సందీప్‌కు టీడీపీ నేతల అండదండలు.. | Rowdy Sheeter Sandeep Deceased in Conflicts in Vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో అలజడి

Published Mon, Jun 1 2020 7:36 AM | Last Updated on Mon, Jun 1 2020 9:17 AM

Rowdy Sheeter Sandeep Deceased in Conflicts in Vijayawada - Sakshi

ప్రతిపక్షనేత చంద్రబాబుతో మృతుడు సందీప్‌(ఫైల్‌)

సాక్షి, అమరావతిబ్యూరో: బెదిరింపులు.. సెటిల్‌మెంట్లు.. రౌడీషీటర్ల నిత్య కృత్యాలు. అనుకున్నది చేసేందుకు వారు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేస్తున్నా పంథాను మార్చుకోవడం లేదు. వివాదాల్లో ఉన్న భూములు, కాలనీలు, వీధుల్లో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు, శివార్లలోని రూ. కోట్ల విలువైన స్థలాల క్రయ విక్రయాల్లో వీరు జోక్యం చేసుకుంటున్నారు. భౌతిక దాడులకు  గబడుతున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు. పటమట, కృష్ణలంక, భవానీపురం, కొత్తపేట, సింగ్‌నగర్‌ ప్రాంతాల్లోవీరి అరాచకాలు పెరుగుతుండడమే ఇందుకు నిదర్శన. తాజాగా శనివారం పటమటలో జరిగిన గ్యాంగ్‌వార్‌లో ఒక మాజీ రౌడీషీటర్‌ ఆదివారం మరణించడం నగరంలో కలకలం రేపుతోంది.  (టీడీపీ,జనసేన భూ వివాదం: ఒ‍కరి మృతి)

ఏం జరిగిందంటే..  

నగరానికి చెందిన ధనేకుల శ్రీధర్, ప్రదీప్‌రెడ్డిలు యనమలకుదురులో ఒక స్థల యాజమానితో కలిసి డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ కింద 14 ఫ్లాట్లతో కూడిన అపార్ట్‌మెంట్‌ నిర్మాణం చేపట్టినట్లు సమాచారం.  
ప్రదీప్‌రెడ్డి తన వాటాలో భాగంగా రూ. 40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. కొన్నాళ్లకు అతను అగ్రిమెంట్‌ నుంచి తప్పుకున్నాడు. అయినా ధనేకుల శ్రీధర్‌ ప్రాజెక్టుకు ఆపకుండా పూర్తి చేశారు.  
ఇటీవల ప్రదీప్‌రెడ్డి శ్రీధర్‌ను కలిసి తాను పెట్టుబడిగా పెట్టిన రూ. 40లక్షలకు వడ్డీ కలిపి రూ. 50 లక్షలు ఇ వ్వాలనికోరగా, అంతఇవ్వలేనని శ్రీధర్‌ తేల్చిచెప్పాడు.
దీంతో ప్రదీప్‌ స్పందన కార్యక్రమంలో శ్రీధర్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు దీనిని కోర్టులో తేల్చుకోవాలని సూచించారు.  
ఎలాగైనా తన డబ్బును రాబట్టుకోవాలని భావించిన ప్రదీప్‌రెడ్డి పటమటలో ఉన్న టీడీపీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్‌ కుమారుడిని కలిసి విషయం తెలియజేయగా.. ఇరువర్గాలను పిలిచి సెటిల్‌ చేయమని అతను తన అనుచరుడికి పని అప్పగించాడు.  
దీంతో అతను సందీప్‌ అనే ఓ మాజీ రౌడీషీటర్, నేర చరిత్ర ఉన్న పండు అలి యాస్‌ మణికంఠ అనే ఇద్ద రితో కలిసి తాడేపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం శ్రీధర్, ప్రదీప్‌రెడ్డిలను పిలిచి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు.  
ఈ నేపథ్యంలో పండు, సందీప్‌ మధ్య వాటాల పంపకంలో వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అదే రోజు అర్ధరాత్రి 1 గంట సమయంలో పండు ఇంటికెళ్లిన సందీప్‌ అతని తల్లితో గొడవపడ్డాడు.  
ఆ తెల్లవారే శనివారం ఉదయం సందీప్‌కు చెందిన ఐరన్‌ షాపుకెళ్లిన పండు అక్కడ పనిచేసే వ్యక్తిని గాయపరచడంతో వివాదం చినికి చినికి గాలివానాల మారి చివరకు రెండు వర్గాలు విడిపోయి గ్యాంగ్‌వార్‌కు దారితీసింది.  
సాయంత్రం విజయవాడ పటమట పప్పులమిల్లు సెంటర్‌ సమీపంలోని మైదానంలో ఇరువర్గాలు కత్తులు, రాడ్లతో దాడి చేసుకున్నారు.  
ఈ వార్‌లో సందీప్, పండులు ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో సందీప్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి, పండును గుంటూరు జీజీహెచ్‌కు  స్నేహితులు తరలించారు.  
సందీప్‌ మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆదివారం చికిత్స పొందుతూ మరణించాడు. పండు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. 

విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద రోదిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు
మృతదేహం తరలింపు..
ఆటోనగర్‌:  సందీప్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.పోలీసులుబందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చాపకింద నీరులా..  
ఒకప్పుడు గ్రూపు తగాదాలు.. గ్యాంగ్‌ వార్‌లతో అట్టుడికిన బెజవాడలో గత కొన్నేళ్లుగా ప్రశాంత వాతావారణం నెలకొంది. రాజకీయ వర్గాల మధ్య వివాదాలు కూడా బాగా తగ్గుముఖం పట్టినట్టే కనిపించాయి. కానీ గత తెలుగుదేశం ప్రభుత్వం పుణ్యమా అని నగరంలో మళ్లీ చాపకింద నీరులా రౌడీయిజం విస్తరించింది. 

కోవిడ్‌ విధుల్లో పోలీసులు..  
కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా గత రెండు నెలలుగా కమిషనరేట్‌ పరిధిలోని పోలీసులు నిమగ్నమై ఉన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న రౌడీమూకలు కొందరు సెటిల్‌మెంట్లు చేసున్నట్లు తెలుస్తోంది.

సందీప్‌కు టీటీపీ నేతల అండదండలు
పటమట(విజయవాడ తూర్పు): ఇరువర్గాల మధ్య ఘర్షణలో మృతి చెందిన తోట సందీప్‌ గత దశాబ్ద కాలంగా టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు మహానాడు కార్యక్రమ సమయంలో భారీస్థాయిలో బైక్‌ ర్యాలీలు నిర్వహించేవాడు. టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 వరకు నగరంలోని తూర్పు, సెంట్రల్, పెనమలూరు నియోజకవర్గాలలో సెటిల్‌మెంట్లను జోరుగా సాగించేవాడు.  దీనికి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ సహకారం మెండుగా ఉండేది. విజయవాడ రెండో డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ దేవినేని అపర్ణ కుమారుడు, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు దేవినేని చందు సాన్నిహిత్యం తోడవ్వటంతో నేరాల తీవ్రత పెరిగింది. ఈ క్రమంలోనే వీఎంసీ ఎన్నికల్లో పోటీకి సందీప్‌ భార్య తేజశ్విని 3వ డివిజన్‌కు కార్పొరేటర్‌ అభ్యర్థిగా ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌ ప్రతిపాదించారు. అయితే సందీప్‌ కుటుంబానికి పెనమలూరు మండలం యనమలకుదురులో ఓటు ఉండటంతో ఇక్కడ పోటీ చేయటానికి వీలుకాదని తేల్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement