‘అసైన్డ్‌’ ఆగడం! రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన చంద్రబాబు సర్కారు | TDP Chandrababu Govt stopped Assigned Lands registrations | Sakshi
Sakshi News home page

‘అసైన్డ్‌’ ఆగడం! రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన చంద్రబాబు సర్కారు

Published Mon, Aug 12 2024 4:38 AM | Last Updated on Mon, Aug 12 2024 12:57 PM

TDP Chandrababu Govt stopped Assigned Lands registrations

20 ఏళ్లు దాటిన అసైన్డ్‌ భూములపై రైతులకు సంపూర్ణ హక్కులిచ్చిన వైఎస్‌ జగన్‌

9 లక్షల ఎకరాలు 22 ఏ జాబితా నుంచి తొలగింపు

ఒరిజినల్‌ అసైనీలకు న్యాయబద్ధంగా, తమ ఇష్టపూర్తిగా అవసరానికి అమ్ముకునే హక్కు

ఒకవేళ ఇప్పటికే చేతులు మారినా ఒరిజినల్‌ అసైనీలకే హక్కులు

అలాంటప్పుడు అది బడుగు, బలహీన వర్గాల రైతులకు మేలు చేసినట్లా? కీడు చేసినట్లా?

లక్షలాది ఎకరాల అసైన్డ్‌ భూములపై ఆంక్షలతో మళ్లీ మొదటికి కథ

అసైన్డ్‌ భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయంటూ అడ్డగోలు వాదన

రాజకీయ కారణాలతో అసైన్డ్‌ రైతుల పొట్టగొడుతున్న సీఎం చంద్రబాబు

సాక్షి, అమరావతి: అసైన్డ్‌ భూములపై వైఎస్సార్‌ సీపీ హయాంలో యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్‌) పొందిన రైతన్నలపై కూటమి సర్కారు కక్ష సాధింపులకు దిగింది. దశాబ్దాల తర్వాత తమ భూములపై ఆంక్షలు తొలగిపోవడంతో సంతోషంగా సాధారణ రైతులుగా సాగు చేసుకుంటున్న వారిని మళ్లీ కష్టాల్లోకి నెట్టింది. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ భూముల చట్ట సవరణ ద్వారా ఫ్రీ హోల్డ్‌ అయిన భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివే­యాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. 

అంతేకాకుండా ఫ్రీ హోల్డ్‌ అయిన భూములన్నింటిపైనా విచారణ నిర్వహించాలని, రీ వెరిఫికేషన్‌ చేయాలని స్పష్టం చేసింది. వాస్తవానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ హోల్డ్‌ భూముల రిజి­స్ట్రేషన్లను అనధికారికంగా నిలిపివేసింది. ఇప్పుడు దాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో లక్షలాది రైతు కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

గత ప్రభుత్వం ఒరిజినల్‌ అసైనీలకు న్యాయ­బద్ధంగా, ఇష్టపూర్తిగా అమ్ముకునే హక్కు కల్పించింది. అసైన్డ్‌ పేదలకు భూములపై పూర్తి హక్కులతోపాటు  అవసరాలకు విక్రయించుకునే అవకాశమిచ్చింది. ఒకవేళ ఇప్పటికే చేతులు మారినా ఒరిజినల్‌ అసైనీలకే హక్కులు ఉండేలా చర్యలు తీసుకుంది. మరి అలాంటప్పుడు అది బడుగు, బలహీన వర్గాల రైతులకు మేలు చేసినట్లా? కీడు చేసినట్లా? అని కూటమి ప్రభుత్వాన్ని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.

చిరకాల వాంఛ నెరవేర్చిన వైఎస్‌ జగన్‌ 
ప్రభుత్వాల నుంచి భూములు పొందిన లక్షలాది మంది నిరుపేద రైతుల చిరకాల కోరికను నాడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నెరవేర్చింది. పేదలకు అసైన్‌ చేసిన (కేటాయింపు) భూములపై వారికి కేటాయించిన తేదీ నుంచి 20 సంవత్సరాల తర్వాత హక్కులు లభించేలా 1977–అసైన్డ్‌ భూముల చట్టానికి 2023లో కీలక సవరణ చేసింది. దీంతో 27 లక్షల మంది అసైన్డ్‌ భూముల రైతన్నలు తమ భూములపై హక్కులు (ఫ్రీ హోల్డ్‌) పొందే అవకాశం కలిగింది. 

