
నన్ను భూ వివాదంలో కేంద్ర సహాయ మంత్రి పీఆర్వో బెదిరించారు
కలకలం రేపుతున్న డిప్యూటీ కలెక్టర్ ఆడియో
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘నేను టీడీపీ సానుభూతిపరుడిని.. పార్టీ కోసం ఎంతో పనిచేశా. అయినా భూ వివాదంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పీఆర్వో మధు బెదిరించారు. అధికారిలా కాదు.. కనీసం మనిషిలా కూడా చూడలేదు’ అంటూ ఓ డిప్యూటీ కలెక్టర్ వాపోయాడు. ఈమేరకు ఓ ఆడియో కలకలం సృష్టిస్తోంది. సదరు డిప్యూటీ కలెక్టర్ గతంలో తాడికొండ ఎమ్మార్వోగా, కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పనిచేశారు.
ప్రస్తుతం సెక్రటేరియేట్‌లో పని చేస్తున్నారు. ఆయన సమీప బంధువు విడాకులు తీసుకోవడంతో వారికి సంబంధించిన భూమిపై వివాదం నెలకొన్నట్లు తెలిసింది. చేబ్రోలు మండలంలోని సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ఈ భూమి తనకు చెందేలా చూడాలని ఒక మహిళ.. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిని ఆశ్రయించినట్లు సమాచారం. ఆయన ఆదేశాల మేరకు పీఆర్వో మధు సదరు డిప్యూటీ కలెక్టర్‌ను పెమ్మసాని కార్యాలయానికి పిలిపించుకున్నట్లు తెలిసింది. అక్కడ మధు మరో న్యాయవాదితో కలిసి తనను బెదిరించారంటూ డిప్యూటీ కలెక్టర్ ఓ వ్యక్తితో ఫోన్‌లో వాపోయారు.
మినిస్టరే డీల్ చేయమన్నారంటూ బెదిరించారు!
‘నేను ఐదేళ్లు తాడికొండ ఎమ్మార్వోగా, రెండేళ్లు పెదకాకాని, ఒకటిన్నరేళ్లు వినుకొండ ఎమ్మార్వోగా పనిచేశా. తాడికొండలో ఉన్న టీడీపీ యంత్రాంగం మొత్తానికి నేను తెలుసు. టీడీపీకి ఎంత సేవ చేశానో అందరికీ తెలుసక్కడ. నేను డిప్యూటీ కలెక్టర్ కాకపోయి ఉంటే.. టీడీపీ నాయకులు నన్ను ఎమ్మార్వోగా అక్కడికి తీసుకెళ్లి ఉండేవారు. శ్రావణ్‌కుమార్ నా గురించి చెబుతారు. జీవీ ఆంజనేయులు నరసరావుపేట ఆర్డీవోగా నన్ను వేయాలని ఎన్నో సార్లు లోకేశ్‌ను అడిగారు. నన్ను ఎక్కడా.. ఎవరూ అగౌరవపరచలేదు. కానీ మధు(పెమ్మసాని పీఆర్వో) చాంబర్‌లో కూర్చోబెట్టి వ్యంగ్యంగా మాట్లాడారు. మినిస్టర్‌గారు ఉంటే ఇలా ఉండేది కాదన్నాను నేను. కానీ మినిస్టరే డీల్ చేయమన్నారంటూ పదేపదే బెదిరించారు. దీంతో నేను ఆ వారమంతా మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యాను.
నా హోదాకు గౌరవం ఇవ్వకపోగా.. కనీసం మనిషిలా కూడా చూడలేదు’ అంటూ డిప్యూటీ కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ ఘటన జరిగి చాలా రోజులయ్యింది. కానీ డిప్యూటీ కలెక్టర్ ఆడియో తాజాగా వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. కేంద్ర సహాయ మంత్రికి తెలియకుండా ఒక చిరుద్యోగి.. డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తిని బెదిరించే అవకాశం లేదని.. అంతా ఆయనకు తెలిసే జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో టేపు కలకలం సృష్టించడంతో.. ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు పలువురు రంగంలోకి దిగారు. పెమ్మసానికి తెలియకుండా జరిగి ఉంటుందని.. ఆయన సోదరుడు మీతో మాట్లాడతారని.. ఈ విషయాలను మరెక్కడా బయటపెట్టవద్దని డిప్యూటీ కలెక్టర్‌ను కోరారు. ఆడియోలోని వాయిస్ తనది కాదని చెప్పాలంటూ డిప్యూటీ కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.