
ఆ రోడ్డుపై వెళ్లారని సీఎస్‌పై సందేహం: రైతులు
ప్రెస్‌మీట్‌లో జనసేన కార్పొరేటర్ తెల్లమొహం
జవహర్‌పై బురద చల్లేందుకు ప్రయత్నించి భంగపాటు
ఐదేళ్లుగా రెండు గ్రామాల మధ్య భూ వివాదాల రగడ
విశాఖ సిటీ: అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై బురద జల్లడానికి ప్రయత్నించిన ఎల్లో మీడియా యత్నాలు బెడిసికొట్టాయి. సీఎస్‌పై విశాఖ జీవీఎంసీ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని వెల్లడైంది. సీఎస్ ఎన్నడూ తమ భూముల వద్దకు రాలేదని, భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే సమయంలో రోడ్డు మీదుగా మాత్రమే వెళ్లారని జనసేన, టీడీపీ నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో రైతులు కుండబద్ధలు కొట్టారు.
విశాఖలో 800 ఎకరాల అసైన్డ్ భూములను సీఎస్ రైతుల నుంచి బలవంతంగా రాయించుకొని ఫ్రీ హోల్డ్ అనుమతులు పొందినట్లు పీతలమూర్తి యాదవ్ ఆరోపణలు చేశారు. దీన్ని ఆధారాలతో నిరూపిస్తానని బీరాలు పలికిన ఆయన శుక్రవారం టీడీపీ కార్యాలయంలో రైతులు చిట్టెమ్మ, అప్పన్న, నారాయణతో ప్రెస్‌మీట్ నిర్వహించి చివరకు తెల్లమొహంవేశారు.
అగ్రిమెంట్లు చేయలేదన్న రైతులు
తమ భూములను ఎవరికీ అగ్రిమెంట్ చేయలేదని మీడియా సమావేశంలో రైతులు స్పష్టం చేశారు. సీఎస్ ఎప్పుడైనా మీ భూములు ఇవ్వాలని బలవంతం చేశారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అసలు జవహర్‌రెడ్డి ఎన్నడూ తమ భూముల వద్దకే రాలేదని రైతులు స్పష్టం చేశారు. ఇటీవల భోగాపురం విమానాశ్రయం పనుల పరిశీలన నిమిత్తం వచ్చినప్పుడు ఇటుగా వెళ్లడంతో అలా భావించామనడంతో టీడీపీ నేతలు, జనసేన కార్పొరేటర్ కంగుతిన్నారు.
700 ఎకరాలకే ఫ్రీ హోల్డ్ ప్రొసీడింగ్స్
గత ఎనిమిది నెలల్లో విశాఖ జిల్లాలో 700 ఎకరాల అసైన్డ్ భూములకు మాత్రమే ఫ్రీ హోల్డ్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. రాష్ట్రంలో అత్యల్పంగా అనుమతులు ఇచ్చిన జిల్లాల్లో విశాఖ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.1 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల ప్రకారం తెలుస్తోంది. దళితులకు అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో జీవో 596 ఇచ్చింది.
ఇరు గ్రామాల మధ్య ఐదేళ్లుగా వివాదం
టీడీపీ, జనసేన నేతలు తీసుకొచ్చిన రైతుల మధ్య భూ వివాదాలు ఐదేళ్లుగా నలుగుతున్నాయి. భీమిలి మండలం అన్నవరం, భోగాపురం మండలం తూడెం పంచాయతీల మధ్య అసైన్డ్ భూముల వివాదాన్ని సీఎస్‌కు అంటగట్టేందుకు ప్రయత్నించి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ భంగపడ్డాడు. రైతులు మాట్లాడుతుండగా సీఎస్ పేరు చెప్పాలని ఆయన గదమాయించడం గమనార్హం. జవహర్‌రెడ్డి పేరు కూడా తెలియని వారంతా తడబడుతూ జవర్ అని పేర్కొన్నారు.
పార్టీకి సంబంధం లేదు..
సీఎస్‌పై పీతల మూర్తి యాదవ్ ఆరోపణల గురించి జనసేన విశాఖ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌ను ఇటీవల మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పడం గమనార్హం. ఆయన బయట చేసే వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.