మార్కాపురం, న్యూస్‌లైన్ : మార్కాపురం మున్సిపాలిటీలో ఏ బ్లాక్‌లో చూసినా నీటి సమస్య తాండవిస్తోంది. మిగిలిన రోజుల్లో పరిస్థితి ఎలాగున్నా..వేసవి కాలంలో మాత్రం పట్టణ ప్రజల గొంతెండక తప్పడం లేదు. బిందె నీటి కోసం నానాతంటాలు పడాల్సి వస్తోంది. స్థానికులకు సక్రమంగా మంచినీరు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన దూపాడు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులోని సాగర్‌నీరు గతేడాది పూర్తిగా అడుగంటింది.
దీంతో గతంలో మూడు రోజులకోసారి సరఫరా చేసే సాగర్‌నీటిని ప్రస్తుతం ఐదు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. శివారు కాలనీలకు పైపులైన్లు సక్రమంగా లేకపోవడంతో సాగర్‌నీటి సరఫరా కలగానే మిగిలింది. ఆయా కాలనీలకు ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరే దిక్కయింది. ఆ ట్యాంకర్లు కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. వాటి వద్ద నీరు పట్టుకునేందుకు మహిళలు పోటీపడే నేపథ్యంలో నిత్యం ఘర్షణలు సర్వసాధారణమయ్యాయి. ప్రధాన కాలనీలకు సైతం అరకొరగానే సాగర్ నీరు అందుతోంది.
మున్సిపాలిటీలో 32 వార్డులుండగా, అధికారికంగా 17,464 నివాస గృహాలు, 71,092 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. 29 మురికివాడల్లో 29,173 మంది నివసిస్తున్నారు. ఒక్కొక్కరికి రోజుకు సుమారు 70 లీటర్ల నీరు అవసరం. కానీ, ప్రస్తుతం 40 నుంచి 50 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. 24 వార్డుల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.
వేసవి ప్రారంభానికి ముందే నీటివెతలు మొదలవడంతో వేసవిలో ఇంకెలా ఉంటుందోనని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాలుగు నెలల నుంచి వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే శివారు ప్రాంతాల్లోని డీప్‌బోర్లు సైతం పనిచేయడం లేదు. మున్సిపాలిటీలో సుమారు 165 డీప్‌బోర్లుండగా, వాటిలో 80 నుంచి 85 మాత్రమే పనిచేస్తున్నాయి. 25 మినీ వాటర్ ట్యాంకులుండగా 10 నుంచి 12 మాత్రమే వాడుకలో ఉన్నాయి.
పూలసుబ్బయ్యకాలనీ, ఎస్సీబీసీకాలనీ, బాపూజీకాలనీ, భగత్‌సింగ్‌కాలనీ, చెన్నరాయునిపల్లె, విద్యానగర్, కరెంట్ ఆఫీస్‌కాలనీ, నాగులవరం రోడ్డు, ఒంటెద్దుబండ్లకాలనీ, నానాజాతుల పేట, ఏకలవ్యకాలనీ, రాజ్యలక్ష్మీనగర్, సుందరయ్య కాలనీల్లో తీవ్ర నీటి కొరత నెలకొంది. 28, 29 బ్లాకుల్లో దాహంతో ప్రజలు అల్లాడుతున్నారు. పొలాల్లో నుంచి తోపుడు బండ్లు, సైకిళ్లపై నీరు తెచ్చుకుంటూ అవస్థపడుతున్నారు. సుమారు 350 నుంచి 400 అడుగుల లోతులో వేసిన బోర్లలో సైతం నీరు రాకపోవడంతో ప్రజలతో పాటు సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు.
కనిగిరిలో కన్నీటి గాథ
కనిగిరి, న్యూస్‌లైన్ : కనిగిరి అనగానే ప్రధానంగా నీటి సమస్య గుర్తొస్తుంది. కనిగిరి మేజర్ పంచాయతీని నగర పంచాయతీగా మార్చేందుకు చుట్టుపక్కలున్న కాశీపురం, మాచవరం, శంఖవరం పంచాయతీలను విలీనం చేశారు. ప్రస్తుతం కనిగిరి నగర పంచాయతీలో 20 వార్డులు, 44,755 మంది జనాభా ఉన్నారు. అధికారికంగా 10,465 గృహాలు, 307 బోర్లు, 51 డీప్‌బోర్లు, 1,839 కుళాయిలు ఉన్నాయి. కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని సగం ప్రాంతాల్లో బోర్లలో నీరు పడవు. ఒకవేళ నీరు పడినా ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంటుంది. అత్యధికంగా 5.1 పీపీఎం ఫ్లోరైడ్ శాతం ఇక్కడి నీటిలో ఉంటుంది.
దీంతో ఇక్కడి ప్రజలకు సాగర్ నీటి సరఫరా తప్పనిసరి. 1992లో కనిగిరి పరిసరాల్లోని 18 గ్రామాల కోసం రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంత ప్రజలకు ఫ్లోరైడ్ నీటి నుంచి విముక్తి కలిగించేందుకు 175 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. కానీ, ఆయన మరణం తర్వాత సక్రమంగా నిధులు విడుదలగాక ఆ పథకం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నగర పంచాయతీలో ఇంటికో సాగర్‌నీటి కుళాయి కలగానే మిగిలింది. ట్యాంకర్లపై ఆధారపడి నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతూనే ఉన్నారు.