వాహన చట్ట నిబంధనల్ని కచ్చితంగా అమలు చేయాల్సిందే
ట్రాఫిక్ పోలీసులు బాడీఓర్న్ కెమెరాలు ధరించాలి
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ధర్మాసనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో ఏ ఒక్కరినీ ఉపేక్షించరాదని స్పష్టం చేసింది. హెల్మెట్ ధరించకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాలను దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది.
ఈ విషయంలో చట్ట నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంది. తదుపరి విచారణను ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అవగాహన కల్పించండి
హెల్మెట్ ధరించాల్సిన అవసరం, ధరించకుండా సంభవించే దు్రష్పభావాలపై వాహన చోదకులలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులను, న్యాయ సేవాధికార సంస్థను ధర్మాసనం ఆదేశించింది. చట్ట నిబంధనల గురించి ప్రాంతీయ, జాతీయ భాషా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలంది. రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు తప్పనిసరిగా బాడీఓర్న్ కెమెరాలు ధరించాల్సిన అవసరం ఉందంది.
ఈ దిశగా చర్యలు తీసుకోవాలంది. తద్వారా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను కోర్టు ముందుంచి వారికి శిక్ష పడేలా చేయొచ్చని తెలిపింది. అలాగే మోటారు వాహన చట్టంలో నిర్ధేశించిన ఇతర నిబంధనలను కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను ధర్మాసనం ఆదేశించింది.
ఈ వ్యవహారం విస్తృత ప్రజా ప్రయోజనాలకు సంబంధించిందని, దీనిని సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు స్పష్టం చేసింది. అందువల్ల సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి విధించిన చలాన్ల వివరాలను, వాహన తనిఖీల వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. మంచి వ్యాజ్యం దాఖలు చేశారంటూ పిటిషనర్ తాండవ యోగేషన్‌ను ధర్మాసనం ఈ సందర్భంగా అభినందించింది.
2022లో 3,042 మంది మృతి
కేంద్ర మోటారు వాహన సవరణ చట్ట నిబంధనలను అమలు చేయడం లేదని, చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానాలు విధించడం లేదని, దీంతో పెద్ద సంఖ్యలో వాహన ప్రమాదాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయని న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ట్రాఫిక్‌తో సహా మోటారు వాహన చట్ట నిబంధనల కింద ఇతర విధులు నిర్వర్తించే పోలీసులు, ఇతర అధికారులు బాడీఓర్న్ కెమెరాలను ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.
ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. యోగేష్ వాదనలు వినిపిస్తూ.. 2022లో రోడ్డు ప్రమాదాల కారణంగా 3,703 మరణాలు సంభవించాయని, ఇందులో 3,042 మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే సంభవించాయని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. విజయవాడలో హెల్మెట్ లేకుండా వాహన చోదకులు తిరుగుతుండటాన్ని తాము కూడా గమనించామంది.
చట్ట నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి ఉందని, ఈ దిశగా తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. దీనికి ముందు చట్ట నిబంధనల అమలుకు ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment