సాక్షి, అమరావతి: ‘కత్తితో గొంతు కోస్తున్నప్పుడు స్.. స్.. స్.. స్.. అనే ఓ సౌండ్ వస్తది సామి. అది వినడానికి సమ్మగా ఉంటుంది సామీ..’ ఇది ఓ సినిమా డైలాగ్. ఇదే డైలాగ్‌ను తన హావభావాలతో అనుకరిస్తూ మణికంఠ అలియాస్ కేటీఎం పండు ఇటీవల టిక్‌టాక్ వీడియో చేసిన తీరు అతనిలోని క్రూరత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఇలాగే మరో వీడియోలో ‘విజయవాడ మొత్తానికి మొగుడిలా బతకడానికి పెద్దగా ఆలోచించాలి’ అంటూ పేర్కొనడం కూడా అతనిలోని గ్యాంగ్‌లీడర్ మనస్థత్వాన్ని వెల్లడిస్తోంది. ఇలాంటి ఆలోచనలు, డైలాగులు మణికంఠపై తీవ్ర ప్రభావమే చూపాయని చెప్పొచ్చు.
తల్లి అండదండలతో..
సనత్‌నగర్‌లోని రామాలయం వీధిలో పండు తల్లి పద్మ, ఆమె బంధువులు కలిసి ఐదు కుటుంబాలు వరకు నివసిస్తున్నాయి. గత 40 ఏళ్లుగా వాళ్లు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం.. మొదటి నుంచి స్థానికంగా గొడవలు పడటం.. కేసులు పెట్టడం.. పోలీసుస్టేషన్ల చుట్టూ తిరగడం వీరికి అలవాటు. నగరంలో కాల్‌మనీ వ్యాపారం బాగా పెద్ద ఎత్తున జరుగుతున్న రోజుల్లో పండు తల్లి రూ. 15ల వడ్డీతో అప్పులు ఇచ్చి వసూళ్లు చేసేదని స్థానికులు చెబుతున్నారు.
ఎవరైనా ఇవ్వకపోతే దాడులు చేసి మరీ వసూలు చేసేదని కూడా తెలుస్తోంది. అలాగే తన కొడుకు ఎక్కడైనా గొడవ పడినా తల్లి వెనకేసుకొచ్చేదని సమాచారం. 2012లో పెనమలూరు పోలీసుస్టేషన్ పరిధిలో కొట్లాట కేసులో పండుపై కేసు నమోదైంది. అలాగే 2017లో పటమట పోలీసుస్టేషన్ పరిధిలో మరో కొట్లాట కేసు నమోదైంది. కృష్ణలంకలోనూ ఇదే తరహా కేసు పండుపై 2019లో నమోదైంది. ఈ మూడు కేసుల సందర్భంలోనూ పండు తల్లి పద్మనే అన్ని దగ్గరుండి చూసుకున్నదని పండు స్నేహితులు పేర్కొంటున్నారు. చదవండి: సందీప్‌కు టీడీపీ నేతల అండదండలు..
చుట్టూ స్నేహితులు.. నిత్యం హంగామా
తల్లి పద్మ అండదండలతో పండులో విచ్చలవిడితనం పెరిగిపోయింది. నిత్యం తన చుట్టూ పది మంది స్నేహితులు, బ్లేడ్‌బ్యాచ్ సభ్యులతో హంగామా సృష్టించేవాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో పండు అతని స్నేహితులు ఆ వీధిలోకి వస్తే ఎవరూ బయటకొచ్చేవారు కాదని, అలాగే పండు కుటుంబసభ్యులు ఉంటోన్న ఇళ్లవైపునకు వెళ్లే ధైర్యం కూడా చేసేవారు కాదని సమాచారం. పండు చుట్టూ ఉండే స్నేహితులు, బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు గంజాయి, మద్యం మత్తులోనే ఉండేవారని తెలుస్తోంది.
పోలీసుల అదుపులో 21 మంది..
డొంకరోడ్డులో జరిగిన గ్యాంగ్‌వార్‌పై పోలీసు కమిషనర్ తీవ్రంగా పరిగణించడంతో నిందితుల వేటలో పోలీసులు నిమగ్నమయ్యారు. సందీప్ మృతితో నిందితులు అందరిపైనా ఐపీసీ 302, 307, 188, 269 సెక్షన్లతో కోవిడ్–19 చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. 6 బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అలాగే డొంకరోడ్డులో పండు గ్యాంగ్ సాగించిన కార్యకలాపాలపైనా కూపీ లాగుతున్నారు. ఇప్పటికే 21 మందిని అదపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment