ఎల్‌ఈడీ లైట్లతో ప్రమాదం | Danger with LED Lights | Sakshi
Sakshi News home page

ఎల్‌ఈడీ లైట్లతో ప్రమాదం

Published Tue, Apr 29 2025 6:19 AM | Last Updated on Tue, Apr 29 2025 6:19 AM

Danger with LED Lights

ఇష్టానుసారంగా వినియోగం 

ద్విచక్రవాహనాలు మొదలుకుని భారీ వాహనాల వరకు 

పట్టించుకోని ఆర్టీఏ శాఖ అధికారులు

పట్నంబజారు(గుంటూరు ఈస్ట్‌):  నిబంధనలకు నీళ్ళొదిలేస్తున్నారు.. కనీస ఆలోచన లేకుండా.. ఇతరుల ప్రాణాలకు ముప్పు అని తెలిసినా.. ఎల్‌ఈడీ లైట్ల వినియోగం యథేచ్ఛగా సాగుతోంది. ద్విచక్ర వాహనాలు మొదలుకుని.. ఆటోలు, లారీలు, ప్రైవేట్‌ బస్సుల్లో లైట్ల వినియోగం పెచ్చుమీరుతోంది. అయినా పట్టించుకోవాల్సిన రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆరీ్టఏ) అధికారులు మాత్రం మొద్దు నిద్రపోతున్నారు. కొన్నాళ్ళ క్రితం గుంటూరు రూరల్‌ మండలం అంకిరెడ్డిపాలెం వద్ద ఒక బస్సులో అగి్నప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం తెలిసిన అధికారులు షాక్‌కు గురయ్యారు. నేరుగా ఇంజిన్‌ నుంచి ఎల్‌ఈడీ లైట్లకు వైర్లు అనుసంధానం చేయటం ద్వారానే ప్రమాదం జరిగిందని గుర్తించారు.

ఆ ప్రమాదంలో బస్సు దగ్ధమై, ప్రయాణికులు మాత్రం స్వల్ప గాయాలతో బయట పడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాహనాలకు సంబంధించి ఎల్‌ఈడీ లైట్ల వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. భారీ ఫోకస్‌ వచ్చే లైట్లు వినియోగించటం ద్వారా ఎదురుగా వచ్చే వాహనదారులకు కనపడకపోవటంతోపాటు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు 90శాతం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం కంపెనీల ఫోకస్‌ లైట్లు ఇచ్చిన వాటి వరకే వినియోగించాలనేది చట్టం. అదనపు ఫిట్టింగ్‌లు చేయకూడదని స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటీకీ.. వాహనదారులు యథేచ్ఛగా దురి్వనియోగం చేస్తున్నారు.

వాహనాల చట్టం 1988 (మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌) ప్రకారం వాహనాల్లో అనుమతించని మార్పుల్లో ఎల్‌ఈడీ లైట్లు వినియోగం ఒకటి. ఈ చట్టంలోని సెక్షన్‌ 52 ప్రకారం వాహనాల నిర్మాణం, ఫీచర్లలో అనుమతి లేకుండా మార్పులు చేయటం చట్ట విరుద్ధం. ఎల్‌ఈడీ లైట్లు హాలోజెన్‌ లైట్ల కంటే అధికంగా ప్రకాశిస్తాయి. తద్వారా ఇతర డ్రైవర్‌లకు గందరగోళం ఏర్పడటంతోపాటు, అంధత్వాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఆర్టీఏ, ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం అధికమైన వాట్స్, అన్‌ అప్రూవ్డ్‌ లైట్లు నిషేధించిన పరిస్థితులు ఉన్నాయి. కారుల్లో 75 వాట్స్, లారీలకు 100 వాట్స్, బైక్‌లకు 10 వాట్స్‌లోపు మాత్రమే లైట్ల వినియోగం ఉండాలి.  

జైలు శిక్షకు కూడా అవకాశం 
ఆర్టీఏ రూల్‌ ప్రకారం ఎల్‌ఈడీ లైట్లు వినియోగం చేపడితే వాహనాన్ని సీజ్‌ చేయటంతోపాటు జరిమానా విధించవచ్చు. జరిమానా రూ.1,000 నుంచి రూ.పదివేల వరకు పడే అవకాశం ఉంది. కొద్ది కాలం క్రితం బెంగళూరుతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కేవలం వారం రోజుల వ్యవధిలో 8వేల కేసులు నమోదు చేశారంటే ఎల్‌ఈడీ లైట్ల వినియోగం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లైట్ల వినియోగం ద్వారా ఒక్కోసారి జైలు శిక్షకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు.

అడ్డగోలుగా అమ్మకాలు..
మోటార్‌ వెహికల్‌ షాపుల్లో ఎల్‌ఈడీ లైట్ల విక్రయాలు చేపట్టకూడదని నిబంధనలు చెబుతున్నాయి ఆయా వాహనాన్ని బట్టి దాని వినియోగానికి సరిపడా వాట్స్‌ కంటే అధిక ప్రమాణాలు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి. రోడ్డు మంత్రిత్వ శాఖ (మినిస్టరీ ఆఫ్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే లైట్లు వినియోగించాలి. అయితే దీనిపై చర్యలు తీసుకునేందుకు ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసులకు అధికారం ఉంది. అయినా కనీస చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇటీవల కాలంలో కేసులు నమోదు చేసిన పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు.  

ఎల్‌ఈడీ లైట్లు వినియోగిస్తే చర్యలు  
నిబంధనలకు విరుద్ధంగా హెవీ ఫోకస్‌ ఉన్న ఎల్‌ఈడీ లైట్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా కేసులు నమోదు చేయటంతోపాటు, వాహనాలను సీజ్‌ చేస్తాం. అధిక వెలుగు వచ్చే లైట్లు వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ. కంపెనీలు అమర్చిన లైట్లు మినహా ఏ ఒక్కరూ విడిగా ఎల్‌ఈడీ లైట్లు పెట్టుకోకూడదు. ఇష్టానుసారంగా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.  –ఎం. రమేష్‌ (గుంటూరు ట్రాఫిక్‌ డీఎస్పీ)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement