![demand for Markapuram Matti Palaka in many countries including America and Russia](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/pallaka.jpg.webp?itok=5mRdvd7l)
అమెరికా, రష్యాతో పాటు పలు దేశాల్లో పలకలకు మంచి డిమాండ్
గృహ నిర్మాణాల్లో విరివిగా వినియోగం
గది ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంచడంలో ఉపయుక్తం
రష్యా యుద్ధంతో తగ్గిన ఎగుమతులు
అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంతో ఎగుమతులు పుంజుకునే అవకాశముందంటున్న వ్యాపారులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురం అంటే.. అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది ‘పలక’. ఆ పలక మీద ఓనమాలు నేర్చుకున్న ఎన్నో చిట్టి చేతులు.. ఉన్నతస్థానాలకు చేరాయి. అలాగే ఎన్నో శీతల దేశాలు కూడా మార్కాపురం పలక(Markapuram Matti Palaka)లను అక్కున చేర్చుకున్నాయి. మన దేశంలో వీటిని అక్షరాలు దిద్దేందుకు వినియోగిస్తే.. శీతల దేశాల్లో గృహ నిర్మాణాల్లో ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల బయట గడ్డ కట్టే చలి ఉన్నా.. గదిలో మాత్రం వెచ్చగా ఉంటుంది. అందుకే వీటికి శీతల దేశాల్లో మంచి డిమాండ్ ఉంది.
రాసుకునే పలకల నుంచి డిజైన్ స్లేట్స్ వైపు అడుగులు..
పలకల గనులు మార్కాపురంతో పాటు తర్లుపాడు, కొనకనమిట్ల, దొనకొండ మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. మన దేశంలో హరియాణా, రాజస్థాన్ ప్రాంతాల్లో పలకల గనులు ఉన్నప్పటికీ.. ఎక్కువగా మార్కాపురం నుంచే పలకలు ఎగుమతి అవుతుంటాయి. 80, 90 దశకాల్లో వ్యాపారం జోరుగా సాగింది. ఆ రోజుల్లో ఏ చిన్నారి చేతిలో చూసినా మార్కాపురం పలకే ఉండేది.
ఈ ప్రాంతంలో 100కి పైగా గనుల్లో కార్యకలాపాలు సాగేవి. వేలాది మంది గడ్డపారలు, సుత్తులతో పలకలు దెబ్బ తినకుండా జాగ్రత్తగా తీసేవారు. అయితే కాలక్రమేణా రాసుకునే పలకల వినియోగం తగ్గడంతో వ్యాపారులు, తయారీదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేశారు. గృహ నిర్మాణాల్లో ఉపయోగించేలా పలకల తయారీ మొదలుపెట్టారు. వీటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
చైనాతో పోటీ.. కరోనాతో డీలా
అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, వియత్నాం, మలేసియా, సింగపూర్, ఇంగ్లండ్ తదితర దేశాలకు మార్కాపురం నుంచి పలకలను ఎగుమతి చేస్తుంటారు. క్రిస్మస్ వస్తుందంటే చాలు అమెరికా, ఇంగ్లండ్, రష్యా తదితరæ దేశాల్లో పాత డిజైన్ స్లేట్‌లను తొలగించి కొత్త వాటిని అమర్చుకుంటూ ఉంటారు. దీంతో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండేది. అదే సమయంలో చైనా కూడా భారీగా ఎగుమతులు మొదలుపెట్టారు. ఈ పోటీని తట్టుకుంటున్న సమయంలో అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఆర్థిక మాంద్యం తలెత్తడంతో ఎగుమతులకు ఆటంకాలు ఎదురయ్యాయి.
కరోనా తర్వాత ఈ పరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతింది. చాలా పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందులతో మూతపడ్డాయి. కొందరు మాత్రమే ఎగుమతులు ప్రారంభించారు. మళ్లీ పుంజుకుంటున్న సమయంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఎగుమతులపై పడింది. పలకల కంటైనర్లను సముద్రం ద్వారా పంపే ఖర్చు రెట్టింపు అయ్యింది. దీంతో ఎగుమతులు భారమయ్యాయని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం కలిసొచ్చేనా..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. చైనాకు, ఆ దేశానికి మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. పోటాపోటీగా దిగుమతి సుంకాలను పెంచుకుంటున్నాయి. దీంతో అమెరికాలో చైనా పలకల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మళ్లీ మార్కాపురం పలకలకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రభుత్వ భవనాలకు మార్కాపురం డిజైన్ స్లేట్స్‌ను ఉపయోగించాలి. అలాగే ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఉచితంగా పలకలు ఇవ్వాలి. దీని వల్ల వేలాది మంది కార్మి కులకు పని దొరకడంతో పాటు పరిశ్రమ పుంజుకుంటుంది. అలాగే పలకల ఫ్యాక్టరీల యజమానులకు సబ్సిడీపై రుణాలు అందించాలి. కరెంటు చార్జీలతో పాటు క్వారీ చార్జీలను తగ్గించి.. ప్రభుత్వం ఆదుకోవాలి. – బట్టగిరి తిరుపతిరెడ్డి, డిజైన్ స్లేట్ వ్యాపారి
Comments
Please login to add a commentAdd a comment