
ధర్నా చేస్తున్న ఏపీ కోకో రైతుల సంఘం నేతలు, కోకో రైతులు
ధరల ఒప్పంద ప్రకటన చేయకపోవడంపై ఆగ్రహం
మంత్రి హామీ ఇచ్చిన తర్వాత కూడా కంపెనీలు ధరలు తగ్గించాయని మండిపాటు
కొరిటెపాడు(గుంటూరు): కూటమి ప్రభుత్వ తీరుపై కడుపు మండిన కోకో రైతులు సోమవారం కదం తొక్కారు. వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ధరల ఒప్పంద ప్రకటన చేయకపోవడంపై ఆగ్రహించిన రైతులు గుంటూరులోని ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ మాట్లాడుతూ.. కోకో గింజలు కొనే కంపెనీలు రోజురోజుకూ ధరలు తగ్గిస్తుండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.
ఈ నెల 3న జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఈనెల 7న కోకో గింజల ధరల ఒప్పంద ప్రకటన వస్తుందని ఎదురు చూశామన్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఒప్పంద ప్రకటన చేయలేదని మండిపడ్డారు. మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు కిలో కోకో గింజలను రూ.550కు కొనుగోలు చేస్తామని మంత్రి సమక్షంలో చెప్పి.. అమలు చేయలేదన్నారు. పైగా మరో రూ.50 ధర తగ్గించారని మండిపాడ్డారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో కోకో గింజల ధర రూ.750కు పైగా ఉందని.. రాష్ట్ర రైతులకు కూడా ఆ మేరకు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వారం, పది రోజుల్లో మళ్లీ కంపెనీలతో సమావేశం నిర్వహించి.. ధరలు తగ్గకుండా చర్యలు తీసుకుంటామని రైతులకు ఉద్యాన శాఖ రాష్ట్ర అసిస్టెంట్ డైరెక్టర్ హరినాథ్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు వై.కేశవరావు, కె.శ్రీనివాస్, ఎస్.గోపాలకృష్ణ, పానుగంటి అచ్యుతరామయ్య పాల్గొన్నారు.