అయితే అసైన్డ్‌ భూములు చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఒరిజినల్‌ అసైనీ (ఒరిజినల్‌ కేటాయింపుదారు)కే యాజమాన్య హక్కులు కల్పించింది. ఎవరు పడితే వారు అసైన్డ్‌ భూములను సొంతం చేసుకునే ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి భూములు పొందిన వారు లేక వారి వారసులకు మాత్రమే అసైన్డ్‌ భూములపై హక్కులు కల్పించింది. ఈ క్రమంలో పూర్తి వెరిఫికేషన్‌ తర్వాత 9 లక్షల ఎకరాలపై సంబంధిత రైతులకు హక్కులు కల్పించి ఆ భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించింది. 

మిగిలిన భూములపైనా వెరిఫికేషన్‌ పూర్తి చేసి 22 ఏ జాబితా నుంచి తొలగించాల్సి ఉండగా కూటమి సర్కారు ఆ పని నిలిపివేసింది. అంతటితో ఆగకుండా గత  ప్రభుత్వం 22ఏ జాబితా నుంచి తొలగించిన భూములకు చెందిన రైతులపైనా విచారణ పేరుతో కక్ష సాధింపులకు దిగింది. విచారణలో సక్రమమని తేలిన భూములపైనా ఆంక్షలు కొనసాగించాలని, ప్రభుత్వానికి తెలియకుండా వాటిని 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించకూడదని స్పష్టం చేయడాన్ని బట్టి చంద్రబాబు సర్కారు పేద అసైన్డ్‌ రైతులపై ఎంత క్షక్ష పూరితంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

రైతుల చేతుల్లోనే 97.22 శాతం భూములు 
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో పేదల అసైన్డ్‌ భూములు ఫ్రీ హోల్డ్‌ కావడం, వాటిపై వారికి సంపూర్ణ హక్కులు లభించడంతో ఏదో గోల్‌మాల్‌ జరిగిందని, అన్యాక్రాంతమయ్యాయని కూటమి సర్కారు దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవానికి 22 ఏ జాబితా నుంచి తొలగించిన 9 లక్షల ఎకరాల్లో విక్రయాలు జరిగింది కేవలం 25 వేల ఎకరాలు (2.78 శాతం) మాత్రమే. అంటే ఒరిజినల్‌ అసైనీలు మాత్రమే ప్రయోజనం పొందారు. 

మిగిలిన 97.22 శాతం భూములపై కూడా హక్కులు ఒరిజినల్‌ రైతుల చేతుల్లోనే ఉన్నాయి. దీన్ని చంద్రబాబు ప్రభుత్వం తప్పుగా చిత్రీకరిస్తూ అసైన్డ్‌ భూముల చట్ట సవరణను తప్పు పడుతోంది. అదే సమయంలో చట్ట సవరణను కొనసాగిస్తామని ప్రకటించింది. దీన్నిబట్టి అసైన్డ్‌ భూములపై దళితులకు, బడుగులకు హక్కులు దక్కకూడదన్నదే చంద్రబాబు సర్కారు లక్ష్యంగా కనపడుతోంది.

విస్తృత అధ్యయనం తర్వాతే చట్ట సవరణ
అసైన్డ్‌ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు కల్పించటానికి ముందు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విస్తృతంగా అధ్యయనం చేసింది. అప్పటి రెవెన్యూ మంత్రి నేతృత్వంలో ఎమ్మెల్యేలతో కమిటీని నియమించింది. వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన కమిటీ అసైన్‌మెంట్‌ భూముల చట్టాలు, నియమ నిబంధనలను క్షుణ్నంగా పరిశీలించి గత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 

అసైన్‌ చేసిన 20 ఏళ్ల తర్వాత ఒరిజినల్‌ లబ్ధిదారులకు లేదా వారి వారసులకు అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు వీలు కల్పించాలని, అందుకు అనుగుణంగా ఏపీ అసైన్‌మెంట్‌ చట్టం (పీఓటీ)– 1977కి సవరణలు చేయాలని కమిటీ సిఫారసు చేసింది.

పీఓటీ 1977 చట్టం స్ఫూర్తిని గౌరవిస్తూ.. 
అసైన్డ్‌ భూములపై లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని గత ప్రభుత్వానికి కమిటీ సిఫారసు చేయగా దీనికి నాటి మంత్రివర్గం ఆమోదం తెలిపి చట్టానికి సవరణలు చేసింది. 20 ఏళ్లకు ముందే ఎవరైనా పేద రైతుల నుంచి భూములు కొనుక్కుంటే వారికి ఎలాంటి ప్రయోజనం దక్కని విధంగా కూడా అదే సందర్భంలో చట్ట సవరణ చేసింది. 

తద్వారా అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతం కాకూడదన్న ఒరిజినల్‌ పీఓటీ (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌)–1977 చట్టం స్ఫూర్తిని గౌరవించింది. తద్వారా అసైన్‌మెంట్‌ అయిన దగ్గర నుంచి 2023లో చట్ట సవరణ జరిగే వరకూ అసైన్డ్‌ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన రైతులకు మాత్రమే మేలు జరుగుతుంది. ఇలా ఒరిజనల్‌ అసైనీలకు మాత్రమే ప్రయోజనం దక్కేలా చర్యలు తీసుకున్నారు.

పేద రైతులను రోడ్డుకీడ్చేసి..
గత ప్రభుత్వం ఇంత పకడ్బందీగా చట్ట సవరణ చేసి అసైన్డ్‌ భూములపై విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే దాన్ని వక్రీకరించి భూములన్నీ అన్యాక్రాంతమైనట్లు ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కుట్ర మినహా మరేమీ లేదని స్పష్టమవుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలు అసైన్డ్‌ భూములను సొంతం చేసుకున్నట్లు కూటమి సర్కారు అభాండాలు మోపుతోంది. ఫ్రీ హోల్డ్‌ అయిన 9 లక్షల ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగింది కేవలం 25 వేల ఎకరాలే. 

అందులో ఎక్కడైనా తేడాలున్నాయని భావిస్తే విచారణ నిర్వహించుకోవచ్చు. అంతేగానీ ఒరిజినల్‌ అసైనీల చేతుల్లో ఉన్న మొత్తం ఫ్రీహోల్డ్‌ భూములన్నింటిలోనూ తప్పులు జరిగాయని వితండవాదం చేస్తూ ఆ రైతులను రోడ్డు కీడ్చడం కచ్చితంగా పేదలపై కక్ష సాధించడమే. పేదలంతా వైఎస్‌ జగన్‌కు అండగా ఉండడాన్ని జీర్ణించుకోలేని కూటమి సర్కారు వారిని ఇక్కట్లకు గురి చేస్తూ బురద జల్లడానికి సిద్ధపడినట్లు స్పష్టమవుతోంది. 

ఆ ఉత్తర్వులు అన్యాయం..
ఏళ్ల తరబడి అనుభవంలో ఉన్న అసైన్డ్‌ భూములపై రైతులకు సంపూర్ణ హక్కులను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కల్పించారు. పేద రైతులపై కక్ష సాధించేలా అసైన్డ్‌ భూములను రిజిస్ట్రేషన్‌ చేయకూడదని, వాటిపై విచారణ జరపాలని కూటమి ప్రభుత్వం ఆదేశించడం దారుణం. చిప్పాడ పంచాయితీలో మా అమ్మ వెంకాయమ్మ పేరుతో 2 ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. రిజిస్ట్రేషన్‌ కోసం మేం చేసుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉండగా నిలిపివేయాలని ఆదేశిచడం అన్యాయం.
– కొయ్య అప్పల సూర్యనారాయణరెడ్డి, పాత మూలకుద్దు, భీమిలి మండలం

బ్యాంకు రుణాలు రాకుండా చేసింది..
ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు 20 ఏళ్లకు పైబడి లబ్ధిదారుల అధీనంలో ఉంటే సంపూర్ణ యాజమాన్య హక్కులు దక్కేలా గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ ప్రక్రియ కొనసాగుతుండగా టీడీపీ కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయడం దారుణం. భూములు చేతిలో ఉన్నా అవసరానికి బ్యాంకు రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా చేసింది. గత ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును రద్దు చేయడం సరికాదు. 
– ఆండ్రా వెంకట సుబ్బారెడ్డి, రైతు, ఆత్మకూరు

మళ్లీ కష్టాలు మొదలు
ఏళ్ల తరబడి అసైన్డ్‌ భూములను అనుభవిస్తున్న రైతులకు మేలు కలిగేలా గత ప్రభుత్వం చొరవ తీసుకుని యాజమాన్య హక్కులు కల్పించింది. ఇప్పుడు రైతులకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. భూములను తనఖా పెట్టి రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా చేసింది.
–  మెట్టుకూరు చంద్రశేఖర్‌రెడ్డి, రైతు, గోవిందంపల్లి, అనంతసాగరం మండలం

నిలిపివేయడం అన్యాయం..
గత ప్రభుత్వం అసైన్డ్‌ భూములపై పేదలకు కల్పించిన యాజమాన్య హక్కులను కూటమి సర్కారు హరించడం దారుణం. ఇది పేద రైతుల కడుపు కొట్టడమే. అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లతో ఎంతో మంది పేద రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. 
– బోస నర్సింగరావు, జేవి అగ్రహారం, భీమిలి నియోజకవర్గం

రోడ్ల పైకి రైతులు
మాకు భూములున్నా యాజమాన్య హక్కులు కల్పించకుండా కూటమి ప్రభుత్వం 
అడ్డుపడటం సరికాదు. సక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగిన వాటిని కూడా పెండింగ్‌లో ఉంచాలని నిర్ణయించడం ఏమిటి? కూటమి ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోకుంటే లక్షల మంది పేద రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది.
– పెద్దాడ వెంకటప్పారావు, జేవి అగ్రహారం, భీమిలి నియోజకవర్గం. 

పేదల కడుపుకొడుతున్నారు..
మాకు తిరుపతి సమీపంలో నాలుగు ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. గత ప్రభుత్వం సర్వ హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఎంతో సంతోషపడ్డాం. గతంలో ఎంతో మంది పాలకులు హామీలిచ్చినా నెరవేర్చలేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చింది. కొత్త ప్రభుత్వం రాగానే ఫ్రీ హోల్డ్‌ పేరుతో అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌ను నిలుపుదల చేయడం దారుణం. పేదల పట్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు. చంద్రబాబు నిరుపేదల కడుపు కొడుతున్నారు. 
–ప్రభాకర్, భైరాగిపట్టెడ, తిరుపతి 

అన్యాయం చేయొద్దు..
మాకున్న అసైన్డ్‌ భూమికి గత ప్రభుత్వంలో సర్వహక్కులు కల్పించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. చాలా ఆనందం వేసింది. చాలా ఏళ్లుగా ఉన్న సమస్య గత ప్రభుత్వంలో పరిష్కారమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిలిపి వేయడం వల్ల ఎంతో మంది రైతులు నష్టపోతారు. సీఎం చంద్రబాబు రైతులకు మేలు చేయాలే కానీ అన్యాయం చేయకూడదు. ప్రీహోల్డ్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. 
– సుబ్బానాయుడు, రైతు, 50 బసివిరెడ్డిపల్లి గ్రామం, గంగాధర నెల్లూరు, చిత్తూరు జిల్లా 

రైతులకు తీవ్ర ఇబ్బందులు..
ఫ్రీ హోల్డ్‌ అయిన చుక్కల భూములు, అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం దారుణం. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత ప్రభుత్వం అన్ని రకాల విచారణలు నిర్వహించాకే అనుమతించింది.
– జీ రామయ్య, రైతు, పొదలకూరు మండలం

కథ మళ్లీ మొదటికే..
దశాబ్దాల తర్వాత రైతులు కష్టాలు తీరాయనుకుంటే మళ్లీ మొదలవుతున్నాయి. అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని సంతోషపడుతున్న సమయంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం వల్ల కథ మొదటికి వస్తుంది. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి.
– వి.దయాకర్‌రెడ్డి, పొదలకూరు మండలం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement