మున్సిపాలిటీ వ్యూ
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకానికి జడ్చర్ల మున్సిపాలిటీని ఎంపిక చేశారు. ఈ మేరకు రూ.47కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మరో 20ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా పనులు చేపట్టనున్నారు. మున్సిపాలిటీలోని కావేరమ్మపేట, జడ్చర్ల, బూరెడ్డిపల్లి, నాగసాల, నక్కలబండతండ, శంకరాయపల్లి తండాలు విలీనమయ్యాయి. విలీన గ్రామాల్లో కొంత నీటి సమస్య ఉంది. అమృత్ 2.0 పథకంలో మంజూరైన రూ.47కోట్ల ద్వారా అన్ని గ్రామాల్లోనూ సమస్యలు పరిష్కారం కానున్నాయి. మున్సిపాలిటీలో లక్షా 10వేలకుపైగా జనాభా ఉండగా, 17వేలకుపైగా ఇళ్లున్నాయి. ప్రస్తుతం 9వేలకుపైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలో ప్రస్తుతం 20ట్యాంకులు ఉండగా, 200 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేశారు.
సామాజిక కార్యకర్తకు సమాచారం..
పట్టణంలోని సామాజిక కార్యకర్త కంచుకోట ఆనంద్ పలు సమస్యలపై ఉన్నతాధికారులకు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ లేఖలు రాయటం పరిపాటిగా మారింది. ఆ లేఖల్లో నీటి ప్రాజెక్టు అమృత్ 2.0 ఒకటి. అయితే ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్లుగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ సెక్రెటరి పి.ఏ.లతిక సామాజిక కార్యకర్తకు లేఖను పంపించటం గమనార్హం.
రియల్ వెంచర్లతో పెరుగుతున్న సమస్య
మున్సిపాలిటీ పరిధిలో కొంతకాలంగా వెలుస్తున్న రియల్ వెంచర్ల వల్ల నీటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. వాస్తవానికి వెంచరు దారులే ప్రతి ఇంటికి నీటి సౌకర్యం వసతి కల్పించాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు వేయకపోవటంతో మున్సిపాలిటీపై భారం పడుతుంది. కొత్తకాలనీలకు నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి వల్లే మిషన్ భగీరథ పథకం అమలు చేస్తున్నప్పటికీ సమస్యలు వస్తూనే ఉన్నాయి.
అమృత్ 2.0లోఇవీ ప్రతిపాదనలు..
అమృత్ 2.0 పథకం ద్వారా మంజూరైన నిధులతో మున్సిపాలిటీలో కింది పనులు చేపట్టనున్నారు. నూతనంగా 53 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం గల 6 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 30వేల లీటర్ల సామర్థ్యం కల 1స్లంప్ నిర్మించనున్నారు. 2.5కి.మీటర్ల మేర ఫీడర్ పైప్‌లైన్ వేయనున్నారు. ఇంటింటికీ నీటిని సరఫరా చేసేందుకు గానూ 62.5 కి.మీటర్ల మేర పైప్‌లైన్ వేయనున్నారు. అదేవిధంగా 7,954 నల్లా కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయటంతోపాటు టెండర్లు పిలిచారు. టెండరు ప్రక్రియ పూర్తికాగానే పనులు మొదలు పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment