విజయవాడ గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్న మంగళగిరికి చెందిన కిరణ్, ఏవీఎస్
ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రమైన మంగళాద్రి... చేనేతకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన పట్టణం... రాను రాను హత్యా రాజకీయాలు, రౌడీ షీటర్లకు నిలయంగా మారిపోతోంది. గడిచిన ఏడేళ్లలో మూడు కిరాయి హత్యలు, వేర్వేరు నేరాలతో పాటు పలుచోట్ల అల్లర్లు సృష్టించడానికి, కోట్ల విలువ చేసే భూముల కబ్జాకు మంగళగిరిలో ఉన్న రౌడీషీటర్లు బ్లేడ్‌బ్యాచ్‌ని, గంజాయి బ్యాచ్‌ని వాడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా నిఘా వర్గాలు పట్టించుకోకపోవటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి, తాడేపల్లిరూరల్: తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ స్థాయి నాయకులు ‘ఏ’ గ్రేడ్ రౌడీషీటర్లను, ఆ రౌడీషీటర్లు బ్లేడ్ బ్యాచ్‌నీ, గంజాయి బ్యాచ్‌నీ పెంచి పోషిస్తున్నారు. తాజాగా విజయవాడలో జరిగిన గ్యాంగ్‌వార్ వెనుక మంగళగిరికి చెందిన ఒక చిట్‌ఫండ్ ఫైనాన్స్ కంపెనీ వ్యాపారి హస్తం ఉంది. విజయవాడ గ్యాంగ్‌వార్‌లో మృతి చెందిన మాజీ రౌడీషీటర్ తోట సందీప్‌ను చంపితే తమను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని, ఆ భయాన్ని ఆధారం చేసుకుని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సెటిల్‌మెంట్‌లు చేయొచ్చన్న ఆలోచనతో మంగళగిరికి చెందిన కిరణ్, ఏవీఎస్, తంబి అనే రౌడీషీటర్లను ఉసిగొల్పి వీరి వద్ద ఉన్న సుమారు పదిమందిని విజయవాడ పంపి ఆ గ్యాంగ్‌వార్‌లో పాల్గొనేలా చేశారు.
మణికంఠ అలియాస్ పండు మంగళగిరిలో ఐదు రోజుల పాటు ఉండి ఈ గ్యాంగ్‌వార్‌కు వ్యూహరచన చేశాడు. ఇదే సమయంలో పండు టిక్‌టాక్‌లో ఒక భయంకరమైన వీడియోను అప్‌లోడ్ చేసి, తాము హత్య చేయబోతున్నామనే ఒక సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఇంత జరుగుతున్నా ఇక్కడ పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యకరం. గతంలో కిరణ్ అన్నయ్య హేమంత్‌ను వర్గపోరులో భాగంగా అతి దారుణంగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రాళ్లతో కొట్టి చంపారు. అదే బాట ఎంచుకున్న కిరణ్ తన ఆధిపత్యాన్ని చూపించుకునేందుకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుని చిన్న ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో నలభై, యాభై వేల కమీషన్ కోసం ఈ హత్యకు పాల్పడ్డాడు.
ఏవీఎస్, మణికంఠ(పండు)
తాడేపల్లిలో మకాం వేసిన సందీప్
విజయవాడలో వెలివేసిన చెందిన వెల్లంకి సందీప్ అలియాస్ పెద్దబాండు, అతని అనుచరుడు గుర్రాల కళ్యాణ్ అలియాస్ చిన్నబాండు తాడేపల్లి ప్రాంతంలో నివాసం ఉంటూ ప్రజలను తమ బ్లేడులతో భయభ్రాంతులకు గురిచేసేవారు. యాభై రూపాయలు ఇవ్వలేదని తాడేపల్లిలో బార్ అండ్ రెస్టారెంట్‌లో ఒక వ్యక్తిపై బ్లేడ్‌తో దాడికి పాల్పడ్డారు.
క్యారంబోర్డు ఆకర్షణతో...
టీడీపీ నాయకుడు, ఫైనాన్షియర్, ప్రస్తుత రౌడీషీటర్ యువకులను సన్మార్గంలో నడపడానికి కారంబోర్డు ఏర్పాటు చేశాడని బయటకు ప్రచారం చేస్తూ లోపల మాత్రం భవిష్యత్తులో తాను చేయబోయే భూకబ్జాలకు, ఫైనాన్షియల్ వసూళ్లకు సిద్ధం చేశాడు. కిరణ్ కూడా సదరు రౌడీషీటర్ ఈ మధ్య కాలంలో జైలుకి వెళ్లే వరకు అతని అడుగుజాడల్లోనే నడుస్తూ కరుడుగట్టిన నేరస్తుడు అయ్యాడు.
ప్రేమ వ్యవహారంలో జోక్యం
విజయవాడలో పలు కళాశాలల్లో విద్యార్థుల మధ్య జరిగే ముక్కోణపు ప్రేమ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని కిరణ్, ఏవీఎస్. తంబి, రవి, వంశీ తదితరులు సెటిల్‌మెంట్లు చేస్తూ విద్యార్థులను సైతం బెదిరించి వారి వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. విజయవాడ కళాశాలల్లో జరిగిన ఈ ప్రేమ వ్యవహారాలను మణికంఠ కిరణ్ వద్దకు పంపడంతో కిరణ్ రౌడీయిజం గురించి ఆనోటా ఈనోటా బహిర్గతం అయింది. చదవండి: ‘సందీప్, పండూ గతంలో స్నేహితులు’
భూకబ్జాలకు వీరే నాంది
తెలుగుదేశం పార్టీ హయాంలో టీడీపీ నాయకుడు, ఫైనాన్షియర్ చేసిన భూకబ్జాలకు వీరిని కాపలా పెట్టి భూములను ఆక్రమించి సొమ్ము చేసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు లేదా కుటుంబసభ్యుల మధ్య ఏర్పడిన వివాదాలను అడ్డం పెట్టుకుని కోటి రూపాయల విలువైన భూమిని కేవలం పాతిక లేదా ముప్ఫై లక్షల రూపాయలు ఇచ్చి భూమిలో ఉన్న రెండో వ్యక్తిని దౌర్జన్యంగా బయటకు పంపించి ఆ భూమిని తన సొంతం చేసుకున్నాడు. సెటిల్‌మెంట్ అయిన తర్వాత వీరికి పదో పరకో ఇచ్చి సదరు ఫైనాన్షియర్ చేతులు దులుపుకొనేవాడు. వీరి ఆగడాలు ఎక్కువ అవడంతో నిదానంగా తన కార్యాలయం నుంచి బయటకు పంపించి ఏమీ తెలియనట్లు పెద్దమనిషిలా వ్యవహరించడం గమనార్హం. చదవండి: గ్యాంగ్ వార్; వెలుగులోకి కొత్త విషయాలు
విజయవాడ నేరస్తులంతా ఇక్కడే
2007లో పోలీసులకు సైతం ఐపీ పెట్టి కాల్వలోకి కారును తోసేసి చనిపోయినట్లు సృష్టించిన ప్రముఖ నేరస్తుడి దగ్గర్నుంచి గంజాయి వంటి మత్తు పదార్థాల కోసం యాచకులను సైతం వదలకుండా దాడులకు పాల్పడే బ్లేడ్ బ్యాచ్, రౌడీషీటర్లు మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతంలో నేరస్తులను కూడగట్టి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మంగళగిరి శివారు ప్రాంతాలైన పాత రైల్వేగేటు ప్రాంతంతో పాటు హాయ్‌ల్యాండ్ వెనుక ప్రాంతం, అమరావతి టౌన్‌షిప్, చినకాకాని గ్రామానికి, రైల్వే ట్రాక్ మధ్య, తాడేపల్లిలోని మహానాడు, సుందరయ్య నగర్, పుష్కరఘాట్లు, ఐఓసీ ఎదురుగా ఉన్న వెంచర్లు, విజయవాడ క్లబ్ వెనుక ఉన్న కృష్ణానది తదితర ప్రాంతాల్లో స్థలాలు మారుస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సందీప్ హత్య చేసే ముందు కుంచనపల్లి గ్రామంలో కూడా కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కార్యకర్త ఆధ్వర్యంలో జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా నిఘా వర్గాలు వీరిపై దృష్టి సారించి ఈ ప్రాంతాన్ని నేరస్తుల బారి నుంచి కాపాడుతారో లేదో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment