రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకూడదు
రూ.115 కోట్ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు
సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులన్నీ పూర్తిగా నీటితో నింపండి
ఎక్కడైనా సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా రోజూ తాగునీటి సరఫరా
1904 కాల్‌సెంటర్ ద్వారా తాగునీటిపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించండి
అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఆదేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తి కావచ్చిన మంచినీటి పథకాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ఆదేశించారు. తాగునీటి పథకాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
వేసవి నీటి ఎద్దడిని అధిగమించేందుకు రూ.115 కోట్ల అంచనాతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బోర్‌వెల్స్ సహా ఇతర తాగునీటి వనరులన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి ఎద్దడి గల ఆవాసాలు, శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా ప్రతి రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. కుళాయిల ద్వారా రోజుకొకసారి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. ఎక్కడైనా మంచినీటికి ఇబ్బంది కలిగితే 1904 కాల్‌సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
పశువులకు కూడా తాగునీటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రైవేట్ బోరులను అద్దెకు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న బోరులను మరింత లోతు చేయడం.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న 1,354 ఆవాసాలకు జూన్ వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయగా.. ఈనెలలో 109 ఆవాసాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అనుమతి మంజూరు చేశామని తెలిపారు.
మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ శ్రీకేశ్ బాలాజీరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం 47 పట్టణ స్థానిక సంస్థల్లో రోజుకు ఒకసారి, 29 యూఎల్బీల్లో రోజుకు 2సార్లు, 43 చోట్ల 2 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కడప, పెనుగొండ, ఒంగోలు, హిందూపురంలో మూడు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా చేస్తున్నామని.. ఇక్కడ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు ఎస్‌ఎస్ రావత్, కేవీవీ సత్యనారాయణ, ఆర్‌వీ కృష్ణారెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment