంగా ఉంటాయో! ఇక్కడకు దగ్గరలోనే ప్రాచీన సంగ కాలానికి చెందిన ఆరపాలీశ్వర ఆలయం ఉంది. ఈ శివుడి గుడి ఎంతో మహిమాన్వితమైనదని స్థానికుల నమ్మకం. ఈ ‘పేదవారి ఊటీ’ని అభివృద్ధి చేయవచ్చని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం గడచిన ఏడేళ్ళుగా ఆ పనిలో ఉంది. పర్యాటక స్థలంగా కొల్లి హిల్స్‌ను ప్రోత్సహిస్తోంది. అలాగే, ఈ కొండల మీద ఓ రెండు వ్యూ పాయింట్లను సిద్ధం చేయాలని చూస్తోంది. అవే గనక సిద్ధమైతే, పర్యాటకులకు మరింత ఆకర్షణ తోడవుతుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఓ వరం. ఇక్కడ సేంద్రియ విధానంలో చిరుధాన్యాలను సహజంగా పండించి, అమ్ముతుంటారు. అలాగే, ఈ కొండల నిండా అనాస, పనస, సపోటా, బత్తాయి తోటలు పుష్కలం. మిరియాలు, కాఫీ లాంటి వాణిజ్య పంటలు ఈ కొండల్లో నివసించే గిరిజనులకు ప్రధాన దిగుబడి. ఈ ప్రాంతాన్ని సందర్శించినవారు గుర్తుగా ఇలాంటివి కొని తీసుకువెళ్ళచ్చు. గిరిజనుల పవిత్ర అరణ్యాలు మరో విశేషం ఏమిటంటే, ఈ కొల్లి హిల్స్ మీద దాదాపు వంద దాకా పవిత్రమైన అడవులు ఉన్నాయి. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ ‘ఎం.ఎస్. స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్’లో పనిచేస్తున్న డాక్టర్ ఇజ్రాయెల్ ఆలివర్ కింగ్ ఇక్కడి ప్రజలు పవిత్రంగా భావించే ఈ అడవులపై పిహెచ్.డి. చేశారు. ‘‘పవిత్రంగా భావించే ఈ అడవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ఎవరినీ గిరిజనులు అనుమతించరు. ఈ ప్రాంతాల్లోనే వారు తమ బంధువులను, పూర్వీకులను ఖననం చేస్తారు. ఈ కొండలకే పరిమితమైన ఈ విలక్షణ ఆచారం, పవిత్ర అరణ్యాలనే ఈ పద్ధతి దేశంలో మరెక్కడా లేదు’’ అని కింగ్ వివరించారు. కొల్లి హిల్స్‌లోని ఈ మలయాళీ గిరిజనులు నేరాలకు పాల్పడరు. అందుకే, ఈ ప్రాంతంలో నేరాలు జరిగినట్లు పెద్దగా ఎప్పుడూ వినం. అయితే, ఇక్కడ జరిగే ఒకే ఒక్క నేరం - వ్యభిచారం. గమ్మత్తేమిటంటే, అలా వ్యభిచరిస్తూ పట్టుబడిన జంట పంది మాంసం వండి, మొత్తం గ్రామ ప్రజలకు విందు పెట్టడమే శిక్ష! ఎలా వెళ్ళాలంటే... తమిళనాడులోని సేలమ్ పట్టణం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో కొల్లి హిల్స్ ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సేలమ్‌కు రవాణా సౌకర్యాలున్నాయి. చక్కటి రైలు మార్గం కూడా ఉంది. మరింకేం! ఈ ‘పేదవారి ఊటీ’కి వెళ్ళి, ప్రకృతిలో తాదాత్మ్యం కండి! * తమిళనాడులోని సేలమ్ పట్టణం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో కొల్లి హిల్స్ ఉన్నాయి. * కొల్లి హిల్స్ మీద దాదాపు వంద దాకా పవిత్రమైన అడవులు ఉన్నాయి. * పవిత్రంగా భావించే ఈ అడవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి * ఎవరినీ ఇక్కడి గిరిజనులు అనుమతించరు. - కె. జయదేవ్ (ఈ వ్యాస రచయిత సీనియర్ జర్నలిస్టు, చలనచిత్ర రూపకర్త. సైన్స్ పత్రిక ‘నానో డెజైస్ట్’కు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.) -
‘సన్’డే
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: రాజకీయ వేడి ముగిసింది. భానుడు మాత్రం ఇప్పటికీ పట్టపగలే చుక్కలు చూపుతున్నాడు. ఉష్ణోగ్రత అంతకంతకు పెరుగుతుండటం.. ఉక్కపోత కారణంగా జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. అత్యవసరమైతే తప్ప ఆరోగ్యవంతులు సైతం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వారం రోజులుగా జిల్లాలో ఎండ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పది రోజుల క్రితం 38 డిగ్రీలు ఉండగా.. ఆదివారం ఒక్కసారిగా 41.2 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నాలుగైదు రోజుల్లో రోహిని కార్తె రానుండటంతో ఎండలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ విడత ఎండల తీవ్రత కాస్త తక్కువే అయినా.. బయట కాలు మోపేందుకు జంకాల్సి వస్తోంది. మాసాంతంలో భానుడు మరింత విజృంభించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ సుర్రుమంటుండటంతో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఇక రోడ్ల పక్కన వ్యాపారాలు నిర్వహించే సామాన్యులు నీడ లేక ఎదుర్కొంటున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. వేసవి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 10 శాతం అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. ఫ్రిజ్‌ల అమ్మకాలు సైతం అధికమయ్యాయి. మట్టి కుండలు, టోపీలు, స్కార్ఫ్, కూలింగ్ గ్లాసెస్లకు సైతం డిమాండ్ అధికంగానే ఉంటోంది. దాహం తీర్చుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అధిక శాతం ప్రజలు కొబ్బరి బోండాంలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఒక్కో బోండాం ధర రూ.30లు పలుకుతుండటం గమనార్హం. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు కూల్‌డ్రింక్స్, నిమ్మకాయ సోడా, నన్నారితో సరిపెట్టుకుంటున్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాధ్యమైనంత వరకు ఉదయం 11 గంటల్లోగా పనులు ముగించుకోవాలి. సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు వెళ్లే ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ తీసుకెళ్లాలి. వేసవిలో శుభ్రమైన తాగునీటినే తీసుకోవాలి. కలుషిత నీటితో డయేరియా(వాంతులు, విరేచనాలు), టైఫాయిడ్, కామెర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఎండకు ఎక్కువగా తిరిగే వారికి వడదెబ్బ సోకే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు నీడలో ఉండే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా నీటిని తాగాలి. వడదెబ్బ సోకినట్లు అనిపిస్తే ఆ వ్యక్తిని నీడకు తీసుకె ళ్లి చల్లని నీటితో తుడవాలి. అనంతరం సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి. కూల్‌డ్రింక్స్ కంటే కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ రసం, తాజా పండ్ల రసం వంటి పానీయాలు మేలు. నూనె, కారం ఎక్కువగా ఉండే ఆహారానికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. లేత రంగు, కాటన్, ఖద్దరు దుస్తులనే ధరించాలి. అవి కూడా వదులుగా ఉండేలా జాగ్రత్త పడాలి. -
‘ఉపాధి’ బకాయిలు రూ.1.60 కోట్లు
ధారూరు, న్యూస్‌లైన్: మండలంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు డబ్బులు అందక నానా పాట్లు పడుతున్నారు. దాదాపు 25 గ్రామ పంచాయతీల పరిధిలో 7 నుంచి 8 వేల మంది కూలీలు ఈ పథకం కింద పనులు చేస్తున్నారు. వేసవి కాలంలో వ్యవసాయ పనులు అంతగా లేకపోవడం, సమీప పట్టణాలకు కూలీ పనులు చేసేందుకు వెళ్తున్నా ఓ రోజు పని దొరకడం, మరో రోజు దొరక్కపోవడంతో ఉపాధి పనుల చేయుడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఉపాధి పనుల కోసం పేర్లు నమోదు చేసుకున్న వారంతా ఫీల్డ్ అసిస్టెంట్ సూచించిన పొలానికి వెళ్లి పనులు చేస్తున్నారు. రెండు నెలల నుంచి కేరెల్లి గ్రామ కూలీలు రూ.1.60 కోట్ల విలువైన పనులు చేసి జిల్లాలో రెండో స్థానంలో నిలిచారు. అయితే ఇంత కష్టపడినా తమకు కూలీ డబ్బులు ఇవ్వడం లేదుని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిబంధన అంటూ డబ్బులు రాకుండా చేశారని చెప్పారు. రెండు నెలలుగా ఇంటి అవసరాలకు డబ్బులు అందక పస్తులుండే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. కనీసం నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఈ విషయమై ఏపీఓ వై.శ్రీనును వివరణ కోరగా డబ్బులు రానిదే నిజమేనని, రూ.1.60 కోట్ల బకాయలున్నాయని చెప్పారు. వారం రోజుల డబ్బులు వచ్చినట్లు ఆదివారం తమకు సమాచారం వచ్చిందని, దశల వారీగా మిగిలిన డబ్బులన్నీ వస్తాయని ఆయన వివరించారు. -
ప్రచార హోరు
సాక్షి, చెన్నై : రాష్ర్టంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. నేతలందరూ సుడిగాలి పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. జాతీయ పార్టీల నాయకులు సైతం రాష్ట్రంలో ప్రచారాలకు సిద్ధమయ్యారు. మదురై ఆధీనం అరుణగిరినాథర్ సైతం ప్రచార బాట పట్టారు. పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని 40 లోక్‌సభ స్థానాల్లో ప్రచారం హోరెత్తుతోంది. పుదుచ్చేరిని పక్కన బెడితే రాష్ట్రంలోని 30 స్థానాలకు పంచముఖ సమరం నెలకొంది. అన్నాడీఎంకే ఒంటరిగాను, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, మనిద నేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగంలతో కలసి కూటమిగా డీఎంకే ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. సీపీఎం, సీపీఐలు కలసికట్టుగా, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, ఐజేకే, కొంగు పార్టీలతో కలసి బీజేపీ నేతృత్వంలో ఓ కూటమి బరిలోకి దిగి ఉంది. ఇక కొన్నేళ్ల అనంతరం రాష్ట్రంలో ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడింది. అన్ని పక్షాలు ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల జాబితాను దాదాపుగా ప్రకటించాయి. కాంగ్రెస్, బీజేపీ, పీఎంకేలు మాత్రం చెరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మిగిలిన పార్టీలు పూర్తి స్థాయిలో జాబితాల్ని ప్రకటించాయి. ప్రచార హోరు: ఆయా పార్టీల అభ్యర్థులు ఓటర్ల ను ఆకర్షించడం లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో ఓపెన్ టాప్ జీపులకు భలే డిమాండ్ ఏర్పడింది. కొన్ని చోట్ల ఇంటింటా ప్రచారం సాగిస్తు న్నా, మరి కొన్ని చోట్ల రోడ్ షోల రూపంలో అభ్యర్థులు ప్రచారాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఉదయం నుంచి రాత్రి వరకు అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడంతో, ఒక్కో రోజు ఒక్కో ప్రాంతాన్ని లేదా, రెండేసి ప్రాంతాల్ని ఎంపిక చేసుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ వస్తున్నారు. నేతల బిజీ : అభ్యర్థులు ఓ వైపు ప్రచారంలో దూసుకెళుతుంటే, మరో వైపు ఆయా పార్టీల నాయకులు సైతం ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అందరి కంటే ముందుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత శ్రీకారం చుట్టారు. హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ రోజుకు రెండు లోక్‌సభ నియోజక వర్గాల చొప్పున ఆమె ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. హెలిపాడ్ల నుంచి రోడ్ షోల రూపంలో బహిరంగ సభల వేదికకు వచ్చే ఆమె కేంద్రంలోని కాంగ్రెస్, రాష్ట్రంలోని డీఎంకే పార్టీలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇక, బీజేపీ కూటమి తరపున డీఎండీకే అధినేత విజయకాంత్, ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన సతీమణి ప్రేమలత ప్రచారంలో ముందున్నారు. వేర్వేరుగా ఈ ఇద్దరు ఓ పెన్ టాప్ వాహనాల ద్వారా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ కన్యాకుమారి నుంచి ప్రచారంలో ఉన్నారు. ఆ పార్టీ అధినేత కరుణానిధి సైతం రెండు బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ తాను పోటీచేస్తున్న కన్యాకుమారిలో ఓటర్లను ఆకర్షిస్తునే, పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రోజు మార్చి రోజు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు రామకృష్ణన్, టీ పాండియన్లు తాము పోటీ చేస్తున్న చెరో తొమ్మిది స్థానాల్లో ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఎండీఎంకే అధినేత వైగో తాను విరుదునగర్‌లో పోటీ చేస్తున్నప్పటికీ, అక్కడి బాధ్యతలను స్థానిక నాయకులకు అప్పగించి, కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రోడ్ షో రూపంలో ప్రచారంలో దూసుకె ళ్తున్నారు. ఆయా పార్టీలకు మద్దతుగా ఉన్న సినీ నటులు ప్రచారంలో ఉరకలు తీస్తుంటే, మదురై ఆధీనంలోని అరుణగిరి నాథర్ అన్నాడీఎంకేకు మద్దతుగా ఆధ్యాత్మిక ప్రసంగాలతో ప్రచారం నిర్వహించే పనిలో ఉన్నారు. అన్నాడీఎంకే కు మద్దతుగా ఎస్ఎంకే నేత, నటుడు శరత్‌కుమార్ ప్రచార బాట పట్టారు. జాతీయ నాయకులు: రాష్ట్ర పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకెళ్తోంటే, జాతీయ పార్టీలు సైతం ప్రచారాలకు సిద్ధం అయ్యాయి. 18 స్థానాల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి సీపీఎం, సీపీఐ జాతీయ నాయకులు సిద్ధం అయ్యారు. ఏప్రిల్ పన్నెండు నుంచి కారత్, 19 నుంచి సీతారాం ఏచూరీ మూడు రోజుల పాటుగా రాష్ట్రంలో పర్యటించనున్నారు. సీపీఐ జాతీయ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, ఏపీ బర్దన్ ప్రచారానికి సిద్ధం అవుతోంటే, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించి నాలుగు చోట్ల ప్రచార సభల్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహం రూపొంది స్తోంది. బీజేపీ నేత నరేంద్ర మోడీ సభలు నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నారు. భానుడి దెబ్బ: వేసవి కాలం కావడంతో ప్రచారానికి భానుడు అడ్డంకిగా మారుతుండడంతో ఉదయాన్నే తమప్రచారానికి శ్రీకారం చుట్టేస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం వేళ ప్రచారాన్ని ముగించుకుని, మళ్లీ సాయం సంధ్య వేళ ప్రచార బాట పట్టే పనిలో అభ్యర్థులు, నాయకులూ ఉన్నారు. -
మంచినీళ్లో రామచంద్ర..!
మార్కాపురం, న్యూస్‌లైన్ : మార్కాపురం మున్సిపాలిటీలో ఏ బ్లాక్‌లో చూసినా నీటి సమస్య తాండవిస్తోంది. మిగిలిన రోజుల్లో పరిస్థితి ఎలాగున్నా..వేసవి కాలంలో మాత్రం పట్టణ ప్రజల గొంతెండక తప్పడం లేదు. బిందె నీటి కోసం నానాతంటాలు పడాల్సి వస్తోంది. స్థానికులకు సక్రమంగా మంచినీరు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన దూపాడు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులోని సాగర్‌నీరు గతేడాది పూర్తిగా అడుగంటింది. దీంతో గతంలో మూడు రోజులకోసారి సరఫరా చేసే సాగర్‌నీటిని ప్రస్తుతం ఐదు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. శివారు కాలనీలకు పైపులైన్లు సక్రమంగా లేకపోవడంతో సాగర్‌నీటి సరఫరా కలగానే మిగిలింది. ఆయా కాలనీలకు ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరే దిక్కయింది. ఆ ట్యాంకర్లు కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. వాటి వద్ద నీరు పట్టుకునేందుకు మహిళలు పోటీపడే నేపథ్యంలో నిత్యం ఘర్షణలు సర్వసాధారణమయ్యాయి. ప్రధాన కాలనీలకు సైతం అరకొరగానే సాగర్ నీరు అందుతోంది. మున్సిపాలిటీలో 32 వార్డులుండగా, అధికారికంగా 17,464 నివాస గృహాలు, 71,092 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. 29 మురికివాడల్లో 29,173 మంది నివసిస్తున్నారు. ఒక్కొక్కరికి రోజుకు సుమారు 70 లీటర్ల నీరు అవసరం. కానీ, ప్రస్తుతం 40 నుంచి 50 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. 24 వార్డుల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వేసవి ప్రారంభానికి ముందే నీటివెతలు మొదలవడంతో వేసవిలో ఇంకెలా ఉంటుందోనని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాలుగు నెలల నుంచి వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే శివారు ప్రాంతాల్లోని డీప్‌బోర్లు సైతం పనిచేయడం లేదు. మున్సిపాలిటీలో సుమారు 165 డీప్బోర్లుండగా, వాటిలో 80 నుంచి 85 మాత్రమే పనిచేస్తున్నాయి. 25 మినీ వాటర్ ట్యాంకులుండగా 10 నుంచి 12 మాత్రమే వాడుకలో ఉన్నాయి. పూలసుబ్బయ్యకాలనీ, ఎస్సీబీసీకాలనీ, బాపూజీకాలనీ, భగత్‌సింగ్‌కాలనీ, చెన్నరాయునిపల్లె, విద్యానగర్, కరెంట్ ఆఫీస్కాలనీ, నాగులవరం రోడ్డు, ఒంటెద్దుబండ్లకాలనీ, నానాజాతుల పేట, ఏకలవ్యకాలనీ, రాజ్యలక్ష్మీనగర్, సుందరయ్య కాలనీల్లో తీవ్ర నీటి కొరత నెలకొంది. 28, 29 బ్లాకుల్లో దాహంతో ప్రజలు అల్లాడుతున్నారు. పొలాల్లో నుంచి తోపుడు బండ్లు, సైకిళ్లపై నీరు తెచ్చుకుంటూ అవస్థపడుతున్నారు. సుమారు 350 నుంచి 400 అడుగుల లోతులో వేసిన బోర్లలో సైతం నీరు రాకపోవడంతో ప్రజలతో పాటు సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. కనిగిరిలో కన్నీటి గాథ కనిగిరి, న్యూస్‌లైన్ : కనిగిరి అనగానే ప్రధానంగా నీటి సమస్య గుర్తొస్తుంది. కనిగిరి మేజర్ పంచాయతీని నగర పంచాయతీగా మార్చేందుకు చుట్టుపక్కలున్న కాశీపురం, మాచవరం, శంఖవరం పంచాయతీలను విలీనం చేశారు. ప్రస్తుతం కనిగిరి నగర పంచాయతీలో 20 వార్డులు, 44,755 మంది జనాభా ఉన్నారు. అధికారికంగా 10,465 గృహాలు, 307 బోర్లు, 51 డీప్‌బోర్లు, 1,839 కుళాయిలు ఉన్నాయి. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని సగం ప్రాంతాల్లో బోర్లలో నీరు పడవు. ఒకవేళ నీరు పడినా ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంటుంది. అత్యధికంగా 5.1 పీపీఎం ఫ్లోరైడ్ శాతం ఇక్కడి నీటిలో ఉంటుంది. దీంతో ఇక్కడి ప్రజలకు సాగర్ నీటి సరఫరా తప్పనిసరి. 1992లో కనిగిరి పరిసరాల్లోని 18 గ్రామాల కోసం రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంత ప్రజలకు ఫ్లోరైడ్ నీటి నుంచి విముక్తి కలిగించేందుకు 175 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. కానీ, ఆయన మరణం తర్వాత సక్రమంగా నిధులు విడుదలగాక ఆ పథకం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నగర పంచాయతీలో ఇంటికో సాగర్‌నీటి కుళాయి కలగానే మిగిలింది. ట్యాంకర్లపై ఆధారపడి నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు.