చిత్తూరు అర్బన్/బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద ముందస్తు ప్రణాళికలో భాగంగానే టీడీపీ శ్రేణులను బహిరంగంగా రెచ్చగొట్టి దాడులు చేయించిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. విధ్వంసానికి దిగాలని చంద్రబాబు బహిరంగంగానే పిలుపునివ్వగా.. పార్టీ శ్రేణులు, కిరాయి మూకలు దాడులకు తెగబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ‘పచ్చ మీడియా’ సహా అన్ని చానళ్లలోనూ ప్రసారమయ్యాయి.
వాస్తవానికి తంబళ్లపల్లె నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన లేకపోయినా.. ముందురోజు సాయంత్రం పర్యటనలో మార్పు చేయడం.. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో లేకున్నా ములకలచెరువు, బురకాయలకోట, అంగళ్లు గ్రామాల పర్యటనకు వెళ్లడం వంటి అంశాలు చంద్రబాబు ఈ కుట్రకు ఏవిధంగా తెర తీశారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గతంలో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. ఆ ఆడియో టేపులోని మాటలు తనవి కాదని బొంకారు.
కానీ.. తాజా కేసులో పార్టీ శ్రేణులను రెచ్చగొట్టిన వీడియో సాక్ష్యాలు ఉండటంతో ఈ కేసులో అడ్డంగా దొరికిపోయారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు తాను రెచ్చగొట్టలేదని మాట మారిస్తే.. పోలీసుల వద్ద ఉన్న, ఎల్లో మీడియా, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి.. చట్టపరంగా ముందుకు వెళ్లడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏ1గా కేసు నమోదైంది.
అంతా వ్యూహం ప్రకారమే..
ఈ నెల 4న ఉదయం 10:30 గంటలకు నాయన చెరువుపల్లెలో పనుల పరిశీలనకు రావాల్సిన చంద్రబాబు 12 గంటలు దాటాక చేరుకున్నారు. నేరుగా పనుల పరిశీలనకు వెళ్లకుండా షెడ్యూల్‌ను పక్కనపెట్టి ములకలచెరువులో ప్రసంగించారు. ఈ ప్రసంగంలోనూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడారు. అక్కడినుంచి నాయన చెరువుపల్లెకు వెళ్లి తిరుగు ప్రయాణంలో బురకాయలకోటలో కారు ఫుట్ బోర్డుపైకి ఎక్కి రోడ్‌షో నిర్వహించారు.
బి.కొత్తకోట మండలంలో హంద్రీ–నీవా కాలువను కొద్దిసేపు పరిశీలించారు. అంగళ్లులో చంద్రబాబు రోడ్‌షో, ప్రసంగం లేదు. కానీ.. మసీదు వద్దకు రాగానే చంద్రబాబు తాను ప్రయాణించే కారుపై రోడ్‌షో నిర్వహించారు. నాయన చెరువుపల్లె, హంద్రీ–నీవా కాలువ పనుల పరిశీలన మినహా షెడ్యూల్ మేరకు మిగతా ఏ కార్యక్రమం లేదు. కానీ.. ఆద్యంతం షెడ్యూల్‌కు భిన్నంగానే చంద్రబాబు పర్యటన కొనసాగించారు.
ప్రాజెక్టుల సందర్శన పేరిట చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు విధ్వంసక వ్యూహం ప్రకారమే వచ్చినట్లు అర్థమవుతోంది. వాస్తవానికి హంద్రీ–నీవా కాలువ వద్ద రైతులతో చంద్రబాబు సమావేశం కావాల్సి ఉంది. దానిని రద్దు చేసుకుని మరీ అంగళ్లు గ్రామానికి చేరుకున్న చంద్రబాబు మసీదు వద్దకు రాగానే కారుపై నిలబడి రోడ్‌షో ప్రారంభించారు. అంగళ్లులో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు.
పిచ్చలవాండ్లపల్లె రిజర్వాయర్‌పై చంద్రబాబు కోర్టులో కేసు వేయించి పనులు అడ్డుకున్నందుకు నల్లకండువాలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు ‘తరమండిరా.. కొట్టండిరా నా కొడుకులను..’ అంటూ గొడవకు ఉసిగొల్పారు. అంతటితో ఆగక ‘పుంగనూరులో ఆ పుడింగి సంగతి తేలుద్దాం.. పదండి’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో అప్పటికే ముందస్తు వ్యూహం ప్రకారం పుంగనూరు వద్ద వేచి ఉన్న టీడీపీ మూక, అల్లరి మూక విధ్వంసకాండకు దిగారు.
అంగళ్లులో చెలరేగిన టీడీపీ నేతల రౌడీయిజంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, పోలీసులు గాయపడ్డారు. పుంగనూరు వద్ద మారణాయుధాలు, రాళ్లు, కొడవళ్లు, ఇటుకలతో చేసిన దాడిలో పదుల సంఖ్యలో పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ రణ«దీర్ ఒక కంటి చూపును శాశ్వతంగా కోల్పోయారు. డీఎస్పీ బాబుప్రసాద్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మహిళా ఎస్‌ఐ కరీమున్నీసా నడవలేని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment